Telugu News

‘భారత అంతరిక్షరంగ పితామహుడు’: డా. విక్రమ్ సారాభాయ్!

అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తుల్లో ప్రథములు వీరు..

భౌతికశాస్త్రంలో విశేష ప్రావీణ్యం కలిగిన ఆయన.. అంతరిక్ష పరిశోధన రంగవ్యవస్థను స్థాపించడంలో ముఖ్యులు. తద్వారా భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలకు, ఎనలేని విజయాలకు మూలమయ్యారు. భారతదేశపు తొలి ఉపగ్రహమైన ఆర్యభట్టను రష్యా దేశ సాయంతో రూపొందించడమేకాక మన దేశం నుంచే ప్రయోగించగలిగిన వ్యక్తి ఆయన.. భారత్ అంతరిక్షరంగ కేంద్రమైన ఇస్రో అధినేతగా వ్యవహరించి.. ఎన్నో రంగాల్లో కీలక వ్యూహాలను అందించి.. తదుపరి తరాలకు మార్గనిర్దేశనం చేసి, విశేష గుర్తింపు పొందిన డా. విక్రమ్ సారాభాయ్ జయంతి ఈరోజు (ఆగస్టు 12). ఈ సందర్భంగా ఆయన జీవిత, పరిశోధన విశేషాలివిగో:

నేపథ్యం…

1919 ఆగస్టు 12న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అంబాలాల్, సరళాదేవి దంపతులకు జన్మించారు విక్రమ్ సారాభాయ్. కాగా వీరికి ఎనిమిదిమంది సంతానం. వీరి కుటుంబం మొదట్నుంచీ స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనటం వల్ల మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి ఎంతోమంది ప్రముఖులతో పరిచయాలున్నాయి. ఆ పరిచయాలతో తరచూ వీరింటికి వస్తూ పోయేవారు. దీంతో విక్రమ్ సారాభాయ్ వ్యక్తిగతంగా వారి ఆలోచన విధానాలకు ప్రభావితులయ్యారు. తన ఎనిమిదిమంది పిల్లలను చదివించేందుకు విక్రమ్ తల్లి ఏకంగా మాంటిస్సోరీ లాంటి ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసిందంటే నమ్ముతారా!

స్కూలింగ్ అయిపోయాక గుజరాత్ కళాశాలలో మెట్రిక్ విద్యను పూర్తి చేసుకున్నారు విక్రమ్. తర్వాత పై చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 

1940లో నేచురల్ సైన్సెస్‌లో పాసయ్యారు. అదే సమయంలో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభం కావటంతో ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సర్ సి.వి.రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధన చేయడం మొదలుపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి 1945లో తిరిగి కేంబ్రిడ్జ్ కి వెళ్లారు. పీహెచ్‌డీ పట్టాను పొంది, 1947లో తిరిగి మళ్లీ భారత్ కి చేరుకున్నారు.

ఆయన చేసిన పరిశోధనలు..

దేశానికి ఏదైనా మేలు చేయాలనే దృఢ సంకల్పంతో… వారి కుటుంబ ట్రస్ట్ సాయంతో విక్రమ్ 1947 నవంబర్ 11న అహ్మదాబాద్‌లో ఫిజికల్ రిసెర్చి లాబొరేటరీ (పీఆర్ఎల్)ను ఏర్పాటు చేశారు. అప్పుడతడి వయసు కేవలం 28 ఏళ్లు.

అహ్మదాబాద్ లోని ఐఐఎం ఏర్పాటు కూడా ఆయన వల్లే సాధ్యపడిందని మీకు తెలుసా!

1957లో రష్యా తన దేశం నుంచి మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ ను ప్రయోగించింది. ఇది తెలిసి భారత్ భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం ఎంతైనా ఉందని ఆ ఆవశ్యకతలను గుర్తించి అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూకు ఎంతో చక్కగా వివరించారు విక్రమ్. అటువంటి శాటిలైట్ ను భారత్ లోనూ ఏర్పాటు చేద్దామని కన్విన్స్ కూడా. 

*1962లో హోమీబాబా (భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడు) పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్‌సీఓఎఫ్ఎస్ఆర్) సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అదే తర్వాత 1969లో (ఇస్రో- ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)గా రూపాంతరం చెందింది. నేటికీ గనతలంపై భారత్ విజయాలు సాధించడంలో ఎంతగానో తోడ్పడింది. ఆయన ఇస్రో అధినేతగా కూడా పనిచేసి దానిని మేటి సంస్థగా రూపొందించారు. 

అలాగే తొలి రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ను కేరళలోని తిరువనంతపురంలో నెలకొల్పారు. 1963 నవంబరులో ఇక్కడ్నుంచి ఓ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం విశేషం. 

*సాంకేతిక పరిజ్ఞానం వల్ల పొందే ఉపయోగాలను అతి సామాన్యులకు అందుబాటులోకి తీసుకుని రావాలనుకునేవారు సారాభాయ్. అప్పుడే దేశంలోని ఎన్నో సమస్యలను సాధ్యమైనంతమేర పరిష్కరించవచ్చని తన తోటి శాస్త్రవేత్తలను ఆ దిశగా ప్రోత్సహించేవారు. గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించాలానే అంశం సారాభాయ్ వ్యూహంలో ప్రధానంగా ఉండేదట.

గుర్తింపు..

*‘భారత అంతరిక్షరంగ పితామహుడు’గా కీర్తి సంపాదించుకున్న సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన్ను 1962లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుతో సత్కరించింది.

*1966లో పద్మ భూషణ్ అవార్డుతోనూ గౌరవించింది. 

*మరణానంతం 1972లో పద్మ విభూషణ్ ప్రకటించి సారాభాయ్ సేవలను స్మరించుకుంది. 

*భారతీయ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ సేవలను స్పెషల్ డూడుల్‌తో సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ సైతం అరుదైన గౌరవాన్నిచ్చింది. 

*ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా ‘విక్రమ్’ అనే పేరుతో ఓ ల్యాండర్‌ను విక్రమ్ సారాభాయ్ గౌరవార్థంగా ప్రయోగించారు.   

చిన్న, చిన్న రాకెట్ల నుంచి అతిపెద్ద రాకెట్ ప్రయోగ వాహకనౌకలు, ఉపగ్రహాల వరకు భారత్ అంతరిక్షంలో ప్రయోగాలు చేసేంతలా ఎదిగిందంటే అందుకు మూలకారణం ఈయనే.

ఈ పరిశోధనల ఫలితంగానే.. దేశావసరాలైన విద్య, కమ్యూనికేషన్స్, భూగర్భ వనరులు, రక్షణ, వాతావరణం, పరిశోధనలాంటి మేటైన రంగాల్లో అద్భుత మార్పులు చోటు చేసుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు. 

Show More
Back to top button