HISTORY CULTURE AND LITERATURE

స్త్రీని అబలగా భావిస్తే.. దుష్టసంహరం తప్పదు..శరన్నవరాత్రుల అసలు పరమార్థం!

సర్వజగత్తుకి ఆమె రక్షా.. లోకమంతా శక్తి స్వరూపినిగా వెలసిన అమ్మను ఈ శరన్నవరాత్రుల్లో.. ప్రత్యేకించి పూజలూ, కుంకుమార్చనలూ, లలితాసహస్రనామ పారాయణాలూ, బొమ్మల కొలువులూ, బతుకమ్మ ఆటపాటలూ, దాండియా ఆటలూ, గర్బా నృత్యాలతో… తొమ్మిదిరోజులు.. మైమరచి విశిష్టంగా పూజించడం.. ఆ తల్లి అనుగ్రహం పొందడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆచారాన్ని ఏటా పాటిస్తూనే ఉన్నాం. అటువంటి ఈ శరన్నవరాత్రుల వెనుక అసలు వృత్తాంతమేంటి.. అమ్మ అవతారాల వైశిష్ట్యం గురుంచి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా…

స్త్రీని శక్తి స్వరూపంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించడం, శక్తి ఆరాధనే ఈ పండుగ అసలు పరమార్థం. అంటే, పూర్వం మహాబల సంపన్నుడైన మహిషాసురుడు ఒకనాడు బ్రహ్మకోసం ఘోర తపస్సు చేసి, మరణం ఉండకూడదని వరం కోరతాడు. అప్పుడు బ్రహ్మ ఇలా అంటాడు.. ‘పుట్టినవాళ్లు గిట్టక తప్పదు. చావక తప్పదు‘ అన్నా.. ఆ అసురుడు తన పట్టు వదలడు. దాంతో నీ మరణానికి ఓ మార్గాన్ని విడవమంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఆ మహిషాసుర.. స్త్రీని ఆబలగా భావించి… ఆమెవల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని భావించి… తనకు పురుషుల చేతిలో మరణం లేకుండా చేయమని అడుగుతాడు.

ఇందుకు బ్రహ్మ ‘సరే’ అనడంతో తనకిక తిరుగులేదనుకుని ఇష్టారీతిన విర్రవీగుతాడా రాక్షసుడు. అతని ఆగడాలు మరింత మితిమీరతాయి. ముల్లోకాల్ని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. దీంతో దేవతలందరూ త్రిమూర్తులతో మొరపెట్టుకోగా… ఆ ముగ్గురి అంశతో ప్రత్యేకంగా ఆవిర్భవించిన జగన్మాత తొమ్మిదిరోజులపాటు అలుపెరగక పోరాడి, ఆ మహిషాసురుడ్ని సంహరిస్తుంది. విజయం సాధిస్తుంది. అబల అనుకునే స్త్రీ… అవసరమైతే ఆదిశక్తిలా మారుతుందని చెబుతూ… స్త్రీ శక్తిని, గొప్పదనాన్ని చాటుతూ…. జరిగిన ఈ కథానుసారం.. శరత్కాలంలో అమ్మవారిని భక్తితో కొలిచేవిగా శరన్నవరాత్రులు నిలిచాయి. 

చెడుపై మంచి సాధించిన విజయం. మహిషాసుర సంహారం… 

ఇకపోతే గెలుపు అనేది ఎల్లప్పుడూ ప్రకృతి హితం కోరేదై, లోక క్షేమం కాంక్షిస్తూ.. సత్యం, అహింస, శౌచం, నీతి, నిగ్రహం, సామరస్యం.. వంటి దైవిక భావాలతో నిండి ఉంటుంది. కాబట్టి వీటిని సంరక్షించడం మన అంటే మానవ కర్తవ్యం అని చెప్పడమే ఈ నవరాత్రుల్లోని దేవీఉపాసన వెనకున్న అసలు పరమార్థం. సత్వగుణంప్రకాశవంతమైనది. ప్రశాంతంగా ఉంటూనే చురుగ్గా ఆలోచిస్తాం. నవరాత్రుల్లో ఆ జగదాంబను పూజించడం ద్వారా తమో, రజో గుణాల ప్రభావం తగ్గి, ప్రశాంతమైన సత్వగుణం పెంపొందుతుంది. ఈ గుణం వల్ల విజయం మీ వెన్నంటే ఉంటుంది.

నవ రూపాలు!

పౌరాణిక కథనం ప్రకారం దుష్టసంహారంకోసం ఆదిశక్తి తొమ్మిది రూపాలు ధరించింది. అందుకే ఏటా ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుంచి నవమి వరకూ ఆ జగదాంబను బాలాత్రిపురసుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణ, లలితా త్రిపురసుందరి, మహాచండి, మహాలక్ష్మి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దని… అంటూ ఇలా భిన్న రూపాల్లో అలంకరించి షోడశోపచారాలతో పూజిస్తారు. పదోరోజు రాజరాజేశ్వరీదేవిగా కొలుస్తారు. సాహసానికీ, ఆత్మవిశ్వాసానికీ ప్రతిరూపంగా దుర్గాదేవినీ, సంపదకి లక్ష్మీదేవినీ, విద్యామూర్తి సరస్వతినీ మూడేసి రోజుల చొప్పున పూజించే ఆచారం చాలాచోట్ల కనిపిస్తుంది. ఉత్తరాదిన నవదుర్గల రూపాల్లోనే ఆర్చిస్తారు. ఇలా ఒక్కోచోట ఒక్కోరీతిలో పరాశక్తిని పూజిస్తారు. దేవాలయాల్లో మూల విగ్రహాన్నే రోజుకో రూపంలో అలంకరించడం అంతటా కనిపిస్తుంది. 

అన్ని కాలాల్లోకి శరత్కాలమంటే తనకెంతో ప్రీతి అని, ఆ మాసాల్లో పూజిస్తే మరింత ఆనందిస్తానని దుర్గామాతే స్వయంగా చెప్పిందిట. కావున ఈ కాలంలో అమ్మను పూజించినా, స్మరించినా ఎంతో సంతుష్టి చెందుతుందిట. అందువల్ల శరత్కాలంలో వచ్చే మొదటి తొమ్మిది రోజులు నవదుర్గలను పూజించి, దశమినాడు రాజరాజేశ్వరీదేవిని అర్చించి అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు. దేవీ నవరాత్రుల్లో లలితా సహస్రనామాలు, దుర్గా సప్తశతిపారాయణ తప్పకుండా చేస్తారు.

ఈ రోజుల్లో ఏనాడు ఏ రూపంలో ఎలా పూజించాలో కృతయుగంలో సుకేతనుడనే మహారాజుకి అంగీరస మహర్షి ఉపదేశించాడు. ఆ విధంగా నాడు మొదలైన దేవీ నవరాత్రులు నేటికీ వైభవంగా కొనసాగుతున్నాయి. ద్వాపర యుగంలో ఈ ఉత్సవాలను భక్తిపూర్వకంగా తాను పాటించడమే కాక ప్రజల చేత కూడా చేయించాడట శ్రీకృష్ణుడు. ఆష్టాద శమహాపరాజాలన్నీ నవరాత్రుల విశిష్టతను గొప్పగా చాటి చెప్పాయి. విశేషించి బ్రహ్మాండ పురాణం, దేవీభాగవతం అమ్మవారిని పరాశక్తి, అపరాజిత, లలితాదేవి, త్రిపురసుందరి, రాజ రాజేశ్వరి, కాత్యాయని, చిద్రూపిణి పరదేవత, అపరదేవత, భగవతి అని స్తుతించాయి.

అమ్మవారు దుర్గమాసురుణ్ణి చంపడం వల్ల ‘దుర్గ’ అనే పేరు వచ్చింది. దుర్గ అంటే సకల దోషనివారిణి. సర్వశుభప్రదాయిని. అందువల్ల దుర్గను స్మరిస్తే చాలు.. చెడుగుణాలు, అడ్డంకులు, అనారోగ్యాలు, పాపాలు, భయాలన్నీ నశిస్తాయి. ఈ విషయం సాక్షాత్తూ పరమ శివుడే చెప్పినట్లుగా బ్రహ్మ మార్కండేయ మహర్షికి తెలిపాడన్నది పురాణ వచనం.

ఏ రోజు.. ఏ నైవేద్యం..!

దేవీ ఆలయాల్లో ఒక్కోరోజు ఒక్కో అవతారంగా అమ్మను అలంకరించి నివేదనలు సమర్పిస్తారు. *పాడ్యమినాడు బాలాత్రిపుర సుందరిగా అలంకరించి, పులిహోర నివేదిస్తారు. 

*విదియనాడు గాయత్రీమాతగా కొలువైతే, కొబ్బరన్నం నైవేద్యంగా పెడతారు.

*తదియనాడు అన్నపూర్ణాదేవిగా ఆరాధించి మినపగారెలు సమర్పిస్తారు. 

*చవితినాడు శ్రీలలితాదేవిగా పూజించి, పెరుగన్నం నివేదిస్తే, 

*షష్ఠినాడు మహాలక్ష్మిగా పూజించి కేసరి పెడతారు. *సప్తమినాడు మహాసరస్వతిగా అర్చించి అల్లంగారెలు సమర్పిస్తే,

అష్టమినాడు దుర్గాదేవిగా పూజించి శాకాన్నం నివేదిస్తారు. 

నవమినాడు మహిషాసుర మర్ధినిగాఅలంకరించి చక్రపొంగలి పెడితే, 

దశమినాడు శ్రీరాజరాజేశ్వరిగా ఆర్చించి పరమాన్నం సమర్పిస్తారు.

ఈ పదిరోజుల్లో సరస్వతీ సప్తమి, దుర్గాష్టమి, మహాసప్తమి, విజయదశమి అత్యంత ప్రధానమైనవి.

ఆడపిల్ల జీవనక్రమాన్ని సూచించే దుర్గాదేవీ రూపాలు..

విష్ణువు దశావతారాలు జీవ పరిణామక్రమాన్ని సూచిస్తున్నట్లుగా దుర్గాదేవి నవరూపాలూ ఆడపిల్ల జీవనక్రమాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

ప్రథమం శైలపుత్రి జన్మించి పుత్రిగా విలసిల్లడం.

ద్వితీయం బ్రహ్మచారిణి. అంటే బాల్య, కౌమార దశల్లో ఆటపాటలు, చదువుసంధ్యలు.

తృతీయం చంద్రఘంటయౌవనం, మంచి భర్త కోసం తపం చేస్తూ ఎదురుచూడటం,

చతుర్ధం వివాహం, సంసారికజీవనం.

పంచమం స్కంద మాత. మాతృత్వంతో పరిపూర్ణతను సాధించటం.

షష్టం కాత్యాయని.పిల్లలను తీర్చిదిద్దటం.

సప్తమం శుభం. కుటుంబానికి శుభం చేకూర్చటం,

అష్టమం మహాగౌరి. కుటుంబాన్ని వృద్ధి చేయటం.

నవమం సిద్ధిదాత్రి. అందరి కోరికలనూ నెరవేర్పి గృహిణిగావిరాజిల్లడం. 

ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి,క్రియాశక్తి- ఇలా అమ్మవారు మూడు శక్తులతో కూడి.. సర్వలోకాలనూ సంరక్షించే శక్తిమాతగా కొలువై, తనని కొలిచి మొక్కే భక్తులు ఎవరెప్పుడు పిలిచినా ఆనందంతో పొంగిపోతూ.. వారి కోరికలను తీర్చే కరుణామయిగా విరాజిల్లుతోంది.

Show More
Back to top button