
ప్రకృతిని ఆరాధిస్తూ, పుడమితల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక బతుకమ్మ పండుగ. ఇది తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా భావించే రాష్ట్ర పండుగ. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకలో పూల సుగంధం, పాటల మాధుర్యం, స్త్రీల ఐక్యత కలిసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి.
బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం పెతర అమావాస్యనాడు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై, దసరా చివరి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది. తెలంగాణ ఉద్యమం సమయంలో దేశవ్యాప్తంగా, విదేశాల్లో నివసించే తెలంగాణ ప్రజలు ఈ పండుగను జరుపుకోవడం ద్వారా తమ మాతృభూమిపై గర్వాన్ని వ్యక్తపరిచారు.
బతుకమ్మ మూలాలు పూర్తిగా వెలుగులోకి రాకపోయినా, జానపద గాథలు, పాటలు శతాబ్దాలుగా ప్రజలతో కలసి జీవిస్తున్నాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, వేములవాడ రాజేశ్వరాలయం, చోళ – చాళుక్యుల కాలం ఈ పండుగ మూలాలకు సంబంధం కలిగి ఉండవచ్చని చెబుతారు. చోళులు వేములవాడ నుంచి శివలింగాన్ని తంజావూరుకు తరలించడంపై తెలంగాణ ప్రజలు తమ ఆగ్రహాన్ని అహింసా పూర్వక నిరసన రూపంలో వ్యక్తం చేశారు. సృష్టికి మూలమైన శక్తిస్వరూపాన్ని పూలతో రూపకల్పన చేసి పూజించడం, చివరగా నీటిలో నిమజ్జనం చేయడం అలవాటుగా మారి “బృహతమ్మ”.. “బతుకమ్మ”గా రూపాంతరం చెందిందని భావిస్తారు. ఇది కేవలం ఆధ్యాత్మికత కాదు, ఒక ఉద్యమానికి ప్రతీక కూడా.
బతుకమ్మ తొమ్మిది రోజులు ప్రత్యేకమైన నైవేద్యాలతో జరుపుకుంటారు:
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ – నువ్వులు, బియ్యం పిండి నైవేద్యం.
రెండో రోజు అటుకుల బతుకమ్మ – అటుకులు, పప్పు, బెల్లంతో.
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ – పప్పు, పాలు, బెల్లంతో.
నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ – పాలలో నానబెట్టిన బియ్యం.
ఐదో రోజు అట్ల బతుకమ్మ – అట్లు లేదా దోశలు.
ఆరవ రోజు అలిగిన బతుకమ్మ – ఉపవాసంతో అమ్మవారికి అలక చెప్పే రోజు.
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ – బియ్యంపిండితో వేపకాయలు.
ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ – నువ్వులు, బెల్లం, వెన్నతో.
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ – పెరుగన్నం, పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం వంటి రకాల నైవేద్యాలు.
ఈ తొమ్మిది రోజులు కేవలం పూజాకార్యక్రమాలే కాకుండా, పల్లెల్లో సామాజిక ఐక్యతకు ప్రతీకలుగా మారతాయి. ఇంట్లో తయారు చేసిన వంటకాలను పంచుకోవడం, అందరూ కలిసి పాటలు పాడుతూ ఆటలాడడం బతుకమ్మ పండుగలో ప్రత్యేకత.
ప్రపంచంలోనే ఏకైక పూల పండుగగా, స్త్రీల కోసం మాత్రమే జరుపుకునే పండుగగా బతుకమ్మ ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇది ప్రకృతిని, పుట్టినిల్లును, మాతృస్వరూపాన్ని స్త్రీలు గౌరవించే ఆధ్యాత్మిక ఉత్సవం. తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ ప్రాణం పోసినట్లే, నేడు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగగా నిలిచింది.










