
తెలుగు సినిమాలలో నేడు నటి కాకుండా గాయని అయినవాళ్లు అనేకులు ఉన్నారు. కానీ తెలుగు టాకీలు మొదలయిన తొలినాళ్ళలో నటీమణులే పాటలు కూడా పాడుకునే వాళ్ళు. అప్పటి సినిమాలలో నటించాలంటే తప్పనిసరిగా పాడడం వచ్చి ఉండాలి. నేపథ్య గానం మొదలవ్వడానికి టాకీలు వచ్చిన తరువాత పదేళ్లు పట్టింది. ఆ దశాబ్దాలలో తెలుగు సినిమాలను పరిశీలిస్తే చాలామంది నటీనటులు రంగస్థలం నుంచి వచ్చిన వారే. ఎందుకంటే రంగస్థలం మీద వారికి పాటలు, పద్యాలు పాడిన అనుభవం ఉంటుంది కాబట్టి. అలాంటి వారిలో కన్నాంబ, దాసరి కోటిరత్నం, కుమారి మాలతీ, జి.వరలక్ష్మి, ఎస్.వరలక్ష్మి లాంటి నటి గాయణీమనులు ఉండనే ఉన్నారు. భానుమతి, టంగుటూరి సూర్యకుమారి లాంటి వాళ్ళు సినిమాలలోకి రాకముందు నాటక అనుభవం లేకపోయినా వాళ్లకు సంగీత అనుభవం ఉండేది. ఈ రెండు వర్గాలకు చెందిన కళాకారిణిగా పేర్కొన్న నట గాయని బెజవాడ రాజారత్నం.
పైన పేర్కొన్న నటీమణుల, గాయనీమణుల పేర్లు వినిపించినంతగా బెజవాడ రాజరత్నం పేరు వినిపించికపోవచ్చు. వారిని గుర్తుపెట్టుకున్నంతగా సినీ చరిత్ర ఏమైనా గుర్తుపెట్టుకోకపోవచ్చు. కానీ 1930 – 40 దశాబ్దాలలో ప్రముఖంగా వినిపించిన గాయని రాజారత్నం. ఆ రోజులలోనూ సుప్రసిద్ధ గ్రామ్ ఫోన్ కళాకారులలో ఒకరు బెజవాడ రాజరత్నంగా పేరు తెచ్చుకొని గ్రామ్ ఫోన్ రికార్డులు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, తెలుగు టాకీల ప్రారంభంలోనే సినీ రంగ ప్రవేశం చేసి, తెలుగు సినిమా తొలి దశాబ్దాలలో రూపొందించబడిన కొన్ని విలక్షణ చిత్రాలలో పాత్రలు ధరించి పాటలు పాడి అలనాటి ప్రేక్షకులు అలరించిన స్థానం బెజవాడ రాజరత్నందే. గాయనీమణిగా ఎంత పేరు తెచ్చుకున్నారో బెజవాడ రాజారత్నం, సినీనటిగా మాత్రం ఆమె సమకాలీన నటీమణులకు ఉన్నంత పేరు రాకపోవడానికి కారణం, ఆమె ప్రధాన పాత్రలో ధరించిన సినిమాలు ఘనవిజయం సాధించకపోవడం, ఘనవిజయం సాధించిన సినిమాలలో ఆమె చిన్న పాత్రలకే పరిమితం కావడం, ఆమె సినీ జీవితం ఎక్కువకాలం కొనసాగిపోవడానికి ఇలాంటివన్నీ కారణాల అయ్యుండవచ్చు. కానీ బెజవాడ రాజరత్నం సినీ జీవితంలో తనకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
మద్రాసులోనే పూర్తిగా నిర్మాణమైన తొలి చిత్రం 1934 లో విడుదలైన “సీతా కళ్యాణం” లో సీత పాత్రధారిణి బెజవాడ రాజారత్నం. తెలుగు తెరమీద రెండో సీతగా కూడా బెజవాడ రాజరత్నం. సుప్రసిద్ద దర్శకులు వై.వి.రావు (నటి లక్ష్మీ తండ్రి) కన్నడ, తమిళ రంగాలలో విజయం సాధించాక తెలుగులో సినిమా రంగానికి వచ్చి నేర్పించిన తొలి చిత్రం “మళ్ళీ పెళ్లి”. కాంచనమాలతో కలిసి నటించిన బెజవాడ రాజారత్నం, జెమినీ చిత్ర పతాకం పై నిర్మించిన తొలి చిత్రం, తెలుగు చిత్రం “జీవన్ముక్తి”. అందులో ప్రధాన పాత్రధారిణి బెజవాడ రాజరత్నం. తెలుగు సినిమా తొలి నేపథ్య గాయని బెజవాడ రాజారత్నం. అలనాటి హాస్యనటులు లంక సత్యం దర్శకులుగా వచ్చిన తొలి చిత్రం భక్తతులసి లో నటించారు. బెజవాడ రాజరత్నం తెలుగువారి సంస్కృతిలో భాగమైన “మాయాబజార్” చిత్రంలో తలుక్కుమని మెరుస్తారు. బెజవాడ రాజారత్నం 1941 లో వచ్చిన మహాత్మా గాంధీ డాక్యుమెంటరీలో సంగీతం వహించిన నలుగురిలో ఒకరు బెజవాడ రాజారత్నం.
జీవిత విశేషాలు…
జన్మ నామం : రాజారత్నం
ఇతర పేర్లు : బెజవాడ రాజారత్నం
జననం : 1921
స్వస్థలం : చిన్నరావూరు, తెనాలి, ఆంధ్రప్రదేశ్…
వృత్తి : తెలుగు సినిమా నటి, రంగస్థల నటి
మరణం : 1962
నేపథ్యం…
బెజవాడ రాజారత్నం 1921 సంవత్సరంలో తెనాలి పట్టణంలోని చినరావూరు లో జన్మించారు. ఆమెది కళలకే అంకితమైన కళాకారుల వంశం. ఆమె కళల కంటే సంగీతంకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. ఆమె సమీప బంధువు సరస్వతి తెనాలిలో ఉండేవారు. ఆమెకు తెనాలి సరస్వతి అని పేరు. సరస్వతి మంచి నర్తకి. సహజంగానే ఆమె సంగీతంలో నిష్ణాతురాలు. రాజరత్నం తల్లి ఆమెను తెనాలి పంపించి సరస్వతి దగ్గర సంగీతంలోనూ, నృత్యంలోనూ శిక్షణ ఇప్పించారు. ఆ అనుభవంతోనే రాజారత్నం ఏడు, ఎనిమిది ఏళ్ల వయస్సులోనే నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు రాజారత్నం. ఇంకా మెరుగైన నృత్య ప్రదర్శన కోసం విజయవాడకు మకాం మార్చారు. ఆ రోజులలో జొన్నవిత్తుల శేషగిరిరావు ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు కర్ణాటక, హిందుస్థానీ సంగీతంలో ఆయనది అఖండమైన ప్రజ్ఞ. రాజారత్నంను ఆయన వద్ద శిక్షణ కోసం వాళ్ళ అమ్మ చేర్పించారు. మూడు, నాలుగు సంవత్సరాలు జొన్నవిత్తుల శేషగిరిరావు వద్ద సంగీతంలో లోతైన శిక్షణ తీసుకున్నారు రాజారత్నం. ఆ శిక్షణతో తానే స్వయంగా రంగస్థలం కళా కచ్చేరీలు చేసే స్థాయికి ఎదిగారు.
బెజవాడ రాజారత్నం గా…
ఆ రోజులలో కళాకారులను ఊరు పేరుతో గుర్తించి పిలవడం ఆనవాయితీగా అయిపోయింది. టి.సరస్వతిని తెనాలి సరస్వతి అన్నట్లు, ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు కళాకారులు ఉంటే వారిని ఊరి పేరుతో పిలవడం సులభంగా ఉండేది. ఆ రోజులలో కాకినాడ నుంచి ఇంకో రాజరత్నం ఉండేవారు. ఆవిడ మూకీ సినిమాలలో నాటకాలలో నటిస్తుండేవారు. ఆమెను కాకినాడ రాజారత్నం అని పిలిచేవారు. అప్పుడప్పుడే వచ్చిన రాజారత్నంను కాకినాడ నుంచి వచ్చిన రాజారత్నం నుండి భిన్నంగా గుర్తించడానికి బెజవాడ రాజరత్నం అని పిలుస్తుండేవారు. ఆ తరువాత రోజులలో బెజవాడ రాజారత్నం సినిమాలలోకి వెళ్ళాక కాకినాడ రాజారత్నంతో కలిసి మూడు, నాలుగు సినిమాలలో నటించారు. బెజవాడ రాజారత్నం యుక్తవయస్సులో ఉన్న పాత్రలు ధరిస్తే, కాకినాడ రాజారత్నం వయస్సు మళ్ళిన పాత్రలు ధరించేవారు. అప్పట్లో రంగస్థలం కచ్చేరీలు చేసే వారితో అప్పటి గ్రామఫోన్ రికార్డు కంపెనీ వాళ్ళు రికార్డులు ఇప్పిస్తుండేవారు. బెజవాడ రాజరత్నం, లంక కామేశ్వరరావుతో గ్రామఫోన్ రికార్డులు ఇస్తుండేవారు.
గ్రామ్ ఫోన్ రికార్డులలో…
ఆ రోజులలో గ్రామ ఫోన్ రికార్డులు గురించిన ప్రచార ప్రకటనలు సినిమా ప్రక్రియ లాగా ఉండేవి. టాకీ సినిమాలు రాని రోజులలో గ్రామ ఫోన్ రికార్డులకు ఎంతో ఆకర్షణలు ఉండేవి. ఆ విధంగా బెజవాడ రాజరత్నం ఇచ్చిన గ్రామఫోన్ రికార్డులో “మా రమణ గోపాల”, “శృంగార సుధాకర” అని రెండు పాటలు వుండగా, ఇంకో రికార్డులో “హాయి హాయి కృష్ణ”, “చిరు నగవులు చిందుతూ” అన్న పాటలు పాడారు. వీటితో పాటు “రుక్మిణి కల్యాణం”, “రాధాకృష్ణ” అనే రికార్డులు ఇచ్చేవారు. ఒకవైపు రంగస్థలం నాటకాలలో నటిస్తూనే అవసరమైనప్పుడు తాను నటించే నాటకాలకు సంగీతంలో సహాయం చేస్తూ ఉండేవారు. ఇంత అనుభవం పేరు సంపాదించుకున్న రాజారత్నంను మొదటి సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. 1934 లో మచిలీపట్నం నుండి ఒక వ్యాపారవేత్త మద్రాసుకు చేరుకున్నారు. ఆయన మచిలీపట్నంలో పెట్రోల్ బంకులు, వ్యవసాయ పొలాలు ఉండేవి. వివిధ వ్యాపారాలలో అనుభవం సంపాదించిన ఆయన సినిమా వ్యాపారం ఎలా ఉంటుందో చూద్దామని, చేద్దాం అని వచ్చారు. ఆయన పేరు పి.వి.దాసు గారు.
సినీ నేపథ్యం…
మచిలీపట్నం నుండి వచ్చిన పినపాల వెంకట దాసు కొంతమంది తమిళులను కలుపుకొని “వేల్ పిక్చర్స్” ను స్థాపించి, స్టూడియో నిర్మాణాన్ని మొదలుపెట్టారు. టాకీలు మొదలైన కొత్తలో సినిమాలు నిర్మాణం కలకత్తా, బొంబాయి, కొల్లాపూర్ లలో జరిగేవి. ఆ విధానానికి స్వస్తి చెప్పి పి.వి.దాసు మద్రాసులోనే సినిమా నిర్మానానికి పూనుకున్నారు. వేల్ పిక్చర్ తరఫున నిర్మించ తలపెట్టిన సినిమా పేరు “సీతా కళ్యాణం”. ఇతర భాషలో తయారైన స్క్రిప్ట్ తీసుకుని దానిని తెలుగులోకి అనువదించారు. అప్పట్లో సినిమాలకు కథానాయకులు దొరకడం కష్టంగా ఉండేది. అందువలన నిర్మాతలే ఆంధ్రదేశమంతా తిరిగి టాకీ సినిమాలకు నటీనటులను ఎంపిక చేసుకునే ఆనవాయితీ ఉండేది. ఆవిధంగా ఆ రోజులలో పి.వి.దాసు బృందం “సీతా కళ్యాణం” లో కథానాయకుడిగా రాముడు పాత్ర కోసం మాస్టర్ కళ్యాణి, సీత పాత్ర కోసం బెజవాడ రాజారత్నంను ఎంపిక చేశారు. నట గాయని బెజవాడ రాజారత్నం పాడిన పాటలు అప్పటికే ఆంధ్రదేశమంతటా గ్రామ ఫోన్ రికార్డులలో ప్రచారంలో ఉన్నాయి. అందులోనూ నాటకాలలో అనుభవం కూడా ఉంది.
తొలి సినిమా “సీతా కళ్యాణం” (1934)…
ఆ విధంగా బెజవాడ రాజారత్నం సినీరంగ ప్రవేశం జరిగింది. “సీతాకళ్యాణం” సినిమాలో రాజరత్నం నాలుగు పాటలు పాడుకున్నారు. ఆ రోజులలో ఉన్న సాంకేతికత ప్రకారం చిత్రీకరణ సమయంలోనే పాటలు పాడేవారు. చెలికత్తెలతో “చెలియా పరిమళ మిళిత సుమములచే విలసిత డోలికలూపెదము” అనే పాటను, సీత ఒక్కతే “ఆనందమై అలలారుచుండెను” అనే పాట, “మానస చోరా సుధీరా” అనే పాట, శ్రీనాథ తరించితిని నీ కృప చేతనే కదా శ్రీనాథా” అనే పాట. అప్పట్లో పాటలు ఇప్పట్లో లాగా మూడు నాలుగు చరణాలు కలిసి ఉండేవి కావు. చరణమో, పల్లవో, అనుచరణమో కలిసి చిన్న చిన్న పాటలు ఎక్కువగా వుండేవి. బెజవాడ రాజరత్నం “సీతా కళ్యాణం” లో పాడిన నాలుగు పాటలు కూడా చిన్నవే. 06 అక్టోబరు 1934 నాడు విడుదలైన “సీతా కళ్యాణం” విజయవంతంగానే ప్రదర్శించబడింది. తొలి ప్రయత్నంగా నిర్మాతలకు నష్టాలను తెచ్చి పెట్టలేదు. స్త్రీ పాత్రధారి అయిన “రాజరత్నం” కూడా సినీ తారగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటివరకు ఆమె గ్రామఫోన్ గాయనిగా, రంగస్థలం నటిగా మాత్రమే తెలుసు. కానీ బెజవాడ రాజారత్నం ఆ తరువాత మరో ఐదేళ్లదాకా ఏ సినిమాల్లో కూడా నటించలేదు. ఆమె పాల్గొంటున్న గ్రామఫోన్ రికార్డులు, రంగస్థలం నాటకాలు అలాగే కొనసాగుతూ వచ్చాయి.
మళ్ళీ పెళ్లి…
నిజానికి నట గాయనీమణులు రంగస్థల నటీనటులు ఆ రోజులలో సినిమాల కంటే రంగస్థలం వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉండేవారు. ఈ ధోరణి మారి సినిమాలకే ఎక్కువ ఆకర్షణ రావడానికి ఐదేళ్లు పట్టింది. బెజవాడ రాజరత్నం నటించిన రెండో చిత్రం 1939 డిసెంబరులో విడుదలైన “మళ్లీ పెళ్లి” సాంఘిక చిత్రం. దీనిలో నాయక, నాయికలు వై.వి.రావు, కాంచనమాల ఒక జంటగా, బెజవాడ రాజారత్నం, కొచ్చర్లకోట సత్యనారాయణ వీరిద్దరూ మరొక జంటగా నటించారు. బెజవాడ రాజారత్నం రెండో ప్రధాన స్త్రీ పాత్రలో నటించారు. ఇందులో వితంతు పాత్ర ధరించినది కాంచనమాల. హీరో వై.వి.రావు, ఆయన చెల్లెలు పాత్ర బెజవాడ రాజారత్నం. ఈమె కాంచనమాలతో కలిసి ఒక లఘు గీతం పాడారు. ఆ పాట “ఆనందమేగ వాంఛనీయము” పాట ఆ దశాబ్దంలోనే ఒక మంచి పాటగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. కానీ ఆమె సమకాలీన కథానాయకులతో పాటు సినిమాలలో నటించలేకపోవడం ఆశ్చర్యకరం.
దేవత (1941)…
“మళ్లీ పెళ్లి”(1939) తరువాత వై.వి.రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా “విశ్వమోహిని” (1940). ఇందులో కూడా రెండో ప్రధాన నాయిక పాత్ర. ఈ చిత్రం 1940 నవంబరులో విడుదలైంది. ఈ సినిమాలో ప్రధాన నాయిక లలితా దేవి అనే తమిళ నటీమణి. విశ్వమోహిని లో రాజరత్నం నటన కంటే ఆమె పాడిన పాటలు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. ఇందులో బెజవాడ రాజారత్నం పాడిన పాట “ఈ పూపొదరింట సేద దీర్చుకుని” పాట గురించి మొదలి నాగభూషణం శర్మ వ్రాస్తూ ఆ పాటకు ఆనాడు యువకులలో కలిగిన ఉత్సాహం తెలుగు సినిమాలలో యవ్వనోదయ మధురిమలకు నాందిగా చెప్పవచ్చు అన్నారు.
ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఈ సినిమాల తరువాత ఏడాదిలోపే జూలై 1941 లో విడుదలైన బి.యన్.రెడ్డి దర్శకత్వం వహించిన “దేవత” అనే చిత్రం. బెజవాడ రాజరత్నంకి తన స్వల్ప నట జీవితంలో మరుపురాని చిత్రం గా చెప్పుకోవచ్చు. ఇందులో నాగయ్య సంగీత దర్శకత్వంలో బెజవాడ రాజరత్నం ఐదు పాటలు పాడారు. అన్నింటికన్నా విజయవంతమైన పాటగా “మగవారినిలా నమ్మరాదే చెలి” అనే పాట చెప్పుకోదగ్గది. ఇందులో ఆమె పాడిన ఇంకో పాట “జాగేలా వేరపేలా త్రాగుము రాగసుధ రసము అనురాగ సుధా రసము” అనే పాట కొన్ని సంవత్సరాల పాటు యువతరాన్ని ఒక ఊపు ఊపేసింది అని విశ్లేషకుల అభిప్రాయం.
మహాత్మా గాంధీ డాక్యుమెంటరీ ….
దేవత చిత్రం తరువాత బెజవాడ రాజారత్నం దక్షయజ్ఞం లో నటించారు. ఒకే సంవత్సరం తాను నటించిన మరొక చిత్రం దక్షయజ్ఞం. ఇది 1941లో విడుదలైంది. ఇందులో ప్రధాన స్త్రీ పాత్రధారిణి కృష్ణవేణి. ఆ తరువాత కనిపించే పాత్ర బెజవాడ రాజారత్నం. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు ప్రసూతి. ఇందులో బెజవాడ రాజారత్నం ఒక పాట పాడారు. 1941లో బెజవాడ రాజరత్నం నటించకపోయినప్పటికీ పాటలు పాడిన ఇంకో చిత్రం “మహాత్మా గాంధీ”. ఇది డాక్యుమెంటరీ చిత్రం. దానికి వ్యాఖ్యానం వ్రాసింది “తాపీ ధర్మారావు రాయుడు” అయితే, నేపథ్య గానం పాడినవారు బెజవాడ రాజరత్నం, పసుపులేటి కన్నాంబ, టంగుటూరు సూర్యకుమారి, చిత్తూరు నాగయ్య. ఇందులో మొట్టమొదటి పేరు బెజవాడ రాజరత్నం. ఈ డాక్యుమెంటరీలో బెజవాడ రాజరత్నం రెండు పాటలు పాడారు. మొదటిది “వర గాంధీ కరుణకనర మా సేవ మహాత్మ బిరాన” అనే పాట, రెండోది “ఎదురు చూడ నీవె గాంధీ ఏ దెసకేగ అంతట నీ మహిమేగా” అనేది. ఈ రెండు పాటలు చివర్లో రెండు పంక్తులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీకి ఎంత స్థానం ఉందో, బెజవాడ రాజారత్నం కు అంతే ప్రత్యేక స్థానం ఉంది.
జెమినీ వారి “జీవన్ముక్తి”…
ఆ తరువాత 1942 జనవరిలో విడుదలైన “జీవన్ముక్తి” కి ప్రత్యేక స్థానం ఉంది. నిజానికి ఈ సినిమా అంతగా ప్రజాదరణ పొందలేదు. జీవన్ముక్తి అనేది జెమినీ పతాకం పై నిర్మించిన మొదటి చిత్రం. దానికి తెరవెనక దర్శకత్వం వహించింది లంక సత్యం. జీవన్ముక్తిలో ప్రధాన పాత్రలు ఒక చర్మకారుడు, అతని భార్య, అతని కొడుకు. చర్మకారుడిగా పాత్ర ధరించినది పువ్వుల సూరిబాబు. ఆయన భార్యగా “బెజవాడ రాజరత్నం” నటించారు. ఈ భక్తి రస ప్రధాన చిత్రంలో “ఆయే వేళాయే హరి మా యిలు సేరగ వేళాయె” అనే లఘు గీతం బెజవాడ రాజరత్నం పాడారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన లంక సత్యం తరువాత రోజులలో బెజవాడ రాజారత్నంకు ఒక తెలుగు సినిమా, ఒక తమిళ సినిమాలో అవకాశం ఇచ్చారు.
భక్త పోతన…
జీవన్ముక్తి సినిమా తరువాత బెజవాడ రాజారత్నం రికార్డుకు ఎక్కిన సినిమా “భక్త పోతన”. ఇది జనవరి 1943 లో విడుదలైంది. ఇందులో బెజవాడ రాజరత్నం నటించలేదు. కానీ అందులో ఒక నటీమణికి నేపథ్య గానం పాడారు. చాలా మందికి తెలుగులో మొట్టమొదటి నేపథ్య గాయని రావు బాలసరస్వతి అంటారు. కానీ రావు బాల సరస్వతి, కమలా కోట్నీస్ కు నేపథ్యగానం చేసిన “భాగ్యలక్ష్మి” చిత్రం “భక్త పోతన” తరువాత విడుదలైంది. అందువలన సాంకేతికంగా చూస్తే బెజవాడ రాజరత్నం తెలుగు సినిమాలలో మొట్టమొదటి నేపథ్య గాయని అని సంగీత విశ్లేషకులు తేల్చి చెప్పారు. “భక్త పోతన” లో భోగినీ అనే నర్తకి వేషం వేసిన ఆమె పేరు “సామ్రాజ్యం”. ఆమెకు “ఇది మంచి సమయము రారా” అనే జావళిని పాడారు బెజవాడ రాజరత్నం. ఆ తరువాత బెజవాడ రాజరత్నం చిన్న పాత్ర పోషించి ఉన్న సినిమా పేరు వై.వి.రావు దర్శకత్వంలో 1944 విడుదలైన తహసీల్దారు. భానుమతి, కమలా కోట్నీస్ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాలో బెజవాడ రాజరత్నం ఒక పాటలో ఒక చరణం పాడారు. ఆమె విడిగా పాటలు తహసీల్దారు లో లేవు.
చివరి చిత్రం జగదేక వీరుని కథ…
1946లో బెజవాడ రాజరత్నం నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో లంక సత్యం దర్శకత్వం చేసిన “భక్త తులసీదాస్”, ఘంటసాల బలరామయ్య దర్శకత్వం వహించిన “ముగ్గురు మరాఠీలు”. ఈ రెండు సినిమాలలో ఆమె ధరించిన పాత్ర చిన్నవే. కానీ ఆమె ఈ రెండు సినిమాలలో పాటలు పాడారు. ముగ్గురు మరాఠీలలో అయితే “జీవనము యమున జీవనము” అనే పాటను పాడారు. స్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులలో పతాక సన్నివేశానికి వచ్చిన రోజులవి. ఆ రోజులలో సినిమా కథ జానపదమైనా, పౌరాణికమైనా దేశభక్తి గీతాలు చూపించిన కొంతమంది దర్శకులు ఉండేవారు. ఆ తరువాత 1948లో లంక సత్యం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం మోహినీ విడుదలైంది.
అందులో మాధురి అనే తమిళ నటీమణికి పాటలు నేపథ్యం గానం చేశారు. రాజారత్నం 1950లో లక్ష్మమ్మ అనే సినిమాలో సంగీత దర్శకుడు, ఘంటసాల తో కలిసి ఒక పాట పాడారు. బెజవాడ రాజరత్నం ఇలా 1940 – 1950 మధ్యలో ఒక మాదిరి వేగంతో సాగిన బెజవాడ రాజరత్నం సినీ జీవితం 1950 తరువాత పూర్తిగా నెమ్మదించింది. 1952 లో విడుదలైన “మాయాబజార్” చిత్రంలో విన్నావా యశోదమ్మ అనే పాట అంతర్నాటకంగా వస్తుంది. అందులో యశోదమ్మ పాత్రధారిణిగా బెజవాడ రాజారత్నం, చిన్ని కృష్ణుడుగా నటించినది హీరోయిన్ రేఖ తమ్ముడు బాబ్జి. బెజవాడ రాజరత్నం నటించిన ఆఖరి చిత్రం “మాయాబజార్”. దీని తరువాత 1961 లో వచ్చిన జగదేకవీరుని కథలో గాయనిగా యక్ష కన్యల మీద చిత్రీకరించిన పాటలో కొన్ని పంక్తులు పాడారు. సినీ గాయనిగా బెజవాడ రాజరత్నం కు చివరి చిత్రం జగదేకవీరుని కథ.
మరణం…
సినిమాలలో అవకాశాలు తగ్గిపోయాక ఆమె బెజవాడకు చేరుకున్నారు. 1960 ప్రాంతాల్లో ఆమె వయసు 40 సంవత్సరాలు ఉంటుంది. 1960 ప్రాంతంలో బెజవాడ రాజరత్నం ఒక నాటక సమాజాన్ని మొదలుపెట్టి “సతీసక్కుబాయి” అనే నాటకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే విజృంభిస్తున్న సినిమాల ప్రభావం నాటక రంగంపై పడుతుంది. బెజవాడ రాజరత్నం ప్రదర్శించిన నాటకానికి కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. ఆ నాటక సమాజాన్ని కూడా బెజవాడ రాజారత్నం తొందరగానే మూసేయాల్సి వచ్చింది. చివరి రోజులలో ఒంటరితనాన్ని మోస్తూ జీవితాన్ని భారంగా గడుపుతూ బెజవాడలోనే మరణించారు బెజవాడ రాజారత్నం.
ఇట్టి విషయాన్ని మొదలి నాగభూషణ శర్మ వ్రాసిన పుస్తకంలో ఉన్నట్లు సమాచారం. తమ ప్రతిభాపాఠవాలతో తమకున్న పరిధిలోనే కళాసేవ చేసిన కొంతమంది కళాకారుల జీవితపు చివరిదశ విషాదమయం కావడం చాలా విషాదకరం. సమకాలీన నటీమణులు చాలామందికి వచ్చిన పేరు “బెజవాడ రాజారత్నం” కు వచ్చి ఉండకపోవచ్చు. ఎక్కువ సినిమాలలో నటించి ఉండకపోవచ్చు. కానీ ఆ దశాబ్దాలలో ఆమెకు ఉన్న ప్రాచుర్యం మాత్రం దేని ప్రత్యేకత దానిదే. తెలుగు టాకీల తొలి దశాబ్దాలలో, ఆ దశాబ్దాలలోని గ్రామ ఫోన్ రికార్డులలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బెజవాడ రాజరత్నం లాంటి కళాకారులను అప్పుడప్పుడైనా గుర్తుకు తెచ్చుకోవడం కళాభిమానుల కర్తవ్యం.

