NRI News

హెచ్‌-1బీ వీసా గడువు పొడిగింపుపై అదనపు ఫీజు?

హెచ్‌-1బీ వీసా గడువు పొడిగింపు ఫీజుపై అమెరికా ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తోంది.అమెరికాలో ఉద్యోగం చేయడానికి విదేశీయులకు హెచ్‌-1బీ, ఎల్‌-1 వంటి వీసాలు అవసరం. ఈ వీసాలతో భారతదేశానికి చెందిన వేలాది మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇతర రంగాల నిపుణులు అమెరికాలో పనిచేస్తున్నారు.

హెచ్‌-1బీ వీసా పొడిగింపుపై కొత్త ప్రతిపాదన

వీసాకు కొంతకాలం మాత్రమే గడువు ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉద్యోగం చేయాలంటే దాన్ని మళ్లీ పొడిగించుకోవాలి. ఇప్పటివరకు కొత్తగా వీసా తీసుకునే సమయంలో కంపెనీలు అదనపు ఫీజు చెల్లిస్తున్నాయి. ఇప్పుడు వీసా గడువు పొడిగించుకునే సమయంలోనూ అదనపు ఫీజు వసూలు చేయాలని అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

కంపెనీలపై పెరగనున్న ఆర్థిక భారం

ప్రస్తుతం ఒక విదేశీ ఉద్యోగి కొత్త కంపెనీలో చేరినప్పుడు లేదా కంపెనీ అతని కోసం కొత్తగా వీసా దరఖాస్తు చేసినప్పుడు ఈ ఫీజు వర్తిస్తోంది. కొత్త పద్ధతి అమల్లోకి వస్తే ఉద్యోగి అదే కంపెనీలో కొనసాగుతున్నా, అతని వీసా గడువు పెంచేందుకు కంపెనీ అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు ఒక్కో ఉద్యోగి కోసం కనీసం 4,000 డాలర్ల వరకు చెల్లిస్తున్నాయి. ఈ ఫీజు మరింత పెరిగితే విదేశీ ఉద్యోగులను కొనసాగించడం కంపెనీలకు ఖరీదైన వ్యవహారంగా మారుతుంది.

భారతీయ ఐటీ ఉద్యోగులపై ప్రభావం ఉంటుందా?

ఈ నిర్ణయం వల్ల భారతీయ ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువ. కంపెనీలపై ఖర్చు పెరిగితే కొందరిని ఉద్యోగాల్లో కొనసాగించకపోవచ్చు లేదా కొత్తగా విదేశీయులను తీసుకోవడం తగ్గించవచ్చు. మరోవైపు ఈ అదనపు ఫీజుల ద్వారా ప్రతి సంవత్సరం 15 కోట్ల డాలర్లకుపైగా ఆదాయం వస్తుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదన ఇంకా తుది నిర్ణయంగా మారలేదు. అమల్లోకి వస్తేనే ఉద్యోగులు, కంపెనీలపై ఎంత ప్రభావం పడుతుందో స్పష్టమవుతుంది.

Show More
Back to top button