ముఖంపై నల్లటి మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు, చర్మం నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలను కొందరు ‘ఫెర్రిటిన్ ఫేస్’ అని పిలుస్తున్నారు. అయితే ఇది వైద్యపరంగా గుర్తించిన ప్రత్యేక వ్యాధి కాదు. శరీరంలో ఐరన్ నిల్వలు తగ్గినప్పుడు కనిపించే కొన్ని లక్షణాలను ఈ పేరుతో వివరిస్తున్నారు. ఫెర్రిటిన్ అనేది శరీరంలో ఐరన్‌ను నిల్వ చేసే ప్రొటీన్. రక్తంలో దీని స్థాయిలు తగ్గితే ఐరన్ నిల్వలు తక్కువగా ఉన్నాయని అర్థం. ఐరన్ తగ్గడం వల్ల హిమోగ్లోబిన్ తయారీ కూడా దెబ్బతిని రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది.
ఫెర్రిటిన్ తగ్గితే ముఖంపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
ఫెర్రిటిన్ స్థాయిలు తగ్గినప్పుడు చర్మం పాలిపోయినట్లు కనిపించడం, జుట్టు ఎక్కువగా రాలడం, గోర్లు బలహీనపడటం వంటి సమస్యలు రావచ్చు. అలాగే తరచూ అలసట, నీరసం, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, కొద్దిపాటి పని చేసినా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అయితే కళ్ల కింద నల్లటి వలయాలు, ముఖంపై మచ్చలు రావడానికి ఐరన్ లోపమే కారణమని చెప్పలేం. నిద్రలేమి, జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల మార్పులు, ఇతర చర్మ సమస్యలు కూడా వీటికి కారణం కావచ్చు.
ఫెర్రిటిన్ స్థాయిలను తెలుసుకోవడానికి ఏ పరీక్ష చేయించుకోవాలి?
శరీరంలో ఐరన్ నిల్వలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి సీరం ఫెర్రిటిన్ పరీక్ష చేయించుకోవాలి. సాధారణ హిమోగ్లోబిన్ పరీక్షలో ఐరన్ నిల్వల గురించి పూర్తి సమాచారం తెలియకపోవచ్చు. అవసరాన్ని బట్టి వైద్యులు కంప్లీట్ బ్లడ్ కౌంట్ వంటి ఇతర పరీక్షలను కూడా సూచిస్తారు. ఐరన్ లోపం ఉన్నట్లు తేలితే ఆకుకూరలు, పప్పులు, బీన్స్, మాంసం వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. నిమ్మ, ఉసిరి వంటి విటమిన్ సి ఉన్న ఆహారం ఐరన్ శోషణకు తోడ్పడుతుంది. ఐరన్ మాత్రలను మాత్రం వైద్యుల సలహా మేరకే వాడాలి. ముఖంపై మచ్చలు కనిపించగానే ఫెర్రిటిన్ లోపంగా భావించి సొంతంగా మందులు వాడకూడదు.






