డబ్బుకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. వస్తుమార్పిడి పద్ధతి ద్వారా ప్రాచీన కాలం నుండి బంగారం, వెండి వంటి భౌతిక విలువ ఉన్న వస్తువులు క్రయ విక్రయములు జరుగుతున్న దగ్గరనుండి ఇప్పటి డిజిటల్ కరెన్సీ వరకు డబ్బుకు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఏ వస్తువు కొనాలన్నా అంతా డబ్బుతోనే ముడిపడి ఉన్నదనేది నమ్మదగిన సత్యం. ఒక వస్తువు ఖరీదైనదైతే ప్రజలు దానిని జాగ్రత్తగా చూస్తారు, అదే వస్తువు చవకైనదైతే ప్రజలు దానిని నిర్లక్ష్యం చేస్తారు.
మనిషికి డబ్బే ప్రపంచమా? డబ్బు లేకపోతే బ్రతకలేమా?
ఇదే సూత్రాన్ని మనుషులకు కూడా వర్తింపజేసుకుంటారు. డబ్బు ఉంటేనే విలువ ఉంటుందని, డబ్బు ఉంటేనే సంఘంలో, సమాజంలో గౌరవం దక్కుతుందని, డబ్బు కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదనే ఒక భ్రమలో బ్రతుకుతూ మనిషి తానే సృష్టించిన డబ్బు అనే ఒక రంగుల కాగితం కోసం పరుగులు పెడుతూ, తన సమయాన్ని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ అంతిమంగా బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకుంటూపోతాడు, కానీ ముగింపు లేని తన జీవితపు పరుగులో తనను తాను కోల్పోతూ ఉంటాడు. డబ్బు లేకపోతే సమాజం తనను గుర్తించదు అనే ఒక ఆత్మన్యూనతకు మనిషి లోనవుతాడు. డబ్బుని మించి విలువైనవి ఈ ప్రపంచంలో చాలా వున్నా కూడా డబ్బుకు ఇచ్చిన విలువ ఇతర విషయాలకు ఇవ్వకుండా దానికి పూర్తిగా బానిసైపోతున్నాడు. డబ్బును వాడుకోవాల్సింది పోయి, డబ్బుకు దాసోహమై, డబ్బు లేకపోతే బ్రతకలేము అనే అంశాన్ని మెదడులో బలంగా నాటుకుపోయి ఉన్నాడు. నిజంగా డబ్బు లేకపోతే బ్రతకలేమా? డబ్బే జీవితమా? డబ్బే లోకమా? మనిషికి డబ్బే ప్రపంచమా?
రంగురంగుల కాగితాల భ్రమలో మనిషి
నిత్య జీవితంలో మనల్ని ఒక ప్రశ్న ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది. డబ్బు లేకుండా బ్రతకలేమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే ముందు మనల్ని మనం అద్దంలో చూసుకుని ఒక దారుణమైన నిజాన్ని ఒప్పుకోవాలి. అసలు డబ్బు లేకుండా బ్రతకలేమా అనే విషయాన్ని మనం ప్రక్కన పెడితే డబ్బు అనే ఒక రంగురంగుల కాగితాల భ్రమలో లేకపోతే మనం జీవచ్ఛవాలుగా మిగిలిపోతామనే ఒక అంశాన్ని ఈ సమాజం మన మెదడులోకి బలంగా దూర్చేసింది. దైనందిన జీవితంలో ఈ సమాజం చిన్నప్పట్నుంచి మనకు నేర్పింది ఏమిటంటే బాగా చదువుకో, ఎవడో ఒకడి కింద ఊడిగం చేసెయ్, నీ బ్యాంక్ అకౌంట్ నింపేసెయ్. అప్పుడే నీ బ్రతుకుకు ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఇదే అబద్ధాన్ని ప్రతిరోజూ ఉదయం నిద్రలేచే దగ్గరినుండి రాత్రి నిద్రపోయేవరకు కొన్ని వేలసార్లు, కొన్ని లక్షల సార్లు విన్నాం.
ఇది అబద్దం మనకు తెలిసినా కూడా లోపల ఎక్కడో అది తప్ప మనల్ని రక్షించే ఇంకో మార్గం మరొకటి లేదనే ఒక భయంతో పూర్తిగా కుంచించుకుపోయి, ఆ భయానికి మనం బానిసలుగా మారిపోయాం. ఒక్క క్షణం మన చుట్టూ ఉన్న ఈ గొడవను ఆపేసి, గుండె మీద చేయి వేసుకొని ఆలోచిస్తే, నిజంగా మన శ్వాస, మన ఉనికి మనకై మనం ఆ కాగితం ముక్కలపై ఆధారపడి ఉన్నామా? లేమా? తెలిసిపోతుంది. ఈ ప్రకృతి ఆహారం, నీరు, గాలిని మనకు ఉచితంగా ఇస్తుంది. మనిషి మనుగడకు కావలసినవి ఇవే. ఇవి అనుభవించి సంతోషంగా గడపాల్సిన మనం రాత్రింబవళ్లు కష్టపడి అహంకారాన్ని కొంటున్నాం. పక్కవాడికంటే నేను పెద్ద తోపు అనే ఒక నకిలీ గర్వాన్ని కొంటున్నాం. కానీ ఇదే మూర్ఖత్వాన్ని 2500 సంవత్సరాల క్రితమే ఒకడు ప్రశ్నించాడు. నిజమేమిటంటే అజ్ఞానంలో మునిగిపోతున్న ఈ పిచ్చి సమాజంలో అతడొక్కడే మేల్కొన్న జ్ఞాని. అతడే డయోజెనెస్. ఆయన మరెవరో కాదు క్లాసికల్ గ్రీస్ కాలానికి చెందిన ఒక ప్రాచీన గ్రీకు తత్వవేత్త మరియు సైనీసిజం వ్యవస్థాపకులలో ఒకడు.
సమాజం కట్టుబాట్లను కాలితో తన్నేసిన డయోజెనెస్
తన సన్యాస జీవనశైలికి మరియు సామాజిక ఆచారాలపై చేసిన తీవ్ర విమర్శలకు ప్రసిద్ధి చెందిన అతను ఒక పురాణ పురుషుడిగా నిలిచిన డయోజెనెస్ విలాసవంతమైన తన జీవనాన్ని వదిలేసి గ్రీకు నగరవీధుల్లో ఒక పెద్ద పింగాణీ జాడీలో నివసించడం లేదా పగటిపూట వెలిగించిన లాంతరుతో ఒంటిమీద సరైన బట్టలేకుండా బహిరంగ ప్రదేశాలలో తిరుగుతూ ఉండేవాడు. ఈ సమాజం ఒక పెద్ద బూటకం అని, మనషులు ఇక్కడ సంపాదిస్తున్నారని భ్రమిస్తూ తమలోని మంచితనాన్ని, తమలోని స్వేచ్ఛను పూర్తిగా అమ్మేసుకుంటున్నారని అతడికి స్పష్టంగా తెలుసు. అందుకే డయోజెనెస్ ఆ రోజే తన విలాసవంతమైన జీవనాన్ని తిరస్కరించాడు, పేరుప్రతిష్టల మీద ఉమ్మేశాడు. సమాజం వ్రాసిపెట్టుకున్న కట్టుబాట్లను తన కాలితో తన్నేసాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అంతటివాడే వచ్చి మీకు ఏమి కావాలో కోరుకోమంటే డయోజెనెస్ ఏమన్నాడో తెలుసా? కొంచెం ప్రక్కకు జరుగు, నీ నీడ వల్ల నాకు వచ్చే ఎండ రావడంలేదు అన్నాడు. అది నిజమైన దృక్పథం అంటే. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు చేతిలో గిన్నె కూడా లేకుండా నదిలో నీళ్లు త్రాగడం చూసి డయోజెనెస్ తన దగ్గరున్న ఆ ఒక్క కప్పును కూడా విసిరిపారేశాడు. ఏమి లేకుండా ఒక చిన్న పిల్లవాడు కూడా నాకంటే ఎక్కువ స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడు, ఈ పాత్ర కూడా నాకు బరువే అనుకున్నాడు. నిజానికి ఎంతటి దారుణమైన సత్యం ఇది.
కోరికలు పెరిగేకొద్దీ డబ్బు అవసరం పెరుగుతుంది
మనిషి అవసరాలు అనేవి చాలా చిన్నవి. కానీ ఆ అవసరాల మీద నీవు పెంచుకున్న కోరికల సామ్రాజ్యం చాలా పెద్దది. ఆ సామ్రాజ్యానికి నీవే రాజు అనుకుంటున్నావు కదా, కానీ అది నీ భ్రమ మాత్రమే. నిజానికి నీవు అక్కడ కాపలా కాసే కుక్కవి మాత్రమే. అక్కడే అసలైన పతనం మొదలవుతుంది. మనిషి అవసరం కాస్త కోరిక అవుతుంది, ఆ కోరిక కాస్త అత్యాశగా మారుతుంది. ఆ అత్యాశనే నీ నరనరాల్లోకి ప్రవహింపజేసి నిన్ను ఒక లోబిగా మార్చేస్తుంది. ఆ లోభం నిన్ను నీ మొహం నీవే చూసుకోలేని అసహ్య స్థితికి మార్చేస్తుంది. నీవు రోజుకు 14 గంటలకు పశువులా కష్టపడుతూనే, నేను నా కుటుంబం కోసం కష్టపడుతున్నానంటూ నీయొక్క కాలర్ ఎగరేస్తావు. కానీ ఒక నిజం చెప్పు నీవు నీ జీవితాన్ని, నీ విలువైన స్వేచ్చని ఇంకొకరి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం లేదా?
మనిషి మొదట డబ్బుకి బానిసవ్వడు, వాడు కొనుక్కోవాలని వస్తువుల వెనక ఉన్న భ్రమకు బానిసవుతాడు. కోరికల చిట్టా పెరిగే కొద్దీ వాటిని తీర్చడానికి డబ్బు అనే ఔషదం (డ్రగ్) అవసరం అంతకంతకు పెరుగుతుంది. ఆ డ్రగ్ కోసం నీవు నీ ప్రశాంతతను అమ్ముకుంటావు, నీ ఆత్మ గౌరవాన్ని కూడా అమ్ముకుంటున్నావు. చివరకు నీకంటూ ఒక విషయం ఉన్నదనే విషయాన్ని మర్చిపోతావు. ఇప్పుడు చెప్పు నీవు డబ్బు లేకుండా బ్రతకలేమా? ఈ ప్రశ్న అసలు వాస్తవమేనా? కాదు. అది తప్పు ప్రశ్న. నీకు నిజంగా డబ్బు ఎంత అవసరం ఉందో నీవు ఒంటరిగా కూర్చొని లెక్కలేసావా? లేదు. నీవు నీ అవసరాలను , నీ అంతరంగం నిర్ణయించలేదు. పక్కింటి వారు ఉపయోగిస్తున్న కారు చూసో, లేక సాంఘిక ప్రసార మాధ్యమం (సోషల్ మీడియా) లో ఎవడో వేసుకున్న బ్రాండెడ్ బట్టలను చూసో, సమాజం నీ మొహాన విసిరేసిన సామాజిక హోదా (స్టేటస్ సింబల్) ను చూసో నీ అవసరాలను రూపకల్పన చేసుకుంటున్నావు అంతే.
అవసరాలు మనిషి మెడకు తగిలించిన ఉరితాళ్లు
మనిషికి తలదాచుకోవడానికి ఇల్లు అవసరమే, కానీ పక్కింటి వారి కంటే పెద్ద ఇల్లు కావాలనే తాపత్రయం ఎందుకు? మనిషి శరీరాన్ని కప్పివుంచడానికి బట్టలు అవసరమే, కానీ వాటి మీద అంతర్జాతీయ బ్రాండ్ ముద్ర లేకపోతే ఇతరులకంటే తక్కువైపోతావనే దుర్బుద్ధిని, కుళ్ళు బుద్ధిని నీ తలలో ఎవరు చొప్పించారు. మనిషి మాట్లాడడానికి ఫోన్ అవసరమే, కానీ ప్రతీ సంవత్సరం లక్షలు పోసి కొత్త మోడల్ ఫోన్ కొనకపోతే నీ ఉనికికే ప్రమాదం ఉన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అవి అవసరాలకు కావు, నీవు నీ మెడకు తగిలించిన ఉరితాళ్లు. ఈ అంచనాలే రోజు రోజుకు నిన్ను చంపేస్తున్నాయి. అయినా సరే మనం మళ్లీ వేదిక ఎక్కి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, మాటలు మాట్లాడుతూ ఉంటాం. నన్ను ఈ ఉద్యోగం బంధీ చేసింది, నన్ను ఈ బాధ్యతలు తొక్కేస్తున్నాయి అని ఏడుస్తుంటాం.
కానీ నిన్ను ఏ ఉద్యోగం నిన్ను బంధించలేదు, ఏ వ్యవస్థ నిన్ను తొక్కేయలేదు. అలవాటు పడ్డ నీ విలాసవంతమైన జీవనశైలి నిన్ను బంధించింది. నీవు పెంచుకున్న కృత్రిమ అవసరాలు నిన్ను కుక్క కంటే హీనంగా మారుస్తున్నాయి. నీ కోరికలే నీ చుట్టూ ఇనుప గోడలను నిర్మించుకున్నాయి. అందుకే ఏమీ లేకపోయినా కొందరు రోడ్డు ప్రక్కన ప్రశాంతంగా నిద్రపోతుంటారు. కోట్ల రూపాయలు ఉన్నా కూడా కొందరు నిద్ర మాత్రలు మింగుతూ నరకం చూస్తున్నారు. అందుకే మనిషిని వాడి దగ్గర ఉన్న ఆస్తి నిర్వచించదు. వాడు దేనికోసమైతే లాలాజలం కార్చుకుంటూ పరిగెడుతుంటాడో ఆ కోర్కె తన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. ఇక్కడ డబ్బు సమస్య కానే కాదు, డబ్బులు లేకపోవడం కూడా సమస్య కాదు. అసలు సమస్య ఏమిటంటే డబ్బు లేకపోతే ఈ సమాజం నిన్ను మనిషిగా గుర్తించదనే భయం నీ గుండెల్లో నాటుకుపోవడం.
మనిషి మేధస్సును, సమయాన్ని అమ్ముకుంటున్నాడు
డబ్బు కేవలం జీవించడానికి కావాల్సిన ఒక వస్తువు మాత్రమే. అంతేకానీ డబ్బే నీ జీవితం అయిపోకూడదు. అది నీ చేతుల్లో ఉండవలసిన ఒక చిన్న సాధనం. ఆ సాధనమే ఈరోజు నిన్ను కొరడాతో కొట్టి పరిగెడుతుంది. నీవు దానిని వాడుకోవాల్సింది పోయి, అదే నిన్ను పూర్తిగా వాడుకుంటుంది. ఇప్పుడు సమాజంలో మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే బజార్లో పశువులను అమ్ముకున్నట్టు తమను తాము అనుకుంటున్నారు. కార్పొరేట్ కార్యాలయాలలో తమ మేధస్సును, తమ సమయాన్ని అమ్ముకుంటున్నాయి. తమ ఆత్మను అమ్ముకుంటున్నారు. ఇంకా ఇంకా సంపాదించాలి, తమ బ్యాంకు ఖాతాలో మరింత నిల్వ నగదు (అకౌంట్ బాలన్స్) పెరగాలి, ఇంకొక ఇల్లు కొనాలి. ఇలా ఇంకొంచెం అనే దరిద్రపు మాటకు ఈ భూమి మీద ఎక్కడా విలువలేదు. ఆ ముగింపు లేని పరుగులో నీ జీవితాన్ని నీవు కోల్పోతున్నావు. నీకు ఉన్నదాన్ని చూసి సంతోషించే కళ్ళు నీకు పోయాయి. కేవలం లేని దానికోసం ఏడుపు మాత్రం నీకు మిగిలింది.
డబ్బు ఆకలిని తీరుస్తుంది, ఆత్మకు శాంతిని ఇవ్వలేదు
నీ కోసం బ్రతకడం ఎప్పుడో మానేశావు. కేవలం డబ్బు సంపాదిస్తున్న శవంగా తిరుగుతున్నావు. చివరికి నీ వయస్సు అయిపోయింది. చేతుల్లో సత్తా తగ్గిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే నీ దగ్గరున్న బ్యాంకు ఖాతాలో పెద్ద ఎత్తున నగదు నిల్వ ఉంటుంది, సమాజం ఇచ్చిన బిరుదులు ఉంటాయి. లోపల మాత్రం ఒక భయంకరమైన శూన్యం, ఒక అనాథ లాంటి ఒంటరితనం పెరుగుతాయి. నీవు సంపాదించిన కాగితాలు అన్నీ నీ ఆకలిని తీర్చగలిగేమో, కానీ నీ ఆత్మకు శాంతిని ఇవ్వలేవు. డబ్బు లేకుండా బ్రతకడం చాలా కష్టమే కావొచ్చు, ఈ సమాజంలో అది దాదాపు అసాధ్యం కావొచ్చు, ఇది నిజమే కావొచ్చు, కానీ ఆ డబ్బు కోసమే నీ సర్వస్వాన్ని తగలేసుకుని దానిమీద ఆధారపడి బ్రతకడం చాలా ప్రమాదకరం. అది నిన్ను నిలువెత్తున మంచేస్తుంది. నిన్ను నీ నుండి శాశ్వతంగా దూరం చేస్తుంది. ఇదంతా విన్నాక కూడా మళ్ళీ రేపు ఉదయం అదే పరుగు మొదలుపెడతావు. ఎందుకంటే డబ్బు తప్ప నీకు వేరే దారి తెలియదు. ఆ దారి తప్ప ఇంకో దారి వెతుక్కునే ధైర్యం నీకు లేదు. చివరికి నీ బ్రతుకులో ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది. నీవు డబ్బు కోసం బ్రతుకుతున్నావా? లేక కేవలం బ్రతకడం కోసమే డబ్బులు వాడుకుంటున్నావా? అని. ఒక్కసారి నిన్ను నీవు లోతుగా ఆత్మవిమర్శ చేసుకుని ఆలోచించు.










