Telugu News

హోమ్‌లోన్‌ తీసుకున్నవారికి కొత్త రూల్‌.. EMIపై ప్రభావం ఎలా ఉంటుందంటే?

హోమ్‌లోన్‌ తీసుకున్నవారికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక మార్పు తీసుకొచ్చే ప్రతిపాదన చేసింది. ముఖ్యంగా ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లను ఎప్పుడు మార్చాలి అనే విషయంలో కొత్త నిబంధనను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించినా.. బ్యాంకులు వెంటనే హోమ్‌లోన్ల వడ్డీ రేట్లను తగ్గించాల్సిన పరిస్థితి లేదు. కొన్ని బ్యాంకులు త్వరగా రేట్లు మార్చినా.. మరికొన్ని ఆలస్యంగా మారుస్తుంటాయి. దీంతో ఆర్‌బీఐ వడ్డీ తగ్గించిన ప్రయోజనం రుణం తీసుకున్నవారికి వెంటనే అందదు. కొన్నిసార్లు ఈ ప్రయోజనం అందడానికి చాలా నెలలు పడుతుంది. ఇదే సమస్యకు పరిష్కారంగా ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాల వడ్డీని నిర్ణీత వ్యవధిలో మార్చేలా ఆర్‌బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించింది.

హోమ్‌లోన్‌ వడ్డీ రీసెట్‌ మూడు నెలల్లోపు?

తాజా ప్రతిపాదన ప్రకారం.. ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు రీసెట్‌ అయ్యే సమయం మూడు నెలలకు మించకూడదు. ఈ ప్రతిపాదనపై సెప్టెంబర్‌ 11 వరకు ఆర్‌బీఐ ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. తుది నిబంధనలు ఖరారైన తర్వాత 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

RBI రెపో రేటు తగ్గితే EMI తగ్గుతుందా?

ఇప్పుడు అసలు రుణం తీసుకున్నవారికి దీని వల్ల ఏం లాభం అనే ప్రశ్న వస్తుంది. ఉదాహరణకు ఆర్‌బీఐ వడ్డీ రేటును తగ్గించిందనుకుందాం. దానికి అనుగుణంగా బ్యాంకు తన ఫ్లోటింగ్‌ హోమ్‌లోన్‌ వడ్డీని కూడా తగ్గించాల్సి ఉంటుంది. కొత్త నిబంధన అమల్లోకి వస్తే.. ఆ మార్పు మూడు నెలల్లోపు రుణగ్రహీతకు చేరే అవకాశం ఉంటుంది. అంటే వడ్డీ రేటు తగ్గినప్పుడు EMI తగ్గొచ్చు లేదా అదే EMI కొనసాగితే రుణం చెల్లించే కాలం తగ్గొచ్చు. ముఖ్యంగా చాలా ఏళ్ల కాలపరిమితితో హోమ్‌లోన్‌ తీసుకున్నవారికి వడ్డీ రేటులో చిన్న మార్పు కూడా మొత్తం చెల్లించే మొత్తంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇదే నియమం వడ్డీ రేట్లు పెరిగినప్పుడు కూడా వర్తిస్తుంది. ఆర్‌బీఐ రేట్లు పెంచితే బ్యాంకులు కూడా ఫ్లోటింగ్‌ రుణాల వడ్డీని మూడు నెలల్లోపు సవరించే అవకాశం ఉంటుంది. అప్పుడు EMI పెరగవచ్చు లేదా రుణ కాలపరిమితి పెరగవచ్చు. అంటే ఈ నిబంధన రుణగ్రహీతలకు కేవలం వడ్డీ తగ్గినప్పుడు మాత్రమే ఉపయోగపడేది కాదు. బ్యాంకులు వడ్డీ రేట్లను ఆలస్యంగా మార్చకుండా ఒక స్పష్టమైన కాలపరిమితి ఉండేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం.

ఈ కొత్త RBI రూల్‌ ఎలాంటి రుణాలకు వర్తిస్తుంది?

అయితే ఈ కొత్త ప్రతిపాదన అన్ని రకాల రుణాలకు వర్తించదు. ముఖ్యంగా ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుతో ఉన్న రుణాలకే ఇది సంబంధించినది. గృహ రుణాలు ఎక్కువగా ఫ్లోటింగ్‌ రేటుతో ఉండటంతో హోమ్‌లోన్‌ తీసుకున్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే హోమ్‌లోన్‌ తీసుకున్నవారితో పాటు కొత్తగా రుణం తీసుకునేవారికి కూడా నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు వంటి వాటికి ఇదే విధంగా వర్తిస్తుందని చెప్పలేం. ముఖ్యంగా స్థిర వడ్డీ రేటుతో ఉన్న రుణాల్లో ఆర్‌బీఐ రేట్ల మార్పుతో EMI వెంటనే మారదు. కాబట్టి కొత్త నిబంధనను సింపుల్‌గా చెప్పాలంటే.. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు దాని ప్రయోజనం హోమ్‌లోన్‌ కస్టమర్లకు త్వరగా చేరేలా చేయడం, పెంచినప్పుడు కూడా బ్యాంకులు ఆలస్యం చేయకుండా రేట్లను సవరించడం ఈ ప్రతిపాదన లక్ష్యం. అయితే ఇది ప్రస్తుతం తుది నిబంధన కాదు. సెప్టెంబర్‌ 11 వరకు వచ్చే అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత ఆర్‌బీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.

Show More
Back to top button