పెట్టుబడులు ఆకర్షించడంలో కేవలం అనుమతులు ఇవ్వడం, నిబంధనలను సులభతరం చేయడం మాత్రమే సరిపోదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పెట్టుబడిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా.. పనులు ఎంత వేగంగా పూర్తవుతున్నాయన్నదే ఇప్పుడు ముఖ్యమని చెప్పారు. “Ease of Doing Business” నుంచి “Speed of Doing Business” వైపు భారత్ ముందుకు వెళ్తోందని వివరించారు. ఢిల్లీలో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో నవంబర్‌లో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు సన్నాహకంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. సాంకేతికతను ఉపయోగించుకుని నిర్ణయాలు, అనుమతులు, ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
అనుమతుల కోసం తిరగాల్సిన పనిలేదు.
పెట్టుబడిదారులు ఒకప్పుడు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అనుమతులు తీసుకోవాల్సి వచ్చేదని.. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దరఖాస్తులు, అనుమతులు, సమస్యల పరిష్కారం వంటి ప్రక్రియలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడంతో పాటు రియల్‌టైమ్‌లో స్పందించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరింతగా ఉపయోగిస్తున్నామని వివరించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ద్వారా ప్రజలకు, వ్యాపార సంస్థలకు సేవలు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉండాలంటే వేగవంతమైన నిర్ణయాలు కీలకమని పేర్కొన్నారు.
డిజిటల్ ఇండియాకు కొత్త దిశ.
డిజిటల్ మౌలిక సదుపాయాల్లో భారత్ ప్రపంచంలోనే ముందంజలో ఉందని చంద్రబాబు అన్నారు. దేశంలో సింగిల్ పవర్ గ్రిడ్ ఉండటం పెద్ద బలమని.. అమెరికాలో కూడా ఇలాంటి వ్యవస్థ లేదని వ్యాఖ్యానించారు. రోడ్ గ్రిడ్ విషయంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని చెప్పారు. 1990లలో వచ్చిన ఐటీ విప్లవాన్ని అప్పట్లో హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగించుకున్నానని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ అనుభవాన్ని ఏపీకి అన్వయిస్తూ డిజిటల్ హబ్‌లు, డేటా సెంటర్లు, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రంలో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయని.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేసే ప్రణాళిక ఉందన్నారు.
సముద్ర తీరంతో భారీ అవకాశాలు.
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని సీఎం తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. పోర్టుల మధ్య మెరుగైన అనుసంధానం కోసం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. సముద్ర రవాణా, ఎగుమతులు, లాజిస్టిక్స్ రంగాలను కలిపి రాష్ట్రాన్ని మరింత పెట్టుబడి అనుకూల ప్రాంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మరోవైపు రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
డ్రోన్లు.. డిఫెన్స్.. గ్రీన్ ఎనర్జీ.
కొత్త టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు కూడా ఏపీ ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేశామని తెలిపారు. పుట్టపర్తిలో డిఫెన్స్, ఏరోస్పేస్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ రక్షణ తయారీ కేంద్రం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని వివరించారు. అదే సమయంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తి, ఎగుమతులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. కొత్త పరిశ్రమలు రావడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
అమరావతికి గ్లోబల్ టెక్ హబ్ హోదా.
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మార్చడంతో పాటు భవిష్యత్ టెక్నాలజీ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమరావతిని గ్లోబల్ టెక్ సెంటర్‌గా అభివృద్ధి చేయడంలో భాగంగా క్వాంటమ్ వ్యాలీకి రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. సీఐఐతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేసిన చంద్రబాబు.. పరిశ్రమలు, ప్రభుత్వం కలిసి పనిచేసినప్పుడే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాబోయే పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రంలోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తున్నామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా.. వచ్చిన పెట్టుబడులను వేగంగా అమల్లోకి తీసుకురావడమే “Speed of Doing Business” విధానానికి అసలు అర్థమని ఆయన స్పష్టం చేశారు.










