CINEMAGREAT PERSONALITIESTelugu CinemaTelugu Featured NewsTelugu Special Stories

శత వసంతాల యుగ పురుషుడి మరణం లేని జననం… నందమూరి తారక రామారావు..

శత వసంతాల యుగపురుషుడి మరణం లేని జననం… నందమూరి తారకరామారావు..

నందమూరి తారక రామారావు (28 మే 1923 – 18 జనవరి 1996)

నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిక్కచ్చితనం తన బలాలు. అహం, ఆవేశం, అతివిశ్వాసం  తన బలహీనతలు. మొండితనం తన ఆస్తి. పట్టుదలతనకు ప్రాణం. మానవత్వం నింపుకున్న మనిషిగా ప్రజలకోసం అనుక్షణం శ్రమించాడు. అనంతమైన, అనితర సాధ్యమైన, అభేద్యమైనప్రజాభిమానమే తనకు ధనం. ఆత్మాభిమానం తనకు ఇంధనం. ఈ బలాలు, ఈ ధనాలే తనను ప్రతీ చోట విజేతగా నిలబెట్టాయి. అవినీతిరహితపాలన తన ముద్ర. ప్రజాధనం వృధా కాకుండా చూడడం తన ప్రత్యేకత. ఇవి నాణేనికి ఒకవైపు..

నటన ఒక ఎత్తు, నడక ఒక ఎత్తు. శ్రీరాముడుగా ఒకవైపు, రావణాసురుడిగా మరోవైపు. శ్రీకృష్ణుడిగా ఒక వైపు, దుర్యోధనుడిగా మరోవైపు. అర్జునుడిగా, బృహన్నలగా, భీష్ముడుగా, శ్రీనాథ కవి సార్వభౌముడిగా, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు. మనకుకేవలం పాత్రలే కనిపిస్తాయి. నటుడు కాదు. ఇది నాణేనికి మరోవైపు. ఆయనే యుగపురుషుడు, శకపురుషుడు, కారణజన్ముడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు. నటుడు, నిర్మాత, కథారచయిత, దర్శకుడు, రాజకీయ నాయకుడు.

తెలుగు సినిమా టాకీలు మొదలైన తర్వాత 1931 నుండి 1953 వరకు హీరో అంటే అందగాడు. హీరో అంటే ఆజానుబావుడు. భారతీయ చలనచిత్రపరిశ్రమ మొత్తం కూడా ఇదే ధోరణిలో కొనసాగేది. కానీ నందమూరి తారకరామారావు గారు ఆ ధోరణికి చరమ గీతం పాడేశారు.

1953లో వచ్చిన పిచ్చిపుల్లయ్య లోని డీగ్లామర్ పాత్ర కూడా హీరో అవుతుందని చెప్పకనే చెప్పారు మన నందమూరి తారక రామారావు గారు.

“తోడుదొంగలు” చిత్రంలోముసలి పాత్ర, “రాజు పేదలు” చిత్రంలో అంద విహీనుడి పాత్ర, “కలిసి ఉంటే కలదు సుఖం” లో వికలాంగుడి పాత్ర. 

ఇలా ప్రతి పాత్రలో కూడా ఒకహీరోను చూపించి ప్రయోగాత్మకంగా నిరూపించిన ప్రయోగశాలి, ప్రయోగశీలి మన నందమూరి తారక రామారావు గారు.

నిడుమోలు లో ఓనమాలు నేర్పిన తొలి గురువు వల్లూరి సుబ్బారావు, విజయవాడలో నట ప్రస్థానానికి తొలి తిలకం దిద్దిన కవిసమ్రాట్ విశ్వనాథసత్యనారాయణల శిష్యరత్నంగా తెలుగు భాషాభిమానాన్ని, తెలుగు ఆత్మగౌరవాన్ని  నరనరాన  చాటుకున్న మేరునగధీరుడు నందమూరితారకరామారావు గారు. 

నట విరాట్ స్వరూపంగా సకల సౌభాగ్య  సంపదలన్నీ అందుకున్నారు.

నందమూరి అంటే ఆకర్షణకు మరో పేరు, స్పుర ద్రూపం, వాచకం తన ప్రత్యేకత. ఆయన నోటి వెంట వచ్చే ప్రతీ అక్షరం, ప్రతీ అచ్చు అచ్చంగా, స్వచ్ఛంగా పలుకుతూ మనకు చేరుతాయి, స్వర విన్యాసం నట విన్యాసం ఏకకాలంలో తన కంచు కంట నుండి ప్రస్ఫుటంగా పలుకుతాయి.అప్పటివరకు బృహన్నలుగా ఉండి, ఉన్నట్టుండి ఒక్కసారిగా అర్జునుడిగా మారిన వెంటనే వాచక, రూపక స్వరూపాలు చకచకా మారి పోతాయి.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    నందమూరి తారక రామారావు

జననం    :    28 మే 1923

స్వస్థలం   :    నిమ్మకూరు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం

తండ్రి   :   లక్ష్మయ్య చౌదరి

తల్లి     :  వెంకట్రావమ్మ 

ఇతర పేర్లు  :   విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, ఎన్.టి.ఆర్, అన్నగారు

వృత్తి      :    సినిమా నటుడు , సినిమా దర్శకుడు, నిర్మాత , రాజకీయ నాయకుడు , రంగస్థల నటుడు

రాజకీయ పార్టీ    :    తెలుగుదేశం పార్టీ

మతం        :      హిందూ

భార్య        :   బసవ రామ తారకం ,లక్ష్మీపార్వతి

​పిల్లలు    :     జయకృష్ణ, సాయికృష్ణ ,హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి

మరణం   :     18 జనవరి 1996 హైదరాబాదు, తెలంగాణ.

బాల్యం.

నందమూరి తారక రామారావు గారు 28 మే 1923 వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామానికి లక్ష్మయ్య, వెంకట రామమ్మ గార్ల దంపతులకు జన్మించారు. నందమూరి తారక రామారావు గారి పేరు మొదట కృష్ణ అనిపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారకరామారావుగా మారింది. పాఠశాల విద్యలో భాగంగా 1వ తరగతి నుండి మూడవ తరగతి వరకు నిమ్మకూరులో, ఆరవ తరగతి నుండి విజయవాడమునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదివారు. ఆ తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కళాశాలలో చేరారు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారుతెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావు ను ఒక నాటకములో ఆడవేషం వేయమన్నారు.

అయితే రామారావు గారు తన మీసాలు తీయటానికి ‘ససేమిరా’ అన్నారు. మీసాలతోటే నటించడం వలన అతనికి “మీసాల నాగమ్మ” అనే పేరుతగిలించారు.

1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో తన మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు. వివాహోవిద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పారు. తర్వాత గుంటూరు లోని “ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల” లో చేరారు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చాలా చురుకుగా పాల్గొనేవారు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (NAT) అనే నాటకసంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో చేసిన “పాపం” వంటి ఎన్నో నాటకాలు ఆడారు. తర్వాతికాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ గారు మంచి చిత్రకారులు కూడా. రాష్ట్ర వ్యాప్త చిత్రలేఖన పోటీలలో తనకుబహుమతి కూడా వచ్చింది.

కుటుంబం.

నందమూరి తారక రామారావు, బసవతారకం గార్ల దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురుకుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా, లోకేశ్వరి, దగ్గుబాటిపురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు..

ఉద్యోగం…

నందమూరి తారక రామారావు గారు కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం కొన్ని కొన్నికారణాల వలన హరించుకుపోయింది. దాంతో యుక్తవయసులో ఉన్న రామారావు గారు జీవనం కోసం అనేక పనులు చేసారు. కొంత కాలం పాల వ్యాపారం, మరి కొంత కాలం కిరాణా కొట్టు, ఆపైన ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపారు రామారావు గారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏనాడూ అప్పు చేసేవారు కారు.

రామారావు గారు 1947లో పట్టభద్రులయ్యారు. అటుపిమ్మట తాను మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష వ్రాశారు. పరీక్ష వ్రాసిన 1100 మంది నుండిఎంపిక చేసిన ఏడుగురిలో తాను ఒకరిగా నిలిచారు. అప్పుడు రామారావు గారికి మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. కానీసినిమాలలో చేరడమే తన అభిలాష కావడం వలన ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయారు.

సినీ రంగ ప్రవేశం.

ఇంటర్మీడియట్ పూర్తవ్వగానే బి.ఏ కోసం గుంటూరులో ఏ.సి. కళాశాలలో చేరారు. అక్కడ బి.ఏ చదువుతూనే నాటకాలు వేసేవారు. ఎన్టీఆర్ గారువేసే నాటకాల గురించి తెలిసి పి.పుల్లయ్య గారు కీలుగుర్రం సినిమాలో ఎన్టీఆర్ గారికి అవకాశమిచ్చారు. కానీ బి.ఏ పూర్తిచేయాలనే కసిమీద ఉన్నఎన్టీఆర్ గారు ఆ అభ్యర్థనను తోసి పుచ్చారు. ఎలాగోలా బి.ఏ 1947 లో పూర్తయ్యింది. తదనంతరం ఎన్టీఆర్ గారు మద్రాసు సర్వీసు కమిషను పరీక్షవ్రాశారు. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యి మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగంకు ఎంపికయ్యారు. అయితే సినిమాలలో చేరాలనే అభిలాష కారణంగా ఆఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయారు ఎన్టీఆర్ గారు.

ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు గారు ఎల్వీ ప్రసాదు దగ్గర ఎన్టీఆర్ గారి ఫొటోను చూసి, తనను మద్రాసు పిలిపించి తాను తీసే “పల్లెటూరి పిల్ల” చిత్రంలో కథానాయకుడిగా ఎంపిక చేసారు. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గాను రామారావు గారికి వెయ్యి నూటపదహార్ల పారితోషికంఅందుకున్నారు. సినిమాలలో ఎంపిక అవ్వగానే తక్షణమే ఎన్టీఆర్ గారు తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేశారు. “పల్లెటూరి పిల్ల” చిత్రంఇంకా మొదలవ్వలేదు.

ఇంతలో “మనదేశం” అనే సినిమాలో అవకాశం రావడంతో అందులో నటించారు. దాంతో మొదటిసారి తాను కెమేరా ముందు నటించిన సినిమామనదేశం గా రికార్డులోకెక్కింది.

1949లో తెరకెక్కిన ఆ చిత్రంలో తాను ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించారు.

1950లో “పల్లెటూరి పిల్ల”చిత్రంవిడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు గారు చిత్రీకరించిన “షావుకారు” కూడా విడుదలైంది. రెండు సినిమాల అనంతరం ఎన్టీఆర్ గారుతన మకాం మద్రాసుకు మార్చివేశారు. మద్రాసులోని థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవారు.

1951లో కె.వి.రెడ్డి గారు తీసిన పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి గారు నిర్మించి, దర్శకత్వం వహించిన మల్లీశ్వరి, 1952లోఎల్వీ ప్రసాదు గారి “పెళ్ళిచేసి చూడు”, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు గారి చిత్రం “చంద్రహారం” లాంటి చిత్రాలన్నీ కూడా ఎన్టీఆర్గారిని నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. 

ఈ సినిమాలన్నీ విజయా వారి సంస్థలో నిర్మించబడినవే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం, 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చేవారు. పాతాళభైరవి ఆ రోజుల్లో 10 కేంద్రాలలో 100 రోజులు ఆడి రికార్డులు సృష్టించింది. 1956లో విడుదలైన “మాయాబజార్‌” సినిమాకు తాను తీసుకున్న పారితోషికం 7500 రూపాయలు  అపట్లోనే అత్యధిక పారితోషికం అని చెప్పుకునేవారు.

ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు 1959లో నిర్మించి, విడుదల చేసిన “భూకైలాస్” చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు “రామారావు” గారే ప్రాణప్రతిష్ఠ చేసారు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రం అత్యంత భారీ విజయం నమోదు చేసింది. శ్రీమద్విరాటపర్వములో ఎన్టీఆర్ గారు ఐదుపాత్రలు పోషించారు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ గారు ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగారు. 1963లో విడుదలైన “లవకుశ” చిత్రంసంచలన విజయాన్ని నమోదు చేసింది. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవారు ఎన్టీఆర్ గారు. తాను సినిమాల్లోకి వచ్చిన 20 సంవత్సరముల వరకు తన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972 నుండి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.

ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం సీతారామ కళ్యాణం 1961లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తన తమ్ముడు త్రివిక్రమరావు గారు”నేషనల్ ఆర్టు ప్రొడక్షన్స్ ” పతాకంపై విడుదల చేసారు. 1977వ సంవత్సరంలో విడుదలైన “దాన వీర శూర కర్ణ” లో ఎన్టీఆర్ గారు మూడు పాత్రల్లోనటిస్తూ, స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఎన్టీఆర్ గారే దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్గారు నటించిన సాంఘిక చిత్రాలు “అడవిరాముడు”, “యమగోల” బాక్సాఫీసు వద్ద గొప్ప విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసంతాను నటించి, దర్శకత్వం వహించిన “బ్రహ్మర్షి విశ్వామిత్ర” 1990లో విడుదలైంది.

క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండే ఎన్టీఆర్ గారు, తన గంభీరమైన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచ్ లో అభ్యాసంచేసేవారు. “నర్తనశాల” సినిమా కోసం తాను వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. వృత్తిపట్ల తనకున్న నిబద్ధత అలాంటిది. కెమెరాముందు ఎన్టీఆర్ గారు ఏనాడూ తడబడిన దాఖలాలు లేవని అంటుంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు డైలాగులను ముందుగానే కంఠస్థంచేసేవారు.

ఆ రోజుల్లో కోటి రూపాయల సినిమా “దాన వీర శూర కర్ణ”…

నందమూరి తారక రామారావు గారు “శ్రీకృష్ణ పాండవీయం” (1966) చిత్రం ద్వారా మెగాఫోన్ చేతబట్టి దర్శకుడిగా తొలి చిత్రానికి దర్శకత్వంవహించిన తాను 1976 లో “దాన వీర శూర కర్ణ” చిత్రాన్ని నిర్మిస్తూ, దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణుడి పాత్రలో అక్కినేని నాగేశ్వరావు గారినినటింపజేయాలని చూశారు. కానీ అందుకు అక్కినేని గారు ఒప్పుకోలేదు. కృష్ణుడిగా ఎన్టీఆర్ గారిని చూసిన కళ్ళతో తనను చూడలేరనేది అక్కినేనిగారి అభిప్రాయం. కర్ణుడి పాత్రనైనా పోషించమని అడిగితే, తాను కర్ణుడిగా నటిస్తే పాండవులు మరుగుజ్జులుగా ఆగుపిస్తారనేది అక్కినేని గారివాదన. చివరికి దుర్యోధన, కర్ణ, శ్రీకృష్ణుడి గా మూడు పాత్రలను ఎన్టీఆర్ గారే నటించాల్సి వచ్చింది. నటన ఒకవైపు అయితే దర్శకత్వం, కథ, చిత్రానువాదం, నిర్మాణం, దర్శకత్వం మరోవైపు. ఇన్ని బాధ్యతలు ఒకేసారి నిర్వర్తించడం అంటే మాములు విషయం కాదు.

కేవలం 43 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశారు. విడుదల తేదీ దగ్గర పడడంతో చివరి పది రోజులు రాత్రింబవళ్లు చిత్రీకరణ కొనసాగించారు. ప్రతినాయకుడు ధుర్యోధనుడి పాత్రకు “చిత్రం భళారే విచిత్రం” అనే పాటను పెట్టి ఔరా అనిపించారు ఎన్టీఆర్ గారు. ధుర్యోధనుడు పాటపాడుతుంటే ఎన్టీఆర్ గారే పాడినట్టుంటుంది. కర్ణుడి పాత్రపై ఇంత సానుభూతి కురిపించడం ఈ చిత్రం తోనే మొదలయ్యింది. కర్ణుడి పాత్రను ఎన్టీఆర్ గారు అర్థం చేసుకున్న తీరు అమోఘం. సంభాషణలు డైనమెట్లలా పేలాయి. “ఏమంటివి ఏమంటివి” అనే సుదీర్ఘమైన సంభాషణ ఎన్టీఆర్గారు అద్భుతంగా చెప్పారు.

14 జనవరి 1977 నాడు సంక్రాతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని అందుకుంది. ఆ రోజుల్లోనే”లవకుశ” తరువాత కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రంగా రికార్డుకెక్కింది. రెండవ సారి విడుదల చేసినప్పుడు కూడా ఈ చిత్రం కోటిరూపాయలు వసూలు చేయడం విశేషం.

శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్.

అప్పట్లో తెలుగు సినిమాలలో శ్రీకృష్ణుడు అంటే ఈలపాటి రఘురామయ్య గారే. తానే శ్రీకృష్ణుడు వేషం ధరించేవారు. “మాయాబజార్” తీస్తున్నకె.వి.రెడ్డి గారు ఎన్టీఆర్ గారిని శ్రీకృష్ణుడుగా నటింపజేయాలని చూశారు. ఇది తెలిసిన ఎన్టీఆర్ గారు అంతకు ముందు రెండు సార్లు శ్రీకృష్ణుడుగావేషం వేస్తే ప్రేక్షకుల నుండి నిరాదరణ ఎదురవ్వడం గురించి కె.వి.రెడ్డి గారికి చెప్పారు. అయినా వినని కె.వి.రెడ్డి గారు మాయాబజార్ లో ఎన్టీఆర్గారినే శ్రీకృష్ణుడుగా నటింపజేసి తెలుగు వారికి నిజమైన శ్రీకృష్ణుడు ఇలాగే ఉంటాడేమో అన్న భ్రమను కలిగించారు. శ్రీకృష్ణుడు పాత్రను అనితరసాధ్యమైన రీతిలో పోషించి తెలుగు వారికి ఆరాధ్య దైవం అయ్యారు.

ఎన్టీఆర్ గారు సినిమాలలో అడుగుపెట్టే నాటికి పౌరణికాల ప్రభ తగ్గుముఖం పట్టింది. తాను ధరించిన ధుర్యోధనుడు, రాముడు, కృష్ణుడు, రావణాసురుడు పాత్రలకు అద్భుతమైన ప్రశంసలు వెల్లువెత్తడంతో పౌరాణిక పాత్రలకు పునరుజ్జీవం పోసినట్లయ్యింది. నాటకాలలో, సినిమాలలోకలిపి ఎన్టీఆర్ గారు 33 సార్లు శ్రీకృష్ణుడు పాత్రను ధరించారు. ఎన్టీఆర్ గారికి సమకాలికులైన కొందరు శ్రీకృష్ణుడు పాత్రలను పోషించే ధైర్యంచేసేవారు. కానీ ప్రతిసారి వారు ఎన్టీఆర్ ను పోల్చుకుని వెనుకంజ వేస్తూ వచ్చారు. ఎన్నిసార్లు ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడు పాత్ర పోషించినా కూడా అదేవయస్సు, అదే ఆహార్యం ప్రతిబింబిస్తూ నటించడం కేవలం ఎన్టీఆర్ గారికి మాత్రమే సాధ్యం..

మరణం.

సినీ జగత్తులో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని లిఖించుకున్న నందమూరి తారక రామారావు  గారు 1942లో బసవతారకం గారిని వివాహంచేసుకున్నారు. కానీ తాను 1985లో మరణించారు. కొంత కాలం తరువాత 1993లో ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతిని గారిని వివాహం చేసుకున్నారు. ఆతరువాత పార్టీలో లక్ష్మీ పార్వతి గారి అధిపత్యాన్ని ఓర్చుకోలేని టీడీపీ నాయకులు అసమ్మతిని తెలియజేశారు. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబునాయుడు గారు పార్టీ నాయకత్వంను తన చేతిలోకి తీసుకుని ఎన్టీఆర్‌ గారిని ప్రక్కన పెట్టారు. ఆగస్టు 1995లో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకుడిగా మరియు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ మరుసటి ఏడాది ప్రారంభంలో గుండెపోటుకు గురైన ఎన్టీఆర్ గారు 18 జనవరి 1996న హైదరాబాదులోని తన నివాసంలో 72 సంవత్సరాల వయస్సులో మరణించారు. తన అంత్యక్రియలు జరిపి తన చితాభస్మాన్ని ఎనిమిదేళ్ల తర్వాత మే 2004లో ఆయన రెండవ భార్య లక్ష్మీపార్వతి గారు శ్రీరంగపట్నంలో నిమజ్జనం చేశారు.

విశిష్టతలు..

★ తెలుగు చలనచిత్ర చరిత్రలో సంసారం, పాతాళభైరవి, మల్లీశ్వరి లాంటి వరుస విజయాలలో మొదటి హ్యాట్రిక్ సాధించిన కథానాయకుడుఎన్టీఆర్ గారూ..

★ శ్రీ మద్విరాట పర్వము చిత్రంలో కృష్ణ, అర్జున, దుర్యోధన, కీచక, బృహన్నల లాంటి ఐదు విభిన్న పాత్రలతో పాటు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణ మరియుదర్శకత్వ బాధ్యతలు ఒకే చిత్రానికి చేపట్టిన మొట్టమొదటి నటుడు ఎన్టీఆర్ గారూ..

★ తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యంత నిడివి (లెంత్) ఎక్కువ కలిగి అతి తక్కువ రోజులలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం “దాన వీర శూర కర్ణ”. ఎన్టీఆర్ గారూ నటించిన, నిర్మించిన, దర్శకత్వం వహించిన “దాన వీర శూర కర్ణ” మూడు గంటల 46 నిమిషాల సినిమాని కేవలం 43 రోజులలోచిత్రీకరించడం జరిగింది. ఇది అనితర సాధ్యం..

★ 1958 సంవత్సరంలో తమిళ భాషలో సంపూర్ణ రామాయణం చిత్రంలో మొదటిసారిగా పూర్తి నిడివిగల రాముని పాత్రలో నటించారు ఎన్టీఆర్గారూ…

★ 1966 జనవరి 13న విడుదలైన “శ్రీకృష్ణ పాండవీయం” చిత్రం ద్వారా దర్శకునిగా వెండితెరపై మొదటిసారిగా ఎన్టీఆర్ గారి పేరుప్రచురితమైనది…

★ ఎన్టీఆర్ గారి మొట్టమొదటి సారిగా శ్రీరాముని పాత్రలో నటించిన తమిళ సినిమా “సంపూర్ణ రామాయణం” 264 రోజులు విజయవంతంగాప్రదర్శించబడింది..

★ భారతదేశ చలనచిత్ర పరిశ్రమ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సి.ఎన్.ఎన్ & ఐ.బి.ఎం వారు చేసిన సర్వే ప్రకారం 2013లోభారతదేశ ప్రఖ్యాత నటుడిగా 53% ఓట్లతో ఎన్టీఆర్ గారు మొదటి స్థానంలో నిలిచారు. ఎన్.డి.టీ.వీ సర్వే ప్రకారం ప్రఖ్యాత ఆంధ్రుడిగా 73% ఓట్లతోఎన్టీఆర్ గారు మొదటి స్థానంలో నిలిచారు..

★ తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన వాటిలో అత్యధిక సినిమాలు 100 రోజులు ఆడిన ఘనత ఒక ఎన్టీఆర్ & ఏఎన్నార్ లకే సాధ్యం. వాళ్ళిద్దరూ కలిసి నటించిన 14 సినిమాలలో తొమ్మిది సినిమాలు 100 రోజులు పైబడి ఆడినవే…

★ తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి పూర్తి నిడివి కలర్ సినిమాలో రూపొందిన చిత్రం 1963 లో ఎన్టీఆర్ గారు నటించిన “లవకుశ”…

★ శ్రీకృష్ణుని పాత్ర 17 సార్లు పోషించి, ఆంధ్రులకు శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనిపించేలా పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు యుగపురుషుడుఎన్టీఆర్ గారు…

★ తెలుగు చిత్ర సీమకు సంక్రాంతి సత్తాను పరిచయం చేసి సినిమాకి సంక్రాంతికి అవినాభావ సంబంధం నెలకొల్పిన నటుడు, నిర్మాత, దర్శకుడుఅయిన ఎన్టీఆర్ గారు ఆయన నటజీవితంలో నాలుగు సంవత్సరాలు తప్ప ప్రతి సంక్రాంతి పండుగకు ఒక సినిమా విడుదల చేసి విజయాలసాధించారు. మొత్తం 32 సంక్రాంతి సినిమాలు విడుదల చేయగా వాటిలో 27 సినిమాలు అఖండ విజయం సాధించాయి..

★ 1961 లో “సీతారాముల కళ్యాణం” లో రావణబ్రహ్మ సన్నివేశంలో పది తలలు సహజంగా ఏర్పడే సన్నివేశం కోసం పది గంటల పాటు కదలకుండాసింగిల్ షాట్ తీసిన మొండితనం పేరు ఎన్టీఆర్ గారు..

★ 1963లో 40 సంవత్సరాల వయస్సులో నర్తనశాల చిత్రంలోని బృహన్నల పాత్ర కోసం “వెంపటి చిన్న సత్యం” గారి దగ్గర కూచిపూడి నృత్యంఅభ్యసించారు ఎన్టీఆర్ గారు…

★ పాతాళభైరవి చిత్రం ద్వారా ఏకకాలంలో తెలుగు తమిళ భాషలలో నటించారు ఎన్టీఆర్ గారు..

★ నాడు ఎన్టీఆర్ గారు నటించిన “అడవి రాముడు” సినిమా రికార్డు వసూళ్ళు నాలుగు కోట్ల రూపాయలు నేటి ఎనిమిది వందల కోట్లరూపాయలకు సమానం…

★ 1974 రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ స్థాపించి 11 చిత్రాలను నిర్మించారు ఎన్టీఆర్ గారు…

★ కాలేజీ రోజులలో “కీలుగుఱ్ఱం” సినిమాలో మొదట నటించే అవకాశం వచ్చినా చదువును పూర్తి చేయాలని పట్టుదలతో ఆ అవకాశాన్నితిరస్కరించారు ఎన్టీఆర్ గారు…

★ పల్లెటూరి పిల్ల సినిమాకి 1116 రూపాయలు మొదటి పారితోషకంగా అందుకున్న ఎన్టీఆర్ గారు…

★ 1953 లో ఎన్టీఆర్ గారు నటించిన “చండీరాణి” సినిమా తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో విడుదలవడం ద్వారా తొలి తెలుగు పాన్ఇండియా హీరోగా ఎన్టీఆర్ గారు చరిత్ర సృష్టించారు..

★ 21 మే 1947న శోభనాచల స్టూడియోలో ఎల్వీ ప్రసాద్ గారికి మొదటి స్క్రీన్ టెస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ గారు..

★ 1965లో విడుదలైన 12 చిత్రాలలో 9 చిత్రాలు విజయవంతం అవ్వగా ఎనిమిది చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఒకే సంవత్సరంలోఇన్ని విజయాలు సాధించిన కథానాయకుడు ఎన్టీఆర్”

★ 1941-42 సంవత్సరానికి గాను జరిగిన రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీలో బహుమతి గెలుచుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న ఎన్టీఆర్..

★ ఎన్టీఆర్ నటించిన మొత్తం చిత్రాలు…   304 ★ 

★ హిట్ చిత్రాలు…     275…

 ★ 365 రోజుల చిత్రాలు 23..

★ 300 రోజుల చిత్రాలు 94..

★ 175 రోజుల చిత్రాలు 185..

 ★  వందరోజుల చిత్రాలు 223…

★ 50 రోజుల చిత్రాలు 52..

 ★ రెండవ రిలీజ్ లో 100 రోజులు ఆడిన చిత్రాలు 28…

Show More
Back to top button