TRAVEL

నల్లమల అభయారణ్యం గుండా కృష్ణానదిలో సాగర్ – శ్రీశైలం పడవ ప్రయాణం..

కృష్ణానది గురించి సంక్షిప్తంగా…

  • తెలుగు నేల పొలాలకు జలములొసగి 
  • తెలుగు వారల మతులకు తేజమిచ్చి
  • తెలుగుదేశమ్ము కీర్తికి వెలుగుకూర్చు 
  • కృష్ణవేణి నది! నమస్కృతులు గొనుము..
  •       … దివాకర్ల వెంకటావధాని

కళాప్రపూర్ణ, విద్యాసనాథ, కవిభూషణ దివాకర్ల వెంకటావధానులు తన కవిత్వం ద్వారా కృష్ణా నది వైభవం గురించి పైవిధంగా ప్రస్తావించారు. కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం  దగ్గర పడమటి కనుమల్లోని సహ్యాద్రి పర్వతాలలో పుట్టి చిన్న నదిగా పారుతూ చిన్న కాలువలు మొదలుకొని, పెద్ద ఉప నదులను తనలో కలుపుకుంటూ తన ప్రయాణాన్ని సాగిస్తుంది. పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ సుమారు 29 ఉపనదులను తనలో విలీనం చేసుకుంటుంది. కృష్ణా జనించిన మహాబలేశ్వరం నుండి 135 కి.మీ.ల దూరంలో కొయినా నదిని తనలో కలుపుకుని ఆ తరువాత వర్ణ, పంచగంగ, దూధ్‌గంగలను కావలించుకుని మహారాష్ట్రలో 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అలా పశ్చిమ కనుమలు దాటిన కృష్ణ తన జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలో ఘటప్రభ, మలప్రభ నదులను తనలో కలుపుకుని తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు భీమా నదిని తనలో ఐక్యం చేసుకుంటుంది.

ఆవిధంగా కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్‌సూగూర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అటు పిమ్మట ఆలంపూర్ కు దగ్గరలో కృష్ణ నదికి ఉన్న అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుపుకొంటూ  ఇక్కడే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనికి ప్రవేశిస్తుంది. ఆ తరువాత కొద్ది దూరంలోనే కృష్ణా నది నల్లమల కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండి, మూసి, పాలేరు, మున్నేరు వంటి నదులను కలుపుకొంటూ విజయవాడ దగ్గర బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజిని దాటి డెల్టా ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ చివరికి దివిసీమ లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో మూడవది అనదగ్గ కృష్ణా నది దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది. కృష్ణా నదిలో నీటి ప్రవాహం సెకనుకు 2213 మీ3. ఈ నది నీటి ప్రవాహం పరంగా భారతదేశంలో కెల్లా నాలుగవ పెద్ద నది. తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని పిలుచుకునే ఈ నది సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున పడమటి కనుమలలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్‌కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో చిన్న ధారగా జన్మించి, ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను సస్యశ్యామలం చేస్తూ సుమారు 1400 కి. మీ. ప్రయాణించి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ క్రమంలో ఉపనదులు అన్నిటితో కలిపిన కృష్ణా నదీ వ్యవస్థ యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 2,56,000 చ.కి.మీ.

నల్లమల అభయ్యారణ్యం..

దేశంలోని ఐదు జీవవైవిద్య ప్రాంతంలో నల్లమల్ల అభయారణ్యం ఒకటి. అరుణాచల్ ప్రదేశ్ లోని నాందాఫా, పశ్చిమ కనుమలలోని అగస్త్యమలై, తమిళనాడులోని నీలగిరి, హిమాలయాలలోని నందాదేవి మిగిలిన నాలుగు జీవవైవిద్య ప్రాంతాలు. మన నల్లమల్ల జీవవైవిద్యానికి పుట్టినిల్లు. తూర్పుకనుమల లోపలి భాగపు కొండల మీద సాంద్రంగా పరుచుకున్న ఆకుపచ్చటి దుప్పటే నల్లమల అడవులు. ఇవి నల్లగొండ, మహబూబ్ నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దులో సుమారు ఆరు వేల కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి. ఈ అడవులలో అరుదైన వృక్షజాతులు, జంతుజాతులు, వాగులు, సుందర జలపాతాలు, పాతాళానికి మార్గాలుగా ఉండే లోయలు, అక్కడక్కడా చెంచుపెంటలు, పురాతన దేవాలయాలతో పాటు ఆధునిక దేవాలయాలుగా పేరుగాంచిన శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆనకట్టలు వంపులు తిరుగుతూ వయ్యారంగా పరుగులెత్తే కృష్ణవేణమ్మను పాపిటగా చేసుకొని అలరాలుతోంది నల్లమల్ల.

రకరకాల పక్షులు, వివిధ రకాల జంతువులు, పలు రకాల వన్యమృగాలతో అలరారుతూ జీవవైవిధ్యానికి కొలువై వున్న ఈ నల్లమల అటవీప్రాంతం మొత్తం విస్తీర్ణం 5,947 చదరపు కిలోమీటర్లు. ఇందులో సుమారు 3040.74 చదరపు కిలోమీటర్లు రాజీవ్ గాంధీ పులుల అభయారణ్యం విస్తరించి ఉంది. ఇది దేశంలోని అతిపెద్దది. దీనికి మరో పేరు నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్. పులి ఉన్నత స్థాయి జంతువు. అంటే ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తనకు ఆహారం అయ్యే వందలు కొద్ది క్రింది స్థాయిల జీవులు మనుగడలో ఉంటేనే. పులులు సంచరిస్తాయి. ఈ లెక్కన చూస్తే నల్లమల్లలో జీవవైవిధ్యం అపారంగానే ఉంటుంది. ప్రపంచంలోనే అరుదైన జీవరాశులను చూడాలంటే శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలోని జీవవైవిద్య కేంద్రానికి వెళ్తే సరే ఈ అడవుల్లో ఎంత వైవిధ్య ఉందో తెలుస్తుంది.

నల్లమల అడవుల్లో 70 రకాల క్షీరదాలు, 20 రకాల సరీసృపాలు, 300 రకాల పక్షులు, 100 సీతాకోకచిలుకలు, మౌత్స్, 80 రకాల సాలెపురుగులు కనిపిస్తాయి.  వీటితో పాటు రకరకాల పిల్లులు, అనేకానేక కీటకాలు, చుక్కల జింకలు, కణితులు, నాలుగు కొమ్ముల జింకలు, కృష్ణ జింకలు, దుప్పులు, కొండచిలువలు, అడవి పందులతో పాటు రకరకాల పాములు, బల్లి జాతులను నల్లమలలో ఉంటాయి. హిమాలయాలు, పశ్చిమ కనుమలు, ఇంకా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని జీవులు నల్లమల్లలో కనిపిస్తాయి. ఇక్కడ జీవవైవిధ్య కేంద్రంలో చేపలు, సీతాకోకచిలుకలు, తొండలు, ఉడుములు, పాములు, పిల్లులు, జంతువులు, గబ్బిలాలు, సాలెపురుగులు, క్రిమి కీటకాలను ఇక్కడ భద్రపరిచారు. జింకలు, అడవి పందులు, నక్కలు, తొండలు, ఎలుగుబంట్లు, అడవి పిల్లులు, కొండ గొర్రెలు, సాంబార్, చుక్కల దుప్పులు, తాబేలు, నక్షత్ర తాబేలు, బెట్టు ఉడతలు మొదలగు రకరకాల జీవరాశులు నల్లమల నివాస స్థలం.

లాంచనంగా ప్రారంభమైన లాంచీ ప్రయాణం…

నాగార్జునకొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల్ల అందాలను తిలకిస్తూ గల గల పారుతున్న కృష్ణానదిలో లాంచీలో విహార యాత్రను తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు 120 కిలోమీటర్ల దూరం 6 నుండి 7 గంటల ప్రయాణం 02 నవంబరు 2024 నాడు పర్యాటకుల కేరింతల మధ్య ప్రారంభమైంది. నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల్ల అటవీ అందాల మధ్య సాగిన ఈ అద్భుత ప్రయాణం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్తీకమాసం తొలిరోజే ప్రారంభించిన ఈ పర్యాటకం తెలంగాణ ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు అద్భుతమైన బోటు ప్రయాణాన్ని కార్తీక మాసం తొలిరోజు తెలంగాణ పర్యాటకశాఖ ప్రారంభించింది. గత పదేళ్లుగా ఈ పర్యాటకానికి ప్రణాళిక చేస్తున్నప్పటికీ నాగార్జునసాగర్ జలాశయంలో సరైన నీటిమట్టం లేకపోవడం, కరోనా మహమ్మారి తదితర కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణానికి మొదటి రోజు రాష్ట్రంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు.

120 మంది ప్రయాణించేలా బోటు…

నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను వీక్షించేలా లాంచీ ప్రయాణం సాగనుంది. ఇదొక మార్గం అయితే, మరొక మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా పర్యాటకాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొల్లాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ప్రారంభించారు. అక్కడి నుంచి శ్రీశైలం వరకు 120 కిలోమీటర్ల మేర 6:30 గంటల పాటు ఈ ప్రయాణం ఉంటుంది.

నాగార్జునసాగర్‌ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నట్లు పర్యాటకాభివృద్ధి సంస్థ తెలిపింది. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుగా డబుల్ డెక్కర్ మాదిరి ఏ.సి లాంచ్ లు పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది . సాయంత్రానికి లాంచ్ శ్రీశైలం చేరుకుంటుంది. శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం మరుసటి రోజు మళ్లీ లాంచ్ తిరిగి సాగర్‌కు చేరుకుంటుంది. సుమారు 100 మంది పర్యాటకులతో లాంచ్ బయలుదేరుతుంది. చుట్టూ కొండలు, ఇంకాస్త కముందుకు వెళ్తే నలమల్ల అటవీ అందాలు మరోవైపు కృష్ణమ్మ పరవళ్లు ఇలా ప్రకృతి రమణీయత మధ్య ఈ లాంచీ ప్రయాణం సాగుతుంది.

ప్యాకేజి…

ఇందుకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. పెద్దలకు 2000 రూపాయలు, పిల్లలకు 1,600 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కేవలం సింగిల్ వేకు మాత్రమే. అదే సమయంలో రౌండప్ టూర్ ప్యాకేజీ అయితే పెద్దలకు 3000 రూపాయలు, పిల్లలకు 2400 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్యాకేజీని ఎంపిక చేస్తే.. సాగర్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుండి సాగర్ వరకు లాంచీ ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్యాకేజీని https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు. లేదా 9848540371 లేదా 9848306435ను సంప్రదించొచ్చు. [email protected]కు కూడా మెయిల్ చేయవచ్చు. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు టూర్ ప్యాకేజీ  అంటే 02 నవంబరు 2024 నుండి ప్రారంభమవ్వగా, 26 అక్టోబరు 2024 తేదీ నుంచి నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీనికి కూడా పైన పేర్కొన్న టిక్కెట్ ధరలే వర్తించనున్నాయి. ఈ ప్రయాణానికి దాదాపు 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది.

స్పీడ్‌ బోట్ల కొనుగోలుకు రంగం సిద్ధం…

ప్రస్తుతం కార్తికమాసం అవ్వడంతో శ్రీశైలానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అక్కడ వసతి గదుల సమస్య కూడా ఉంటుంది. దీంతో పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రస్తుతం ​ ఈ పర్యాటకాన్ని నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలంకు, సోమశిల నుంచి శ్రీశైలం క్రూయిజ్‌ షిప్‌ ప్రయాణానికి పరిమితం చేసింది. కార్తికమాసం పూర్తయ్యాక హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో బస్సుల్లో నాగార్జునసాగర్‌, సోమశిల తీసుకెళ్లడం, తిరుగు ప్రయాణంలో శ్రీశైలం నుంచి తీసుకురావడంతో పాటు అక్కడ వసతులు, సౌకర్యాలు వంటి వాటిని కల్పించనున్నట్లు ఆ సంస్థ అధికారి సాయిరాం తెలిపారు. మరోవైపు సోమశిల నుంచి శ్రీశైలం వరకు నలుగురు వ్యక్తులు ప్రయాణించేలా స్పీడ్‌ బోట్ల కొనుగోలుకు పర్యాటకాభివృద్ధి సంస్థ సిద్ధమవుతోంది. ఇరవై మంది​తో కూడిన డీలక్స్‌ బోట్‌ను కొనుగోలు చేయనుంది. నదికి ఓ వైపు తెలంగాణలో అమ్రాబాద్‌ పెద్దపులుల అభయారణ్యం, మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వు ఉన్నాయి. నది మీదుగా పెద్దపులుల రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ అడవులలో ఉండే పెద్దపులులు ఈదుతూ నదిని ​దాటుతాయి. నీటి సామర్థ్యం అధికంగా ఉన్నప్పుడు మినహా ఇతర సమయాల్లో పెద్దపులులు నది మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి.

కర్నూలు జిల్లాలో చూడవలసిన క్షేత్రాలు…

కృష్ణానదిలో అందమైన ప్రయాణం చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునే క్రమంలో కర్నూలు జిల్లాలో గల ఇతర పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకునే వెసులుబాటును కల్పించుకోగలిగితే ఆ పుణ్య క్షేత్రాల వివరాలను కూడా తెలియపరుస్తున్నాము.

శ్రీశైలం…

సుమారు రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శైవ క్షేత్రాన్ని పురాణాల్లో శ్రీ పర్వతం గా పేర్కొన్నారు. లింగాయతులకు, వీరశైవులకు ఈ క్షేత్రం పరమ పవిత్రమైన స్థలం. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయం యొక్క మండపాన్ని విజయనగర రాజు రెండో హరి హర రాయులు నిర్మించారు. ఈ ఆలయం పెద్ద ప్రాకారంలో కొలువుతీరి ఉంటుంది. ఆనాటి శిల్పలు ప్రాకార కుడ్యాల మీద పౌరాణిక కథలను చెక్కారు. ఆలయానికి తూర్పు ద్వారం దగ్గరలో నంది విగ్రహం ఉంటుంది. ప్రాకారంలో అన్నింటికంటే పాత గుడి వృద్ధ మల్లికార్జునుడిది. ప్రాకారానికి ఆవల అష్టాదశ శక్తిపీఠాలలో ఒక్కటైన భ్రమరాంబికా దేవి ఆలయం ఉంటుంది. ఇక్కడ నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో పాతాళగంగ   ఉంటుంది. పాతాళ గంగ దగ్గర శ్రీశైలం ఆనకట్ట నీళ్లలో ఒక పెద్ద నంది విగ్రహం మునిగిపోయింది. కృష్ణా నదికి చేరుకునేందుకు కొండమీద నుండి రెడ్డి రాజులు నిర్మించిన మెట్లమార్గం ఉంది.

ఓంకారం..

నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన క్షేత్రమే ఓంకారం. ఇక్కడ పరిసరాలు నిరంతరం ప్రణవ నాదాన్ని వినిపించడం వలన ఈ ప్రాంతానికి ఓంకారం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉమా సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయస్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే గ్రహదోషాలు తొలగిపోయి అన్నీ శుభాలే జరుగుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతుంటారు.

మహానంది..

మహానందిలో శివుడు కామేశ్వరి సమేత గోపాదలింగేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ పుష్కరిణిలో నంది ముఖంలోంచి నిరంతరం నీళ్లు వస్తూనే ఉంటాయి. కార్తీకమాసంలో సోమవారాలు, పౌర్ణమి నాడు సూర్యోదయం లోపు భక్తులు పాదయాత్రతో నవనందీశ్వరుడిని దర్శించుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీ. నంద్యాల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలోని సాక్షి గణపతి విగ్రహానికి నమస్కరించి ఈ యాత్ర మొదలుపెడతారు. మొదట నంద్యాలలోని చామకాలువ గట్టున ఉన్న ప్రథమ నందీశ్వరుని దర్శించుకుంటారు. ఆ తరువాత పట్టణంలో ఉన్న నాగ, సోమ, బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వలోని శివ, అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో  కృష్ణ, మహా, వినాయక, గరుడ (రెండు మహానందిలోనే), సూర్య, నందీశ్వరులను (తమడపల్లె నుంచి రెండు కిలోమీటర్లు) వరుసగా దర్శించుకుంటారు.

యాగంటి..

పూర్వం ఓ యోగి ఇక్కడ దైవ సత్కారం పొంది “నేనుగంటి”, “నేనుగంటి” అన్నాడట. అదే తరువాతి కాలంలో ఏగంటి, ఆ తరువాత యాగంటిగా మారిందని అంటారు. యాగంటి అనేది బనగానపల్లి సమీపంలోని ఎర్రమల కొండలలో వెలసిన ముక్కంటి క్షేత్రం. స్వామి ఇక్కడ లింగాకృతిలో కాకుండా పార్వతీ సమేతంగా విగ్రహా రూపంలో ఉండడం ప్రత్యేకత.ఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. ఈ ప్రాంతంలో కాకులు కనిపించకపోవడం విశేషం. శివాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి గుహ, అగస్త్య ముని గుహ  దర్శనీయ స్థలాలు. కార్తీక, మాఘ మాసాలు, శివరాత్రి పర్వదినం నాడు ఈ క్షేత్రానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. గుడిలో ఉన్న పెద్ద నంది విగ్రహం పెరుగుతుందంటారు. ఈ బసవన్న కలియుగాంతంలో రంకె వేస్తాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు.

ఇష్టకామేశ్వరి…

శ్రీశైలం నుండి దోర్నాల వైపు 11 కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడి నుండి పది కిలోమీటర్లు అడవి మార్గంలో జీపుల ద్వారా వెళితే ఇష్టకామేశ్వరి వస్తుంది. ఇది నల్లమల అడవుల మధ్యన కొలువై ఉన్న ఆలయం. ఏటవాలు కొండ మీద నుంచి సాగుతూ ఉండే ఈ ప్రయాణం చాలా ఉత్కంఠభరితంగా అనిపిస్తుంది. ఈ ఆలయానికి కొద్ది దూరంలో వాహనాలను ఆపేస్తారు. అక్కడొక సెలయేరు ఉంటుంది. దానిని దాటి వెళితే ఇష్టకామేశ్వరి ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం లోపలికి వెళ్లాలంటే కూర్చొని అడుగులో అడుగు వేస్తూ వెళ్లాలి. ఈ ఆలయంలో భక్తులే స్వయంగా అమ్మవారికి బొట్టు పెడతారు. ఇది ఇక్కడి ఆచారం.

  నందవరం…

 బనగానపల్లి నుండి నంద్యాల రహదారిలో పన్నెండు కిలోమీటర్ల దూరంలో నందవరం ఉంది. ఇక్కడికి ప్రాణ్యం నుండి కూడా వెళ్ళవచ్చు. ప్రాణ్యం నుండి 25 కిలోమీటర్ల దూరంలో నందవరం ఉంటుంది. ఇక్కడ చౌడేశ్వరీదేవి ఆలయం ప్రసిద్ధి. నందన చక్రవర్తి నందవరాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ కాశీ విశాలాక్షి చౌడేశ్వరి దేవి రూపంలో వెలసిందంటారు. ఇక్కడ ఉగాది రోజు మొదలుకొని ఆరు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నందవరంలో దత్తాత్రేయుని ఆలయ ప్రాంగణంలో ఉన్న అత్తి చెట్టుకు పూజలు జరుగుతుంటాయి.

ఊరుకుంద…

ఆదోని నుండి 30 కి.మీ దూరంలో ఉరుకుంద ఉంటుంది. అలాగే కుప్పగల్లు, కోస్గి రైల్వే స్టేషన్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో “ఉరుకుంద” ఉంటుంది. విష్ణు భక్తులు నృసింహాస్వామిగా, శివ భక్తులు వీరభద్ర స్వామిగా ఒకే దగ్గర పూజలు చేసే క్షేత్రం “ఊరుకుంద”. కౌతాళం మండలంలో ఉన్న ఊరుకుంద కొలువై ఉన్న దైవం ఈరన్న స్వామి. అమావాస్య, సోమవారం, గురువారాల్లో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్వ కాలంలో “ఉరుకుంద” పొలిమేరలో ఉన్న రావి చెట్టు క్రింద తపస్సు చేసి ఈరన్నస్వామి యోగిగా మారాడట. ఆయనను గౌరవించే వారికి కొంగుబంగారంగా, దుష్టుల పట్ల ఆగ్రహంగా ఉండేవారట. ఈరన్న స్వామి వస్త్రధారణ, ఆచారాలు దృష్ట్యా ఆయనను వీరభద్రుడుగా కొలుస్తారు. ఆయన తపస్సు చేసిన రావిచెట్టు విష్ణుమూర్తికి ప్రతీక కావడం, ఆలయ నిర్మాణ సమయంలో నృసింహస్వామి విగ్రహం లభించడంతో ఊరుకుందను వైష్ణవులు కూడా దర్శించుకుంటార.  ప్రతి శ్రావణమాసం ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయి.

మంత్రాలయం…

మంత్రాలయం రాఘవేంద్ర మఠంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇది తుంగభద్ర నది తీరంలోని పుణ్యక్షేత్రం. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. తమిళనాడులోని కాంచీపురం సమీపంలో గల భువనగిరిలో రాఘవేంద్ర స్వామి జన్మించారు. ఆయన సన్యాసం స్వీకరించాక కర్ణాటకలో ధర్మ ప్రచారం చేస్తూ చేస్తూ చివరికి మంత్రాలయం చేరుకుని క్రీస్తుశకం 1671లో జీవ సమాధి పొందారు. స్వామి సమాధి అయినచోట ఉన్న బృందావనానికి భక్తులు పూజలు చేస్తారు. ఇక్కడ జయరామాలు, దిగ్విజయరామాలు, మూలారామాలు, సంతానగోపాలకృష్ణ, వైకుంఠ వాసుదేవమూర్తుల పూజలను స్వయంగా పీఠాధిపతి నిర్వహిస్తారు. ఈ మఠాన్ని శ్రీమఠంగా పిలుస్తారు. ఇక్కడ స్వామి వారిని దర్శించాలంటే సంప్రదాయ దుస్తులను ధరించాలి. ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ తో బాటు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

కర్నూలు నుండి బస్సు మార్గం, తుంగభద్ర (మంత్రాలయం రోడ్డు) రైల్వే స్టేషన్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

కాల్వబుగ్గ 

కర్నూలు నుండి కాల్వబుగ్గకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి భక్తులకు ప్రయాణ సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ ఎర్రమల కొండలలో కొలువుదీరిన శివ క్షేత్రం ఉన్నది. ఇక్కడ నీటి బుగ్గలు ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ దైవం బుగ్గ రామేశ్వరుడు. పరశురాముడు ఇక్కడ శివుని  ప్రతిష్టించాడని కథ. ఇక్కడికి శ్రావణ కార్తీక మాసంలో భక్తులు ఎక్కువగా వస్తారు. ఇక్కడ శివరాత్రి సందర్భంగా జాతర జరుగుతుంది. కాల్వబుగ్గ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే కొమ్ము ఆంజనేయ స్వామి దేవాలయమును కూడా భక్తులు సందర్శించుకోవచ్చు.

అహోబిలం…

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో నల్లమల లో కొలువుదీరిన ఉన్నది నవ నరసింహ క్షేత్రం. ఆళ్లగడ్డ నుండి అహోబిలంకు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతీ అరగంటకు ఒక బస్సు ఉంటుంది. నరసింహుడు హిరణ్యకశిపుణ్ని సంహరించి  ప్రహ్లాదుల్ని కాపాడింది ఇక్కడే అని అంటారు. అప్పుడు దేవతలు, మునులు స్వామిని “అహోబిలం”, “అహోబిలం” అని ప్రస్తుతించారు. అలా ఈ క్షేత్రానికి “అహోబిలం” అనే పేరు వచ్చింది. కాలక్రమంలో “అహోబిలం” గా మారింది. బ్రహ్మాండపురాణంలో “అహోబిలం మహత్యం” ఉంది. ఇక్కడ తొమ్మిది నరసింహా ఆలయాలు ఉన్నాయి. మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో ఒకరైన “ఎఱ్ఱన” ఈ క్షేత్రాన్ని కీర్తిస్తూ నృసింహపురాణం రచించారు. తెలుగులో ఇదే తొలి స్థల పురాణం. ఇక్కడ స్వామిని కీర్తిస్తూ అన్నమయ్య ఎన్నో సంకీర్తనలు గానం చేశాడు.

ప్రాతకోట…

నందికొట్కూరు నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ప్రాతకోట ఉన్నది. ప్రాతకోటలోనే కుబేరుని విగ్రహం లభ్యమైందని చెబుతుంటారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వున్న విగ్రహానికి ఎదురుగా ఉత్తరం వైపు నిలబడితే నవ్వినట్టు, దక్షిణ వైపు నిలబడితే ఏడ్చినట్టు కనిపిస్తుంది. ప్రాతకోట గ్రామం పూర్తిగా శ్రీశైలం ఆనకట్ట నీళ్లలో మునగిపోయింది. దాంతో దానికి పునరావాసంగా గ్రామ సమీపంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న కాశీశ్వర, నాగేశ్వర, నందీశ్వర దేవాలయాలను కూడా తరలించారు. ప్రాతకోటకు సమీపం నుండే కృష్ణ ప్రవహిస్తోంది. 

బీరవోలు…

ఇక్కడ కొలువై వున్న భీమలింగం గురించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది. పాండవులు అరణ్యవాసంలో ఉండగా కాశీ వెళ్ళి శివలింగాలు తెమ్మని ధర్మరాజు భీముడికి చెప్పారట. అయితే మహోత్సవం సమీపించడంతో ధర్మరాజు వేపదారువును సంగమేశ్వరంలో ప్రతిష్టించాడు. ఆ తరువాత విషయం తెలుసుకున్న భీముడు కోపానికి గురై తాను తెచ్చిన శివలింగాన్ని విసిరేసాడట. ఆ శివలింగం ఐదు లింగాలుగా విడిపోయి మల్లేశ్వరం, సిద్దేశ్వరం, కపిలేశ్వరం, సోమేశ్వరం, సంగమేశ్వరాల్లో పడిపోయాడట. శ్రీశైలం ప్రాజెక్టు ముంపున గురికావడంతో భీమ లింగాన్ని సంగమేశ్వరం నుంచి బీరవోలుకు తెచ్చి ఆలయాన్ని నిర్మించారు. 

కొండారెడ్డి బురుజు…

రాయలసీమ ప్రాంతానికి ముఖద్వారంగా ప్రసిద్ధిగాంచిన కర్నూలు నగరానికి వన్నె తెచ్చిన ఎర్రరాతి కట్టడం కొండారెడ్డి బురుజు. దీనిని విజయనగర చక్రవర్తి అచ్యుతదేవరాయ 16వ శతాబ్దములో నిర్మించారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న కట్టడం పూర్వం ఉన్న కోటల నిర్మాణాల్లో ఒకటి మాత్రమే. ఈ కోటను అప్పట్లో ఖైదీలను బంధించేందుకు ఉపయోగించారట. కాలక్రమేణా ఆ కోట శిథిలమై బురుజు మాత్రమే మిగిలింది. అలంపురాన్ని కొండారెడ్డి అనే పాలెగారు పరిపాలించేవాడు. ఆయన పొరుగునే ఉన్న కర్నూలు నవాబుకు తగాదా ఉండేది. వారిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో ఓడిన కొండారెడ్డిని ఈ బురుజుకి బంధించారు. అందువలన ఈ నిర్మాణం కొండారెడ్డి బురుజుగా స్థిరపడిపోయింది.

నెహ్రు నగర్…

ఈ గ్రామం నందికొట్కూరు నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. నందికొట్కూరు మండలంలోని నెహ్రూ నగర్ గ్రామంలో రామాలయం ప్రసిద్ధి చెందింది. మూర్వకొండ గ్రామం శ్రీశైలం జలాశయంలో మునిగిపోతే దాన్ని నెహ్రూ నగర్ కు తీసుకువచ్చారు.

కొలనుభారతి…

కొలనుభారతి క్షేత్రం కొత్తపల్లి మండలం శివపురం గ్రామ సమీపంలో ఉంది. కర్నూలు నుండి ఆత్మకూరు, కొత్తపల్లి మీదుగా “శివపురం” రావాలి. అక్కడి నుండి కొలనుభారతి క్షేత్రానికి చేరుకోవచ్చు. ఆత్మకూరు నుండి ఉదయం, సాయంత్రం బస్సు సదుపాయం ఉంది. శివపురం నుండి ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. కొలనుభారతిలో ఏటా దసరా నవరాత్రి రోజుల్లో ఉత్సవాలు, కార్తీకం, శివరాత్రి, వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుపుతారు. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఇది ప్రాచీన దేవాలయం. చుట్టూరా ఆవరించి ఉన్న కొండల నుంచి ప్రవహించే చారుఘోషిణీ జల ప్రవాహం ఇక్కడ ఉన్న సరస్వతి దేవి పాదాల దగ్గర ఇంకిపోవడం విచిత్రం.

సంగమేశ్వరం…

సప్త నదుల సంగమమే ఈ సంగమేశ్వర క్షేత్రం. కొత్తపల్లి మండలంలో కృష్ణానది ఒడ్డున సంగమేశ్వర క్షేత్రం నెలకొని ఉంది. కర్నూలు నుండి ఆత్మకూరు మీదుగా కపిలేశ్వరం రావాలి. అక్కడ నుంచి సంగమేశ్వరం చేరుకోవచ్చు. ఇక్కడ బీమ, భవనాసి, మలప్రభ,  తుంగ, భద్ర, కృష్ణ, వేణి ఇలా మొత్తం ఏడు నదుల నీళ్లు ఉంటాయని చెబుతారు. ఇక్కడి వేపదారు శివలింగాన్ని ధర్మరాజు ప్రతిష్టించారని కథ. సంగమేశ్వరం క్షేత్రం ఏడాదిలో ఎనిమిది నెలలపాటు శ్రీశైలం ఆనకట్ట నీళ్లలో మునిగి ఉంటుంది. కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులు దర్శించుకునేందుకు వీలవుతుంది. 

లోయ మీద రైలు…

మహానంది, శిరివెళ్ల మండలాల సరిహద్దలలో నల్లమల అడవిలో కొండమీద గుహలో శ్రీ లక్ష్మీనరసింహా స్వామి పురాతన ఆలయం ఉంది. అలాగే బ్రిటిష్ కాలంలో నిర్మించిన మూడు కిలోమీటర్ల ఉన్న బొగడ రైలు వంతెన (ప్రస్తుతం రాతి స్తంభాలు మాత్రమే) ఉన్నాయి. ఇక్కడ ఉన్న రెండు కొండల మధ్య సుమారు 250 అడుగుల లోతులో ఉన్న లోయ మీద రైలు పరిగెడుతుంటే క్రింద నుండి తీగలు బిగుతు కావడం అప్పుటి ఇంజనీర్ల  పనితనానికి మెచ్చుతునక.

Show More
Back to top button