మంచి రాబడి అందించే పెట్టుబడి మార్గాల్లో స్టాక్ మార్కెట్ ఒకటి. అయితే ఇందులో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. మార్కెట్లో షేర్ల ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కంపెనీల పనితీరు, ఆర్థిక పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ధరలు మారుతుంటాయి. అందుకే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
1. దీర్ఘకాలిక లక్ష్యంతో పెట్టుబడి పెట్టండి: మార్కెట్ ప్రతి రోజూ ఒకేలా ఉండదు. ఒకరోజు లాభాల్లో ఉంటే.. మరో రోజు నష్టాల్లో ఉండవచ్చు. కాబట్టి స్వల్పకాలిక లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో పెట్టుబడులు పెట్టడం మంచిది. పిల్లల చదువులు, ఇల్లు కొనుగోలు, రిటైర్మెంట్ వంటి అవసరాల కోసం పెట్టుబడి పెట్టినవారు మార్కెట్ పడిపోయినప్పుడు కంగారు పడకుండా తమ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. రోజువారీ ఒడిదుడుకులను చూసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
2. తక్కువ ధర షేర్లపై అత్యాశ వద్దు: చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్ల ధరలు తక్కువగా ఉండవచ్చు. వీటిని ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తే భారీ లాభాలు వస్తాయని చాలామంది భావిస్తారు. కానీ కంపెనీ గురించి తెలుసుకోకుండా కేవలం తక్కువ ధరకు వస్తోందని షేర్లు కొనడం ప్రమాదకరం. కంపెనీ ఆర్థిక పరిస్థితి, వ్యాపార భవిష్యత్తును పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టాలి.
3. కొంత నగదును సిద్ధంగా ఉంచుకోండి: మార్కెట్లు భారీగా పడిపోయినప్పుడు మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవడానికి కొంత నగదును సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. అందుకే ప్రతి నెలా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని పెట్టుబడి కోసం పొదుపు చేయాలి. అయితే మార్కెట్ పడిపోయిందని వెంటనే కొనుగోలు చేయకుండా కంపెనీ పరిస్థితిని కూడా పరిశీలించాలి.
4. పెట్టుబడులను విభజించుకోండి: మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని కేవలం స్టాక్ మార్కెట్లోనే పెట్టుబడి పెట్టకూడదు. ఈక్విటీతో పాటు బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడి మార్గాల్లోనూ కొంత మొత్తాన్ని కేటాయించాలి. ఇలా చేయడం వల్ల ఒక రంగంలో నష్టాలు వచ్చినా మరో పెట్టుబడి కొంతవరకు ఆ నష్టాన్ని తగ్గించగలదు.
5. ఒకే కంపెనీపై ఆధారపడొద్దు: మీ పెట్టుబడి మొత్తాన్ని ఒకే కంపెనీ షేర్లలో పెట్టడం మంచిది కాదు. ఒకవేళ ఆ కంపెనీ వ్యాపారం దెబ్బతింటే మీ పెట్టుబడికి భారీ నష్టం రావచ్చు. కాబట్టి వివిధ రంగాలకు చెందిన మంచి కంపెనీలను ఎంచుకుని పెట్టుబడులను విభజించుకోవాలి. దీనివల్ల ఒకే కంపెనీపై ఆధారపడే రిస్క్ తగ్గుతుంది.
6. అప్పు చేసి పెట్టుబడి పెట్టొద్దు: స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో అప్పు చేసి షేర్లు కొనడం ప్రమాదకరం. మార్కెట్ మన అంచనాలకు విరుద్ధంగా కదిలితే పెట్టుబడితో పాటు అప్పు భారం కూడా పెరుగుతుంది. కాబట్టి రోజువారీ ఖర్చులు, అత్యవసర అవసరాలకు ఇబ్బంది కలగకుండా.. మీ దగ్గర ఉన్న అదనపు డబ్బునే పెట్టుబడిగా ఉపయోగించాలి.
7. కంపెనీ వివరాలు తెలుసుకోండి: ఏదైనా కంపెనీ షేర్లు కొనుగోలు చేసే ముందు ఆ కంపెనీ వ్యాపారం, ఆదాయం, అప్పులు, లాభాలు, భవిష్యత్తు అవకాశాలను పరిశీలించాలి. కంపెనీ గత పనితీరు ఎలా ఉంది? ప్రస్తుతం ఏ రంగంలో పనిచేస్తోంది? భవిష్యత్తులో వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయా? వంటి విషయాలను తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, ఇతరుల సలహాలు మాత్రమే నమ్మి షేర్లు కొనకూడదు.
8. అత్యాశతో ట్రేడింగ్ చేయొద్దు: తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఆశతో తరచూ షేర్లు కొనడం, అమ్మడం చేయకూడదు. ముఖ్యంగా ఫ్యూచర్స్, ఆప్షన్స్ వంటి ట్రేడింగ్లో నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సరైన అవగాహన, అనుభవం లేకుండా వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఉన్న డబ్బును కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి.










