అసభ్యత ఆరోపణలతో జీవితాన్ని పోగొట్టుకున్న రచయిత.. ఆస్కార్ వైల్డ్..
వ్యంగ్యం మరియు పదునైన హాస్యానికి ప్రసిద్ధి చెందిన ఒక ప్రముఖ నాటక రచయిత, కవి మరియు నవలా రచయిత ఆస్కార్ వైల్డ్. రచనలోనూ, వస్త్రధారణలోనూ ఆయన తన రంగులమయమైన, ఆడంబరమైన శైలికి సుప్రసిద్ధుడు, మరియు విలక్షణమైన వ్యక్తి. “నువ్వు నువ్వుగానే జీవించు, ఎందుకంటే మిగతా పాత్రలన్నీ వేరేవాళ్లు తీసేసుకున్నారు. జీవించడం అనేది ప్రపంచంలో చాలా అరుదుగా జరిగే విషయం, చాలా మంది వాళ్ళ ఉనికిని కాపాడుకుంటారు అంతే” అంటాడు ఆస్కార్ వైల్డ్. 19వ శతాబ్దపు అత్యంత ప్రజాదరణ పొందిన, వివాదాస్పద సాహిత్యవేత్తలలో ఒకరైన ఆస్కార్ వైల్డ్ తన వివాదాస్పదమైన, నాటకీయమైన మరియు అసాధారణమైన వ్యక్తి. తన వ్యక్తిగత జీవితానికి, రెచ్చగొట్టి, వినోదాన్ని పంచిన తన విలక్షణమైన, సృజనాత్మకమైన, మేధోపరమైన సాహిత్య రచనలకు గాను తాను చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన ఒక సుప్రసిద్ధ వ్యక్తి. “మనందరం మురికి కూపంలోనే ఉన్నాం, మనలో కొందరు మాత్రమే ఆకాశంలో నక్షత్రాలకేసి చూస్తాం. నిజమైన మిత్రుడు ముందునుండే పొడుస్తాడు, వెనుకనుండి కాదు. శత్రువులను క్షమించు అంతకంటే పెద్ద శిక్ష లేదు. నిరాశావాది ఎవరంటే అన్నింటి ఖరీదు తెలిసినవాడు, కానీ దేని విలువ తెలియనివాడు” అని చెబుతాడు ఆస్కార్ వైల్డ్. “ప్రలోభం తప్ప మిగతా అన్నింటినీ నేను ఎదిరించగలను” అంటాడు తాను.
తన రచనా ప్రస్థానంలో రోజురోజుకు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితం మగ వ్యభిచారులతో వివాహేతర సంబంధాలు మరియు కుంభకోణాల సతమతమవుతూ వచ్చింది. లార్డ్ ఆల్ఫ్రెడ్ డగ్లస్‌కు, రాబర్ట్ రాస్‌ను కలుసుకున్న ఆస్కార్ వైల్డ్ వారితో స్వలింగ సంపర్కం పెట్టుకుని లండన్ లోని చీకటి కోణంలో బాలురతో వ్యభిచారం చేయడం చేసి జైలుపాలయ్యారు. అవమానం భరించలేక భార్య పిల్లలు ఇంటి పేరును మార్చేసుకున్నారు. మనిషి తాను చేసిన పొరపాట్లకు పెట్టుకునే అందమైన పేరే అనుభవం అని చెప్పే ఆస్కార్ వైల్డ్, తాను చేసిన స్వలింగ సంపర్కం అనే తప్పుకు జైలు గోడల మధ్య మగ్గిపోయి, తన కన్న తల్లి మరణిస్తే కడచూపుకోసం నోచుకోకపోవడం తన దౌర్భాగ్యానికి, దురదృష్టానికి పరాకాష్టగా నిలిచిపోయింది. ప్రపంచం నాకు చేసినది ఎంత భయంకరమైనదైనా, నేను నాకు చేసుకున్నది అంతకంటే ఎంతో భయంకరమైనది, ఇప్పుడు నాకు ఉన్నదల్లా ఒక్కటే, సంపూర్ణ వినయం అని అన్నారు ఆస్కార్ వైల్డ్. “ఘోరమైన అసభ్యత” ఆరోపణలపై తనకు జరిగిన అపఖ్యాతి వలన వివాదంపాలై ఆస్కార్ వైల్డ్ యొక్క సాహిత్య ప్రతిభ కళంకితమైంది. అందుకు ఫలితంగా తాను రెండు సంవత్సరాలు జైలు జీవితం తరువాత ఫ్రాన్స్ లోని పారిస్ లో ఒక మురికి కూపం లాంటి హోటల్ లో నివసిస్తూ మెదడు వాపు వ్యాధి కారణంగా నవంబర్ 1900 వ సంవత్సరంలో తాను మరణించారు.
నేపథ్యం.
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లోని 21 వెస్ట్‌ల్యాండ్ రోలో (ప్రస్తుతం ట్రినిటీ కాలేజీలోని ఆస్కార్ వైల్డ్ సెంటర్ ఉన్న ప్రదేశం) 16 అక్టోబర్ 1854 నాడు ఆస్కార్ వైల్డ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డబ్లిన్‌లోని ఆంగ్లో – ఐరిష్ మేధావులు అయిన సర్ విలియం వైల్డ్, జేన్ లేడీ వైల్డ్. ఆ రోజుల్లో ఐర్లాండ్ లోని ఐరిష్ ప్రజలందరూ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ ఉండేవారు. తండ్రి సర్ విలియం వైల్డ్ బాగా డబ్బుండి పేరు మోసిన చెవి, ముక్కు, కంటి డాక్టరు. ఆయన తల్లి విద్యావంతురాలు. ఆ రోజుల్లో ఆమె ఐరష్ ప్రజల స్వాతంత్ర్య పోరాటాన్ని సమర్థిస్తూ కొన్ని పాటలు కూడా వ్రాస్తూ ఉండేది. ఆస్కార్ వైల్డ్ తన సోదరుడు విలియం (విల్లీ) వైల్డ్ కంటే రెండు సంవత్సరాలు చిన్నవాడు. చిన్నప్పుడు తల్లి వారికి స్వతంత్ర్య సమర పోరాట పాటలు వినిపిస్తూ ఉండేది. తండ్రి యొక్క ప్రశస్తి మరియు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపును ఇస్తూ ఆయనను సహాయ అధికారి (అసిస్టెంట్ కమిషనర్) గా నియమించింది. ఆయన పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తూ ఉండేవారు. ఒక వైపు వైద్యం చేస్తూనే మరోవైపు జానపద గేయాలు, పాటలు కూడా వ్రాసేవారు. ఆస్కార్ వైల్డ్ తండ్రి సర్ విలియం వైల్డ్ ఇతర మహిళతో వివాహేతర సంబంధం కలిగి ముగ్గురు సంతానం కూడా ఉన్నారు, వాళ్ల బాగోగులు కూడా ఆయన చూశారు. సర్ విలియం వైల్డ్ సమాజంలో మంచి పేరున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళింటికి మేధావులు, సాహితీవేత్తలు, కవులు వస్తుండేవారు. ఆ వాతావరణంలో ఆస్కార్ వైల్డ్ పెరిగారు కాబట్టి సాహిత్యం తనకు వంటబట్టింది అని చెప్పవచ్చు. ఆస్కార్ వైల్డ్ జన్మించిన మూడు సంవత్సరాలకు ఆయన తల్లిదండ్రులకు అమ్మాయి జన్మించింది, కానీ ఆమె తొమ్మిది సంవత్సరాల వయస్సుకే మెదడు వాపు వ్యాధితో మరణించింది.
డిగ్రీ లోనే ప్రపంచ సాహిత్యంతో పరిచయం.
ఆస్కార్ వైల్డ్ వయస్సు తొమ్మిదేళ్లు వచ్చేసరికి అమ్మ నాన్న తనకు ఇంట్లోనే చదువు చెప్పించాలని ఉపాధ్యాయులను ఇంటికి రప్పించి ఇంట్లోనే తనకు చదువు చెప్పించారు. అక్కడ ఒక ఫ్రెంచ్ నర్సు మరియు ఒక జర్మన్ గవర్నెస్ అతనికి వారి భాషలను నేర్పించారు. ఆ తరువాత అతను కౌంటీ ఫెర్మానాగ్‌లోని ఎన్నిస్కిల్లెన్‌లోని పోర్టోరా రాయల్ స్కూల్‌లో తన సోదరుడు విల్లీతో కలిసి 1864 నుండి 1871 వరకు చదువుకున్నారు. తాను చెప్పే హాస్యభరితమైన మరియు సృజనాత్మకమైన పాఠశాల కథలతో తన తోటి విద్యార్థులను ఆకట్టుకునేవారు ఆస్కార్ వైల్డ్. ఆ తరువాత జీవితంలో, వేగంగా చదవగల తన సామర్థ్యం వలన తన తోటి విద్యార్థులు తనను ఒక బాలమేధావిగా భావించేవారు. మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని మంచి బహుమతులు కూడా పొందేవారు. ఆ పాఠశాలలో ఉన్నత పాఠశాల చదువు పూర్తిచేశారు. ఆ పాఠశాలలో ఉండగానే తనకు వివిధ సాహిత్యాలతో పరిచయం ఏర్పడింది. పోర్టల్ పాఠశాలలో చదువు పూర్తయిన తరువాత తనకు డబ్లిన్ లోనే తన ఇంటికి దగ్గరలో ఉన్న ట్రినిటీ కళాశాలలో ప్రవేశం లభించింది. డిగ్రీ కోసం ఆ కళాశాలలో చేరిన తాను 1871 నుండి 1874 వరకు చదువుకుని డిగ్రీ పూర్తి చేశారు. అక్కడ చదువుకున్నప్పుడే ఆయనకు ప్రపంచ సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. డిగ్రీ చదువుతున్నప్పుడే ఈస్తటిజం (సౌందర్యం) గురించి తెలుసుకోవడం జరిగింది. కొంతమంది అధ్యాపకులకు ఆయన నచ్చేవారు మరికొందరు అధ్యాపకులకు ఆయన నచ్చేవారు కాదు. నచ్చేవాళ్లకు కవిత్వం ద్వారా నచ్చేవారు, క్లాస్ పుస్తకాలు సరిగ్గా చదవడం లేదు కనుక నచ్చని వాళ్ళు ఇష్టపడేవారు కాదు.
ఆక్స్‌ఫర్డ్ లో మాస్టర్ డిగ్రీ.
అత్యంత గుర్తింపుతో డిగ్రీ పూర్తిచేసిన ఆస్కార్ వైల్డ్ 1874 వ సంవత్సరంలో తన 20 సంవత్సరాల వయస్సులో లండన్ వెళ్లి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ కోసం చేరారు. అక్కడ తన గదికి వెళితే అద్భుతమైన అలంకరణలతో తన గది ఉండేది. తన గదులను నెమలి ఈకలు, కలువలు, పొద్దుతిరుగుడు పువ్వులు , నీలిరంగు పింగాణీ మరియు ఇతర కళాఖండాలతో అలంకరించేవారు. మనం చూసే ప్రతీ వస్తువులో కూడా అందాన్నే చూడగలిగితే జీవితం కూడా ఆనందంగా ఉంటుందని తాను ఎప్పుడు చెబుతూ ఉండేవారు. తాను ఎప్పుడూ మొదటి తరగతిలో పాస్ అవుతుండేవారు, తనకు ఎప్పుడూ కూడా బహుమతులు వస్తూవుండేవి. 1874 నుండి 1878 వరకు నాలుగు సంవత్సరాలు ఆక్స్‌ఫర్డ్ లో చదువు పూర్తిచేశారు. లండనులో చదువుకునే రోజులలో తనకు ఒక అమ్మాయి పరిచయమైంది. ఆమె పేరు ఫ్లోరెన్స్ బాల్‌కోంబ్. ఆ అమ్మాయి తనకు జూనియర్.
ఫ్లోరెన్స్ బాల్‌కోంబ్ తో ప్రేమలో పడిన ఆస్కార్ వైల్డ్ ఆమెను వివాహం కూడా చేసుకుందామని అనుకున్నారు. అయితే 1878వ సంవత్సరంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఆమె బ్రామ్ స్టోకర్‌తో నిశ్చితార్థం చేసుకుంది. అదే సంవత్సరం ఆమె బ్రామ్ స్టోకర్ ను వివాహం కూడా చేసుకున్నారు. అతను కూడా ఆస్కార్ వైల్డ్ తో పాటు ఒకే కళాశాలలో చదువుకున్నారు. ఐరిష్ రచయిత, బారిస్టర్ , సాహిత్య విమర్శకుడు మరియు థియేటర్ మేనేజర్ అయిన బ్రామ్ స్టోకర్ తరువాత రోజులలో గోతిక్ హారర్ నవల “డ్రాక్యులా” (1897) రచించారు. అందులో కౌంట్ డ్రాక్యులా అనే కల్పిత పాత్ర సృష్టించారు కూడా. అయితే ఆస్కార్ వైల్డ్ ప్రేమించిన ఫ్లోరెన్స్ బాల్‌కోంబ్ వేరే పెళ్లి చేసుకోవడంతో ఆయన మనస్సు విరిగిపోయి, మనస్తాపానికి గురై, విషయం అమ్మానాన్నలకు చెప్పి తమ దేశం రానని తిరిగి లండను వెళ్ళిపోయారు. వాళ్లకు చెప్పినట్లుగానే తరువాత రోజులలో అంటే తన 24 సంవత్సరాల వయస్సు నుండి తాను మరణించేవరకు డబ్లిన్ నగరానికి కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చారు ఆస్కార్ వైల్డ్.
ఎస్థెటిసిజం గురించి న్యూయార్క్ లో ప్రసంగాలు.
ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగలేదని సొంత ఊరు వదిలి డబ్లిన్ వదిలి లండను వెళ్లిన ఆస్కార్ వైల్డ్ అక్కడినుండే తన కార్యకలాపాలు కొనసాగించారు. లండను వచ్చిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు, కానీ ఆయనకు ఉద్యోగం దొరకలేదు. ఆయనకు ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఎందుకంటే డబ్లిన్ లో తమ ఇంటి వద్దనే నివాసం ఉన్న తల్లిదండ్రుల నుండి వచ్చే డబ్బులతో లండనులో ఒక వసతి గృహంలో అద్దె చెల్లించి (పేయింగ్ గెస్ట్), ఆ వసతి గృహంలో ఉంటూనే తాను కవితలు వ్రాస్తూ ఆ కవితలకు సంబంధించిన సమావేశాలకు వెళుతూ ఉండేవారు. 1881 లో తన 27 సంవత్సరాల వయస్సులో తాను వ్రాసిన కవితలన్నీ కలిపి ఒక పుస్తకంగా తయారు చేశారు. డబ్లిన్ లోని కళాశాలలో ఆయన చదివిన రోజులలో కూడా కవితలు వ్రాసేవారు. అయితే ఆయన తయారుచేసిన కవితల పుస్తకం ముద్రించిన కొద్దిరోజుల్లోనే 750 కాపీలు అమ్ముడుపోయింది.
తన పుస్తకం వెనువెంటనే పునః ముద్రణకు కూడా వచ్చేసింది. ఆయన సౌందర్యవాదం (ఎస్థెటిసిజం) గురించి ఎక్కువగా ఉపన్యాసాలు ఇస్తూ ఉండటం వలన ఆయనకు అమెరికా నుండి ఆహ్వానం వచ్చింది. అమెరికాలో అందరూ సౌందర్యవాదాన్ని (ఎస్థెటిసిజం) ఎగతాళి చేస్తూ వస్తుండడంతో అక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇవ్వాల్సిందిగా ఆస్కార్ వైల్డ్ ను కోరారు. దాంతో 02 జనవరి 1882 వ సంవత్సరంలో సముద్రంలో ఓడల ద్వారా ప్రయాణం చేసి అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉపన్యాసం ఇస్తూవచ్చారు. అమెరికా నుండి తిరిగి లండను వెళ్లాక ఆయన ఒక నాటకం వ్రాశారు. అయితే ఈయన వ్రాసిన “వీర్” అనే నాటకాని లండనులో ఎవ్వరూ కూడా ప్రదర్శించలేదు. అయితే అమెరికాలోని న్యూయార్కులో ఈ నాటకాన్ని వారం రోజులు ప్రదర్శించారు. ఆ తరువాత ఆనాటక ప్రదర్శనపై విమర్శకుల విమర్శలు ఎక్కువయ్యాయి. దాంతో ఆ నాటక ప్రదర్శన ఆగిపోవడంతో ఆస్కార్ వైల్డ్ న్యూయార్క్ నుండి తిరిగి లండన్ వెళ్లిపోయారు.
“కాన్‌స్టాన్స్ లాయిడ్” తో వివాహం.
ఆస్కార్ వైల్డ్ వ్రాసిన తొలి నాటకం ఘోర పరాజయంపాలైంది. తొలిప్రేమ విఫలం కావడంతో చాలా సంవత్సరాల తరువాత 1881లో లండనులో, ధనవంతుడైన క్వీన్స్ కౌన్సెల్ (న్యాయవాది) హోరేస్ లాయిడ్ కుమార్తె అయిన “కాన్‌స్టాన్స్ లాయిడ్” తో అతనికి పరిచయం ఏర్పడింది. ఆస్కార్ వైల్డ్ 1884 వ సంవత్సరంలో గెయిటీ థియేటర్‌లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు దగ్గరుండి ఆ ప్రసంగాలను విని అతనిపట్ల ఆమె ఆకర్షణకు గురైంది. సమయం చూసి “కాన్‌స్టాన్స్ లాయిడ్” వద్ద తన ప్రేమ ప్రతిపాదనను తెలియజేశారు. దానికి ఆమె కూడా సమ్మతంగానే ఉండడంతో వారిరువురు 29 మే 1884 నాడు లండను నగరంలో పాడింగ్‌టన్‌లోని ఆంగ్లికన్ సెయింట్ జేమ్స్ చర్చిలో వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆమెకు 25 సంవత్సరాలు. కాన్‌స్టాన్స్ లాయిడ్ కు సంవత్సరానికి 31,973 భత్యం ఉండేది. అంటే ఇప్పటి విలువ 34,40,00 రూపాయలు. దాంతో ఆస్కార్ వైల్డ్ దంపతులు సాపేక్షంగా విలాసవంతమైన జీవనం సాగించారు. వివాహం అనంతరం ఆస్కార్ వైల్డ్ దంపతులకు సిరిల్ (1885) మరియు వివియన్ (1886) అనే ఇద్దరు కుమారులు జన్మించారు.
“ది లేడీస్ వరల్డ్” పత్రికకు సంపాదకుడిగా.
1886 వ సంవత్సరంలో ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నప్పుడు, ఆస్కార్ వైల్డ్ ను రాబర్ట్ రాస్ అనే వ్యక్తి కలిశాడు. 1886లో కెనడా నుండి వచ్చిన అతను కవిత్వం వ్రాసేవాడు. అతడు పదిహేడేళ్లకే అసాధారణ ప్రతిభ కనబరిచేవాడు. రాబర్ట్ రాస్ రాకతో ఆస్కార్ వైల్డ్ జీవితం చీకటి జీవితం వైపు మళ్ళిపోయింది. స్థిరమైన ఆదాయం కోసం కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఉండటంతో 1887 వ సంవత్సరంలో “ది లేడీస్ వరల్డ్” పత్రికకు సంపాదకుడయ్యారు. దానికి “ది వుమన్స్ వరల్డ్” అని పేరు మార్చి దాని స్థాయిని పెంచారు. ఫ్యాషన్ మరియు కళల గురించిన చర్చలను కొనసాగిస్తూనే, పిల్లల పెంపకం, సంస్కృతి మరియు రాజకీయాలపై గంభీరమైన వ్యాసాలను వ్రాసేవారు వైల్డ్. పిల్లలకు చదివి వినిపించడానికి, పెద్దల కోసం రెండు కాల్పనిక కథలు ప్రచురింపబడేవి. సమయంలో అతని స్వంత “లిటరరీ అండ్ అదర్ నోట్స్” కూడా ప్రజాదరణ పొంది, వినోదాత్మకంగా ఉండేవి. రెండు సంవత్సరాల తరువాత ఆస్కార్ వైల్డ్ ఆ పత్రికలో ఉద్యోగం మానేశారు. 1890 వ సంవత్సరంలో ఆస్కార్ వైల్డ్ వ్రాసిన “ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే” అనే నవల “లిప్పిన్‌కాట్స్ మంత్లీ మ్యాగజైన్” పత్రికలో సీరియల్ గా వచ్చింది. అది విమర్శకులకు విపరీతంగా నచ్చింది.
“లేడీ విండర్‌మేర్స్ ఫ్యాన్” తో విపరీతమైన ప్రజాదరణ.
ఆ తరువాత నాటకాల వైపు మళ్లిన ఆయన ఫ్రెంచ్ భాషలో “సలోమీ” అనే ఏకాంక విషాదాంత నాటకాన్ని వ్రాశారు. దానిని లండనులో ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఆ నాటకం ద్వారా బైబిలులో కొన్ని పాత్రలను అవహేళన చేశారని వారు ఒప్పుకోలేదు. కానీ ఆయన అవసాన దశలో ఆ నాటకాన్ని ఫ్రాన్స్ లో ప్రదర్శించడమైంది. 1892 వ సంవత్సరంలో ఆయన వ్రాసిన నాటకం “లేడీ విండర్‌మేర్స్ ఫ్యాన్” కిక్కిరిసిన ప్రేక్షకులతో ప్రదర్శించబడింది. అప్పటినుండి ఆయన మూడు సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాలుగు నాటకాలను ఆయన వ్రాశారు. ఆ నాలుగు నాటకాలు కూడా ఒకదానిమించి మరొకటి ప్రజాదరణ పొందింది. ఆ నాటకాలతో తాను ఎంత ప్రసిద్ధి పొందారంటే ఆయనతో మాట్లాడితే చాలు, తనతో భోజనం చేస్తే చాలు అని అభిమానులు ఊహించేంతగా ఆదరణ పెరిగిపోయింది. ఇన్ని సంవత్సరాలలో తనకు ఇద్దరు కుమారులు పుట్టినప్పటి నుండి అద్భుతమైన పేరు తెచ్చుకున్న ఆస్కార్ వైల్డ్ లోపల 1895 వరకు మరొక కోణం ఉన్నదని, మరొక మనిషి ఉన్నారనే విషయం చాలామందికి తెలియదు. అప్పటివరకు ఆయనలో ఒక చీకటి కోణం ఉన్నదని, ఒక చీకటి తెర దాగుందని బయట ప్రపంచానికి తెలియదు.
స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డ ఆస్కార్ వైల్డ్.
ఆస్కార్ వైల్డ్ 1886 వ సంవత్సరంలో ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నప్పుడు, రాబర్ట్ రాస్ తో పరిచయం ఉంది. తాను ఆస్కార్ వైల్డ్ ను స్వలింగ సంపర్కానికి అలవాటు చేశారు. ఆ అలవాటు అలాగే 1891 వరకు కొనసాగింది. 1891 మధ్యలో, లయొనెల్ జాన్సన్ అనే వ్యక్తి తన స్నేహితుడైన లార్డ్ ఆల్ఫ్రెడ్ డగ్లస్‌కు ఆస్కార్ వైల్డ్‌ను పరిచయం చేశాడు. ఆ సమయంలో ఆక్స్‌ఫర్డ్‌లో అండర్‌గ్రాడ్యుయేట్‌గా ఉన్న ఆల్ఫ్రెడ్ డగ్లస్ మరియు ఆస్కార్ వైల్డ్ మధ్య ఒక గాఢమైన స్నేహం చిగురించింది. ఆస్కార్ వైల్డ్ 1893 నాటికి వైల్డ్ డగ్లస్‌పై మోహాన్ని పెంచుకున్నారు. వారు ఒక ఉద్వేగభరితమైన సంబంధంలో క్రమం తప్పకుండా కలిసి తిరిగేవారు. వైల్డ్ ప్రవర్తించే విధానంలో సాపేక్షంగా విచక్షణారహితంగా, కొన్నిసార్లు ఆడంబరంగా ఉంటే, డగ్లస్ బహిరంగంగా నిర్లక్ష్యంగా ఉండేవాడు. రాబర్ట్ రాస్ మరియు లార్డ్ ఆల్ఫ్రెడ్ డగ్లస్ కలిసి ఆస్కార్ వైల్డ్ ను లండన్ లో చీకటి కోణానికి తీసుకెళ్లి అక్కడ బాలురతో లైంగిక కార్యకలాపాలు జరిపించేవారు. బలహీనతలను ఆసరాగా చేసుకుని మానసికంగా, శరీరకంగా వేధించే బ్లాక్ మెయిలర్స్, మగ వ్యభిచారుల (మేల్ ప్లాస్టిట్యూటర్లు) తో ఆస్కార్ వైల్డ్ కి పరిచయం ఏర్పడింది.
నేరం ఋజువై జైలుకు వెళ్లిన ఆస్కార్ వైల్డ్.
ఒకవైపు బ్రహ్మాండమైన నాటకాలు వ్రాస్తూనే ఉండే ఆస్కార్ వైల్డ్ మరోవైపు చీకటి కోణాలు వైపు కార్యకలాపాలు కొనసాగించేవారు. లార్డ్ ఆల్ఫ్రెడ్ డగ్లస్ తండ్రి ఆల్ఫ్రెడ్ ను పలుమార్లు హెచ్చరించాడు, కానీ అతను వినలేదు. ఆస్కార్ వైల్డ్ కు కూడా చెప్పి చూశాడు, కానీ తాను కూడా వినలేదు. 18 ఫిబ్రవరి 1895 నాడు లార్డ్ ఆల్ఫ్రెడ్ డగ్లస్ తండ్రి ఒక క్లబ్ లో విసిటింగ్ కార్డుపై ఆస్కార్ వైల్డ్ ను ఉద్దేశించి అసభ్య పదజాలంతో వ్రాసి ఆ క్లబ్ లో వదిలి వెళ్ళాడు. దానిని చూసిన విపరీతమైన కోపం తెచ్చుకున్న ఆస్కార్ వైల్డ్ తోటి భాగస్వామి లార్డ్ ఆల్ఫ్రెడ్ డగ్లస్ సూచనతో డగ్లస్ తండ్రి మీద కోర్టులో కేసు వేశాడు. దాంతో వెంటనే పోలీసులు డగ్లస్ తండ్రిని అరెస్ట్ చేశారు. పలుకుబడి ఉన్న డగ్లస్ తండ్రి అపరాధ పరిశోధకులను (డిటెక్టివ్) రంగంలోకి దించాడు. వారు లండన్ లోని చీకటి ప్రదేశాలలో తిరిగి ఆస్కార్ వైల్డ్ స్వలింగ సంపర్క చరిత్రను శోధించి సాక్షులుగా మగ వ్యభిచారుల (మేల్ ప్లాస్టిట్యూటర్లు) తీసుకువచ్చారు. రెండు నెలలుగా విచారణ అనంతరం డగ్లస్ తండ్రిని వదిలేసి ఆస్కార్ వైల్డ్ చేసిన నేరం ఋజువు అయిందని తనని అరెస్టు చేశారు. విచారణ అనంతరం ఆస్కార్ వైల్డ్ ని జైలులో పెట్టారు.
ఇంటిపేరును మార్చుకున్న భార్య పిల్లలు.
ఆస్కార్ వైల్డ్ కేవలం 15 వారాల వ్యవధిలో తాను ఎక్కడైతే నీరాజనాలు అందుకున్నాడో, అక్కడే తాను జైలు పాలయ్యారు. లండను కు దగ్గరలో ఉన్న జైలులో ఉంచారు. జరిగిన అవమానాన్ని భరించలేక ఆయన భార్య పిల్లలు తమ ఇంటిపేరును మార్చేసుకున్నారు. తండ్రిని చూడడానికి పిల్లలు జైలుకు వెళ్లలేదు. తనను చీకటి కోణంలో దించిన రాబర్ట్ రాస్, చివరి రోజులలో ఆస్కార్ వైల్డ్ బాగోగులను చూసుకున్నాడు. కొన్ని నెలల తరువాత అతన్ని లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలుకు తరలించారు. అక్కడ తాను “కఠినమైన శ్రమ, కఠినమైన ఆహారం మరియు కఠినమైన పడక” అనే నియమావళిని అనుసరించారు. ఇది వైల్డ్ యొక్క సున్నితమైన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. అనారోగ్యం మరియు ఆకలితో అతను ప్రార్థన సమయంలో కుప్పకూలిపోయారు. ఆ పతనంలో అతని కుడి చెవి డ్రమ్ చిట్లింది. ఆ జైలులో మరో రెండు సంవత్సరాల పాటు ఉన్నారు.
మరణం.
తన తల్లి మరణించిన వార్త చెప్పడానికి వచ్చిన భార్య పది నిమిషాలు మాత్రమే ఉండి ఆయనకు విషయం చెప్పి వెళ్లిపోయింది. అయినా కూడా ఆస్కార్ వైల్డ్ తన తల్లిని చూడలేకపోయారు. ఆయన రచనలు చేయడానికి పెన్ను పేపర్ ఇచ్చారు, కానీ జైలు నుండి విడుదలైన తరువాత మాత్రమే ఆ రచనలు బయటకు తీసుకెళ్లాలని ఆంక్షలు విధించేవారు. జైలు నుంచి వచ్చిన తరువాత శరీరం బాగా చిక్కిపోయింది. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత అక్కడి నుండి ఫ్రాన్స్ వెళ్లి పేరు మార్చుకుని ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్లి జీవించారు. ఆ సమయంలో ఆస్కార్ వైల్డ్ తో రాబర్ట్ రాస్ కలిసి ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళ హెచ్చరికతో లార్డ్ ఆల్ఫ్రెడ్ డగ్లస్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆస్కార్ వైల్డ్ డబ్బులకు ఇబ్బంది పడిన చివరి రోజులలో ఫ్రాన్స్ లోని పారిస్ దగ్గర ఒక హోటల్లో ఉన్నారు. ఎవరైనా చూస్తారని ఆయన ముసుగు కప్పుకుని తిరిగేవారు. తెలిసిన వాళ్ళు కలిస్తే డబ్బులు అడుక్కొని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయేవారు. అంత అవమానకర, అమానుష పరిస్థితుల్లో బ్రతికిన ఆస్కార్ వైల్డ్ 12 అక్టోబరు 1900 వ సంవత్సరంలో మెదడు వాపు వ్యాధి వచ్చింది. చివరికి 03 నవంబరు 1900 నాడు మురికి కూపం లాంటి హోటల్ లో కన్నుమూశారు.










