డబ్బు ఒక మాయ.డబ్బును ప్రేమించు, వాడుకో, జీవితాన్నిప్రేమించు,అనుభవించు.
డబ్బు ఒక మాయ. డబ్బును ప్రేమించు, వాడుకో, జీవితాన్ని ప్రేమించు, అనుభవించు. మనిషి నిత్యావసరాలు తీర్చడంలో డబ్బు అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వస్తువు. దైనందిన జీవితంలో మనిషి ఏ వస్తువు కొనాలన్నా, ఏ వస్తువు అమ్మలన్నా డబ్బే ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆహారం, దుస్తులు, వైద్యం, రవాణా వంటి నిత్యవసరాలను కొనుగోలు చేయడానికి డబ్బును ఉపయోగిస్తాము. పొదుపు చేయడం ద్వారా కానీ, అత్యవసర పరిస్థితుల్లో, ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా ఆకస్మిక వైద్య ఖర్చుల కోసం డబ్బు ఉపయోగపడుతుంది. డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవడం వలన, దాని విలువ కోల్పోకుండా నిల్వ ఉండిపోతుంది.
మనకు నచ్చిన పనిని ఎంచుకోవడానికి, సమయాన్ని మనం నియంత్రించుకోవడానికి డబ్బు స్వేచ్ఛను ఇస్తుంది. డబ్బు కేవలం అవసరాల కోసమే కాకుండా, జీవితంలో ఆత్మవిశ్వాసం, స్థిరత్వం మరియు స్వేచ్ఛను పొందడానికి ఉపయోగపడుతుంది. అయితే డబ్బును మన విలాసాల కోసం కాకుండా, మన అవసరాల కోసం మాత్రమే ఖర్చు పెడుతూ, ఇతరులకు మనం తోచిన సహాయం అందిస్తూ, చిన్న చిన్న జ్ఞాపకాలను, చిన్న చిన్న ఆనందాలను అనుభవించడం ద్వారా జీవితం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అనేకమంది తత్వవేత్తలు, తార్కిక జ్ఞానులు చెప్పారు. డబ్బును మితంగా ప్రేమించి, డబ్బును మితంగా వాడుకుంటే, జీవితాన్ని ఎలా ఆనందంగా అనుభవించొచ్చో చూద్దాం.
డబ్బు అనేది ఒక మాయ…
ప్రస్తుతం మానవ సమాజములో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వస్తువు డబ్బు. దీనిని ఎక్కువగా క్రయ విక్రయములలో ఉపయోగిస్తారు. అయితే ప్రాచీన కాలములో క్రయ విక్రయములు వస్తుమార్పిడి పద్ధతి ద్వారా జరిపేవారు. తదుపరి కాలములో అనేక వస్తువులు, గవ్వలు, బార్లీ, ఆల్చిప్పలు, పూసలు మొదలైనవి డబ్బుగా చలామణి అయ్యాయి. సహజంగా చాలా తక్కువగా దొరికే విలువైన లోహాలు, బంగారం వెండి లాంటి వాటిని కూడా డబ్బుగా ఉపయోగించారు. నిజానికి డబ్బు అనేది ఒక మాయ అని చెబుతారు కొందరు. ఇంకొందరు దీనిని పాపానికి మూలం అంటారు. మరికొందరు అసలు డబ్బులు లేకపోవడమే నిజమైన, అసలైన దరిద్రం అంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఈ ప్రపంచం మొత్తం ఒక సర్కస్ (శిక్షణ పొందిన జంతువులు, విదూషకులు, మరియు విన్యాసాలు చేసేవారితో కూడిన ప్రయాణ ప్రదర్శన బృందం) అయితే ఈ సర్కస్ నడవడానికి కావలసిన ఇంధనం ఈ డబ్బు. నిజానికి మనిషికి డబ్బు ఉన్న సంబంధం చాలా విచిత్రంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని ఒక పందెపు గుర్రంలా (రేసు గుర్రం) మార్చేసింది.
సహజమైన అవసరాలు…
ప్రక్కింటి వాడి దగ్గర ఏముంది? వాడు వాడుతున్న గడియారం ఖరీదు ఎంత? వాడి కొన్న కారు ఎంత పెద్దది? వాడు కట్టిన ఇల్లు ఖర్చు ఎంత? ఇదే మన జీవితం అయిపోయింది. కానీ నిజం ఏమిటంటే ఎవరి దగ్గరైనా కోట్ల రూపాయలు ఉండొచ్చు, కానీ వారు ప్రశాంతంగా ఉండకపోవచ్చు. అలాగే నీవు రూపాయి లేకపోయినా నీవు సంతోషంగా ఉండలేవు. చాలా మంది సంతోషం అనేది లోపల ఉంటుందని వేదాంతం చెబుతూ ఉంటారు. వేదాంతాలు చెప్పడం సులువే, కానీ వేదాంతశాస్త్రము ఆకలి వేసినప్పుడు కడుపు నింపదు. అందుకే డబ్బుతో సంతోషాన్ని కొనవచ్చా అంటే కచ్చితంగా కొనొచ్చు.
కానీ దానికి ఒక పద్ధతి ఉంది. అది తెలియకే చాలామంది డబ్బు ఉన్నా కూడా దరిద్రుల్లా బ్రతుకుతుంటారు. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ఎపిక్యూరస్ చెప్పిన మాటలు గనుక మనం సరిగ్గా వింటే మనం ఎంత పిచ్చి వాళ్ళమో మనకు అర్ధం అవుతుంది. ఆయన మనిషి కోరికల్ని మూడు రకాలుగా విడగొట్టారు. అందులో మొదటిది సహజమైన అవసరాలు. అవి ఆకలి, దాహం, నిద్ర, ఉండడానికి ఒక నీడ. ఇవి ఉంటే చాలు మనిషి బ్రతికేయొచ్చు. ఇవి తీర్చుకోవడం చాలా చవక. రెండోది సహజమైనవే కానీ అంతగా అవసరం లేనివి. మంచి రుచికరమైన ఆహారం కావాలనుకోవడం, లక్షణంగా ఉండాలనుకోవడం. అయితే ఇవి లేకపోతే చచ్చిపోం, లేకపోయినా మనం బ్రతకగలం. కానీ అవి ఉంటే బాగుంటుందనిపిస్తుంది.
మనిషి వస్తువులకు బానిసైపోతున్నాడు…
గ్రీకు తత్వవేత్త ఎపిక్యూరస్ చెప్పిన మనిషి మూడో కోరిక “పిచ్చి కోరికలు”. అవి ఏమిటంటే కోటి రూపాయలు ఖర్చు చేసి గడియారం కొనుగోలు చేయాలి అనుకోవడం, 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక కారు కొనుక్కోవాలి అని కోరుకోవడం. అయితే ఇక్కడ ఎపిక్యూరస్ చెప్పిందేమిటంటే ఈ మూడో రకం కోరికల వెనుక పరిగెత్తేవారు ఎప్పటికీ సుఖపడరు. ఎందుకంటే ఆ కోరికలకు అంతం అనేది ఉండదు. ఒక కోటి రూపాయలు పెట్టి కొన్న గడియారం సమయం చూపిస్తుంది, అలాగే వంద రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన గడియారం కూడా సమయాన్నే చూపిస్తుంది. కానీ కోటి రూపాయలు పెట్టి గడియారం కొన్నప్పుడు ఒక ఆనందం ఉంటుంది. కానీ ఆ ఆనందం ఒక మందు (డ్రగ్) లాంటిది. ఆ ఆనందం కొంత కాలం మాత్రమే ఉంటుంది. కానీ మళ్ళీ కొత్త గడియారం కావాలనిపిస్తుంది. అంటే ఎపిక్యూరస్ చెప్పినట్టు మనిషి వస్తువులకు బానిసైపోతున్నాడు. ఈ ఆనందాన్ని కేవలం ఒక లోహం (మెటల్) మీదనో, లేక ఒక వాహనం మీదనో ఆధారపడేలా చేసుకుంటున్నాడు. అయితే అది చాలా ప్రమాదకరం.
డబ్బుతో సమయాన్ని కొనాలి…
నిజానికి డబ్బుతో వస్తువుల్ని కాదు, సంతోషాన్ని కొనాలి. డబ్బుతో సమయాన్ని కొనాలి. జర్మన్ తత్వవేత్త మరియు రచయిత అయిన ఆర్థర్ షోపెన్‌హౌర్ ఒక మాట చెప్పారు. మనిషికున్న అసలైన ఆస్తి అతని ఆలోచనలు. అయితే ఆ ఆలోచనలకు పదును పెట్టాలన్నా, నీకు నచ్చినట్టు నీవు బ్రతకాలన్నా నీకు కావాల్సింది లీజర్ అంటే కాళీ సమయం. అయితే మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే డబ్బు సంపాదించడం కోసం మన సమయాన్ని అమ్మేస్తున్నాం. పొద్దున్నుంచి రాత్రి వరకు ఎవరో ఒక యజమాని క్రిందనో, లేక యాజమాన్యం సమక్షంలో పని చేసి నెల చివరన వచ్చే జీతంతో ఒక ఐఫోన్ కొనుక్కుని అదే సంతోషం అని అనుకుంటున్నాం.
అయితే నిజంగా నీ దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బుతో నీవు చేయాల్సిన మొదటి పని నీ కాలాన్ని నీవు తిరిగి కొనుక్కోవడం. అంటే నీకు నచ్చిన పని చేయడానికి నీకు సమయం ఉండాలి, నీకు చదువుకోవాలని అనిపిస్తే చదువుకోవాలి. నీకు పర్యాటక ప్రదేశాలు చూడాలని ఉంటే నీవు ప్రయాణం మొదలెట్టాలి. అలాగే ఏమి చేయకుండా ఖాళీగా కూర్చోవాలనిపిస్తే, ఖాళీగా కూర్చోవాలి. దీనినే ఆర్థిక స్వేచ్ఛ (ఫైనాన్షియల్ ఫ్రీడమ్) అంటారు. అంటే నీ అవసరాల కోసం ఇంకొకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదన్నమాట. ఇదే గనుక జరిగితే అప్పుడు నీ మీద నీకు నియంత్రణ ఉంటుంది. అదే అసలైన కిక్ అని అర్థం.
జ్ఞాపకాలను ఎవరూ దొంగలించలేరు…
ఈ ప్రపంచంలో చాలామంది అనుకునే విషయం ఏమిటంటే, కోట్లు రూపాయలు ఉంటేనే ఆనందం ఉంటుంది, కోట్ల రూపాయలు ఉంటే జీవితాన్ని ఆహ్లాదకరంగా ఆస్వాదించొచ్చు అని అనుకుంటారు. కానీ పరిశోధన ఏమి చెబుతుందంటే, చిన్న చిన్న ఆనందాలు ఎక్కువసార్లు అనుభవించడం వల్ల వచ్చే సంతోషం ఒకేసారి పెద్ద విలాసవంతమైన వస్తువులు కొనడం వలన రాదు. హార్వర్డ్ అధ్యయనం కూడా ఇదే చెబుతుంది. నీవు ఒక బంగాళా గనుక కొంటే, మొదటి నెల చాలా గొప్పగా ఉంటుంది. రెండో నెల అది అలవాటు అయిపోతుంది. మూడో నెల దానిని శుభ్రం చేసుకోవడం నీకు తలనొప్పిగా మారుతుంది. దీనిని తలనొప్పి అలవాటుపడటం అంటారు. మన మేధస్సు ఏ వస్తువుకైనా కొత్తగా అలవాటు పడిపోతుంది. అందుకే వస్తువుల మీద కంటే అనుభవం మీద డబ్బు ఖర్చు పెట్టాలి. ఒక యాత్రకు వెళ్లడం, ఒక సంగీతం ప్రదర్శన చూడడం లేదా నీకు నచ్చిన వాళ్ళతో విందు వినోదాలకు హాజరవ్వడం ఇవన్నీ నీ జ్ఞాపకాలలో ఉండిపోతాయి.
అయితే జ్ఞాపకాలను ఎవరూ దొంగలించలేరు. వస్తువులయితే పాడైపోతాయి, కానీ అనుభవాలు గుర్తింపులో భాగం అయిపోతాయి. అందుకే ఎవరో చూస్తారని కాకుండా, ఎవరి మెప్పు పొందడం కోసమో పరితపించకుండా నీ మనసుకు నచ్చే పనుల కోసం డబ్బు ఖర్చు పెట్టాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో మనల్ని ఏడిపిస్తున్న మరో అంశం పోలిక (కంపారిజన్). మన కష్టాలు గురించి బాధపడకుండా, పక్కవాడి సుఖాలు చూసి వాటిని పోల్చుకుని బాధపడుతూ ఉంటాము. అవతలి వ్యక్తి ఒక కొత్త కారు కొన్నాడంటే చాలు, మన దగ్గర ఉన్న పాత కారు మీద మనకు అసహ్యం ఏర్పడుతుంది. అయితే ఈ ప్రపంచంలో పరుగు పందెంకు ముగింపు కార్డు లేదు. నీవు ఒక పందెంలో ఒక స్థాయికి వెళితే అవతలి వాడు నీకంటే పైన ఉంటాడు. ఎపిక్యూరస్ కూడా అదే అన్నారు. మీ దగ్గర ఏది ఉందో దానిని చూసి గర్వపడాలి. నీ దగ్గర ఉన్నవే ఒకప్పుడు నీ కోరికలే కదా! ఉన్న వాటిని చూసి ఆనందించడం మర్చిపోయి మనకు లేని దానికోసం ఏడుస్తూ బతికేస్తున్నాం అని ఆయన అన్నారు.
డబ్బు నిన్ను బానిసను చేయొచ్చు, రాజును చేయొచ్చు…
నిత్య జీవితంలో డబ్బును మన అవసరాలు తీర్చే ఒక రక్షణ కవచంలా చూడాలి తప్ప, దానిని ఒక అహంకారంలా చూడకూడదు. మీ దగ్గర ఉన్న డబ్బు నిన్ను ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడాలి. అంటే కుటుంబంలో ఏదైనా అనారోగ్యం కలిగినా, కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడడానికి ఆ డబ్బు పనికి రావాలి. కానీ ఆ డబ్బు కోసం ఎవరికో బానిసలుగా మారడం తెలివి తక్కువ దద్దమ్మలు చేసే పని. అయితే డబ్బు ఎక్కువగా ఉంటే ప్రక్కవాడికి దానం చేయాలి. ఇదేదో పుణ్యం వస్తుందని చెప్పే మాట కాదు. ఇది మనస్తత్వశాస్త్రం. నీ దగ్గర ఉన్న దాంట్లో పక్క వాడికి సహాయం చేసినప్పుడు నీ మెదడులో సంతృప్తి స్థాయిలు పెరుగుతాయి. అయితే దానం అనేది మనస్ఫూర్తిగా చేయాలి. ఎవరో ఒత్తిడి చేస్తేనో లేక సమాజం ఏమనుకుంటుందో అనే ఉద్దేశ్యంతో మాత్రం కాదు.
నీవు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు వారి మొహంలో వచ్చే ఆ సంతోషాన్ని చూస్తే నీకు నీ జీవితం మీద ఒక అభిప్రాయం వస్తుంది. మనుషులతో సంబంధం కలిగి ఉండడం వలన వచ్చే ఆనందం ఒక రోలెక్స్ గడియారం ఇవ్వలేదు. డబ్బు అనేది ఒక వస్తువు మాత్రమే. దానిని నీవు ఎలా వాడుతున్నావ్ అనేది ముఖ్యం. అది నిన్ను బానిసను చేయొచ్చు లేదా నిన్ను రాజును కూడా చేయొచ్చు. నీవు నీ కోరికల్ని నియంత్రణలో పెట్టుకొని కాలాన్ని గౌరవిస్తూ, అనుభవాలకి ప్రాధాన్యత ఇస్తే డబ్బు నీ వెనకాలే వస్తుంది. సంతోషం కూడా నీతోనే ఉంటుంది. అంతేకానీ డబ్బుంటేనే అంతా అవుతుంది అనుకొని రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి ఆరోగ్యం పాడు చేసుకుని చివరికి దవాఖానలో మంచం మీద చావు బ్రతుకుల్లో ఉంటే లాభం ఏంటి? అందుకే బ్రతికినన్ని రోజులు జీవితంపై ఒక స్పష్టతతో బ్రతకాలి. డబ్బును ప్రేమించు, డబ్బును వాడుకో, జీవితాన్ని ప్రేమించు, జీవితాన్ని అనుభవించు.










