Telugu NewsTelugu Special Stories

ఉగాది:పండుగ ఎందుకు జరుపుకోవాలి? ఏ రాశి వారికి అదృష్టంవరించబోతోంది?

ఉగాది అనగానే మనకు గుర్తుకు వచ్చేది పచ్చడి. ఉగాది రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి దగ్గరలో ఉన్న గుడికి లేదా ఇంట్లో దేవుళ్లకు నమస్కారం పెట్టుకొని ఉగాది పచ్చడిని సంతోషంగా తింటాం. అసలు ఉగాది ఎలా వచ్చింది? ఎందుకు జరుపుకుంటారు? పచ్చడిలో వాడే పదార్థాలకు అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది అనే పదం “యుగ ఆది” అనే సంస్కృత పదాల నుండి వచ్చింది. దీని అర్థం “యుగానికి ఆది” లేదా “కొత్త సంవత్సరానికి ఆరంభం” అని. ఈ పండుగను తెలుగు, కన్నడ, మరాఠీ, కొంకణీ ప్రజలు చాలా విశేషంగా జరుపుకుంటారు. ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. అవి తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు. ఇవి మన జీవితంలో అనేక సూచనలు సూచిస్తాయి. తీపి (బెల్లం)-సంతోషం, పులుపు (చింత చిగురు, చింతపండు)-ఆశ్చర్యం, చేదు (వేప ఆకులు)-కష్టాలు, కారం (మిర్చి)-ఉద్వేగం, ఉప్పు-జీవన సమతుల్యత, వగరు (పచ్చి మామిడికాయ)-ఆశలు, కొత్తదనాన్ని సూచిస్తాయి. అలాగే ఉగాది నాడు కొత్త పనులు ప్రారంభిస్తే అవి శుభ ఫలితాలను ఇస్తాయనే నమ్మకం ఉంది. అందుకే చాలా మంది ఉగాది రోజున కొత్త ఇంటికి శంకుస్థాపన, వ్యాపార ప్రారంభం లాంటి పనులను చేస్తారు.

ఉగాది ఎలా వచ్చింది:

పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజున మనం ఉగాది జరుపుకుంటాం. సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ నిద్రించే సమయంలో బ్రహ్మ దగ్గర నుంచి వేదాలని దొంగిలించి సముద్రంలోకి వెళ్లి దాక్కున్నాడు. విష్ణుమూర్తి మత్స్యావతారంలో సముద్రంలోకి వెళ్లి ఆ సోమకాసురుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందించారు. ఆ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. వేదాలను అందుకున్న బ్రహ్మ సృష్టిని చేయడం పునఃప్రారంభించారు. ఆ రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభం మొదలవుతుంది. మహాభారత సమయంలో కూడా ఉగాది జరుపుకున్నారని పురాణాలు చెప్తున్నాయి. మనం చాంద్రమానం ప్రకారం ఈ పండుగ చేసుకుంటాం. ఉగాది అంటే కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త ఆరంభాలు. ఇది మన సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ.

ఉగాది రాశి ఫలాలు (శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాంశములు)

ఈ సంవత్సరమునకు రాజు గురువు, మంత్రి కుజుడు. నవనాయకులలో ఏడు గ్రహాలు శుభులు, రెండు పాపగ్రహాలు. ఎక్కువగా శుభగ్రహాలు ఉండటం వలన దేశంలో రాజులు, ప్రజలు పరస్పర ప్రేమాభిమానంతో, చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సంవత్సరం విద్యా విధానాలలో చాలా మంచి మార్పులు వస్తాయి. గురుకుల విద్యా విధానము, వేద, జ్యోతిష, ఆధ్యాత్మిక విద్యలు పెరుగుతాయి. ప్రవచనముల వల్ల ప్రజలు, నాయకులు ధర్మమార్గంలో నడుచుకుంటారు. నాయకులు ధర్మమార్గంలో ఉండి చక్కని నిర్ణయాలతో పరిపాలన చేస్తారు. ఇంకా విదేశీ రాజుల కుట్రలను మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశానికి అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తారు. ఇరుగుపొరుగు దేశాలతో యుద్ధములు జరుగుతాయి, కొంత నష్టము కలుగుతుంది. ఆర్థిక, సైన్యపరమైన రంగములో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ పాలకులు సరైన సలహాలతో రాణిస్తారు. ఈ ఏడాది సరైన సమయాల్లో వర్షములు కురవక పంటలు సరిగా పండక ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. మెట్ట భూములు, వరి పంటలు, పసుపు, పచ్చ ధాన్యములు, శనగలు, పత్తి అధికంగా పండుతాయి, రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. కూరగాయల ధరలు తగ్గుతాయి.

మేషరాశి: (ఆదాయం 11, వ్యయం 5)

అభిమానవంతులు, తీవ్ర కోపం, ఆలోచన తక్కువ. ఇతరులకు లొంగి ఉండరు, పక్కవారి విషయం పట్టించుకోరు, పొగడ్తలకు లొంగుతారు. ముక్కుసూటిగా పోవడం, నిజాయితీగా బ్రతకాలనే మనస్తత్వం కలిగిన వారు. ధైర్య సాహసాలు కలవారు. నిర్మొహమాటంగా మాట్లాడుట, ఎవరికీ భయపడకపోవుట, అహంభావం అధికం. ఉగాది నుండి 01-06-2026 వరకు గురువు తృతీయ సంచారము చేత ఇంటియందు వివాహాది శుభకార్యములు చేయుట, నూతన గృహ నిర్మాణము చేయుట జరుగును. ఇంటియందు మరొకరికి సంపాదన మొదలవుతుంది. మనస్సుకు నచ్చిన వస్తువులు కొనుట, విద్యయందు ఉత్తీర్ణత, వ్యాపారమందు అభివృద్ధి ఉంటుంది. 01-06-2026 నుండి 4వ ఇంట సంఘము నందు గౌరవము లభించుట, సంతాన ప్రాప్తి కలుగును. ఆస్తుల విషయంలో ఆలస్యము జరుగును.

గురువు వత్సరాంతం సాడేసాత్ శని వల్ల ఇప్పటి నుండి కష్టములు ఏర్పడతాయి. అధికమైన కోపము, నమ్మిన వారి నుండి మోసము, ఇంటియందు కలహములు, విద్యా భంగము, ఉద్యోగ భంగము, చేయు వృత్తులందు ఆటంకములు ఎదురవుతాయి. మీకు సహాయము చేస్తామన్న వ్యక్తులు దూరం అవుతారు. అసందర్భ ప్రేలాపనలు చేయవద్దు, ఎదుటి వారిని తక్కువ అంచనా వేయవద్దు. మధ్యవర్తిత్వం చేయరాదు. మితిమీరిన ఆత్మవిశ్వాసము వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అకారణమైన కలహములు, వాహన ప్రమాదములు, శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది. కొన్ని పనులందు ఓర్పుగా ఉండండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహ పడవద్దు. సన్నిహితులతో కొన్ని పనులు పరిష్కారమవుతాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. శ్రమపడండి మీ కృషి ఫలిస్తుంది. మీరు “సుందరకాండ” పారాయణము లేదా గురు శని జపములు చేసినా మేలు కలుగుతుంది.

వృషభరాశి: (ఆదాయం 5, వ్యయం 14)

ఎంతో ఔదార్యవంతులు. వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువ. ఆత్మస్థైర్యం, చొరవ తక్కువ. ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు. నిజాయితీ ఎక్కువ. స్నేహితులను చూసి సంతోషపడతారు. ప్రశాంతమైన జీవితం గడపడమంటే ఇష్టం. ఎవరియందూ ద్వేషము గానీ, కోపము గానీ రాదు. వచ్చినను తగ్గదు. మనస్సు న్యాయబద్ధము, ధర్మమార్గము, దయా స్వభావము కలిగి ఉందురు. సుకుమారమైన స్వభావం, సున్నితమైన ప్రవర్తన. ఈ రాశివారికి శని (11) ఇంట ఉండటం వల్ల చేయు వృత్తులందు లాభములు, అన్ని రంగాల వారికి లాభములు కలుగుతాయి. ఇంటియందు వివాహాది శుభకార్యములు జరుగుతాయి. కుటుంబములో మరొకరికి సంపాదన మొదలవుతుంది. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వచ్చే సొమ్ము శీఘ్రముగా అందుతుంది. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి, మంచి ర్యాంకులు పొంది పై చదువులకు విదేశాలకు వెళ్తారు. మంచి ఉద్యోగము, ప్రమోషన్లు లభిస్తాయి.

నూతన పనులు ప్రారంభించుట, అనుకున్న పనులు విజయవంతం అగుట జరుగును. తాత్కాలిక ఉద్యోగస్థులకు పర్మినెంట్ అగుట, బ్యాంకు రుణాలు వచ్చుట, ఉద్యోగ మార్పు వంటివి జరుగుతాయి. మెడిసిన్, ఇంజనీరింగ్ వాళ్ళకు కొన్ని చిక్కులు తప్పవు. వకీలు, డాక్టర్లకు మంచి పేరు వస్తుంది. వ్యాపారం, ఉద్యోగం మార్చుటకు అవకాశం ఉంది. మీకు కావలసిన ధనం రావటానికి అనేక మార్గములు ఎన్నుకుంటారు. భూ, ధన, ధాన్య లాభములు, రియల్ ఎస్టేట్ వారికి మంచి అనుకూలత ఉంటుంది. గురువు (3) సంచారం చేత ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, ప్రయోజనం లేని ఉద్యోగము చేయుట, రోజువారీ ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పొత్తు వ్యాపారమందు మోసము జరిగే అవకాశం ఉంది, నమ్మినచో నష్టపోదురు. మానసిక చింతన, పరిచయము లేని వ్యక్తులను నమ్మరాదు. దురాలోచన, మితిమీరిన కోపము కలగవచ్చు. సెంటిమెంట్ వస్తువులను అమ్మి చింతించుట, అనవసరమైన పనులు చేసి బాధపడుట వంటివి జరగవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మీ మీద నరదృష్టి అధికముగా ఉంటుంది. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. మీరు శని జపతర్పణ హోమాదులు చేయించి శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము పఠించిన కొంచెం మేలు కలుగుతుంది.

మిథునరాశి: (ఆదాయం 8, వ్యయం 11)

ఏకాగ్రత తక్కువ, చురుకుదనం ఎక్కువ. ఆలోచన ఎక్కువ, బుద్ధి చాంచల్యం, చక్కని వాక్చాతుర్యం, హాస్య సంభాషణ చేస్తారు. అనేక విషయాలలో ప్రజ్ఞ కలిగి ఉండడం, క్రీడలందు ఆసక్తి, పరోపకార పరాయణులు. డబ్బు, పేరు, కీర్తి, ప్రేమ, ఉద్యోగములలో అంతస్తులు వేటితోనూ వీరు సంతృప్తి చెందరు. జ్ఞాపకశక్తి అధికము, హాస్య ప్రియత్వం, గర్వము, భక్తి పారవశ్యము కలిగి ఉంటారు. వ్యక్తుల పరిస్థితులను బట్టి మంచి చెడులు ఆలోచించే స్వభావం. అదృష్టము చంచలముగా ఉంటుంది. ఈ రాశి వారికి శని (10) ఇంట, 01-06-2025 నుండి గురువు (2) ఇంట సంచారము వల్ల అంతా శుభయోగమే. తలచిన కార్యములు నెరవేరుట, మనస్సు నందు సంతోషము కలుగును. ఇంటియందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో కూడి ఉండుట, ఇంటియందు పండుగ వాతావరణం ఏర్పడుతుంది. సంఘము నందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, సంతాన ప్రాప్తి కలుగును.

కొత్తవారి పరిచయం, రావలసిన ధనం అందుతుంది. పెద్ద మొత్తంలో ధన సహాయం చేయడం తగదు. వివాదాలు పరిష్కారమవుతాయి. అన్ని వ్యాపారాలలో మంచి లాభములు ఉంటాయి. విద్యార్థులకు అంచనాకు మించిన ర్యాంకులు, మంచి ఉద్యోగం, ప్రమోషన్లు లభిస్తాయి. మీ మంచితనం చూసి చాలామంది మిమ్ములను ఆశ్రయిస్తారు. సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయత్నపూర్వకంగా చేసిన పనులు నెరవేరుటచే మనస్సు నందు సంతోషం కలుగుతుంది. మిమ్ములను నమ్మిన వారికి న్యాయం చేస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. విందు వినోదములు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ పరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది. ఇతరులకు సహాయము చేయుట, లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు వస్తుంది. రైతులకు పంటలు బాగా పండుతాయి. రాబడి మీద దృష్టి సారిస్తారు. చేయు వృత్తులందు చురుకుదనము, స్నేహితులతో కూడి ఉండుట, కుటుంబముతో తీర్థయాత్రలు చేయుట జరుగును. మంచి ఆరోగ్యము, మనస్సు నందు సంతోషము ఉన్నప్పటికీ, పనులందు ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ఆర్భాటాలకు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు. స్థిరాస్థులు కొనుట, గృహ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయుదురు. ఈ సంవత్సరమంతా మంచి ఫలితములే ఉంటాయి.

కర్కాటకరాశి: (ఆదాయం 02, వ్యయం 11)

మనస్సు క్షణం కోపం, క్షణం తాపం కలిగి ఉంటుంది. ఓర్పు తక్కువ. అతి సూక్ష్మ విషయములందు చక్కని ఊహ, కల్పనా శక్తి కలిగి ఉంటారు. సమయం సందర్భం లేకుండా ఆవేశపడతారు. ఊహలకు అంచనాలు వేసే సామర్థ్యం కలవారు. నియమబద్ధమైన జీవితం, నిశ్చలమైన స్వభావం ఉంటుంది. నమ్మకములు ఉండవు, ఔదార్యం ఉండదు. లలిత కళలయందు అభిరుచి, మంచి వాగ్దాటి కలిగి ఉంటారు. పైకి మెత్తగా కనిపించినా అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చూపిస్తారు. ఈ రాశి వారికి (9) ఇంట శని కలదు. గురువు (1) జన్మ రాశిలో ఉండటం వల్ల ఏ పని చేసినా నెరవేరుట, అంచనాకు మించిన ఆదాయం ఉంటుంది. నూతన వ్యాపారము ప్రారంభించుట, చేయు వ్యాపారమందు మంచి లాభములు ఉంటాయి. గృహమందు వివాహాది శుభకార్యములు చేయుట, నూతన వస్తువులు, భూమి, బంగారు ఆభరణములు, వాహనము కొనుగోలు చేయుట జరుగును. నూనె, సిమెంట్, ఇనుము రంగాల వారికి విశేషించి లాభములు ఉంటాయి. విందు భోజనములు, సంఘము నందు గౌరవము కలుగుట, వచ్చే సొమ్ము శీఘ్రముగా అందుట జరుగును.

మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి, పై చదువులకు విదేశాలకు వెళ్తారు. ఇంటియందు అందరికీ ఆరోగ్యము, మనస్సు నందు సంతోషము, అన్నదమ్ములతో, అక్కచెల్లెండ్రతో కూడి ఉండుట, బంధుమిత్రుల కలయిక ఉంటుంది. ఇంటియందు పండుగ వాతావరణము ఏర్పడుట, ఉద్యోగస్థులకు మంచి ఉద్యోగము లేదా స్థానచలనములు కలుగుతాయి. అధికార సహాయ సంపత్తులు అందుతాయి. ఉద్యోగ పరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది. రైతులకు పంటలు అధికముగా పండుతాయి. సకాలములో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు. మంచివారితో స్నేహము చేయుట, మిమ్మలను తక్కువ అంచనా వేసిన వారు భంగపడుదురు. కొత్త పెట్టుబడులు పెడతారు. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబముతో తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణములు చేయుదురు. ఉన్నంతలో విలాసవంతమైన జీవనము గడుపుతారు. కుటుంబ బాధ్యతలు మీ మీద పడతాయి. జన్మస్థాన గురువు వల్ల విద్యార్థులు ఆశించిన ర్యాంకులు రాకపోవచ్చు. కోపము ఎక్కువ. వినోద కార్యములకు ధనం ఎక్కువ ఖర్చు చేస్తారు. కొంచెం ఓర్పుగా మెలగాలి. ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, ఉద్యోగస్థులకు మానసిక బాధ ఉండవచ్చు. కావున మీరు “శ్రీరామ రక్షా స్తోత్రము” పఠించుము.

సింహరాశి: (ఆదాయం 5, వ్యయం 5)

స్త్రీ పురుష స్వభావం, విశాల హృదయము, అభిమానవంతులు, పరోపకార గుణములు కలవారు. పొగడ్తలకు లొంగిపోతారు. కోపం ఎంత వేగంగా వస్తుందో అంత త్వరగా తగ్గుతుంది. మర్యాద జరగకపోయినా పరవాలేదు కానీ అవమానము జరిగితే సహించరు. అభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలెననే కుతూహలము, చురుకుదనము, తొందరపాటు ఉంటాయి. గృహ అలంకరణయందు, పరిశుభ్రంగా ఉంచుటలో ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఈ రాశి వారికి గురువు, అష్టమ శని ప్రభావం వల్ల గడ్డుకాలం. ఇంటియందు శుభకార్యముల వల్ల అధిక ధనము ఖర్చు అవుతుంది. వ్యర్థ సంచారము, అనవసర ఆందోళనలు ఉంటాయి. విద్యార్థులకు కష్టకాలము, ఉద్యోగస్థులకు ఆటంకములు, వ్యాపారమందు అభివృద్ధి లేకుండుట, పొత్తు వ్యాపారాల్లో నష్టములు, నమ్మిన వారి నుండి మోసములు ఎదురవ్వవచ్చు.

గృహమందు ఐక్యత లోపించుట, స్థిరాస్థుల విలువ తగ్గుట, మనస్సునందు స్థిరత్వము లేక టెన్షన్ పడుట జరుగును. ప్రయాణములలో జాగ్రత్త అవసరము. ఆర్థిక లావాదేవీలలో తప్పటడుగులు, రాని బాకీల వల్ల వివాదములు కలుగుతాయి. సహాయం చేసే వ్యక్తులు దూరం అవ్వడం, పనులు ఆలస్యమవ్వడం వల్ల అసహనం కలగవచ్చు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి, ప్రలోభాలకు లొంగవద్దు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పిల్లల చదువుపై శ్రద్ధ వహించుట, దాన ధర్మములు, తీర్థయాత్రలు చేయుట మంచిది. ఓర్పుతో మెలగండి, ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సాధ్యంకాని హామీలు ఇవ్వవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమపడండి. నివారణకు గురు శని జపతర్పణ హోమాలు చేయించండి, ప్రతినిత్యము నవగ్రహ స్తోత్రము పఠించండి.

కన్యారాశి: (ఆదాయం 8, వ్యయం 11)

బంధుప్రేమ, అభిమానము, మనస్సు సుకుమార్యం కలిగి ఉంటారు. దేహమందు సౌఖ్యము, సున్నితమైన పనితనము చూపిస్తారు. ఆరోగ్యము గురించి దిగులు హెచ్చుగా ఉంటుంది. సత్యవాక్కు గలవారు, విమర్శనా బుద్ధి కలవారు, ధనకాంక్ష అధికం. గృహములు, వస్త్రములు, కేశాలంకరణ దిద్దుకొనుటయందు ఎక్కువ కాలము వినియోగిస్తారు. మంచి తెలివితేటలు కలిగి ఉందురు. పొదుపు ఎక్కువ. ఎంతో కష్టపడితే గానీ డబ్బు రాదు. ఎవరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని ఆశిస్తారు. ఈ రాశి వారికి గురువు (9,10) స్థాన సంచారము వల్ల ఇంటియందు వివాహాది శుభకార్యములు జరుగును, రావలసిన ధనం చేతికి వస్తుంది. నూతన వ్యాపారాలు ఆరంభించుట వల్ల మంచి లాభములు కలుగును.

విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించుట, ఉద్యోగ ప్రమోషన్లు, బంధుమిత్రుల కలయిక, విదేశీ ప్రయాణములు, సంతాన ప్రాప్తి, సంఘములో గౌరవము లభించును. నూతన వస్తు, వాహన ఆభరణములు కొనుగోలు చేస్తారు. తాత్కాలిక ఉద్యోగస్థులకు పర్మినెంట్ అగుట, ప్రయాణ లాభములు, కుటుంబ ఆరోగ్యము, రాజకీయ జయము, కోర్టు కేసులు పరిష్కారమగుట వంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఆదాయం బాగుంటుంది, కొత్త ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరును. అయితే సంవత్సరాంతం శని ఏడవ ఇంట ఉండటం వల్ల మనస్సు నందు భయము, ప్రయాణ ఆటంకములు, శస్త్ర చికిత్సలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వవచ్చు. పనులు ఆలస్యమగుట, ఆత్మీయులు విడిపోవుట, మానసిక ఒత్తిడి కలుగును. సహనం, ఓర్పు అవసరము. వ్యర్థ సంచారము, మితిమీరిన ఆత్మవిశ్వాసము వల్ల నష్టపోయే అవకాశము ఉంది. నివారణకు ప్రతినిత్యము “శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము” పఠించుము.

తులారాశి: (ఆదాయం 5, వ్యయం 14)

సుకుమారమైన మనస్తత్వము, సుఖజీవనము, చక్కటి ప్రవర్తన, చురుకుదనము కలిగి ఉంటారు. ప్రశాంతమైన స్వభావము, గౌరవము, శుచి, శుభ్రత అధికం. వినోద విలాసములు అధికముగా ఇష్టపడలేరు. అధిక సంచార ప్రియులు. క్రయ విక్రయములయందు అభిరుచి గలవారు. బంధుప్రేమ, అభిమానవంతులు, ధన కాంక్ష అధికం. పొగడ్తలకు లొంగిపోదురు. నిజాయితీపరులు, అలంకార ప్రియులు, చిత్రమైన లక్షణము కలిగి ఉందురు. ఈ రాశి వారికి శని షష్టమ స్థానమున, గురువు (9,10) ఉండటం వల్ల మంచి ఫలములు కలుగును. మీ కష్టం ఫలిస్తుంది, మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులలో అభిమానం పెరుగుట, పనులు హడావిడిగా సాగుతాయి. ఇంటియందు వివాహాది శుభకార్యములు, యజ్ఞ యాగాది క్రతువులు చేయుట, బంధు మిత్రులతో పండుగ వాతావరణము ఏర్పడును.

విద్యార్థులకు మంచి ర్యాంకులు, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభిస్తాయి. మనస్సు నందు సంతోషము, వృత్తులందు తీరిక లేని పని ఉంటుంది. విలువైన స్థిరాస్థులు, భూ సంబంధమైన లాభములు, వ్యవసాయమందు మంచి ఫలితములు ఉంటాయి. నూతన వ్యాపారాల యందు లాభము, కోర్టులందు జయము, ఉపయుక్తమైన ప్రయాణాలు చేస్తారు. సంఘము నందు గౌరవము ఉన్నప్పటికీ, స్థానచలనములు, ఉద్యోగ మార్పు, పై అధికారుల నుండి ఒత్తిడి ఉండవచ్చు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ఆత్మస్థైర్యంతో మెలగండి. ఆర్భాటాలకు ధనం ఖర్చు చేయుట, ప్రయాణ ఆటంకములు ఎదురవ్వవచ్చు. సాధ్యంకాని హామీలు ఇవ్వవద్దు, ఎవరినీ అతిగా నమ్మకుండా ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

వృశ్చికరాశి: (ఆదాయం 11, వ్యయం 5)

చిన్నతనమున తీవ్ర అనారోగ్యములు ఉంటాయి. రహస్యములు బయటికి చెప్పరు. మాటలు వాడిగా, కఠినముగా ఉంటాయి. మనస్సు మాత్రం సున్నితమైనది. స్నేహితులకు ప్రాణం ఇచ్చుటకైనా వెనుకాడరు. శారీరక, మానసిక కష్టాలు ఓర్పుతో సహిస్తారు. త్యాగబుద్ధి, నిర్మొహమాటంగా తీవ్రంగా విమర్శించడం, కక్ష సాధించడం, పరోపకారం చేయడం, ధైర్యమెక్కువ. ఆత్మవిశ్వాసం, సహనం కలిగి ఉంటారు. డబ్బు అధికంగా ఖర్చు పెడతారు. అభిప్రాయ భేదములు వచ్చినను సర్దుకోగలుగుతారు. మానసికంగా ఎంతో గట్టివారు. ఈ రాశి వారికి 01-06-2025 నుండి గురువు 9, 10 స్థాన సంచారం చేత మంచి ఫలితములు ఉండును. ఇంటియందు వివాహాది శుభకార్యములు చేయుట, మంచి ఉద్యోగము, ప్రమోషన్లు లభించుట, విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి మంచి ర్యాంకులు పొందుతారు.

పై చదువులకు విదేశాలకు వెళ్లుట, భూమి, బంగారు, వాహనం కొనుగోలు చేయుట జరుగును. వచ్చే సొమ్ము శీఘ్రముగా అందుతుంది. ఇంటియందు మంచి ఆరోగ్యము, విందు వినోదములు సంతృప్తినిస్తాయి. వ్యాపారమందు మంచి లాభములు పొందుట, నూతన వ్యాపారము ప్రారంభించుట, రియల్ ఎస్టేట్, బట్టల వ్యాపారమందు అభివృద్ధి ఉంటుంది. డాక్టర్లకు మంచి పేరు లభిస్తుంది. సకాలములో మంచి నిర్ణయాలు తీసుకుంటారు, అప్పగించిన పనులు నెరవేరుతాయి. కుటుంబముతో తీర్థయాత్రలు చేస్తారు, రైతులకు పంటలు అధికంగా పండుతాయి. అయితే సంవత్సరాంతం శని 5వ స్థాన సంచారము చేత వృత్తులందు ఆటంకములు, వ్యర్థ సంచారము, కోపము అధికముగా ఉండును. ఓర్పుగా మెలగాలి, సహాయం చేస్తామన్న వ్యక్తులు దూరం కావచ్చు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఉంది, అనారోగ్యములు కలగవచ్చు. నివారణకు శని జపతర్పణ హోమాదులు చేయించి, ప్రతినిత్యము శనిస్తోత్రము పఠించుము.

ధనస్సురాశి: (ఆదాయం 14, వ్యయం 11)

మంచి ఆకర్షణీయమైన రూపం, ఎక్కువ దైవభక్తి, పాపభీతి కలిగి ఉంటారు. ఏ విషయమైనా వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకుంటారు. సాంప్రదాయములు పాటిస్తారు. మనస్సులో ఏదీ దాచుకోరు. అనుకున్నంత తొందరగా పైకి రాలేరు. పొడవైన ముఖము, త్యాగము, ఔదార్యవంతులు. ఉత్సాహం, ఆరోగ్యం, చొరవ శక్తి కలిగి ఉంటారు. జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు. భోగభాగ్యములు అనుభవిస్తారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ఈ రాశివారికి గురువు (7,8) స్థానం, శని 4వ స్థాన సంచారం వల్ల మిశ్రమ ఫలితములు ఉంటాయి. ఇంటియందు వివాహాది శుభ కార్యముల వల్ల అధిక ఖర్చులు, బంధుమిత్ర సమాగమము ఉంటుంది. వ్యాపారమందు అభివృద్ధి లేకుండుట, విద్యయందు ఆటంకములు, ఆశించిన ర్యాంకులు రాకుండుట, ఉద్యోగ నష్టము మరియు అనవసర ప్రయాణములు సంభవించవచ్చు. పనులందు తీరిక ఉండదు, పదవులు దక్కకపోవచ్చు.

స్థోమతకు మించిన హామీలు ఇవ్వవద్దు, అపరిచితులను నమ్మరాదు. రాని బాకీలు వివాదమగుట, పై అధికారుల ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. రైతులకు పంట ఆదాయము ఆలస్యమగును, ఆస్తి పంపకాలలో అన్యాయం జరగవచ్చు. మానసిక చింతన, రాజకీయ ఒడిదుడుకులు, స్థానచలనములు ఉంటాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వృత్తులందు ఆటంకములు, అకారణ కలహములు, అపనిందలు ఎదురవ్వవచ్చు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, మాట ధోరణి నియంత్రించాలి. పనులందు ఒత్తిడి, శ్రమ అధికమైనా మొండిగా నెరవేర్చుతారు. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. నివారణకు “సుందరకాండ పారాయణము” చేయించి, ప్రతినిత్యము నవగ్రహ స్తోత్రము పఠించుట మేలు.

మకరరాశి: (ఆదాయం 02, వ్యయం 08)

ధనము, అధికారము, కీర్తి, ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువ. ఎవరితోనూ స్నేహం చేయరు. ఎంతో ఓర్పు, నిదానం కలిగి ఉంటారు. బాగా కష్టపడి పని చేస్తారు. నిర్మలమైన మనస్సు గలవారు. కపటం లేకుండా జీవిస్తారు. యథార్థవాదులు, ఎంతో నమ్మకస్తులు, క్రమశిక్షణ మీద మక్కువ కలిగి ఉంటారు. ఒకరిని విమర్శించడం, చెడుగా మాట్లాడడం చేయరు. వృత్తి, ఉద్యోగాల పట్ల శ్రద్ధా సంపన్నులై కనిపిస్తారు. సంఘమున గౌరవం కాపాడుకుంటారు. కష్టజీవిగా కనిపిస్తారు. స్వార్జితంతోనే జీవితాంతం గడపాలనే కోరిక. వ్యాపార దక్షత కలిగి ఉందురు. ఈ రాశి వారికి శని (3) ఇంట, 01-06-2025 నుండి గురువు (7) ఇంట సంచారము వల్ల అంతా శుభయోగమే. తలచిన కార్యములు నెరవేరుట, మనస్సు నందు సంతోషము కలుగును. ఇంటియందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో కూడి ఉండుట, ఇంటియందు పండుగ వాతావరణం ఏర్పడుతుంది.

సంఘము నందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, సంతాన ప్రాప్తి కలుగును. కొత్తవారి పరిచయం ఉంటుంది. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారాలయందు మంచి లాభములు ఉంటాయి. విద్యార్థులకు అంచనాకు మించిన ర్యాంకులు, మంచి ఉద్యోగం, ప్రమోషన్లు లభిస్తాయి. మీ మంచితనము చూసి చాలామంది మిమ్ములను ఆశ్రయిస్తారు. సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆనందమునకు అవధులు ఉండవు. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఉద్యోగ పరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది. ఇతరులకు సహాయము చేయుట, లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు వస్తుంది. రైతులకు మంచి పంట పండును. ఖర్చులు అదుపులో ఉండవు. పనులందు ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ఆర్భాటాలకు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు. మీ గుడ్విల్ పెరుగుతుంది. దాన ధర్మములు చేయుట, మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు. ఈ సంవత్సరమంతా మంచి ఫలితములే ఉంటాయి.

కుంభరాశి: (ఆదాయం 02, వ్యయం 8)

మృదు స్వభావము, దయ, వినయము కలిగి ఉంటారు. మధుర వాక్కులు పలుకుతారు. విశ్వాసములు కలిగి ఉందురు. సామాన్యముగా ప్రవర్తనను ఎట్టి పరిస్థితులలో మార్చుకోరు. విఘ్నములన్నింటినీ దాటి ఆదర్శమును సాధిస్తారు. ఒంటరితనమున్నా కష్టపడరు. వ్యక్తులందు అయిష్టత, ద్వేషము ఉండదు. ఉత్సాహముగా కాలము గడుపుతారు. బాగా జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు. అందరినీ సోదర సోదరీమణులుగా చూస్తారు. ఇష్టమైన అభిప్రాయములు నిశ్చితంగా ఉంటాయి. సంవత్సరాంతం గురువు (5,6) సంచారము వల్ల కొన్ని పనులు నెరవేరును. అన్ని రంగాల వ్యాపారమందు మంచి లాభములు ఉంటాయి. మంచివారితో స్నేహము చేయుట, ఇంటియందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల సమాగమము ఉంటుంది. ఇంటియందు పండుగ వాతావరణము, సంతోషము నెలకొంటుంది. ధనం రావటానికి అనేక ప్రయత్నాలు ఎంచుకుంటారు. విద్యార్థులకు మంచి ర్యాంకులు లభిస్తాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, డాక్టర్లకు, న్యాయవాదులకు కొన్ని ఆటంకములు కలగవచ్చు. వ్యవహారానుకూలత ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి.

అవకాశాలను వదులుకోవద్దు. నూతన పరిచయస్తులు ధన సహాయం అందిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఖరీదైన వస్తువులు కొంటారు. ఇతరులకు సహాయము చేయుట, సంతాన ప్రాప్తి, భూసంబంధ లాభములు ఉంటాయి. సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కుటుంబములో ఇంకొకరికి ఆదాయం మొదలవుతుంది. సంవత్సరాంతం ఏల్నాటి శని వల్ల దుబారా తిరుగుట, ప్రయాణ ప్రమాదములు, శస్త్ర చికిత్సలు జరిగే అవకాశం ఉంది. మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లేకుండుట, మనస్సు నందు భయము, అనవసరపు పనులు చేసి చింతించుట జరగవచ్చు. వచ్చే సొమ్ము రాకుండుట, కుటుంబ ఆర్థిక వ్యవహారము నందు అనుకూలము లేకుండుట ఉండవచ్చు. క్రయ విక్రయమందు జాగ్రత్త అవసరము. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. మాటల నియంత్రణ అవసరము. శని జపతర్పణ హోమాదులు చేయించి ప్రతిరోజు శనిస్తోత్రము పఠించుము.

మీనరాశి: (ఆదాయం 14, వ్యయం 11)

ఎంతో ఔదార్యవంతులు. వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువ. ఆత్మస్థైర్యం, చొరవ తక్కువ. ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు. నిజాయితీ ఎక్కువ. స్నేహితులను చూసి సంతోషపడతారు. ప్రశాంతమైన జీవితం గడపడమంటే ఇష్టం. ఎవరియందూ ద్వేషము గానీ, కోపము గానీ రాదు. వచ్చినను తగ్గదు. స్నేహితులకు, బంధువులకు సహాయం చేస్తారు. మనస్సు న్యాయబద్ధము, ధర్మమార్గము, దయా స్వభావము కలిగి ఉందురు. సుకుమారమైన స్వభావం, సున్నితమైన ప్రవర్తన. ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణ, సంస్కారముతో వశపరచుకోగలుగుతారు. ఈ రాశి వారికి గురువు (4, 5) స్థాన సంచారము వల్ల ఇంటియందు వివాహాది శుభకార్యములు జరుగును. 

Show More
Back to top button