
ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో 2025 నోబెల్ బహుమతిని గెలుచుకున్న మేరీ ఇ. బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకాగుచిల పరిశోధన, మన రోగనిరోధక వ్యవస్థ పనితీరు గురించి ఉన్న ప్రాథమిక అవగాహననే మార్చివేసింది. వారి ఆవిష్కరణ ‘నియంత్రణ టి కణాలు (టి–రెగ్స్)’ మన శరీరంలో ఎంత కీలకమో నిరూపించింది. ’నియంత్రణ టి కణాలు’ అనేవి రోగనిరోధక వ్యవస్థలోని ప్రత్యేకమైన ‘శాంతి పరిరక్షకులు’గా పనిచేస్తాయి. మన రోగనిరోధక వ్యవస్థలోని ఇతర ‘టి కణాలు’ (శత్రువులను చంపేవి) పొరపాటున మన ఆరోగ్యకరమైన శరీర భాగాలనే (స్నేహితులను) శత్రువులుగా గుర్తించి దాడి చేయకుండా, ఈ ‘నియంత్రణ టి కణాలు’ వాటిపై నియంత్రణను విధించి అదుపు చేస్తాయి. ఈ ఆవిష్కరణ నిష్క్రియమైన రక్షణ (పాసివ్ టోలరెన్స్) నుండి చురుకైన నియంత్రణ(ఆక్టివ్ రెగ్యులేషన్)కు మారిన గొప్ప మార్పుగా పరిగణించబడింది.
మానవ ఆరోగ్యానికి రెండు విప్లవాత్మక ప్రయోజనాలు:
ఈ పరిశోధన మానవ ఆరోగ్యానికి సంబంధించిన రెండు కీలక రంగాలలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.
1. ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ఉపశమనం: ఆటో ఇమ్యూన్ వ్యాధులు అనేవి రోగనిరోధక వ్యవస్థ నియంత్రణ కోల్పోయి, తమ సొంత శరీర భాగాలపైనే దాడి చేయడం వల్ల వచ్చే తీవ్రమైన సమస్యలు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, టైప్ 1 డయాబెటిస్, లూపస్ వంటి వ్యాధులు కోట్లాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. సకాగుచి 1995లో నియంత్రణ టి కణాలను కనుగొని, అవి చురుకుగా ఈ స్వీయ-దాడిని అణచివేస్తాయని నిరూపించారు. ఆ తర్వాత బ్రంకోవ్, రామ్స్‌డెల్ శాస్త్రవేత్తలు ఎఫ్ఓఎక్స్ పి౩ అనే ఒకే ఒక జన్యువు ఈ ‘నియంత్రణ టి కణాల’ తయారీని, వాటి శక్తిని నియంత్రించే ముఖ్యమైన ‘మాస్టర్ స్విచ్’ అని గుర్తించారు. ఈ స్విచ్‌లో లోపం వస్తేనే ఐపిఇఎక్స్ వంటి ప్రాణాంతక ఆటో ఇమ్యూన్ రుగ్మతలు వస్తాయని స్పష్టం చేశారు. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి, శాస్త్రవేత్తలు ఇప్పుడు నియంత్రణ ‘టి కణ చికిత్స( టి-రెగ్ సెల్ థెరపీ)’ అనే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ చికిత్సలో రోగి నుంచి ‘నియంత్రణ టి కణాల’ను తీసుకొని ప్రయోగశాలలో వాటి సంఖ్యను పెంచి తిరిగి రోగికి ఎక్కిస్తారు. ఇది రోగనిరోధక సమతుల్యతను పునరుద్ధరించి ఆటో ఇమ్యూన్ వ్యాధులను తగ్గించడానికి, అలాగే అవయవ మార్పిడి తర్వాత శరీరం కొత్త అవయవాన్ని తిరస్కరించకుండా అడ్డుకోవడానికి చాలా సహాయపడుతుంది.
2. క్యాన్సర్ పోరాటంలో నియంత్రణ టి కణాల పాత్ర: ‘కణితి రక్షణ వ్యూహం’ సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థలో ఉండే ఇతర టి కణాలు క్యాన్సర్ కణాలను ప్రమాదకరమైన శత్రువులుగా గుర్తించి వాటిని చంపడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఈ పోరాటంలో ‘నియంత్రణ టి కణాలు’ జోక్యం చేసుకొని క్యాన్సర్‌కు అనుకూలంగా పనిచేస్తాయి. క్యాన్సర్ కణం చాలా తెలివైంది. ఇది తన చుట్టూ ఒక ప్రత్యేక వాతావరణాన్ని (మైక్రోఎన్విరాన్‌మెంట్) సృష్టిస్తుంది. ఈ వాతావరణంలో అది ‘నియంత్రణ టి కణాలను’ పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది. కణితి ప్రాంతంలోకి రాగానే అవి చురుకుగా ఉంటూ మిగతా యాంటీ-ట్యూమర్ టి కణాల (క్యాన్సర్‌ను చంపే సైనికులు) పనితీరును నిరోధిస్తాయి.
దీనివల్ల క్యాన్సర్ కణాలను చంపడానికి ప్రయత్నిస్తున్న శక్తివంతమైన కణాలు బలహీనపడతాయి లేదా వాటి పనిని పూర్తిగా ఆపేస్తాయి. ‘నియంత్రణ టి కణాలు’ కొన్ని రకాల రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థలోని కణాలకు ‘దాడి ఆపండి’ అనే సంకేతాన్ని అందిస్తాయి. దీని ద్వారా క్యాన్సర్ కణాల చుట్టూ ఒక బలమైన రక్షణ వలయం ఏర్పడుతుంది. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను శత్రువులుగా గుర్తించదు. ఒకవేళ గుర్తించినా దాడి చేయదు. అప్పుడు క్యాన్సర్ కణాలు సులభంగా ఎదుగుతాయి. దీన్నే ‘ఇమ్యూన్ ఎవేషన్’ అంటే రోగనిరోధక శక్తి నుండి తప్పించుకోవడం అని అంటారు.
ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీలు చాలా శక్తివంతమైనవిగా పరిగణించబడుతున్నాయి. అయితే ఈ ‘నియంత్రణ టి కణాలు’ వాటి ప్రభావానికి అడ్డుగా నిలుస్తున్నాయి. చెక్ పాయింట్ ఇన్హిబిటర్లు వంటి చికిత్సలు, క్యాన్సర్‌పై దాడి చేయకుండా ‘టి కణాలను’ అడ్డుకునే ‘లాక్‌లను’ తెరుస్తాయి. కానీ కణితి ప్రాంతంలో ‘నియంత్రణ టి కణాలు’ ఎక్కువగా ఉంటే అవి ఎన్ని లాక్‌లు తెరిచినా సరే చురుకుగా ఉంటూ రోగనిరోధక శక్తిని అణచివేస్తాయి. కార్-టి లాంటి కణ చికిత్సలలో కూడా బయట నుంచి ఎక్కించిన శక్తివంతమైన ‘టి కణాలు’ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడి ‘నియంత్రణ టి కణాల’ ప్రభావం వల్ల బలహీనపడడమో లేదా వాటి శక్తిని కోల్పోవడమో జరుగుతుంది.
ఈ అడ్డంకిని అధిగమించడం ఇప్పుడు క్యాన్సర్ పరిశోధనలో అతిపెద్ద లక్ష్యం. దీనిని శాస్త్రవేత్తలు రెండు ప్రధాన వ్యూహాలను అనుసరిస్తున్నారు. అవి ఒకటి నియంత్రణ ‘టి కణాల క్షీణత (టి – రెగ్ డిప్లేషన్). ఇవి కణితి ప్రాంతంలో ఉన్న ‘నియంత్రణ టి కణాల’ను ఎంపిక చేసి నాశనం చేయడం లేదా వాటి సంఖ్యను తగ్గించడం. ఈ “భద్రతా సిబ్బందిని” తొలగించిన తర్వాత, మిగిలిన యాంటీ-ట్యూమర్ టి కణాలు శక్తిమంతంగా మారి క్యాన్సర్‌పై పూర్తి స్థాయిలో దాడి చేయగలుగుతాయి. ఇక రెండోది నియంత్రణ సంకేతాల నిరోధం. ఇందులో ‘నియంత్రణ టి కణాలు’ తమ అణచివేసే సంకేతాలను విడుదల చేయకుండా నిరోధించడం. ఈ రెండు వ్యూహాలలో దేనిని ఉపయోగించినా అంతిమ లక్ష్యం ఒక్కటే. క్యాన్సర్ కణాలపై దాడి చేసే రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం. ఆటో ఇమ్యూనిటీలో ఈ కణాలను పెంచితే, క్యాన్సర్‌లో వాటిని తగ్గించడమే ప్రస్తుత వ్యూహాత్మక మార్పు.
సాంకేతిక సవాళ్లు:
ఈ పరిశోధన విజయవంతమైనప్పటికీ, ఈ చికిత్సలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావాలంటే కొన్ని పెద్ద సవాళ్లను అధిగమించాలి. ఇప్పుడు వాడుతున్న ‘నియంత్రణ టి కణ చికిత్స’ కంటే, మరింత మెరుగైన కార్–ట్రెగ్స్ ను తయారుచేయాలి. ఇవి కేవలం దెబ్బతిన్న శరీర ప్రాంతంలో మాత్రమే పనిచేస్తాయి, తద్వారా ఇతర చోట్ల రోగనిరోధక శక్తి అణచివేసే ప్రమాదం తగ్గుతుంది. ఒక రోగి రక్త కణాల నుండి ఈ ‘నియంత్రణ టి కణాల’ను వేరుచేసి, అభివృద్ధి చేయడం చాలా సంక్లిష్టమైన, ఖరీదైన ప్రక్రియ. ఈ ప్రక్రియ వేగంగా తక్కువ ఖర్చుతో జరగాలంటే ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలను బయో-తయారీలో ఉపయోగించడం అత్యవసరం. ఈ ‘నియంత్రణ టి కణ చికిత్స’లు అత్యద్భుతమైన భద్రతా ఫలితాలు చూపడం వలన, పెద్ద బయోఫార్మా కంపెనీలు క్యాన్సర్ పరిశోధనలతో పాటు, ఆటో ఇమ్యూన్ వ్యాధులపై పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నాయి.
ఈ నోబెల్ గుర్తింపు ఈ ‘నియంత్రణ టి కణాల’ పరిశోధనా రంగానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. భవిష్యత్తులో దీర్ఘకాలిక, బాధాకరమైన రోగనిరోధక వ్యాధులకు సురక్షితమైన, శక్తివంతమైన చికిత్సలు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు.










