
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన భేటీకి ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొనడానికి మోదీ చైనాలో పర్యటించినప్పుడు, చైనా మీడియా ఆయన పర్యటనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలను విధించిన నేపథ్యంలో, ఈ సమావేశం భౌగోళిక రాజకీయాల్లో కీలక మార్పులకు కారణం కానుంది. గాల్వాన్‌లో జరిగిన ఉద్రిక్తతల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. చైనా మీడియా మోదీని ప్రశంసిస్తూ, ట్రంప్ నుంచి వచ్చిన ఫోన్ కాల్‌ను మోదీ మూడుసార్లు నిరాకరించడం ఆయన ధైర్యానికి నిదర్శనమని పేర్కొంది.
మోదీ చైనా పర్యటనకు చైనా మీడియా కూడా సానుకూలంగా స్పందించింది. భారత్, చైనాలు కలిసి పనిచేస్తే ప్రపంచంలో ఏ శక్తినైనా ఎదుర్కోగలవని పేర్కొంది. అమెరికా, భారత్‌ను దూరం చేసుకోవడం ద్వారా తప్పు చేసిందని, దీనికి త్వరలోనే పశ్చాత్తాపం చెందుతుందని చైనా డైలీ వ్యాఖ్యానించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకురావడానికి భారత్, చైనాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు.
అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష విధానాల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇబ్బందులు పడుతున్నందున, భారత్, చైనాల వంటి దేశాలు ఆర్థికంగా భరోసా ఇవ్వాలని మీడియా అభిప్రాయపడింది. టియాంజిన్‌లో జరుగుతున్న ఈ SCO సమావేశాలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరయ్యారు. ఈ సదస్సు అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు, సభ్య దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
బ్రిక్స్ సమావేశాలలో భారతదేశం పాల్గొనడం పట్ల అమెరికా అసంతృప్తిని వ్యక్తం చేసింది. అదేవిధంగా, SCO కూటమిలో సభ్యత్వం పొందడంపై కూడా అమెరికా గతంలో వ్యతిరేకత చూపింది. అయితే, అమెరికా మన దేశానికి ప్రత్యేకంగా ఏ విధమైన సహాయం అందించడం లేదని, వాణిజ్య సంబంధాలలో కూడా ఎటువంటి ప్రత్యేకత చూపడం లేదని భారత్ భావిస్తోంది. అందుకే, అన్ని దేశాలతో సంబంధాలను పెంచుకుంటూ భారతదేశం స్వతంత్ర మార్గాన్ని అనుసరిస్తోంది.
షాంఘై సదస్సులో భారతదేశం పాల్గొనడం కూడా ఈ ఉద్దేశంతోనే. ఈ కూటమిలో సభ్యత్వం పొందడం ద్వారా, ప్రపంచ వేదికపై తన ప్రాధాన్యతను నిలబెట్టుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఏది ఏకమైనప్పటికీ భవిష్యత్‌లో ఈ రెండు దేశాలు తీసుకునే నిర్ణయాలు వల్ల ప్రపంచ గమనాన్ని ప్రభావితం మార్చే తీరు కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.










