
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 26న పాక్ సైనిక స్థావరాలపై అఫ్గాన్ దళాలు జరిపిన దాడులకు ప్రతిగా.. పాక్ సైన్యం ‘గజబ్ లిల్ హక్’ పేరుతో భారీ ప్రతీకార ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా కాబుల్, కాందహార్, పక్తియా వంటి ప్రధాన అఫ్గాన్ నగరాలపై పాక్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘర్షణలకు ప్రధాన కారణం ‘డ్యూరాండ్ లైన్’ (Durand Line) సరిహద్దు వివాదం. బ్రిటీష్ కాలంలో గీసిన ఈ 2,640 కిలోమీటర్ల సరిహద్దును అఫ్గానిస్థాన్ ఎప్పుడూ గుర్తించలేదు. తమ దేశానికి చెందిన పష్టూన్ తెగల ప్రాంతాలను పాక్ అక్రమంగా తనలో కలుపుకుందని తాలిబన్లు వాదిస్తుండగా.. అది అంతర్జాతీయంగా గుర్తించబడిన సరిహద్దు అని పాక్ వాదించడం ఈ నిరంతర ఘర్షణలకు మూలబిందువుగా మారింది.
ఈ దాడుల నేపథ్యంలో అఫ్గాన్‌కు చెందిన తాలిబన్ ప్రభుత్వం అత్యంత భయంకరమైన ఎత్తుగడలకు దిగుతోంది. అఫ్గాన్ అధికారిక మీడియా సంస్థ ‘బక్తర్ న్యూస్’ విడుదల చేసిన ‘సూసైడ్ స్క్వాడ్’ చిత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒంటికి పేలుడు పదార్థాలు అమర్చుకున్న బాంబర్లు, కారు బాంబులతో కూడిన ప్రత్యేక బెటాలియన్‌ను పాక్ ప్రధాన లక్ష్యాలపై దాడులు చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పాక్ వైమానిక దాడుల్లో సుమారు 130 మంది తమ ఫైటర్లు మరణించినట్లు పాక్ ప్రకటించగా, తాలిబన్లు మాత్రం తమ ప్రతిఘటనలో 50 మంది పాక్ సైనికులను మట్టుబెట్టామని చెబుతున్నారు. ఇక్కడ మరో ముఖ్య కారణం ‘తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్’ (TTP). పాక్‌లో దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు అఫ్గాన్ ఆశ్రయం ఇస్తోందని పాక్ ఆరోపిస్తుండగా, తమ దేశంలో ఏ ఉగ్రవాద సంస్థలు లేవని తాలిబన్లు తిప్పికొడుతున్నారు.
రెండు ఇస్లామిక్ దేశాల మధ్య చెలరేగిన ఈ ఘర్షణ ఆసియా ప్రాంతంలో అస్థిరతకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని హెచ్చరిస్తుండగా, తమ భూభాగంపై దాడులను సహించబోమని పాక్ స్పష్టం చేస్తోంది. గతంలో తాలిబన్ల రాకను స్వాగతించిన పాకిస్థాన్, ఇప్పుడు అదే తాలిబన్ల నుండి గట్టి సవాలును ఎదుర్కోవడం గమనార్హం. ఈ ప్రాణాంతక ఘర్షణలను ఆపేందుకు ఇరాన్ మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు రావడం కొంత ఊరట కలిగించే విషయమే అయినా.. ఆత్మహుతి దళాల హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దులో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఇతర కథనాలు:
పాకిస్థాన్‌లో లాక్డౌన్.. అసలేం జరుగుతోంది?
మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ.. ఫిన్లాండ్!










