GREAT PERSONALITIESTelugu Cinema

తెలుగు చిత్ర సీమలో దర్శక బ్రహ్మ పి. పుల్లయ్య.

పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (2 మే 1911 – 29 మే 1987)

1931 సెప్టెంబర్ 15 వెండితెర మీద తొలిసారి తెలుగు పలుకులు వినిపించింది. పాట పల్లవించింది. పద్యం పరిమళించింది. తొలి తెలుగు టాకీ “భక్త ప్రహ్లాద” ఆనాడు విడుదల కావడంతో తెరమీద పాత్రలు మూకాభినయాన్ని వదిలి గాత్రాలు సవరించాయి. గొంతులతో ప్రేక్షకుల చెంతకు చేరాయి. నాటి నుండి నేటి వరకు ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో తెలుగు సినిమా ఎన్నో మార్పులు సంతరించుకుంది. ఈ పరిణామానికి బీజం వేసిన ప్రాతఃస్మరణీయులు పి.పుల్లయ్య గారి పేరును తప్పకుండా ప్రస్తావించుకోవాలి.

తాను అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం, వెనకా ముందూ చూసుకోకుండా ముక్కుసూటిగా సాగడం లాంటివి చేసేవారిని జనం అంతగా మెచ్చరు. పైగా వారి ప్రవర్తన చూసి ‘పిచ్చి పుల్లయ్య’ అంటూ బిరుదు కూడా ఇస్తుంటారు. తెలుగు చిత్రసీమలో దర్శక, నిర్మాత పి.పుల్లయ్యను అలాగే పిలిచేవారు. ఆ రోజుల్లో తెలుగు సినిమాలో ఇద్దరు పుల్లయ్యలు దర్శకులుగా రాజ్యమేలారు. వారిలో ఒకరు చిత్తజల్లు పుల్లయ్య. మరొకరు పోలుదాసు పుల్లయ్య. ఇద్దరూ మేటిదర్శకులుగా వెలుగొందారు. ప్రఖ్యాత నటి శాంతకుమారి భర్త పి.పుల్లయ్య. ఈ దంపతులు తమ అభిరుచికి తగ్గ చిత్రాలనూ అందించారు.

సినిమా గురించి ప్రాథమిక విషయాలు సైతం తెలియని రోజుల్లో ఏదో నేర్చుకోవాలి అనే తపనతో, ఎత్తుకు ఎదగాలన్న తపనతో అప్పట్లోనే బి.ఎ.చదివిన పుల్లయ్య గారూ ఉద్యోగాన్ని కాదనుకున్నారు. కష్ట, నష్ట, నిష్టూరాలను ఓర్చి తెలుగు చలనచిత్ర చరిత్ర ఆరంభ పుటల్లో తనదైన స్థాయిని, స్థానాన్ని సంతరించుకున్నారు. 1931 దశకం లోనే విద్యార్థికుడై ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం లభించే అన్ని అర్హతలు ఉన్న పుల్లయ్య గారు కేవలం సృజనాత్మక రంగం మీద ఉన్న విశేష అభిమానంతో సినిమా కలను అధ్యయనం చేసేందుకు బొంబాయి కొల్లాపూర్, పూణేలాంటి నగరాలకు వెళ్లారు.

భారతీయ చలనచిత్ర పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే, బాబురావు పెయింటర్ లాంటి వ్యక్తుల వద్ద పని నేర్చుకున్నారు. సహాయకుడిగా పని చేసి తొలి చిత్రం “సత్య హరిచంద్ర” (1935) లోనే పుల్లయ్య గారు స్వతంత్రంగా పనిచేసినంత పేరు తెచ్చుకున్నారు. అక్కడి నుండి నాలుగు దశాబ్దల కాలంలో “అందరూ బాగుండాలి” (1975) వరకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 50 చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా, నిర్మాత దర్శకుడిగా పుల్లయ్య పని చేశారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    పోలుదాసు పుల్లయ్య

జననం    :    02 మే 1911

స్వస్థలం   :    నెల్లూరు , ఆంధ్రప్రదేశ్

తండ్రి   :   రాఘవయ్య 

తల్లి     :  రంగమ్మ 

ఇతర పేర్లు  :   దాసరి, దర్శక రత్న

వృత్తి      :    సినీ నిర్మాత, సినీ దర్శకుడు

సినీ నిర్మాణం   :    పద్మశ్రీ పిక్చర్స్

భార్య        :   శాంతకుమారి 

మరణం   :     29 మే 1987

జననం…

02 మే 1911 నాడు నెల్లూరు లోని రంగమ్మ, రాఘవేంద్ర దంపతులకు అపురూపంగా జన్మించిన సంతానం పి.పుల్లయ్య గారు. తన తల్లి రంగమ్మకు పుల్లయ్య గారి కంటే ముందు ముగ్గురు పిల్లలు పురిటిలోనే మరణించారు. నోములు, వ్రతాలు, దీక్షలు చేస్తున్న రంగమ్మ నాలుగో కాన్పులో తమకు జన్మించిన అబ్బాయిని దిష్టి తీసి పులిస్తారాకులో దొర్లించింది. దాంతో పుల్లయ్య అని పేరు పెట్టారు.  నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడే తండ్రి, తల్లి ఒకరి వెనకాల ఒకరు మరణించారు. నాలుగేళ్ల పుల్లయ్యకి ఆకలేస్తే, భయం వేస్తే, కలత నిద్రలో కన్నీళ్లు వస్తే, కెవ్వున ఏడిస్తే దగ్గరకు తీసుకునేదెవరు? వెచ్చగా పొదువుకుని భయం లేదు నాన్న అని భరోసా ఇచ్చేది ఎవరు? తల్లిదండ్రులు లేకపోవడానికి, లేమి కూడా తోడైతే అంతకు మించిన నరకం ఇంకా ఏమంటుంది. లోకం తెలియక ముందే నరకం తెలిస్తే అంతకు మించి బాల్యానికి శాపం ఏముంది?

బాల్యం..

పి.పుల్లయ్య గారి పూర్వికులు ఒకప్పుడు బాగా బ్రతికిన వారే. నెల్లూరు ప్రాంతంలో వారు వస్త్ర వ్యాపారులుగా బాగా పేరు మోశారు. సింగపూర్, మలేషియా, బర్మా లాంటి దేశాలకు వస్త్రాలు ఎగుమతి చేసి డబ్బు బాగా అర్జించారు. కానీ పి.పుల్లయ్య గారి తండ్రి రాఘవయ్య వరకు వచ్చేసరికి పరిస్థితులు తారుమారయ్యాయి. వారు లేని వారిగా ముద్రపడింది. గుట్టుగా బ్రతుకుతూ లో లోపల సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువలన జీవితం గురించి స్పష్టమైన ఆలోచన ఏర్పడిన దశలోనే వారికి రక్షణ మొదటి సమస్యగా మారింది. భద్రతా రాహిత్యాన్ని వాటేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఎదురయ్యింది.

పుల్లయ్య గారు అనాధగా మిగిలిపోయారు. దాంతో తన మేనత్త చేరదీసింది.  తన మేనత్త తనను పెంచడం అన్నది కేవలం దయాధర్మబిక్షే. జీవితంలో తల్లిదండ్రుల ప్రేమ అభిమానాన్ని కోల్పోవడం తనకు పెద్ద శాపమని తనకు చిన్ననాడే అర్ధమైంది. అందుకని మొదటి నుంచి పుల్లయ్య గారికి మెలకువగా మసులుకోవడం, బాధ్యత తెలిసి ప్రవర్తించడం అలవాటైపోయింది.

నెల్లూరులోని లక్ష్మీ నరసయ్య గారి వీధి బడిలో ఆలూరు శేషయ్య మాస్టారు పుల్లయ్య గారిని చాలా బాగా అభిమానించేవారు. తెలివైన కూర్రాడని చేరదీశారు. శేషయ్య మాస్టారు ఇంట్లో స్థానం ఇచ్చి ఆంగ్లము బాగా నేర్పించారు. శేషయ్య మాస్టరు తల్లి మంచి మనసున్న మనిషి. పేద వారిని, లేని వారిని చూస్తే ఇట్టే కరిగిపోయేది. పుల్లయ్య గారికి తల్లిదండ్రులే లేరని తెలుసుకొని ఆవిడ గారు విపరీతంగా జాలిపడి అన్నం పెట్టేది. ఆవిడ గారు శ్రావణమాసంలో తుమ్మికూర చేసేది. చాలా చేదుగా ఉన్న ఆ కూర గొంతుకు అడ్డం పడుతున్నా కూడా “అమృతం లాగా ఉందమ్మా” అంటూ పుల్లయ్య గారు తలవంచుకొని తినేసేవారట. వారి పట్ల ఆప్యాయత నిలుపుకోవడం కోసం చేదును సైతం మధురంగా ఉందని మింగడం తన తొమ్మిదో యేటప్పుడు నేర్చుకున్న తొలి జీవిత పాఠం.

చిత్ర రంగ ప్రవేశం…

నెల్లూరులో హైస్కూలు చదువుకున్న పుల్లయ్య గారు, చెన్నపట్నం కళాశాలలో డిగ్రీ చదువులు పూర్తిచేసి, కాలేజీ రోజుల్లోనే ఇంగ్లీష్, తెలుగు నాటకాలు క్షుణ్ణంగా చదివి నాటకాలలో పాత్రలు ధరించి విశ్వవిద్యాలయం ఉత్తమ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం బ్రాడ్ కాస్ట్ లేబుల్ అనే గ్రామ ఫోన్ కంపెనీలో ఉద్యోగం చేసి, అప్పటి రంగస్థలం ప్రముఖులైన అద్దంకి, పులిపాటి, కన్నాంబ, ఎడవల్లి, ఆచారి వంటి మేటి కళాకారుల పాటలను, పద్యాలను గ్రామ ఫోన్ రికార్డులుగా తీసుకొచ్చారు. వీరితో ఏర్పడిన పరిచయం పుల్లయ్య గారి భావి సినీ జీవితానికి మార్గం వేసింది. తెలుగు తొలి టాకీలు అడుగులు వేస్తున్న రోజులలో మిత్రులతో కలిసి పుల్లయ్య గారు “స్టార్ కంబైన్స్” సంస్థను నెలకొల్పారు.

చిత్ర నిర్మాణం తాలూకు విషయాలు తెలుసుకునేందుకు పుల్లయ్య గారు బొంబాయి, కొల్లాపూర్ లకు వెళ్లారు. దాదాసాహెబ్ ఫాల్కే, బాబురావు పెయింటర్ వంటి ప్రముఖుల పనితీరును అధ్యయనం చేశారు. పుల్లయ్య గారి కల 1935లో ఫలించింది. “స్టార్ కంబైన్స్” బ్యానర్ పై నిర్మించిన “హరిశ్చంద్ర” తెలుగు చిత్రం విడుదలైంది. కొల్లాపూర్ షాలిని స్టూడియోలో నిర్మించిన ఈ చిత్రానికి పుల్లయ్య గారు సహాయ దర్శకులుగా పనిచేసినా కూడా నిజానికి దర్శకత్వ బాధ్యతలు అన్నీ పుల్లయ్య గారే చూసుకున్నారు. అద్దంకి శ్రీరామమూర్తి, కన్నాంబలు నటించిన “హరిశ్చంద్ర” విజయం సాధించడంతో స్టార్ కంబైన్స్ “సారంగధర” చిత్రాన్ని ప్రారంభించి అందులో చిత్రానికి, పాత్రకు అందచందాలు, అభినయ కౌశల్యం, గాన ప్రావీణ్యం ఉన్న నటి కోసం అన్వేషించారు. శాంతకుమారి గారి రూపంలో వారికి కావాల్సిన నటీమణి లభించారు.

కన్యాశుల్కం…

కొన్ని గ్రంథాలకు పుట్టుక తప్పించి మరణం ఉండదు. ఆ క్రమంలో తొలి వరుసలో నిలబడుతుంది గురజాడ వారి కన్యాశుల్కం నాటకం. అంత గొప్ప నాటకాన్ని సినిమాగా చూపించే సాహసం చేశారు దర్శకులు పుల్లయ్య గారు. నటీనటులంతా తమ తమ అభినయ వైదుష్యాన్ని అందించి కన్యాశుల్కం చిత్రానికి ఒక కళాఖండం స్థాయి వచ్చేలా చేశారు. గురజాడ గారు సృష్టించిన పాత్రలకు జీవం పోశారు. మధురవాణి పాత్రను పోషించిన సావిత్రి గారు “లొట్టపిట్ట నవ్వు”ను అద్భుతంగా ప్రదర్శించి మంచి మార్కులు కొట్టేశారు. వేశ్య పాత్ర అయినా ఏమాత్రం అసభ్యతకు తావు ఇవ్వని రీతిలో సావిత్రి గారు అద్భుతంగా నటించారు. రామప్ప పంతులుగా సి.ఎస్.ఆర్ అసమాన రీతిలో నటించారు. వంగర ప్రదర్శించిన నటనా చాతుర్యానికి “కరటకశాస్త్రి” అనే వాడు ఇలాగే ఉండొచ్చేమోనని, విన్నకోట రామన్న పంతులు గారు “అగ్నిహోత్రావధాన్ల” పాత్ర కోసం పుట్టారని మనకు అనిపించక మానదు. “లుబ్దావదాన్లు”గా గోవిందరాజుల సుబ్బారావు మాట, కూర్చునే తీరు, నడక నభూతో నభవిష్యతి.

నాటకంలో కీలకమైన గిరీశం పాత్రకు మొదట అక్కినేని నాగేశ్వరావు గారిని సంప్రదించారు దర్శక, నిర్మాతలు. అప్పటికే దేవదాసుతో ఒక స్థాయికి ఎదిగిన తాను వెంటనే ఇలాంటి పాత్ర ధరించడం తన సినీ భవిష్యత్తు కు దెబ్బ అని ఆలోచించి, అక్కినేని గారు డి.ఎల్.నారాయణ తో కుదరదని ఖచ్చితంగా చెప్పేశారట. ఆ తర్వాతే ఎన్టీ రామారావు గారిని గిరిశం పాత్రకు తీసుకున్నారు. ఎన్టీఆర్ “రేచుక్క”, “మిస్సమ్మ” చిత్రాలు థియేటర్లో నడుస్తున్నాయి. ఆ వెంటనే “జయసింహ” కూడా వచ్చేసింది. ఆ ఇమేజ్ చట్రంలో ఎన్టీఆర్ గారి “గిరీశం” పాత్ర ఇరుక్కుంది.

అప్పట్లో తన అభిమానులకు గిరీశం పాత్ర నిరాశపరిచి ఉండొచ్చేమో కానీ, అదే కన్యాశుల్కం పాతికేళ్ల తర్వాత రెండోసారి విడుదలైనప్పుడు ఆ పాత్రకు ఎన్టీ రామారావు గారు కరెక్ట్ అనుకున్నారు జనం. కొందరు భాష పట్ల అభ్యంతరం చెప్పారు. అయితే దర్శకులు పుల్లయ్య గారు ఉపయోగించిన శిష్ట వ్యవహారికం సినిమా విజయానికి ఎంతగా ఉపకరించిందో పాతికేళ్ల తర్వాత చిత్ర ఘన విజయం నిరూపించింది. 1983లో పునః విడుదలై షిప్టుల పద్ధతిలో రజతోత్సవం జరుపుకుంది. మళ్లీ మూడోసారి 1990లో విడుదలై శత దినోత్సవం జరుపుకుంది. పాత చిత్రాలు తిరిగి విడుదలై భారీ కలెక్షన్స్ సంపాదించిన చిత్రంగా “కన్యాశుల్కం” చరిత్రలో నిలిచిపోయింది.

సొంత నిర్మాణ సంస్థ గా “పద్మశ్రీ”…

“భక్తజన” (1948) తో మొదలుపెట్టి తిరుగుబాటు (1959), ధర్మదేవత (1952), అర్ధాంగి (1958) వరకు ప్రముఖ సంగీత దర్శకుడు బి.ఎన్.ఆర్ భాగస్వామ్యంతో “రాగిణి ఫిలిమ్స్” పతాకం క్రింద నిర్మించిన పుల్లయ్య, శాంతి కుమారి దంపతులు ఈసారి పూర్తిగా తమదైన సంస్థలు నెలకొల్పి వెంకటేశ్వర స్వామి లీలా విశేషాలు సరికొత్తగా నిర్మించాలని సంకల్పించుకున్నారు. దాని ఫలితమే “పద్మశ్రీ” సంస్థ. ఈ సంస్థ తొలి చిత్రం “శ్రీ వెంకటేశ్వర మహత్యం” (బాలాజీ) కథ మారలేదు, గాని కథనం సంభాషణలు, పాటలు, సంగీతం ఇవన్నీ మారాయి. వీటితో పాటు పాత్రధారులు మారారు.

శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)…

కొన్ని విజయాలు మర్చిపోలేనంత మధురంగా ఉంటాయి. మళ్లీ మళ్లీ వాటిని పునరావిష్కరించేలా స్ఫూర్తినందిస్తాయి, ప్రేరణ కలిగిస్తాయి. 1939లో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు, శాంతకుమారి జంటగా వెలువడి అద్భుత విజయాన్ని తెచ్చిపెట్టి తన కెరీర్ ను మలుపు తిప్పిన “వెంకటేశ్వర మహత్యం” ( బాలాజీ ) చిత్రం పుల్లయ్య హృదయంలో శేషాచలమంత స్థిరంగా నిలిచిపోయింది. శ్రీనివాసుడి అవతారగాథను మళ్లీ నిర్మించాలనిపించింది.

ఎన్టీఆర్, ఎస్.వరలక్ష్మి, సావిత్రి, శాంతకుమారి, జానకి, గుమ్మడి, రమణారెడ్డి, సూరిబాబు, నాగయ్య లాంటి ప్రముఖ తారాగణాల్ని ఎంపిక చేశారు. ఆత్రేయ మాటలు, మల్లాది, ఆరుద్ర, నారపరెడ్డి, శ్రీ వేణుగోపాల్ ప్రభృతులు పాటలు, పద్యాలు, పెండ్యాల స్వర సౌరభం, ఎస్వీఎస్ రామారావు కళావైభవం, పి.ఎల్.రాయ్ ఛాయాగ్రహణం వగైరాలు శ్రీనివాసుని అభిషేకం లోని యాలాలువంగ ఘనసార సుగంధ తీర్థం లాగా అమిరాయి.

9 జనవరి 1960 నాడు చిత్రం విడుదలైనప్పటి నుండి నేటికీ ఏనాటికి “శ్రీ వెంకటేశ్వర మహత్యం” (బాలాజీ) చిత్రాన్ని అద్భుతమైన దృశ్య కావ్యంగా ఆవిష్కరించి, పుల్లయ్య శాంతకుమారి దంపతుల జీవితాలకు ధన్యత చేకూర్చాయి. ఆ రోజుల్లో ఈ చిత్రం ప్రదర్శితమైన ప్రతి చిత్రం మందిరం తీర్థ క్షేత్రాన్ని తలపించింది. వెంకటేశ్వరుని విగ్రహంతో గర్భాలయ వాతావరణాన్ని దర్శింపజేసింది. తెలుగువారు తమ ఇలవేల్పు సన్నిధిని అనుభూతి చెందారు.

మొక్కులు ముడుపులు చెల్లించుకున్నారు. కానుకలతో నిండిన హుండీలను పుల్లయ్య గారు తిరుమలకే పంపించారు అన్ని పాటలు ఆణిముత్యాల్లాగా అద్భుతంగా వచ్చాయి. “శ్రీ వెంకటేశ్వర మహత్యం” కనక వర్షం కురిపించింది. ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ ఇమేజిని సమున్నత స్థాయికి తీసుకెళ్లింది. 15 సంవత్సరాల వ్యవధిలో మరో ఎనిమిది సినిమాలు నిర్మించే స్థాయికి పద్మశ్రీని చేర్చింది. ఈ చిత్రం నుంచి పుల్లయ్య గారు తెలుగులో తన సొంత చిత్రాలకే పరిమితం కావడం విశేషం

  వివాహం…

బొంబాయి నగరంలోని గేట్ వే ఆఫ్ ఇండియా ప్రాంతం. టాక్సీ ఆగింది. అక్కడ దిగారు ఇద్దరు. డైరెక్టర్ ఏవో చిరు తిళ్ళు కొన్నారు. హీరోయిన్ కి ఇచ్చారు. ఆవిడ యాంత్రికంగా తింటుంది. డైరెక్టర్ గ్రహించి పరధ్యానం గురించి అడిగాడు. హీరోయిన్ తడబడింది. వెంటనే తమాయించుకుంది. ఆయనంటే ఇష్టం అన్నది. అక్కడితో ఆగిపోకుండా పెళ్లి ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. డైరెక్టర్ మొహంలో చిరునవ్వు. మనిషి తొణకలేదు. తనకి కూడా ఇష్టమే అన్నారు. కానీ అంటూ అర్థోక్తి లో ఆగాడు. ఆమె కంగారు పడింది. కారణం అడిగింది. పేదరికం, దాపరికం లేకుండా చెప్పాడాయన. చిల్లి గవ్వంత ఆస్తి కూడా లేదు. అవన్నీ నాకు అనవసరం మీరంటే నాకు ఇష్టం అందామే. నిజమే మీ వాళ్ళు కూడా ఇష్టపడాలి కదా. ఏం ఎందుకు ఇష్టపడరు. పేదవారికి ఎవరైనా పిల్లనిస్తారా. ఇవ్వకపోతే మనమే చేసుకుందాం. అవసరమైతే  రిజిస్టరు పెళ్లికి సిద్ధపడింది హీరోయిన్. తన అదృష్టానికి ఆనందించారు డైరెక్టర్.

ఎదురుగా తాజ్ మహల్ హోటల్. బొంబాయి మహానగరంలో ఆ రోజుల్లో అది పేరు ఉన్నది ఖరీదైనది. కప్పు కాఫీ రూపాయి. 1937లో అది పెద్ద మొత్తమే రెండు కప్పులకు ఆర్డర్ ఇచ్చారు డైరెక్టర్. కాఫీలు వచ్చాయి. ఇద్దరు త్రాగారు. రెండు రూపాయల బిల్లుకు తోడు ఆనందంగా మరో రూపాయి టిప్పు. బేరర్ ముఖం వికసించింది, హిందీలో ఏదో అన్నాడు. డైరెక్టర్ నవ్వాడు. ఆవిడ, ఆయన బయటకు వచ్చారు. ఆ బేరర్ ఏమన్నాడు అడిగింది హీరోయిన్. డైరెక్టర్ నవ్వుతూ చెప్పారు. మనం కొత్త దంపతులు అనుకున్నాడట మంచి సంతానం కలగాలని పిల్లా పాపలతో పది కాలాల పాటు పచ్చగా ఉండాలని ఆశించాడు. అప్పుడు ఇద్దరు ఒకరితో ఒకరు ఏమనుకున్నారో కానీ బేరర్ శుభాకాంక్షలు నిజమయ్యాయి. ఆ హీరోయిన్ శాంతకుమారి అనే వెల్లా సుబ్బమ్మ, డైరెక్టర్ పి.పుల్లయ్య అనే పోలుదాసు పుల్లయ్య. వివాహ బంధంతో ఒకటయ్యారు. జీవితాంతం కలిసి నడిచారు.

“సారంగధర” చిత్రం నిర్మాణ సమయంలో బేబీ అన్న పిలుపుతో శాంతకుమారిలో మొదట అలకని, తర్వాత వలపుని మేల్కొల్పిన పుల్లయ్య జీవితాంతం అర్థాంగిని “బేబీ” అనే పిలవడం, అలాగే శాంతమ్మ శ్రీవారిని “డైరెక్టరూ” అని సంబోధించడం వారి అనురాగ బంధంలోని చెప్పుకోదగ్గ విశేషమని సన్నిహితులు చెబుతారు. చిత్రసీమకు వీరు పార్వతీ పరమేశ్వరుల లాంటి వారు.

దర్శకత్వం వహించిన చిత్ర సమాహారం…

హరిశ్చంద్ర (1935)

సారంగధర (1937/I)

బాలాజీ (1939)

సుభద్ర (1941)

ప్రేమబంధం (1941)

ధర్మపత్ని (1941/I)

భాగ్యలక్ష్మి (1943)

భక్తజన (1948)

మాయా మచ్చీంద్ర (1945)

వీటుకరి (1950)

తిరుగుబాటు (1950)

మచ్చ రేకై(1950)

ధర్మదేవత (1952/I)

మనంపోలే మాంగల్యం (1953)

రేచుక్క (1955)

అర్ధాంగి (1955)

కన్యాశుల్కం (1955)

ఉమా సుందరి (1956)

పెన్నిన్ పేరుమై (1956)

వనగముడి (1957)

ఇల్లారమే నల్లారం (1958)

కలైవణన్ (1959)

బండ రాముడు (1959)

అదిసయ తిరుడన్ (1959)

జయభేరి (1959)

శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960)

సిరి సంపదలు (1962)

మురళీకృష్ణ (1964)

ప్రేమించి చూడు (1965)

ఆసై ముఖం(1965)

తాయే ఉనక్కాగ (1966)

ప్రాణ మిత్రులు (1967)

అల్లుడే మేనల్లుడు (1970)

కొడుకు కోడలు (1972)

అందరూ బాగుండాలి (1975)

@ నిర్మాత గా చిత్ర సమాహారం…

ధర్మపత్ని (1941)

శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960)

సిరి సంపదలు (1962)

ప్రేమించి చూడు (1965)

ప్రాణమిత్రులు (1967)

అల్లుడే మేనల్లుడు (1970)

కొడుకు కోడలు (1972)

నిర్వహించిన పదవులు…

పుల్లయ్య గారు పరిశ్రమకు సంబంధించిన బాధ్యతాయుతమైన పదవుల్ని నిర్వహించారు. “సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్” కు పుల్లయ్య గారు వివిధ హోదాల్లో విశేష సేవలు అందించారు. ఆ ఛాంబర్ పత్రికకు ఎడిటర్ గా వ్యవహరించారు. అలాగే “ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా” ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడుగా కూడా పనిచేశారు. చిత్ర పరిశ్రమలో సమస్యల్ని, సంక్షోభాల్ని పరిష్కరించేందుకు చొరవ చూపేవారు. చలనచిత్ర పురస్కారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కమిటీలో పుల్లయ్య గారు వివిధ హోదాల్లో పనిచేశారు. అప్పటి రష్యా దేశ దర్శకుల సంఘం ఆహ్వానం మేరకు పుల్లయ్య గారు యు.ఎస్.ఎస్.ఆర్ లో పర్యటించారు. తాస్కెంట్ ఫిలిం ఫెస్టివల్ లో భారత ప్రతినిధి వర్గానికి నేతృత్వం వహించారు. చైనా దురాక్రమణ సందర్భంగా జాతీయ రక్షణ నిధి కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య వంటి సినీ ప్రముఖుల సాంస్కృతిక బృందంతో కలిసి రాష్ట్రమంతటా పర్యటించి ఆ రోజుల్లో (1962) పది లక్షల విరాళాన్ని సేకరించి అప్పటి ఉప రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ గారికి అందజేశారు.

అందుకున్న పురస్కారాలు…

వ్యాపార దృక్పథంతో సైతం కళాత్మకతను, సృజనాత్మకతను మేళవించిన దర్శకుడిగా, నిర్మాతగా పుల్లయ్య గారు అనేక పురస్కారాలను అందుకున్నారు. పుల్లయ్య గారు నిర్మించి, దర్శకత్వం వహించిన అర్థాంగి, సిరిసంపదలు, అలాగే దర్శకుడిగా పనిచేసిన “జయభేరి” చిత్రాలకు రాష్ట్రపతి పురస్కారాలు లభించాయి. పరిశ్రమకు చెందిన వివిధ సంఘాల వారు పుల్లయ్య గారిని సన్మానించారు. తమిళనాడు సంగీతం నాటక అకాడమీ, ఆంధ్ర నాటక కళాపరిషత్తులు పుల్లయ్య గారికి విశిష్ట సత్కారాలు అందించాయి. చిన్నప్పుడు ఆంధ్ర మహాసభలను దర్శక బ్రహ్మ బిరుదుతో సన్మానించింది. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలలోని వివిధ సాంస్కృతిక నాటక సంస్థలు పుల్లయ్య, శాంతకుమారి దంపతులను గౌరవపూర్వకంగా సత్కరించాయి.

1981 వ సంవత్సరానికి గాను పుల్లయ్య గారికి, 1999 సంవత్సరానికి గాను శాంత కుమారి గారికి రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం లభించడం ఒక విశేషం.

అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారాన్ని పొందిన ఏకైక దంపతులు ఈ అనురాగ మూర్తులు కావడం మరో విశేషం.

  మరణం…

సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన పుల్లయ్య, శాంతకుమారి దంపతుల షష్టిపూర్తి వేడుకలను 1971లో చెన్నపట్నంలో సినీ కళాకారులు ఘనంగా నిర్వహించారు.

మరో పదేళ్ల తర్వాత 18 జనవరి 1981 హైదరాబాదులో వంశీ ఆర్ట్స్ థియేటర్స్ వాళ్ళు అప్పటి గవర్నర్ కె.సి.అబ్రహం గారి చేతుల మీదుగా సత్కారం జరిపించారు.

ఆ సమయంలో చనిపోయేలోగా మరో సినిమా తీస్తాను అని సభాముఖంగా ప్రకటించిన పుల్లయ్య గారు అది నెరవేరకుండానే 29 మే 1987   శుక్రవారం నాడు కన్నుమూశారు.

దాంతో 19 ఏళ్ల పాటు డైరెక్టర్ ఎడబాటును భరించిన బేబీ శాంతకుమారి  17 జనవరి 2006 మంగళవారం అంతిమ శ్వాస విడిచారు.

Show More
Back to top button