Telugu News

వ్రతాల మాసం వచ్చింది..ఈరోజు నుంచే శ్రావణ మాసం ప్రారంభం!

శ్రావణం.. వర్షాలు తీసుకొస్తుంది. రైతులకు  హర్షాతిరేకాలను మోసుకొస్తుంది. ఈ మాసం రాకతో మేఘాలు వర్షిస్తాయి. చెరువులు, కుంటలు నిండుతాయి. పంటలు సైతం బాగా పండుతాయి. ఇది ప్రకృతిలో కనిపించే మార్పు. వాతావరణం మొత్తం ఆహ్లాదకరంగా మారుతుంది. అలానే ఆధ్యాత్మికపరంగా చూస్తే తెలుగు మాసాల్లో శ్రావణమాసం ఎంతో ప్రత్యేకమైంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసమిది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈ మాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు విశేష ఫలితాన్ని అందిస్తాయి. శ్రవణా నక్షత్ర ప్రవేశంతో మొదలయ్యే ఈ మాసం అంటే మహాశివుడికి కూడా అత్యంత ఇష్టమని భక్తుల నమ్మకం. శ్రావణమాసం అంటే, ‘శుభ మాసం’, ‘నభో మాసం’ అని కూడా అంటారు. ‘నభో’ అంటే ఆకాశమని అర్ధం. 

ఈ నెల మొత్తం ప్రతిరోజూ ఏదో ఒక పర్వం పలకరిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహానికి అనువైన మాసం. మంగళగౌరీ ఆశీస్సులు పొందడానికి ఇదే ఉత్తమమైన సమయంగా చెప్పవచ్చు. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. అటువంటి మంగళకరమైన శ్రావణమాసం ఈ నెల 25 నుంచి ప్రారంభమై, వచ్చే నెల 23న ముగుస్తుంది. ఈ సందర్భంగా శ్రావణ మాసం విశేషాలివిగో:

వ్రతాల ప్రత్యేకత..

శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారం కూడా పవిత్రమైందే. ప్రతి తిథి విశేషమైందే. వరలక్ష్మి వత్రం, మంగళగౌరి వ్రతం, శ్రావణ మాస వ్రతం, శివ వ్రతం, జీవంతికాదేవీ వ్రతం, నారసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం.. ఇలా వివిధ తిథి, వారాల్లో నెల పొడవునా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. శ్రావణాన్ని శివరూపంగా స్కాంద పురాణం చెబుతోంది. శ్రావణంలో శ్రవణ మాత్రంతో (వినడంతోనే) మంచి కలుగుతుందని పెద్దలు చెబుతారు.

ఈ నెలలో శ్రావణ మాస వ్రతం అనగా నక్త వ్రతంను ఆచరిస్తారు కొందరు. శ్రావణ శుద్ధ పాడ్యమి మొదలు బహుళ అమావాస్య వరకు కొనసాగే ఈ వ్రతంలో.. నెల రోజులపాటు ఈశ్వరారాధనను చేస్తూ ఉపవాసం ఉంటారు. రాత్రి పూట మాత్రమే భోజనం చేస్తారు. బ్రహ్మచర్యం పాటిస్తూ, నేలపైనే నిద్రిస్తారు. సాధన సంపత్తిని పెంచుకోవడానికి, ఈశ్వర అనుగ్రహం సంపాదించడానికి ఈ వ్రతాన్ని పాటిస్తారు.

శివ కేశవుల ఆరాధన..

శ్రవణం శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం. శ్రీమహావిష్ణువు అర్ధాంగి అయిన శ్రీమహాలక్ష్మిని ప్రత్యేకంగా అర్చించడం కూడా ఈ మాసంలో కనిపిస్తుంది. పరిశీలన చేస్తే లక్ష్మీదేవి, మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి వీలైన మాసం ఇది. వేదాలను కాపాడేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవునిగా అవతారం ధరించింది కూడా ఈ నెలలోనే. అందువల్ల ఈ నెలలో వేదగ్రంథ ముద్రణకు సహకరించడం పుణ్యప్రదం. కనీసం వేద విద్యార్థులకు గ్రంథాలు దానం చేసినా శ్రీమహావిష్ణువును సేవించిన ఫలితం కలుగుతుందని పెద్దలమాట.

శ్రావణ సోమవారాల్లో మహాశివుడికి అభిషేకాలు, అర్చనలు చేయాలి. కాశి, ఉజ్జయిని, సోమనాథ్‌ వంటి శైవక్షేత్రాలు అనేవి ప్రత్యేకించి శ్రావణ సోమవారాల్లో భక్తులతో కిటకిటలాడుతాయి. 

ఈ రకంగా శివకేశవ అభేదాన్ని ఈ మాసం చాటుతుంది. 

శ్రీ కృష్ణపరమాత్మ అవతరించింది ఈ శ్రావణంలోనే. గరుత్మంతుడు అమృతభాండాన్ని సాధించింది కూడా ఈ నెలలోనే. 

ఒక్కో రోజు.. ఒక్కో దేవత..

శ్రావణంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజించాలని శాస్త్రం సూచించింది. 

ఈ ప్రకారం శ్రావణ సోమవారాల్లో పరమేశ్వరుడు; మంగళవారాల్లో గౌరీ వ్రతం లేదా అర్చనలు; బుధవారం విఠలేశ్వరుడు; గురువారాల్లో గురుదేవుడు; శుక్రవారాల్లో లక్ష్మీదేవి లేదా తులసి పూజలు; శనివారాల్లో శనీశ్వరుడు, వేంకటేశ్వరుడు, ఆంజనేయ స్వామికి విశేషంగా అర్చనలు చేయాలని పేర్కొన్నారు.

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం చేయాలంటారు. ఈ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున శ్రీరమాసహిత సత్యనారాయణస్వామి వారి వ్రతం చేయాలని చెబుతారు. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఉన్ననాడు ఈ వ్రతం ఆచరిస్తే అత్యంత శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం. *శ్రావణంలో ప్రతి మంగళవారం ముత్తయిదువులందరూ విధి నియమాలు, ఆచారాల ప్రకారం మంగళగౌరీ దేవిని భక్తిశ్రద్ధలతో అర్చించి, వ్రతం చేస్తారు. ప్రత్యేకించి, నూతన వధువులు ఈ మంగళ గౌరీ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు. దీనిని శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పాడని పురాణ కథనం. 

*శ్రావణంలో నెల రోజులు పగటిపూట నిద్రించకూడదు. ఒక పూట మాత్రమే భోజనం చేసి, మంగళగౌరీ దేవిని అర్చిస్తే సకల శుభాలు, మాంగళ్య సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం.

*శ్రావణమాసం అనగానే గుర్తుకువచ్చే వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఏ కార్యానికైనా ‘సిద్ధి’ ప్రధానం. అది లేకపోతే కార్యానికి ప్రయత్నమే ఉండదు. అందుకే ‘సిద్ధి’ అనేది మొదటి లక్ష్మి. ఈ దేవత అనుగ్రహం కలిగితే కార్యం సకారం అవుతుందని.. ఆ ముక్తి కల్పించే ‘మోక్షలక్ష్మి’ కూడా సిద్ధిస్తుందని అంటారు. ప్రతికూల పరిస్థితులను దాటడమే ‘జయలక్ష్మి’. కార్యసాధనకు కావలసిన తెలివితేటలు, సమయస్ఫూర్తి, నిర్ణయశక్తి, విజ్ఞానం మొదలైనవి ‘విద్యాలక్ష్మి’. అంటే ‘సరస్వతి’. ఈ సరస్వతి ఫలితంగా పొందే సంపద, ఆనందం ‘శ్రీలక్ష్మి’. దానివల్ల కలిగే శ్రేష్ఠత్వం, ఉన్నతి ‘వరలక్ష్మి’. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం ఉంది. ఈ శ్రేష్ఠత లక్ష్మీ స్వరూపం. శ్రేష్ఠమైన/ ఉన్నతమైన లక్ష్మి (సంపద)ని పొందడమే అందరికీ చివరి గమ్యం. శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీ దేవిని అర్చించి, శాస్త్ర నియమానుసారంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలూ సిద్ధిస్తాయి.

*ఈ నెలలో వచ్చే పంచమిని ‘నాగపంచమి’గా పిలుస్తారు. సంతానం లేనివారు ఈ రోజున ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి నాగ దేవతను పూజిస్తే సంతానం కలుగుతుందని, సర్వదోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. 

Show More
Back to top button