వయసు పెరిగే కొద్దీ ఎముకలు లోపల నుంచి బలహీనపడి, గుల్లబారిపోయే వ్యాధిని ‘ఆస్టియోపోరోసిస్’ అంటారు. చాలామంది ఇది కేవలం ఎముకలు విరిగే సమస్య మాత్రమే అనుకుంటారు. కానీ, దీనివల్ల ప్రాణాలకే ముప్పు ఉందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా నెలసరి (పీరియడ్స్) ఆగిపోయిన మహిళల్లో ఎముకలు గుల్లబారడం వల్ల, భవిష్యత్తులో మరణించే ప్రమాదం ఏకంగా 47 శాతం పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. ఇది ఎలాంటి నొప్పులు లేకుండానే లోపల లోపలే ఎముకలను పూర్తిగా బలహీనపరుస్తుంది.
ఆస్టియోపోరోసిస్ మహిళల్లో ఎందుకు ఎక్కువగా వస్తుంది?
మహిళల శరీరంలో ఎముకలను బలంగా ఉంచడానికి ‘ఈస్ట్రోజెన్’ అనే హార్మోన్ చాలా అవసరం. అయితే, వయసు పెరిగి పీరియడ్స్ ఆగిపోయాక శరీరంలో ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ రక్షణ పోవడంతో ఎముకలు వేగంగా పటుత్వాన్ని కోల్పోతాయి. దీనికి తోడు శారీరక శ్రమ లేకపోవడం, కూర్చుని పనిచేయడం, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎముకలు మరింత బలహీనపడతాయి. ఫలితంగా చిన్నగా కిందపడినా కూడా తుంటి ఎముక లేదా వెన్నెముక విరిగే ప్రమాదం ఉంటుంది.
ఆస్టియోపోరోసిస్ గుర్తించేందుకు ఏ పరీక్ష చేయాలి?
ఈ ప్రమాదం నుండి బయటపడటానికి ప్రతి ఒక్కరూ ‘డెక్సా స్కాన్’ (DEXA Scan) అనే సాధారణ పరీక్ష చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల మన ఎముకలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరలు, గుడ్లు వంటి పౌష్టికాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా కాసేపు ఎండలో నడవడం, వ్యాయామం చేయడం ద్వారా ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవచ్చు.
ఇతర కథనాలు:
పన్ను తీయించుకోవడంపై భయాలు.! వైద్యులు ఏమంటున్నారు?
రోజూ ఆవకాయ తింటున్నారా? మీ గుండె ప్రమాదంలో పడ్డట్లే!
FAQ
1.ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి?
ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలు లోపల నుంచి బలహీనపడి గుల్లబారే వ్యాధి.
2.ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఎవరికి వస్తుంది?
పీరియడ్స్ ఆగిపోయిన మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
3.ఆస్టియోపోరోసిస్‌ను గుర్తించేందుకు ఏ పరీక్ష చేస్తారు?
డెక్సా స్కాన్ (DEXA Scan) ద్వారా ఎముకల సాంద్రతను పరీక్షించి వ్యాధిని గుర్తిస్తారు.
4.ఆస్టియోపోరోసిస్‌ను నివారించవచ్చా?
కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఎండలో నడవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు.










