
ప్రస్తుతం అమెరికా వెళ్లాలని అనుకునే వాళ్లకి H-1B వీసా సులభంగా రావడం లేదు. అదృష్టం మీద ఆధారపడే లాటరీ విధానం, వీసాల సంఖ్య పరిమితిగా ఉండటం, చివరికి మంజూరయ్యే అవకాశం కూడా తక్కువగా ఉండటం వంటివి పెద్ద అడ్డంకులు. ఈ నేపథ్యంలో అసాధారణంగా తెలివి, నైపుణ్యం ఉన్నవాళ్లకి ఓ మంచి అవకాశం కనిపిస్తోంది. అదే O-1 వీసా.
ఈ వీసా 1990లో మొదలైంది. ఎవరైనా తన రంగంలో ప్రత్యేకతను చూపించి పేరు తెచ్చుకున్నవాళ్లయితే, వాళ్లకి ఈ వీసా దరఖాస్తు చేసే హక్కు ఉంటుంది. ఉదాహరణకి విజ్ఞానం, బిజినెస్, చదువు, క్రీడలు, కళలు, సినిమాలు ఇలా ఏ రంగమైనా సరే.. నిజంగా గొప్ప ప్రతిభ ఉన్నవారైతే చాలు. కొన్ని షరతులు ఉంటాయి. అవార్డులు గెలవడం, ప్రముఖ పత్రికల్లో పేరు రావడం, పేరున్న సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉండటం వంటివి.
O-1 వీసాకు లాటరీ అక్కర్లేదు. అర్హత ఉంటే నేరుగా దరఖాస్తు చేసి, మొదట మూడేళ్ల పాటు వీసా తీసుకోవచ్చు. తరువాత అవసరమైతే పొడిగించుకోవచ్చు. వీసా మంజూరు శాతం ఎక్కువ. దాదాపు వందమందిలో తొంభై ముగ్గురికి వీసా వస్తుంది. అదే H-1B అయితే వంద మందిలో సుమారు ముప్పై ఏడుగురికే దక్కుతుంది.
వీసా ఖర్చు తక్కువ కాదు. దాదాపు పదివేల నుంచి ముప్పై వేల డాలర్ల మధ్య ఖర్చు అవుతుంది. అయినా మంచి అవకాశంగా కనిపిస్తుండటంతో చాలామంది దీన్ని ఎంచుకుంటున్నారు. 2020లో భారత్ నుంచి 487 మంది ఈ వీసా తీసుకోగా, 2023లో అది 1418 మందికి పెరిగింది.
ఇప్పుడు గూగుల్, టెస్లా లాంటి కంపెనీలు, హార్వర్డ్, కొలంబియా లాంటి యూనివర్సిటీలు ఈ వీసా ద్వారా నైపుణ్యం ఉన్నవాళ్ల్ని తీసుకుంటున్నాయి. అందుకే సాంకేతిక నిపుణులు, పరిశోధకులు, క్రీడల్లో సత్తా చాటినవాళ్లు, ఆన్లైన్లో మంచి పనులు చేస్తున్న వాళ్లు – అందరూ దీనిని మంచి మార్గంగా తీసుకుంటున్నారు.