ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఎప్పుడు, ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేరు, అప్పటికప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు సర్దుబాటు చేయడం మధ్యతరగతి కుటుంబాలకు అంత సులభం కాదు. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, హఠాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మతుల వంటి అత్యవసరాల కోసం చాలా మంది బ్యాంకుల నుండి వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్స్) తీసుకుంటారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ఎలాంటి ఆస్తుల పూచీకత్తు, సెక్యూరిటీ గ్యారెంటీ లేకుండానే ఈ లోన్లు సులభంగా లభిస్తాయి. కానీ, ఈ రుణాలు చాలా ఎక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి.
పర్సనల్ లోన్ Vs టాప్-అప్ లోన్: తేడా ఏంటి?
తీసుకున్న మొదటి వ్యక్తిగత రుణం ఇంకా పూర్తిగా చెల్లించక ముందే, కొన్ని నెలల వ్యవధిలోనే మళ్లీ అదనంగా డబ్బు అవసరమైతే ఏం చేయాలి? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. అప్పుడు మన ముందు రెండు ప్రధాన మార్గాలు కనిపిస్తాయి. ఒకటి, మరొక కొత్త వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం, రెండోది, ప్రస్తుతం ఉన్న లోన్‌పైనే అదనంగా ‘టాప్-అప్ లోన్’ తీసుకోవడం. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే తక్కువ వడ్డీ భారం పడుతుంది, ఏది మన జేబుకు రక్షణగా నిలుస్తుందో తెలుసుకోవడం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
టాప్-అప్ లోన్ ఎలా పనిచేస్తుంది?
టాప్-అప్ లోన్ అంటే ప్రస్తుతం మీరు కడుతున్న వ్యక్తిగత రుణంపై పొందే అదనపు అప్పు అని చెప్పుకోవచ్చు. పాత లోన్ ఈఎంఐలను క్రమం తప్పకుండా, ఎలాంటి ఆలస్యం లేకుండా కడుతున్న నమ్మకమైన కస్టమర్లకు బ్యాంకులు, ప్రభుత్వేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఈ అదనపు రుణ సౌకర్యాన్ని కల్పిస్తాయి. దీని వడ్డీ రేట్లు సాధారణంగా పాత లోన్ వడ్డీ రేట్లతో సమానంగా ఉంటాయి, కొన్నిసార్లు కొత్త లోన్ల కంటే తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. రుణగ్రహీతలు తాము లోన్ తీసుకున్న పాత బ్యాంకులోనే దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఒకవేళ అక్కడ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే తమ లోన్ బ్యాలెన్స్‌ను తక్కువ వడ్డీ ఉన్న మరొక బ్యాంకుకు బదిలీ చేసి అక్కడ ఈ అదనపు టాప్-అప్ లోన్ పొందవచ్చు.
ఒకటి కంటే ఎక్కువ పర్సనల్ లోన్లు తీసుకుంటే వేర్వేరు తేదీల్లో ఈఎంఐలు కట్టడం, వివిధ బ్యాంకుల చుట్టూ తిరగడం, వాటిని గుర్తుంచుకోవడం మానసికంగా పెద్ద భారంగా మారుతుంది. దీనికి భిన్నంగా టాప్-అప్ లోన్ తీసుకుంటే పాత లోన్, కొత్త అదనపు లోన్ రెండూ కలిసి ఒకే ఈఎంఐగా మారిపోతాయి, దీనివల్ల రుణ నిర్వహణ చాలా సులభం అవుతుంది. సాధారణంగా కొత్త లోన్ తీసుకునేటప్పుడు కట్టాల్సిన ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఖర్చులు టాప్-అప్ లోన్ విషయంలో చాలా తక్కువగా ఉంటాయి, కొన్నిసార్లు అసలు ఏమీ ఉండవు.
పర్సనల్ లోన్, టాప్-అప్ లోన్‌లో ఏది బెటర్?
ఈ రెండింటిలో ఏది బెటర్ అనే ప్రశ్న వచ్చినప్పుడు మీ తక్షణ అవసరం, కావలసిన లోన్ మొత్తం ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోవాలి. మీ క్రెడిట్ ప్రొఫైల్ దెబ్బతినకుండా ఉండాలన్నా, భవిష్యత్తులో హోమ్ లోన్ వంటి పెద్ద రుణాలు పొందాలన్నా ఒకేసారి ఎక్కువ లోన్లు యాక్టివ్‌గా ఉంచకపోవడం మంచిది. మీకు అత్యవసరంగా తక్కువ మొత్తం కావాల్సి వస్తే టాప్-అప్ లోన్ తీసుకోవడమే అత్యంత తెలివైన నిర్ణయం. దీనికి కాగితపు పని చాలా తక్కువగా ఉంటుంది, కేవలం కొన్ని గంటల్లోనే డబ్బు మీ చేతికి వస్తుంది, అదనపు భారాలు కూడా పడవు. పాత లోన్ కాలపరిమితిలోనే దీనిని కూడా సులభంగా చెల్లించే వీలుంటుంది.
ఎక్కువ మొత్తం కావాలంటే కొత్త పర్సనల్ లోన్ బెటరా?
అయితే, మీకు కావలసిన డబ్బు చాలా ఎక్కువగా ఉండి, ఎక్కువ సంవత్సరాల కాలపరిమితితో తిరిగి చెల్లించాలనుకుంటే కొత్త వ్యక్తిగత రుణం తీసుకోవడం మంచిది. కొత్త లోన్ తీసుకునే ముందు బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, తిరిగి చెల్లించే కాలపరిమితి, ముందస్తు చెల్లింపుల (ప్రీపేమెంట్) నిబంధనలను ఒకదానితో ఒకటి క్షుణ్ణంగా పోల్చి చూసుకోవాలి. మీ క్రెడిట్ హిస్టరీ, నెలవారీ ఆదాయం, ఈఎంఐలు కట్టే సామర్థ్యాన్ని బట్టి మీకు తక్కువ భారం కలిగించే మార్గాన్ని ఎంచుకోవడమే ఉత్తమమైన ఆర్థిక సూత్రం, దీనివల్ల అప్పుల ఊబిలో పడకుండా ప్రశాంతంగా ఉండవచ్చు.
ఇతర కథనాలు:
మీరుఇన్‌స్టంట్ లోన్ తీసుకోవాలనకుంటే ఈ విషయాలు తప్పక చూడండి
సీనియర్స్ ఈ రుణాలను తీసుకోవచ్చు..!
క్రెడిట్ స్కోర్ 800+ సాధించేవారు చాలా తక్కువ..!










