ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు తీసుకొచ్చే లక్ష్యంతో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగనుంది. నవంబర్ 12, 13 తేదీల్లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ఈ సదస్సుకు దాదాపు 58 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ‘మారుతున్న ప్రపంచ వ్యవస్థలో వాణిజ్యం, సాంకేతికత, నమ్మకం, నాయకత్వం’ అనే అంశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. దాదాపు 3,800 మంది ప్రతినిధులు, 16 మంది విదేశీ మంత్రులు, 40 మంది అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు వస్తారని అంచనా. ఈ సదస్సు ద్వారా సుమారు రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
కొత్త రంగాలపై ప్రత్యేక దృష్టి.. సెమీకండక్టర్లు, డేటా సెంటర్లకు ప్రాధాన్యం
ఈసారి సదస్సు కేవలం పెట్టుబడుల ఒప్పందాలకే పరిమితం కావడం లేదు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై కూడా దృష్టి పెట్టనున్నారు. జపాన్, యూఏఈ, రష్యా, యూరప్, ఆఫ్రికా దేశాలతో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం, పర్యాటకం వంటి రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను చర్చించనున్నారు. 400కు పైగా వ్యాపార సంస్థల మధ్య సమావేశాలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా విదేశీ కంపెనీలకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించడంతో పాటు, స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధాలు పెంచే ప్రయత్నం జరుగుతుంది.
ఏపీకి ఉన్న బలాలివే.. పోర్టులు, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ
ఏపీ ప్రభుత్వం ఈ సదస్సును పెద్ద అవకాశంగా భావించడానికి కారణం రాష్ట్రానికి ఉన్న భౌగోళిక, పారిశ్రామిక అనుకూలతలు. సుదీర్ఘ సముద్ర తీరం, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక ప్రాంతాలు రాష్ట్రానికి బలంగా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ, కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతులకు అవకాశాలు ఉన్నాయి. అనంతపురంలో ఇప్పటికే కియా పరిశ్రమ ఉండగా.. రాయలసీమలో ఆటోమొబైల్, తయారీ రంగాలకు మరింత అవకాశం ఉంది. విశాఖలో ఐటీ, డేటా సెంటర్లు, ఫార్మా రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ అవకాశాలను ప్రపంచ కంపెనీలకు పరిచయం చేయడమే సదస్సు ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి.
ఒప్పందాల కంటే అమలే ముఖ్యం..
అయితే పెట్టుబడుల ప్రకటనలు రావడం ఒక ఎత్తయితే.. అవి నిజంగా పరిశ్రమలుగా మారడం మరో ఎత్తు. గతంలోనూ రాష్ట్రంలో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయి. 2025లో విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో 613 ఒప్పందాల ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. కానీ వాటిలో ఎన్ని పూర్తిస్థాయిలో అమలయ్యాయన్నదే అసలు ప్రశ్న. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.6 లక్షల కోట్ల విలువైన 272 ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించగా, మరో రూ.17 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. కాబట్టి ఈసారి కూడా ఒప్పందాల సంఖ్య కంటే వాటి అమలుపైనే ప్రజలు ఎక్కువగా దృష్టి పెట్టాలి.
యువతకు ఉద్యోగాలే అసలైన ఫలితం..
ఈ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే పరిశ్రమలతో పాటు రవాణా, గిడ్డంగులు, విద్యుత్, నిర్మాణ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. స్థానిక యువతకు ఉద్యోగాలు, చిన్న పరిశ్రమలకు వ్యాపార అవకాశాలు పెరగొచ్చు. అయితే ఇందుకు భూమి కేటాయింపు, అనుమతులు, విద్యుత్, నీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు సమయానికి అందించాలి. పెట్టుబడుల పేరుతో స్థానిక ప్రజల భూములు, పర్యావరణం దెబ్బతినకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నైపుణ్య శిక్షణ ద్వారా స్థానిక యువతకే ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలి. మొత్తంగా విశాఖ సదస్సు ఏపీకి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే వేదిక కావొచ్చు. కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎంత ఉంటుందనేది ఒప్పందాలు కర్మాగారాలుగా మారి, ఉద్యోగాలు వాస్తవంగా అందినప్పుడే తేలుతుంది.










