
అమెరికా దేశం విభిన్న సంస్కృతులు, మతాలు, భాషలకు పూర్తి స్వేచ్ఛనిచ్చే అద్భుతమైన దేశం. అందుకే ఈ దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, చర్చిలు లాంటి ఎన్నో ప్రార్థనాలయాలు దర్శనమిస్తాయి. ప్రవాస భారతీయులు అనేక తరాలుగా అమెరికా జనజీవన స్రవంతిలో మమేకమై, వివిధ రంగాలలో సేవలందిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కొందరు దుర్వినియోగం చేస్తుండడంతో, ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూర డాలస్ (టెక్సాస్) నగరంలో ఏర్పాటు చేసిన ఒక అవగాహనా సదస్సులో చేసిన ముఖ్య సూచనలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కింద ఇవ్వడం జరిగింది.
ముందుగా, అమెరికా దేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా గౌరవించాలి. సభలు, సమావేశాలలో వేదికపై భారత, అమెరికా దేశపు జెండాలను ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉంచాలి. ప్రేక్షకులకు ఎడమవైపు అమెరికా పతాకం, కుడివైపు భారత పతాకం ఉండేలా చూడాలి. జాతీయ గీతాలు ఆలపించేటప్పుడు మర్యాద పాటించాలి. అమెరికా జాతీయ గీతం పాడుతున్నప్పుడు, పతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండె దగ్గర ఉంచుకోవాలి. టోపీలు ధరించినట్లయితే జాతీయ గీతాలు ఆలపించేంతసేపు వాటిని తీసి ఉంచడం మర్యాద.
భారతీయ ఉత్సవాలు, వేడుకలు జరుపుకునేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీధుల్లో లౌడ్ స్పీకర్లు, బాణసంచాలు, నినాదాలతో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. సిటీ పర్మిషన్ లేనిదే రహదారులు మూసివేయడం, బాణసంచాలు కాల్చడం వంటివి చేయకూడదు. ఈ ఉత్సవాలను సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు లేదా ఆలయ ప్రాంగణాలకు పరిమితం చేయడం ఉత్తమం. ఇటీవల ఇలాంటి ఒక ఉత్సవంలో రోడ్డుపై చిక్కుకుపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో అందరూ భయపడి చెల్లాచెదురయ్యారు. ఇలాంటి ప్రమాదకర సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి.
సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద అభిమానులు కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చేయడం, పేపర్లు విసిరి గోల చేయడం వల్ల ఇతర ప్రేక్షకులు భయపడుతున్నారు. అలాగే, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు హోటళ్లు, రోడ్ల వద్ద అభిమానులు చేసే హడావిడి, అరుపులు, కేకలు ఇతరుల శాంతికి భంగం కలిగిస్తున్నాయి. ఇలాంటి సందర్భాలలో పోలీసులు వచ్చి అందరినీ బయటకు పంపిన సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు.
ఇరుగుపొరుగు అమెరికన్లతో కలిసిమెలిసి జీవించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా, అమెరికాలో నివసిస్తున్న పట్టణాల పేర్లను తమ సొంత ఊళ్ళ పేర్లలాగా మార్చి (ఉదాహరణకు, డాలస్‌ను ‘డాలస్ పురం’గా) పలకడం మానుకోవాలి. ఇది అమెరికన్ల దృష్టిలో అపహాస్యానికి గురిచేస్తుంది. వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, స్టోర్స్‌లో దొంగతనాలు చేయడం, తాగి డ్రైవ్ చేయడం, బహిరంగ ప్రదేశాలలో సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడటం వంటి సంస్కృతిని పూర్తిగా విడనాడాలి. సోషల్ మీడియాలో అమెరికన్ రాజకీయ విమర్శలను పోస్ట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అధికారులు తరచూ ఈ సందేశాలను గమనిస్తుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన దిశానిర్దేశం చేయడం, ప్రసార మాధ్యమాలు అవగాహన కల్పించడంలో కృషి చేయడం ఎంతైనా అవసరం.










