
నేటి కాలంలో అనారోగ్యాలు, చికిత్స ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కేవలం ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీలు సరిపోవడం లేదు. ఆసుపత్రి ఖర్చులు లక్షల్లో ఉంటున్నాయి. దీంతో రూ.5 లక్షల బీమా కూడా తక్కువగా అనిపిస్తుంది. అధిక ప్రీమియంలు చెల్లించలేక చాలామంది ఉద్యోగులు.. సంస్థలు అందించే బృంద బీమా పాలసీలపైనే ఆధారపడతారు. కానీ ఆ పాలసీ విలువకు మించి ఖర్చు అయినప్పుడు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రాథమిక బీమా పాలసీకి అదనంగా టాపప్ లేదా సూపర్ టాపప్ పాలసీలను ఎంచుకోవడం ఉత్తమం. ఈ పాలసీలు తక్కువ ప్రీమియంతో అధిక రక్షణను అందిస్తాయి. ఆరోగ్య బీమా లేకపోయినా, ఒక నిర్ణీత మొత్తం వరకు మీరు భరిస్తాను అనుకుంటే.. మిగతా మొత్తానికి ఈ పాలసీలు సహాయపడతాయి.
టాపప్, సూపర్ టాపప్ పాలసీలు పనిచేసే విధానంలో తేడా ఉంది. ఉదాహరణకు, మీరు రూ.5 లక్షల ప్రాథమిక పాలసీతో పాటు రూ.10 లక్షల టాపప్ పాలసీ తీసుకున్నారనుకుందాం. ఒకేసారి ఆసుపత్రి బిల్లు రూ.8 లక్షలు అయితే, మీ ప్రాథమిక పాలసీ రూ.5 లక్షలు, టాపప్ పాలసీ మిగిలిన రూ.3 లక్షలు చెల్లిస్తాయి. కానీ, ఒకే పాలసీ కాలంలో మీరు రెండుసార్లు ఆసుపత్రిలో చేరి, ఒక్కోసారి రూ.4 లక్షల చొప్పున ఖర్చు అయితే, టాపప్ పాలసీ పనిచేయదు. ఎందుకంటే టాపప్ పాలసీ ఒక్క క్లెయిమ్‌లో ఖర్చు రూ.5 లక్షలు దాటినప్పుడే చెల్లిస్తుంది. సూపర్ టాపప్ పాలసీ ఈ సమస్యకు పరిష్కారం చూపుతుంది.
ఇది ఒక పాలసీ కాలంలో జరిగిన అన్ని క్లెయిమ్‌లను కలిపి చూస్తుంది. పైన ఉదాహరణలో, రెండు బిల్లులు (రూ.4 లక్షలు + రూ.3 లక్షలు) కలిపి రూ.7 లక్షలుగా పరిగణించి, ప్రాథమిక పాలసీ రూ.5 లక్షలు పోగా మిగిలిన రూ.2 లక్షలు సూపర్ టాపప్ పాలసీ చెల్లిస్తుంది. ఈ పాలసీలు తక్కువ ప్రీమియంతో అధిక రక్షణను అందిస్తాయి. ప్రస్తుతం బీమా సంస్థలు రూ.3 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకూ సూపర్ టాపప్ పాలసీలను ఇస్తున్నాయి. కనీసం రూ.50 లక్షల సూపర్ టాపప్ పాలసీని తీసుకోవడం చాలా అవసరం. ఈ పాలసీలు మీ ప్రాథమిక బీమా సంస్థ నుంచి లేదా ఇతర కంపెనీల నుంచి కూడా తీసుకోవచ్చు.






