
ఈరోజుల్లో విద్యారంగంలో పెరుగుతున్న పోటీతత్వం కారణంగా విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడి పిల్లల్లో ఏమాత్రం ప్రభావం చూపుతుంది? మీ పిల్లలు ఒత్తిడిలో ఉన్నట్లు ఎలా గుర్తించాలి? అనే విషయాలు తెలుసుకుందాం. ఒత్తిడికి గురైన చిన్నారులు దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు, ఏకాగ్రత కోల్పోతారు. పనితీరు మందగించడం, మతిమరుపు, జ్ఞాపకశక్తి లోపం, చదువులో వెనకబడటం వంటి లక్షణాలు వారిలో స్పష్టంగా కనిపిస్తాయి.
వారి సామర్థ్యానికి మించి ఒత్తిడి ఉన్నదనేందుకు ఇవన్నీ సూచనలు. విద్యా ఒత్తిడి కారణంగా విద్యార్థులలో ఆందోళన, నిద్రలేమి పెరిగి, దీర్ఘకాలంలో వారి మానసిక స్థితిలో మార్పులకు దారితీస్తుంది. ‘జర్నల్ ఆఫ్ అడోలెసెన్స్’ అధ్యయనం ప్రకారం, విద్యా ఒత్తిడి ఆందోళన, నిరాశ పెంచుతుందని వెల్లడైంది. అందుకే, తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక ప్రవర్తనపై నిరంతరం శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.
పిల్లలపై ఒత్తిడిని తగ్గించడంలో తల్లిదండ్రులు కీలకపాత్ర పోషించాలి. పిల్లలు తాము ఇంట్లో సురక్షితంగా, భద్రంగా ఉన్నామనే భావన కలిగించడానికి ఇంటి వాతావరణాన్ని అందుకు తగ్గట్టుగా మార్చాలి. పాఠశాలలో కొంత బెరుకుగా ఉండే విద్యార్థులు ఇంట్లోనే స్వేచ్ఛగా మాట్లాడతారు, కాబట్టి వారితో బలమైన, సానుకూల కమ్యూనికేషన్‌ను ఏర్పరుచుకోవాలి.
ఇది ఒత్తిడితో కూడిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడానికి వారిని సిద్ధం చేస్తుంది. పిల్లలకు సానుకూల ప్రోత్సాహం (పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్) అందించడం వారి మానసిక పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. చివరిగా, చిన్నారుల లక్ష్యాలను వారే నిర్దేశించుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అప్పుడే వారికి భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన ఏర్పడి, తమకు ఇష్టమైన రంగంలో తక్కువ కష్టంతోనే నిలదొక్కుకోగలుగుతారు.






