చలికాలంలో భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాల్లో ఔలి ఒకటి. ఇది ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాలలో చమోలి జిల్లాలో ఉంది. దీనిని ‘ఔలి బుగ్యాల్’ అని పిలుస్తారు. చలికాలంలో ఇక్కడ ప్రాంతాలు మంచుతో చూడడానికి చాలా బాగుంటాయి. జూన్, నవంబర్ మధ్య వెళ్తే లోయ గడ్డి మైదానంతో నిండి.. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్న పుష్ప జాతులు కనిపిస్తాయి. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 2800 మీటర్లు ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశాన్ని ‘హిమాలయాల గేట్‌వే’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్కీయింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. ప్రతి ఏటా చలి కాలంలో ఇక్కడ స్కీయింగ్ పోటీలు జరుగుతాయి. ఈ ప్రదేశం ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.
అంతేకాకుండా, ఇక్కడ ఉండే నర్సింహ దేవాలయానికి పెద్ద చరిత్రే ఉంది. కలియుగం చివరిలో, ప్రళయం వచ్చినప్పుడు ఈ ఆలయం నీటిలో మునిగిపోయి బద్రీనాథ్‌లోకి ప్రవేశ మార్గాన్ని అడ్డుకుంటుందని ఇక్కడ ఒక ప్రసిద్ధ జోస్యం ఉంది. బద్రీనాథ్ ఇక్కడ నుండి 25 కి.మీ మాత్రమే.
* చూడదగ్గ ప్రదేశాలు:
*ఔలీ రోప్‌వే
*నందా దేవి శిఖరం
*గోర్సన్ రిజర్వ్ ఫారెస్ట్
*ఔలి కృత్రిమ సరస్సు
*గుర్సన్ బుగ్యల్
*జోషిమత్
*రుద్రప్రయాగ
*నందప్రయాగ
*చీనాబ్ సరస్సు
*త్రిశూల శిఖరం
*క్వానీ బుగ్యాల్
*నర్సింహ దేవాలయం
ఎలా చేరుకోవాలి:
రైలు ద్వారా:
ఔలి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్ హరిద్వార్. ఇక్కడి నుండి ఔలికి 273 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్టేషన్ నుండి టాక్సీ, బస్సు సదుపాయం ఉంటుంది.
విమానం:
ఔలికి సమీపంలోని విమానాశ్రయం డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం, ఇది దాదాపు 286 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నుండి టాక్సీ, బస్సుల ద్వారా ఔలి చేరుకోవచ్చు.