Telugu Special Stories

విలక్షణ విజయాలకు చిరునామా.. వోరుగంటి రామచంద్ర రావు..

వోరుగంటి రామచంద్రారావు (13 మార్చి 1926 – 14 ఫిబ్రవరి 1974)

విమాన ప్రమాదంలో అందరూ చనిపోగా ఓ బాలుడు పడే కష్టాలను ఇతివృత్తంగా తీసుకుని వెండితెర రూపం కల్పించిన పాపం పసివాడు చిత్రం అప్పట్లో ఒక సంచలనం. “తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా”.. అంటూ తెల్లవారి అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన మన్యం వీరుడి వీరోచిత గాథను “అల్లూరి సీతారామరాజు” గా తెరకెక్కించి, రికార్డుల వర్షంతో బాటు, కనకవర్షం కూడా కురిపించడం కూడా అప్పట్లో ఓ సంచలనమే.

టాలీవుడ్ లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రాల్లో అద్భుతమైన విజయం సాధించిన చిత్రం “దేవుడు చేసిన మనుషులు”. అంతకు ముందు గానీ ఆ తరువాత గానీ అలాంటి చిత్రం రాలేదు. కుటుంబ కథా చిత్రం “అమ్మాయిగారు – అబ్బాయిగారు”, క్రైమ్ తరహా కథతో వచ్చిన “నేనంటే నేనే”, నెల్లూరు కాంతారావు గారి నిర్మాణంలో వచ్చిన అసాధ్యుడు ఇలా ఒక్కో చిత్రాన్ని ఒక్కో ఆణిముత్యంలా మలచిన అద్భుతమైన దర్శకులు “వోరుగంటి రామచంద్రరావు గారూ”.

వి. రామచంద్రరావు గారూ దర్శకత్వం వహించిన 17 చిత్రాలలో 11 చిత్రాలు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తీసినవే కావడం విశేషం. వీరిద్దరి కలయికలో వచ్చిన అద్భుతమైన చిత్రం అల్లూరి సీతారామరాజు. ఈ చిత్రం ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంగా భారీ విజయాన్ని సాధించింది. వి.రామచంద్రరావు గారి దర్శకత్వంలో ఎడారిలో తప్పిపోయిన బాలుని కథతో తెరకెక్కించిన చిత్రం “పాపం పసివాడు” తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక విలక్షణ చిత్రంగా నిలిచిపోయింది. రామచంద్రరావు స్వయంగా నిర్మించిన “భద్రం కొడుకో” చిత్రానికి గానూ జాతీయ పురస్కారం లభించింది.

జననం..

వి.రామచంద్రరావు గారూ 13 మార్చి 1926 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా, లక్ష్మీ పోలవరంలో జన్మించారు. యండమూరి వీరేంద్రనాథ్ గారూ వీరికి సమీప బంధువు. వి.రామచంద్రరావు గారికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వి.రామచంద్రరావు గారూ 12 యేండ్ల సుదీర్ఘ దర్శకత్వం తరువాత తీసిన తొలిచిత్రం సూపర్ స్టార్ కృష్ణ గారూ నటించిన “మరపురాని కథ”. ఈ చిత్రం చూసి నీ అభిప్రాయం చెప్పమని అప్పటికీ చిన్నపిల్లడైన “యండమూరి వీరేంద్రనాథ్” గారిని కోరారట వి.రామచంద్రరావు గారూ. దానిపైన సమీక్ష వ్రాసి పంపించారట యండమూరి గారూ. అదే యండమూరి గారి తొలి రచన. తనకు రచనలు చేయాలని ప్రేరణనిచ్చిన తొలి రచన అదే అని యండమూరి గారూ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు.

విద్యాభ్యాసం…

వోరుగంటి రామచంద్ర రావు గారి విద్యాభ్యాసం ఎక్కువగా తాడిపత్రి, కొవ్వూరు, పెద్దాపురం, కాకినాడ, మద్రాసులలో సాగింది. విద్యార్థి దశలో విద్యార్థి రాజకీయ ఉద్యమాల్లో ముందుండి ప్రముఖ పాత్ర నిర్వహించారు. ప్రముఖ దర్శకులుగా పేరొందిన తాతినేని ప్రకాష్ రావు గారూ, పి.మధుసూదన్ రావు గారు రామచంద్ర రావు గారికి సహాధ్యాయులు. ఆర్థిక పరిస్థితులు అనివార్యం అయ్యి ఉద్యోగం చేయవలసి వచ్చినా, డిగ్రీ చదువు పట్ల ఉన్న ఆసక్తి కొద్దీ ఉద్యోగానికి స్వస్తి చెప్పి మద్రాసులోని పచ్చయ్యప్పాన్ కళాశాలలో చేరి పట్టబద్రులయ్యారు.

కళల పట్ల ఆసక్తి…

రామచంద్రరావు గారూ బి.ఏ.ఆనర్స్ చదివారు.  చిన్నప్పటినుంచి కళల పట్ల వారికున్న సరదా వల్లనే పాఠశాలలో మోనో యాక్టర్ (నటి), కళాశాలలో నటుడు, నాటకాల దర్శకులుగా తన అభిరుచిని చాటుకునేవారు. నాటకాలలో బుచ్చమ్మ వేషం వేసి నందుకు వారికోసారి రజత పథకం కూడా వచ్చింది. నాటకాలలో ఎక్కువగా నటించకపోయినా, నాటకాలంటే విపరీతంగా ఉత్సాహం వారిలో ఉండేది. నాటకాల మీద కన్నా కూడా సాహిత్యం మీద ఎనలేని ఆసక్తి ఉండేది. ఆ రోజులలో “నయాగరా” అన్న మారుపేరుతో, విరామ్ చంద్ అన్న పేరుతోనూ వి.రామచంద్రరావు గారూ గేయాలు పత్రికల్లో వచ్చేవి. వి.రామచంద్రరావు గారూ దాదాపు 100 గేయాలు వ్రాశారు. అందులో అముద్రితాలు చాలా ఉన్నాయి. వార్తాపత్రికలు నడపడం, సాహిత్య చర్చలు చేయడం వి.రామచంద్రరావు గారికి చిన్నప్పటి అలవాటు.

నాటకరంగం నుండి సినీరంగం వైపు..

విద్యార్థి నాయకుడిగా చురుగ్గా ఉండే రామచంద్రరావు గారూ మద్రాసులో చదువుతున్నప్పుడు ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితికి అతను అధ్యక్షుడుగానూ, వక్తగానూ వారికి మంచి పేరు ఉండేది. ఒకసారి అంతర్ కళాశాల నాటకాల పోటీ జరిగినప్పుడు మద్రాసులో రామచంద్రారావు “అంతర్యుద్ధం” అన్న నాటికను దర్శకత్వం వహించి ప్రదర్శింపజేశాడు. ఆ పోటీలలో చాలా నాటికలు పాల్గొన్నాయి. అంతర్యుద్ధం నాటికకు ఉత్తమ దర్శకత్వానికి బహుమతిగా అందుకున్న వి.రామచంద్ర రావు ఉత్తమ దర్శకుడు అనిపించుకున్నాడు. తాపీ చాణిక్య సహాయ దర్శకుడుగా పనిచేస్తున్న రోజులవి. నాటికల పోటీలో పాల్గొన్న ఒక నాటికను తాపీ చాణక్య దర్శకత్వం చేశాడు. ఆ పోటీలలో చాణక్య గారికి,  రామచంద్ర రావు గారికి పరిచయం ఏర్పడింది.

సహాయ దర్శకుడిగా..

వి.రామచంద్రరావు గారి దర్శకత్వ ప్రతిభలో రూపు దిద్దుకుని విజయవంతంగా ప్రదర్శింపబడిన “అంతర్యుద్ధం” నాటకాన్ని చూసి అబ్బురపడిన తాపీ చాణక్య గారూ వి.రామచంద్రరావు గారిని అభినందించారు. దర్శకత్వం అనే కళలో వి.రామచంద్రరావు గారికి వున్న ఉత్సాహం చాణక్య గారిని విపరీతంగా ఆకర్షించింది. ఆ ఉత్సాహంతోనే రామచంద్రరావు గారూ తన చదువు పూర్తి కావడంతోనే చలనచిత్ర రంగంలో దర్శకత్వ శాఖలో అడుగు పెట్టారు. మొదటగా అక్కినేని నాగేశ్వరరావు గారూ, షావుకారు జానకి గారూ, మరియు వహీదా రెహమాన్ గారూ కలిసి నటించిన “రోజులు మారాయి” అనే చిత్రానికి దర్శకత్వం వహించిన 

తాపీ చాణక్య గారి దగ్గర సహాయకుడిగా పనిచేశారు రామచంద్రరావు గారూ.

ఆ తర్వాత సతీసావిత్రి చిత్రం కోసం కె.బి.నాగభూషణం గారి వద్ధ, బండరాముడు చిత్రం కోసం పి.పుల్లయ్య గారి దగ్గర, మహాకవి కాళిదాసు చిత్రం దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారి వద్ధ, నిత్య కళ్యాణం పచ్చతోరణం చిత్రం కోసం దర్శకులు పినిశెట్టి శ్రీరామమూర్తి తో , పెండ్లి పిలుపు చిత్రానికి దర్శకత్వం వహించిన ఆమంచర్ల శేషగిరిరావు గారితో, మంచి రోజులు వస్తాయి చిత్ర దర్శకులు జి.విశ్వనాథం గారితో, ఇలాంటి అగ్రస్థాయి దర్శకుల దగ్గర పనిచేసి ఎనలేని అనుభవం సంపాదించారు రామచంద్రరావు గారూ. ఆ తర్వాత దర్శకులు  వి.మధుసూదన రావు గారి ద్వారా రాజలక్ష్మి నిర్మాణ సంస్థలో సహాయక దర్శకులుగా ప్రవేశించి “గుడి గంటలు”, “వీరాభిమన్యు”, చిత్రాలకు పనిచేశారు.

అసాధ్యుడుతో దర్శకుడిగా తొలిసారి..

దాదాపు 12 సంవత్సరాల పాటు దర్శకత్వ శాఖలో వి.రామచంద్రరావు గారూ శ్రమించారు. దర్శకునిగా బాధ్యతలు చేపట్టడానికి ఆ అనుభవం ఎంతగానో వారికి ఉపకరించింది. ఆ అనుభవమే వి.రామచంద్రరావు గారి చేత “మరపురాని కథ”కు దర్శకత్వం చేసేలా చేయించింది.

రాజ్యలక్ష్మి నిర్మాణ సంస్థ వారు “మరుపురాని కథ” ను నిర్మించడానికి సన్నాహాలు చేయసాగారు. నిర్మాత డూండీ గారూ ఒక రోజు వి.రామచంద్రరావు గారిని పిలిచి ఈ చిత్రానికి నీవే దర్శకుడివి అని “మరపురాని కథ” చిత్రానికి దర్శకుడిని చేశారు. సరిగ్గా దానికంటే ముందే “టైగర్ ప్రొడక్షన్స్ వారు “అసాధ్యుడు” అనే చిత్రానికి దర్శకత్వం వహించాల్సిందిగా వి.రామచంద్రరావు గారిని కోరారు. వి.రామచంద్రరావు గారూ దర్శకుని హోదాలో పనిచేసిన మొదటి చిత్రం “అసాధ్యుడు” కాగా, మొదట విడుదలైన చిత్రం “మరపురాని కథ”. వి.రామచంద్రరావు గారూ దర్శకుడుగా పనిచేసిన మొదటి రోజు గానీ, ఆ తర్వాత గానీ తనకేమీ కొత్తగా అనిపించలేదు అని అన్నారు.

వి.రామచంద్రరావు గారికి మంచి పట్టు ఉన్న శాఖ గనుక, పదిమంది దర్శకుల దగ్గర వారు పనిచేయడం వల్ల వారికి పది రకాల పద్ధతులు తెలిసాయి. వారు దర్శకత్వ శాఖలో ఓనమాలు చాణిక్య గారి వద్ధ నేర్చుకున్నారు. వ్యాకరణం అంతా కమలాకర కామేశ్వర దగ్గర నేర్చుకున్నారు. చిత్రం నిర్మాణం, క్లుప్తంగా తీసే పద్ధతులను  డూండీ గారి దగ్గర నేర్చుకున్నారు. వి.రామచంద్రరావు గారు పని చేసిన దర్శకులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం దృశ్యాలను తీయడంలో సిద్ధహస్తులు. వారి వారి చిత్రీకరణ పద్ధతులు వి.రామచంద్ర రావు గారికి ఎంతగానో సహాయపడ్డాయని వి.రామచంద్ర రావు గారూ పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు.

దేవుడు చేసిన మనుషులు..

భారీ తారాగణంతో పద్మాలయా బ్యానరుపై వి.రామచంద్రరావు గారూ దర్శకత్వం వహించగా ఘనవిజయం సాధించిన చిత్రం “దేవుడు చేసిన మనుషులు”. నందమూరి తారక రామారావు గారూ,  కృష్ణ గారూ, ఎస్.వి.రంగారావు గారూ, జయలలిత గారూ, విజయనిర్మల గారూ, జగ్గయ్య గారూ, కాంతారావు గారూ, కాంచన గారూ, జమున గారూ, శారద గారూ లాంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రానికి రమేష్ నాయుడు గారూ బాణీలు సమకూర్చిన గీతాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఎల్.ఆర్.ఈశ్వరి గారూ ఆలపించిన “మసక మసక చీకటిలో, మల్లె తోట వెనకాల” అనే ప్రత్యేక గీతం ఇప్పటికీ వన్నె తరగనిది. తదనంతర కాలంలో ఎన్టీఆర్ గారూ అటు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కాగా, జయలలిత గారూ ఇటు తమిళనాడుకు ముఖ్యమంత్రి గానూ, జగ్గయ్య గారూ, కృష్ణ గారూ లోక్ సభ కు యం.పి.లుగా  ఎన్నికవ్వడం విశేషం.

అల్లూరి సీతారామరాజు…

“స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిక్ష కాదు. పోరాడి గెలుచుకునే హక్కు. ఆంగ్లేయుల అధికారం అంతమయ్యే వరకు, ఆఖరి ఆంగ్లప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయే వరకు చెలరేగిన ఈ అగ్ని, ఈ జీవన్మరణ పోరాటం అంటూ ఆంగ్లయులకు వ్యతిరేకంగా పోరాడి, ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఈ నీరు పవిత్రం, ఈ నేల పవిత్రం. ఈ జన్మకే కాదు, వేయి జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. వందేమాతరం.. వందేమాతరం”.. అంటూ తెల్లదొరల తూటాలకు నెలకొరిగిన దేశభక్తుడు “అల్లూరి సీతారామరాజు”. రామరాజు జీవితచరిత్రను వెండితెరపై చూసిన ప్రేక్షకుల గుండెల్లో దేశభక్తి భావం ఉప్పొంగిపోయింది.

ఈ అద్భుతమైన అజరామర చిత్రారాజాన్ని వి.రామచంద్రరావు గారూ “న భూతో న భవిష్యత్” అన్నంతగా రూపొందించారు. స్వాతంత్ర్య సమరయోధుని జీవిత చరిత్ర తెలుగులో తెరకెక్కడం అదే తొలిసారి. ఉత్తమ చిత్రంగా ఆంధ్రప్రదేశ్ నంది పురస్కారాన్ని పొందడమే కాకుండా, “తెలుగు వీర లేవరా” అనే గీతానికి జాతీయ అవార్డుతో పాటు, పలు ప్రాంతీయ అవార్డులను సొంతం చేసుకుంది. వి.రామచంద్రరావు గారూ మరపురాని కథ, నేనంటే నేనే, అసాధ్యుడు, పగబట్టిన పడుచు, పాపం పసివాడు, అమ్మమాట, అబ్బాయిగారు – అమ్మాయిగారు, గంగ మంగ, దేవుడు చేసిన మనుషులు, అల్లురి సీతారామరాజు, పెన్నుం పొన్నుం లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

మరణం..

తెలుగు చలనచిత్ర రంగంలో దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రముఖ దర్శకునిగా ప్రఖ్యాతి పొందిన శ్రీ వి.రామచంద్రరావు గారూ 14 ఫిబ్రవరి 1974 నాడు మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు రాయ వేల్పూర్ దవాఖానలో హృద్రోగం వల్ల అకాల మరణం పొందినారు. సూపర్ స్టార్ కృష్ణ గారూ స్వయంగా నటించి, నిర్మించిన తెలుగు తొలి సినిమా వర్ణ చిత్రం “శ్రీ అల్లూరి సీతారామరాజు” కథకు వి.రామచంద్రరావు గారూ దర్శకులు. తన 46 సంవత్సరాల వయస్సులోనే వారు అకాల మరణం చెందడం అత్యంత బాధాకరం. భార్య ఒక కుమారుడు నలుగురు కుమార్తెలు ఉన్న వి.రామచంద్రరావు గారూ “అల్లూరి సీతారామరాజు” చిత్రం పూర్తవ్వకముందే చనిపోవడంతో మిగిలిన చిత్రం పోరాట సన్నివేశాలకు కె.ఎస్.ఆర్.దాస్ గారూ దర్శకత్వం వహించగా, మిగిలిన కొంత భాగం నటులు, నిర్మాత అయిన సూపర్ స్టార్ కృష్ణ గారూ దర్శకత్వం వహించినా కూడా, దర్శకుడిగా వి.రామచంద్రరావు గారూ గారి పేరునే తెరమీద చూపించారు.

Show More
Back to top button