
మన శరీరంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చి ఉంటే వాటి లక్షణాలు ఒకటి తీవ్రతరం అయితే తప్ప లేదంటే వాటివల్ల మనం ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే తప్ప వాటి లక్షణాలు ఒక పట్టాన బయటపడవు. మనకి మనం గుర్తించినా చిన్నదే కదా నయమవుతుందిలే అనుకొని నిర్లక్ష్యం చేస్తాం. దాని ఫలితం తరువాత ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అయ్యేలా చేస్తోంది.
ఇలా లక్షణాలు తెలియనప్పుడు, అవి బయట పడేంతవరకూ ఆగేకన్నా ముందే గుర్తిస్తే అనారోగ్యాల నుంచి తేలిగ్గా బయటపడొచ్చు కదా! సరిగ్గా అదే ఆలోచనతో హార్వర్డ్, ఎమ్బటీ శాస్త్రవేత్తలు ఇందుకోసం వ్యాధులని ముందే గుర్తించడానికి వీలుగా ప్రత్యేకమైన టాటూలను కనిపెట్టారు. అసలు టాటూలతో వ్యాధులను గుర్తించడమేంటని ఆశ్చర్యంగా ఉందా..? ఇవి పేరుకే టాటూలు. కానీ నిజానికివి, ఈ-కొలిఅనే బ్యాక్టీరియాలో మార్పులు చేసి, శరీరానికి ఏమాత్రం హానిచేయని హైడ్రోజెల్ తో తయారుచేసిన బయోసెన్సార్లు. అందుకే వీటిని ‘లివింగ్ టాటూ’లుగా పిలుస్తారు.
అయితే ఈ టాటూని శరీరంపైన వేసుకున్నప్పుడు మన శరీరం నుంచి రక్తం లేదా చెమట రూపంలో ఇన్‌ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాని గుర్తించి, ఇందులో ఉన్న బ్యాక్టీరియా కాస్త నీలిరంగులోకి మారుతుందట. భలే ఉంది కదూ! ఒక్క బ్యాక్టీరియానే కాదు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు, సెప్సిస్, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇబ్బందులు వచ్చినా సరే ఈ ప్యాచ్‌లు ముందుగానే సమస్యను గుర్తించి మనకు హెచ్చరికలు అందిస్తాయట మరీ!






