Telugu News

ట్రంప్ మాస్టర్ ప్లాన్; ఎమిరేట్స్ సంచలన నిర్ణయం, సౌదీకి షాక్!

ట్రంప్ మాస్టర్ ప్లాన్.. సౌదీ ఆధిపత్యానికి గండి కొట్టిన ఎమిరేట్స్! ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలను నియంత్రించే ‘ఒపెక్’ (OPEC) అనే బలమైన కూటమి నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బయటకు వచ్చేసింది. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించినా, దీని వెనుక పెద్ద స్కెచ్ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ చాలా తెలివైన వారని, ఈ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గుతాయని ఆయన ఆశపడుతున్నారు. ఇన్నాళ్లూ తన మాట వినలేదని ఒపెక్ మీద కోపంగా ఉన్న ట్రంప్‌కు, ఎమిరేట్స్ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.

UAE OPEC నిర్ణయం కారణం..

నిజానికి ఈ నిర్ణయానికి అసలు కారణం సౌదీ అరేబియాతో ఉన్న పంతం. ఇన్నాళ్లూ ఆ కూటమిలో సౌదీ అరేబియా చెప్పిందే ఆట.. పాడిందే పాటలా సాగింది. ఎమిరేట్స్ తన దగ్గర ఉన్న చమురును ఎక్కువగా అమ్ముకుందామన్నా సౌదీ అడ్డుపడుతూనే ఉంది. ఈ ‘బాస్’ పెత్తనం భరించలేక, తనకున్న టార్గెట్ (రోజుకు 50 లక్షల బారెల్స్) పూర్తి చేయాలనే కసితో ఎమిరేట్స్ బయటకు వచ్చేసింది. దీనికి తోడు ఇరాన్ చేసిన దాడులతో దెబ్బతిన్న తన చమురు బావులను, నౌకలను తిరిగి బాగు చేసుకోవాలంటే.. ఎంత వీలైతే అంత చమురును అమ్మి డబ్బులు సంపాదించడమే ఎమిరేట్స్ ముందున్న ఏకైక మార్గం.

ఒపెక్ పట్టు తప్పుతోంది

గత 60 ఏళ్లుగా చమురు ప్రపంచాన్ని శాసించిన ఒపెక్ పట్టు ఇప్పుడు సడలిపోతోంది. ఎమిరేట్స్ లాంటి పెద్ద దేశం బయటకు రావడంతో, ఆ కూటమి మాట చెల్లుబాటు కావడం కష్టమే. ఎమిరేట్స్ ఇకపై తనకి నచ్చినంత చమురును బయటకు తీసి, నచ్చిన రేటుకు అమ్ముకోవచ్చు. అమెరికాకు కావాల్సినంత సప్లై చేయవచ్చు. ఇది చూసి రేపు మరికొన్ని దేశాలు కూడా ఒపెక్ నుండి బయటకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి ఎమిరేట్స్ తన స్వతంత్రతను చాటుకుంటూ, సౌదీ పెత్తనానికి చెక్ పెట్టింది.

మన దేశానికి కలిసొచ్చే అంశం

మన భారతదేశానికి ఇది నిజంగా శుభవార్తే! ఎమిరేట్స్‌తో మనకు చాలా మంచి స్నేహం ఉంది. ఆ దేశం తన ఉత్పత్తిని పెంచితే.. మనకు కావాల్సిన చమురును మరింత సులభంగా పొందవచ్చు. ప్రస్తుతం మనకు అందుతున్న దానికంటే ఎక్కువ శాతం చమురు ఎమిరేట్స్ నుండి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మనం డాలర్లకు బదులు మన ‘రూపాయి’లోనే పేమెంట్ చేసేలా డీల్ కుదుర్చుకుంటే.. మన దేశ ఆర్థిక పరిస్థితికి అది పెద్ద బూస్ట్ అవుతుంది. చమురు సంక్షోభం ఉన్న ఈ సమయంలో ఎమిరేట్స్ అడుగు మనకు లాభం చేకూర్చేలా ఉంది.

మరిన్ని వార్తలు:

యుద్ధమా?ఒప్పందమా? పశ్చిమాసియాలో వేడెక్కిన ’రాజకీయ’ సముద్రం!

ఇరాన్ యుద్ధం.. భారత్‌కు చమురు గండం

వయసు జెన్-జెడ్.. రూట్ మీమ్ పాలిటిక్స్: అసలేంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ?

Show More
Back to top button