HEALTH & LIFESTYLE

‘గుండెఆరోగ్యం’గాఉంచుకుందాం..!

ఛాతీనొప్పి, గుండెపోటు(హార్ట్ అటాక్) గుండె వైఫల్యం(హార్ట్ ఫెయిల్యూర్)… ఇలాంటివి ఈరోజుల్లో సర్వసాధారణంగా వింటూనే ఉన్నాం. ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోవడం.. హార్ట్ బీట్ గతి తప్పి సెకన్ల వ్యవధిలో చనిపోవడం.. వయసు తేడా లేకుండా దీని బారిన పడడం.. ఇవన్నీ పైకి వేర్వేరు సమస్యలుగా అనిపించినా అన్నింటికీ మూలం ఒక్కటే! అదే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో బ్లాక్ ఏర్పడటం. ఇది ఛాతీనొప్పితో ప్రారంభమై.. గుండెపోటు ప్రమాదానికి దారి తీస్తుంది. అలా గుండెపోటుతో దెబ్బతిన్న అంతరం గుండె వైఫల్యానికి కారణమవుతుంది. ఫలితంగా ప్రాణాలకే ముప్పు తెస్తుంది. ఛాతీనొప్పి, గుండె సంబంధ వ్యాధులతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కరోనరీ ఆర్టరీ సంకోచించడం వంటి సమస్యలు వస్తుంటాయి. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ. అయితే వీటిని తొలి దశలోనే కొన్ని జీవనశైలి మార్పులు, ఆహార నియమాలతో నివారించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అదెలానో ఈరోజు తెలుసుకుందాం పదండి:

మన శరీరంలో అన్ని అవయవాలకూ, ఇతర కండరాలకూ రక్తాన్ని సరఫరా చేసే గుండె కూడా ఒక కండరమే తెలుసా.. ఇది పనిచేయటానికీ తగినంత రక్తం సరఫరా కావాల్సి ఉంటుంది. గుండెలో మూడు ప్రధాన ధమనులు(కరొనరీ ఆర్టరీస్‌) ఈ పనిని చేసి పెడుతుంటాయి. అలాంటిది ఇవి సాఫీగా పని చేసినంతకాలం మనకు ఎటువంటి ఇబ్బందీ రాదు. ఏదైనా ఇబ్బందీ తలెత్తితేనే బ్లాక్ అనేది ఏర్పడుతుంది. రక్తంలో ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్‌ ఉంటే, అది క్రమంగా లోపలికి వెళ్లి, కొవ్వు పూడిక(అథిరోమా)గా 

తయారవుతుంది. కొంతకాలానికి ఈ పూడికలు పెద్దవి అవుతూ రక్త ప్రవాహాన్ని అడ్డుకోవటం మొదలెడతాయి. మొదట ఛాతీనొప్పి, గుండెపోటు.. అంతిమంగా గుండె వైఫల్యానికి కారకాలవుతాయి.

ఇది మన ప్రమేయం లేకుండా.. శరీర, వయసు రీత్యా జరగవచ్చు. దీంతో పాటు, హై బీపీ, రక్తంలో అధిక గ్లూకోజు(మధుమేహం), అధిక కొలెస్ట్రాల్‌..  పొగ తాగటం, పొగాకు తీసుకోవడం లేదంటే వంశపారంపర్యంగా కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉండటం.. వీటికి ప్రధాన కారణాలవుతాయి.

మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం, శారీరక సామర్థ్యం వంటి వాటితోనే ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి వీటి విషయంలో నిర్లక్ష్యం తగదు. లేకుంటే మధుమేహం, హై బీపీ, హై కొలెస్ట్రాల్‌ను మనమే దగ్గరుండి కొని తెచ్చుకున్నట్లవుతుంది.

నివారణ…

స్టాటిన్లతో గుండెపోటును తొలిదశలోనే నియంత్రించవచ్చు. ఒకవేళ పూడికలు ఏర్పడితే, ఆస్ప్రిన్‌ మందు సాయంతో క్లియర్ చేసుకోవచ్చు. 

నడుస్తున్నప్పుడు, ఏవేని పనులు చేస్తున్నప్పుడు ఉన్నటుండి ఛాతీలో నొప్పి మొదలవుతుంది. దీనర్థం లోపల రక్తనాళం సగం కంటే మించి మూసుకుపోవడమే. ఏర్పడిన పూడిక ఉన్నట్టుండి పెరిగి, రక్తనాళం మొత్తానికి విస్తరిస్తుంది. దీంతో హఠాత్తుగా గుండె కండరానికి రక్తసరఫరా నిలిచిపోతుంది.. ఇదే గుండెపోటు. 

ఛాతీ నొప్పి సుమారు 20 నిమిషాలపాటు తగ్గకపోతే గుండెపోటు వచ్చిందనే అర్థం. నేరుగా కాకుండా పరోక్షంగా గాలిలోనూ కాలుష్య ప్రభావం ఉన్నట్లు తేలింది. దీంతో గుండెపోటు కేసులు నమోదైనట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

నిర్లక్ష్యం వద్దు

షుగర్, బీపీ, దీర్ఘకాలిక వ్యాధి కలిగిన కుటుంబచరిత్ర.. కలవారు అసలే నిర్లక్ష్యం చేయరాదు. ఛాతీలో ఏమాత్రం అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపించినా గుండెపోటేమోనని అనుమానించటం, గుర్తించడం తప్పనిసరి. 

ఎడమవైపు మొదలై.. భుజం మీదుగా నొప్పి చేతికి విస్తరిస్తుంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. చాలామంది దీన్ని అసిడిటీతోనో, బరువైన పనులు చేయటం వల్లనో వస్తుండొచ్చని భావించి ఊరుకుంటారు.

నొప్పి పుడుతున్న చోటును మీరు స్పష్టంగా గుర్తిస్తున్నా, ఒకవైపు తిరిగినప్పుడు నొప్పి పెరుగుతూ, మరోవైపు తిరిగితే నొప్పి తగ్గుతున్నా అది గుండెపోటు కాదని అనుకోవచ్చు. ఇవి తప్పించి మిగతా ఎలాంటి అసౌకర్య లక్షణాలు కనిపించినా గుండెపోటుగానే భావించాలి. ఆలస్యమవుతున్న కొద్దీ ప్రమాద తీవ్రత పెరుగుతుంది. అలసత్వం వహిస్తే జీవితకాలం కోలుకోలేని దెబ్బతీస్తుంది.

చిక్సిత..

ఈసీజీ ద్వారా గుండెపోటును పరీక్షిస్తారు. ఇది చాలా తేలిక. గుండెపోటు వచ్చిన అరగంటలోపే ఈసీజీలో మార్పులు మనం స్పష్టంగా చూడొచ్చు. తొలి ఈసీజీలో మార్పులు కనిపించకపోతే, 20 నిమిషాల తర్వాత మరోసారి పరీక్షిస్తారు. అప్పటికీ స్పష్టత రాకపోతే.. ట్రోపోనిన్‌ ఐ, ట్రోపోనిన్‌ టి ఎంజైమ్‌ల పరీక్షలు చేస్తారు. ఇవి చాలా కచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎవరైనా మూడు గంటల తర్వాత చూపించుకోవడానికి వచ్చినట్టయితే ఇవి రక్తంలో కనిపించకపోవచ్చు. ఆరు గంటల అనంతరమే మళ్ళీ పరీక్షిస్తారు.

గుండెపోటు నిర్ధారణ అయితే రక్తాన్ని పలుచగా చేసే ఆస్ప్రిన్, క్లోపిడోగ్రెల్‌ వంటి మందులు.. రక్తం గడ్డలను కరిగించే స్ట్రెప్టోకైనేస్, యూరోకైనేస్, టీపీఏ, ఆర్‌టీపీఏ వంటి మందులు వాడటం వల్ల తక్షణ ఉపశమనం ఉంటుంది. అయితే ఈ మందులు అందరికీ ఒకేలా పనిచేస్తాయని చెప్పలేం. మందులతో పని జరగకపోతే యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్‌ అమర్చటం, బైపాస్‌ సర్జరీలు చేయాల్సి ఉంటుంది.

పాటించాల్సినవి

రోజు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి.

కొవ్వులు, ఉప్పు, చక్కెర పదార్థాలున్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. వ్యాయామం రోజులో భాగం చేయాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వీటికి సంబంధించిన వెబ్‌సైట్లూ అందుబాటులో ఉన్నాయి. అధిక రక్తపోటు, గ్లూకోజు మోతాదులు, వయసు, బరువు, కుటుంబచరిత్ర వంటి వివరాలను నమోదు చేస్తే చాలు.. రాబోయే రోజుల్లో అంటే, దాదాపు పదేళ్లలో గుండెపోటు తలెత్తే ముప్పును ముందుగానే తెలియజేస్తుందన్నమాట.

ఇతరాంశాలు

మొదట్లో.. ఆయాసం, అలసట, బలహీనత, కండరాలు పట్టేయటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు గుండె తగినంత రక్తాన్ని పంప్‌ చేస్తున్నప్పటికీ.. ఊపిరితిత్తుల నుంచి ఎక్కువ ఒత్తిడి కలిగి, గుండెలోకి రక్తం చేరుతుండొచ్చు. దీన్నే హైఫిల్లింగ్‌ ప్రెజర్‌ అంటారు. ఇదీ ఓ రకమైన గుండె వైఫల్యమే(కంజెస్టివ్‌ హార్ట్‌ఫెయిల్యూర్‌). 

గుండెకు రక్తసరఫరా పూర్తిగా నిలిచిపోయాక కండరం చచ్చుబడటానికి 6 గంటల సమయం పడుతుంది. ఈలోపు చికిత్స ఆరంభిస్తే కండరం మరింత దెబ్బతినకుండా, సమస్య తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి చచ్చుబడిన కణజాలం అంతే త్వరగా కోలుకోవటం కష్టం. అందువల్ల ఛాతీనొప్పి మొదలైన వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం చాలా చాలా ముఖ్యం.

కొన్నిసార్లు బీటా బ్లాకర్లు, ఏసీఈ ఇన్‌హిబిటార్‌ రకం మందులతో పూర్తిగా గుండె వైఫల్యానికి గురి కాకుండా జాగ్రత్త పడొచ్చు. 

గుండెపోటుతో కొందరిలో హఠాత్తుగా గుండె ఆగిపోవటం చూస్తుంటాం. దీన్నే వైద్య పరిభాషలో ‘కార్డియాక్‌ అరెస్ట్‌’ అంటున్నాం. ఇందుకు గుండె లయ దెబ్బతినటమే ప్రధాన కారణం. గుండెలోని విద్యుత్‌ వ్యవస్థ అతిగా, అస్తవ్యస్తంగా స్పందించటం వల్ల ఉన్నట్టుండి కుప్పకూలి, మరణించడం జరుగుతుంది. పంపింగ్‌ సామర్థ్యం తగ్గటం వల్ల షాక్‌లోకి వెళ్లిపోయి, దాన్నుంచి బయటకు రాలేక కొందరు చనిపోతుండొచ్చు. అయితే దీనికి 24- 48 గంటల సమయం పడుతుంది. అదే గుండె లయ దెబ్బతిని, పనిచేయటం ఆగిపోతే వెంటనే మరణిస్తున్నారు. 

గుండె విఫలమైనవారిలో కొందరికి డీఫిబ్రిలేటర్‌ పరికరాన్ని అమర్చటమూ మేలు చేస్తుంది. ఇది ఒక రకమైన పేస్‌మేకర్‌ లాంటిది. గుండె వేగం తగ్గిపోకుండా చూడటమే కాదు.. విద్యుత్‌ వ్యవస్థ గతి తప్పినప్పుడు తనకు తానే గుర్తించి, అవసరమైన మేరకు షాక్‌ ఇస్తుంది కూడా. 

సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ వచ్చినా దీనివల్ల అదృష్టవశాత్తు బయటపడవచ్చు.

చలికాలంలో వ్యాయామం చేయాలంటే ఒళ్లు వంగదు. బద్దకం వచ్చేస్తుంది. ఇంటి వద్దనే చేయడానికి అవకాశం ఉన్న చిన్న చిన్న వ్యాయామాలను చేయడం వల్ల శరీరం వేడిని పొంది హుషారుగా ఉంటుంది. అందుకని చలికాలంలో కనీసం అరగంటసేపు వ్యాయామము చేయడాన్ని అలవాటు చేసుకోవాలి.

శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రత 95 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే గుండె కండరాలకు హాని కలిగించవచ్చు. కాబట్టి రోజూ వివిధ విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచి, న్యుమోనియా, జలుబు వంటి వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. 

దీంతోపాటు పైన తెలిపిన విషయాల పట్ల కనీస అవగాహన కలిగి ఉంటే, మీ గుండె ఆరోగ్యానికి డోకా ఉండదు. 

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button