
వైట్ బ్రెడ్ మనం రోజు రోజుకీ ఎక్కువగా తినే ఆహారంగా మారిపోయింది. తెల్లగా, మెత్తగా ఉండే ఈ బ్రెడ్‌లో డైట్ ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవచ్చు. అందులోనూ రెఫైన్‌డ్ ఫ్లోర్ (మైదా) ఎక్కువగా ఉండటం వల్ల అది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను త్వరగా పెంచుతుంది. దీని వలన ఒబేసిటీ, డైబెటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువకాలంగా దీన్ని తినడం వలన మలబద్దకం, ఆమ్లత, గ్యాస్ వంటి సమస్యలు కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ అనే విషయంలో వైట్ బ్రెడ్‌ను నేరుగా కారణంగా చూడలేము. కానీ దీన్ని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ (జ్వరం తరహా పరిస్థితి) పెరగవచ్చని పరిశోధనల్లో చెప్పబడింది. అదే ఇన్ఫ్లమేషన్ దీర్ఘకాలంగా కొనసాగితే కొన్ని క్యాన్సర్ రకాలకు అనుకూల వాతావరణం కలిగించే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు వైట్ బ్రెడ్ వలన నేరుగా క్యాన్సర్ వస్తుందనే స్పష్టమైన ఆధారాలు లేవు.
బ్రౌన్ బ్రెడ్ వంటి పూర్తి ధాన్యాల బ్రెడ్‌లలో ఫైబర్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. అలాగే బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. అందుకే రోజూ బ్రెడ్ తినే అలవాటు ఉంటే వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్‌ను ఎంచుకోవడం ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రతి ఆహారాన్ని మితంగా తీసుకోవడమే ఉత్తమ మార్గం.