
జీవితంలో ఆర్థిక అత్యవసరాలు ఎప్పుడు, ఏ రూపంలో వస్తాయో ఊహించడం కష్టం. అటువంటి సమయాల్లో మనకు గుర్తొచ్చే మొదటి మార్గం రుణం. సాధారణంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేసే ముందు క్రెడిట్ స్కోరును ప్రధాన ప్రాతిపదికగా తీసుకుంటాయి. క్రెడిట్ స్కోరు బాగుంటే రుణం సులభంగా దొరుకుతుందన్నది నిజమే అయినా.. అది లేనంత మాత్రాన రుణ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయని బాధపడాల్సిన అవసరం లేదు. సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా కూడా అత్యవసర సమయాల్లో నగదు పొందేందుకు మన ముందు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. క్రెడిట్ స్కోరు లేకపోయినా సులభంగా రుణం పొందే ఆ మార్గాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
బంగారు రుణాలు: భారతదేశంలో బంగారాన్ని పూచీకత్తుగా ఉంచి రుణం తీసుకోవడం అత్యంత సులభం. దీనికి సిబిల్ చెకింగ్ అవసరం లేదు. బ్యాంకులు 8.50% వంటి తక్కువ వడ్డీకే, అతి తక్కువ సమయంలో ఈ రుణాలను మంజూరు చేస్తాయి.
హామీదారుడి (Guarantor) సాయం: మీకు స్కోరు లేకపోయినా, మెరుగైన క్రెడిట్ హిస్టరీ ఉన్న మీ కుటుంబ సభ్యులను హామీదారుగా చూపవచ్చు. విద్యా లేదా వ్యక్తిగత రుణాల కోసం ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది.
జీవిత బీమా పాలసీలపై: కనీసం మూడేళ్లు ప్రీమియం చెల్లించిన జీవిత బీమా పాలసీలను పూచీకత్తుగా పెట్టి రుణం తీసుకోవచ్చు. దీనిపై 9-10% వార్షిక వడ్డీ ఉంటుంది మరియు క్రెడిట్ స్కోరుతో పనిలేదు.
స్థిరాస్తిపై రుణం (LAP): మీకు నివాస లేదా వాణిజ్య ఆస్తి ఉంటే.. దానిని తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకే (9-12%) రుణం పొందవచ్చు. స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఇది మంచి ఎంపిక.
అద్దె డిపాజిట్ రుణాలు: మెట్రో నగరాల్లో అద్దె ఇళ్ల కోసం భారీ డిపాజిట్లు చెల్లించడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి సంస్థలు నేరుగా యజమానికి డిపాజిట్ మొత్తాన్ని చెల్లించేలా రుణాలను అందిస్తున్నాయి.
ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం: మీ బ్యాంకుతో ఉన్న మంచి సంబంధాలను బట్టి, పొదుపు ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా కొంత మొత్తాన్ని వాడుకునేలా బ్యాంకులు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తాయి.










