
సాధారణంగా అందరూ.. ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. మంచి వైద్య సదుపాయాలు, ఇన్ఫెక్షన్ల నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై పెరిగిన అవగాహన కారణంగా ప్రపంచవ్యాప్తంగా జీవనకాలం పెరుగుతోంది. ప్రస్తుతం చాలా మంది 90లలోకి అడుగుపెడుతున్నారు. అయితే, దీర్ఘాయుష్షు కోసం వ్యక్తిగత శ్రద్ధ తప్పనిసరి. ఒంటరితనం వృద్ధాప్యాన్ని త్వరగా తెచ్చిపెట్టి అకాల మరణానికి దారితీస్తుంది. అందుకే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి, స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సెల్ప్ సాటిస్ఫాక్షన్ పెంచుకోవాలి. ఈ సామాజిక అనుబంధాలు ఆయుష్షు పెరిగేందుకు దోహదపడతాయి.
ఆహారం, వ్యాయామం కూడా దీర్ఘాయుష్షులో కీలక పాత్ర పోషిస్తాయి. అక్రోట్లు(వాల్‌నట్స్) వంటి ఆహారాలలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె జబ్బులు, డిమెన్షియా వంటివి రాకుండా కాపాడతాయి. శాకాహారులు సాధారణంగా ఎక్కువ కాలం జీవిస్తారు. ఎందుకంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలో పీచు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పిజ్జాలు, బర్గర్లు వంటి అనారోగ్యకరమైన ఆహారాలను తగ్గించుకోవడం మంచిది. అలాగే, ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల ఏరోబిక్ వ్యాయామాలు (నడక, ఈత, సైక్లింగ్), యోగా వంటివి అలవాటు చేసుకోవడం అవసరం. తీవ్రంగా వ్యాయామం చేసేవారి కణాల వయసు జీవరసాయన పరంగా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇక దీర్ఘకాల ఒత్తిడి అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులకు దారితీయవచ్చు, కాబట్టి ప్రాణాయామం, ధ్యానం వంటి వాటితో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ డి కూడా ఎముకలు, మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వృద్ధాప్యంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి, ఫ్లూ, న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ల నివారణకు టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ జీవనశైలి మార్పులు, జాగ్రత్తలు ఆరోగ్యకరమైన, సుదీర్ఘమైన జీవితాన్ని గడపడానికి సహాయపడతాయి.






