
GDP అనే పదం మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. కానీ, చాలామందికి దీని గురించి తెలియదు. GDP అంటే Gross Domestic Product. దీన్నే స్థూల జాతీయోత్పత్తిగా పిలుస్తారు. దేశంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు, సేవలను GDP అని అంటారు. అది కూడా పూర్తిగా తయారైన వస్తువులను, సేవలను మాత్రమే లెక్కిస్తారు.
దీన్ని లెక్కించడానికి వ్యవసాయ, తయారీ రంగం, విద్యుత్, గ్యాస్ పంపిణీ, గనుల తవ్వకం, అడవులు, చేపల వేట, హోటల్, నిర్మాణం, వాణిజ్యం, సమాచార సంబంధాలు, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, బీమా, వాణిజ్య సేవలు, సామాజిక, ప్రజా సేవలను పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో ఇతర దేశాల నుంచి దిగుమతైన వస్తువులు లెక్కలోకి తీసుకోరు. అయితే, ప్రతి దేశానికి దాని GDP చాలా అవసరం. GDP ఎక్కువ ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని చెప్పవచ్చు.
GDP ఎక్కువ ఉండడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. ఉత్పత్తి పెరిగినప్పుడు GDP పెరుగుతుంది. ఇలా ఉత్పత్తి పెరిగి, వ్యాపారం పెరిగితే.. పన్నులు ఎక్కువ కడతారు. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఈ ఆదాయంతో దేశాన్ని అభివృద్ధి చేస్తారు.
GDPని ప్రతి త్రైమాసికానికి ఒకసారి లెక్కిస్తారు. ఒకవేళ రెండు త్రైమాసికాల్లో GDP తగ్గిందంటే దాన్ని RECESSION అని అంటారు. ఇలాంటి సమయాల్లో చాలా మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. దీంతో నిరుద్యోగం పెరిగి కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇలా ద్రవ్యోల్భణం పెరుగుతుంది. ఈ విధంగా ఒకదానితో మరొకటి లింక్ అయి ఉంటుంది. అందుకే ఏ దేశానికైనా దాని GDP పెరగడం చాలా అవసరం.






