Telugu News
Trending

ఇరాన్10 పాయింట్ల ఫార్ములా.. అగ్రరాజ్యం తలొగ్గిందా? లేక వ్యూహాత్మక విరామమా?

దాదాపు 40 రోజుల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం తర్వాత, ఇరాన్ తన లక్ష్యాలను సాధించామని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన గడువులను తిరస్కరించామని, తమ షరతులకు అగ్రరాజ్యాన్ని లొంగదీసుకున్నామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది. ఇరాన్ పెట్టిన 10 డిమాండ్ల మీద చర్చలకు ట్రంప్ అంగీకరించడం ఒక చారిత్రక పరిణామం. ప్రస్తుతం నెల రోజుల పాటు కాల్పుల విరమణ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇది శాశ్వత శాంతి ఒప్పందానికి పునాది మాత్రమేనని ట్రంప్ స్పష్టం చేశారు.

ఆ పది పాయింట్ల ప్రతిపాదనలు ఏంటి?

  • పూర్తిస్థాయి శాంతి ఒప్పందం దిశగా చర్చలు జరగాలి.
  • ఇరాన్‌పై ఇకపై ఎలాంటి దాడులు చేయబోమని అమెరికా గ్యారెంటీ ఇవ్వాలి.
  • ప్రపంచ ఇంధన మార్గమైన హోర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ ఇరాన్‌కే ఉండాలి.
  • ఇరాన్‌పై ఉన్న అన్ని ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి.
  • యుద్ధం వల్ల జరిగిన నష్టానికి అమెరికా నష్టపరిహారం చెల్లించాలి.
  • పశ్చిమాసియా (Middle East) నుండి అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవాలి.
  • లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధాన్ని నిలిపివేయాలి.
  • శాశ్వతంగా కాల్పుల విరమణ పాటించాలి.
  • హోర్ముజ్ జలసంధిలో భద్రతకు ప్రత్యేక ప్రోటోకాల్స్ ఉండాలి.
  • ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులను వెంటనే విడుదల చేయాలి.

అమెరికా నిజంగా ఓడిపోయిందా?

పైకి చూస్తే ఇరాన్ డిమాండ్లకు అమెరికా తలొగ్గినట్టు కనిపిస్తున్నా.. దీని వెనుక ట్రంప్ ‘బిజినెస్ మైండ్’ రాజకీయం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. అమెరికా ఓడిపోయిందని చెప్పడం కంటే.. యుద్ధం వల్ల కలుగుతున్న ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవడానికి ట్రంప్ ఒక అడుగు వెనక్కి వేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా బలగాల ఉపసంహరణ అనేది ట్రంప్ మొదటి నుంచి చెబుతున్న మాటే. అయితే, ఇరాన్ నిధుల విడుదల, నష్టపరిహారం వంటి అంశాలకు అంగీకరించడం ఇరాన్‌కు దౌత్యపరంగా లభించిన అతిపెద్ద విజయం.

ఇరాన్ చేతిలో ప్రపంచ నాడి

ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం హోర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో 20% పైగా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీనిపై నియంత్రణ సాధించడం ద్వారా ఇరాన్ ప్రపంచ దేశాల ఇంధన ధరలను శాసించే శక్తిని పొందింది. ఇది అమెరికా మిత్రదేశాలకు, ముఖ్యంగా ఇజ్రాయెల్ భద్రతకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సాధించడం అంటే.. భవిష్యత్తులో అమెరికాపై ఎప్పుడైనా ఒత్తిడి తీసుకురాగల ఆయుధాన్ని పొందినట్లే.

14 రోజుల గడువు – ట్రంప్ మాస్టర్ ప్లాన్?

ట్రంప్ కేవలం 14 రోజుల గడువు ఇవ్వడం గమనార్హం. ఈ సమయంలో ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇది ఒక రకంగా ఇరాన్‌ను చర్చల వద్దకు తీసుకురావడానికి అమెరికా వేసిన ఎత్తుగడ. అలాగే, అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరలను తగ్గించుకోవడానికి ఈ కాల్పుల విరమణ ట్రంప్‌కు అవసరం. ఈ 14 రోజుల్లో ఇరాన్ తన అణు కార్యకలాపాలపై ఎలాంటి హామీ ఇస్తుందనే దానిపైనే శాశ్వత ఒప్పందం ఆధారపడి ఉంటుంది.

రాబోయే కాలం ఎలా ఉండబోతోంది?

యుద్ధం ప్రస్తుతానికి ఆగిపోయినట్లు కనిపిస్తున్నా.. ఉద్రిక్తతలు పూర్తిగా తొలగిపోలేదు. ఇరాన్ పెట్టిన 10 పాయింట్ల అమలు అంత సులభం కాదు. ముఖ్యంగా నష్టపరిహారం చెల్లించడంపై అమెరికా కాంగ్రెస్ అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకం. ఒకవేళ ఈ ఒప్పందం సక్సెస్ అయితే పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యం తగ్గి, ఇరాన్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతుంది. ఇది ప్రపంచ రాజకీయాల్లో, ముఖ్యంగా చమురు వ్యాపారంలో భారత్ వంటి దేశాలకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది.

ఇతర కథనాలు:

నిప్పుల కొలిమిలో ప్రపంచం: మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ దాడులు!

ఇరాన్ గడ్డపై అమెరికా పంజా..! యుద్ధం అనివార్యమా?

ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు

Show More
Back to top button