మనం ప్లాస్టిక్‌ను వాడుతున్నామని మాత్రమే అనుకుంటున్నాం. కానీ తెలియకుండానే దానిని తింటున్నాం.. తాగుతున్నాం.. చివరకు పీలుస్తున్నాం కూడా. కంటికి కనిపించనంత చిన్నగా ఉండే ప్లాస్టిక్ ముక్కలనే ‘మైక్రోప్లాస్టిక్స్’ అంటారు. వీటి పరిమాణం ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. మనం రోజూ వాడే ప్లాస్టిక్ సీసాలు, కవర్లు, డబ్బాలు, బట్టలు, వాహనాల టైర్లు కాలక్రమంలో చిన్నచిన్న కణాలుగా విడిపోతాయి. అవి గాలి, నీరు, నేలలో కలిసిపోయి చివరకు మన శరీరంలోకి చేరుతున్నాయి. కనిపించని ఈ ప్లాస్టిక్ కణాలు ఇప్పుడు మన ఆరోగ్యానికి కొత్త ముప్పుగా మారుతున్నాయి.
ఆహారం, నీటి ద్వారా..
మైక్రోప్లాస్టిక్స్ ప్రధానంగా ఆహారం, నీటి ద్వారా మన శరీరంలోకి వస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు నదులు, సముద్రాల్లో చేరినప్పుడు చేపలు, రొయ్యలు, నత్తలు వాటిని ఆహారంగా భావించి మింగుతాయి. వాటిని మనం తిన్నప్పుడు ఆ ప్లాస్టిక్ కణాలు మనలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఉప్పు, తేనె, మాంసం, కూరగాయలు, పానీయాలతో పాటు కుళాయి నీరు, సీసాల్లో అమ్మే నీటిలోనూ మైక్రోప్లాస్టిక్స్‌ను గుర్తించారు. ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి ఆహారం పెట్టడం, సీసాలను ఎండలో ఉంచడం, ఒకసారి వాడాల్సిన సీసాలను పదేపదే ఉపయోగించడం వల్ల చిన్న ప్లాస్టిక్ కణాలు ఆహారం, నీటిలో కలిసే అవకాశం మరింత పెరుగుతుంది.
పీల్చే గాలిలోనూ ప్లాస్టిక్..
మనం పీల్చే గాలి ద్వారా కూడా మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి చేరుతున్నాయి. సింథటిక్ బట్టలు, కార్పెట్లు, సోఫాలు, కర్టెన్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువుల నుంచి అతి చిన్న నారలు విడిపోయి ఇంట్లోని దుమ్ములో కలుస్తాయి. మనం నడిచినప్పుడు లేదా గదిని శుభ్రం చేసినప్పుడు అవి గాల్లోకి లేస్తాయి. ఆ గాలిని పీల్చినప్పుడు ప్లాస్టిక్ కణాలు ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లోకి చేరవచ్చు. రోడ్లపై వాహనాల టైర్లు అరిగినప్పుడు వెలువడే కణాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే కణాలు కూడా గాలిలో కలుస్తాయి. చిన్నపిల్లలు నేలపై ఆడుతూ చేతులను నోట్లో పెట్టుకోవడం వల్ల దుమ్ములోని మైక్రోప్లాస్టిక్స్ వారి శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
ముప్పును తగ్గించుకోవడం ఎలా?
మైక్రోప్లాస్టిక్స్ వల్ల మన ఆరోగ్యంపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావాలు వస్తాయన్న దానిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే భయపడటం కంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడం ముఖ్యం. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకుండా గాజు లేదా స్టీల్ పాత్రలను వాడాలి. ప్లాస్టిక్ సీసాలను ఎండలో ఉంచకూడదు. ఒకసారి వాడే కవర్లు, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలను వీలైనంత వరకు దూరంగా పెట్టాలి. ఇంట్లో దుమ్ము పేరుకోకుండా శుభ్రం చేయడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చకూడదు. ప్లాస్టిక్‌ను పూర్తిగా తప్పించడం కష్టమే.. కానీ రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే మన శరీరంలోకి చేరే మైక్రోప్లాస్టిక్స్‌ను కొంతవరకు తగ్గించుకోవచ్చు.






