బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుఫాన్‌గా మారింది. ఇప్పటికే తీవ్రత పెంచుకుంటున్న ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వైపు కదులుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. భారీ వర్షాలు, బలమైన గాలులు, సముద్రంలో అలజడి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్వన్ తుఫాన్ ఎక్కడ ఏర్పడింది? ఎంత వేగంతో కదులుతోంది? ఏయే ప్రాంతాలపై ప్రభావం చూపనుంది?
బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వన్ తుఫాన్
నవంబర్ 17 ఉదయం 8.30 గంటల నాటికి ఇది దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పున సుమారు 610 కి.మీ., మచిలీపట్నానికి ఆగ్నేయంగా 660 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం గంటకు సుమారు 3 కి.మీ. వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు ‘అక్వన్’ అనే పేరును ఇరాన్ సూచించింది.
తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం
నవంబర్ 17 సాయంత్రానికి అక్వన్ తీవ్ర తుఫాన్‌గా, నవంబర్ 19 ఉదయానికి అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుత అంచనాల ప్రకారం నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు నుంచి తుని మధ్య ఏపీ, యానాం తీరాన్ని దాటవచ్చు. ఆ సమయంలో గంటకు 120-130 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గాలుల వేగం అప్పుడప్పుడు 145 కి.మీ. వరకు చేరవచ్చని హెచ్చరించింది. అయితే తుఫాన్ ప్రయాణ దిశ, తీవ్రతలో మార్పులు ఉండే అవకాశం ఉంది.
ఏయే ప్రాంతాలపై ప్రభావం ఉండొచ్చు?
నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో తీరప్రాంతాల్లో గంటకు 80-90 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వర్షాలు, గాలుల ప్రభావం ఉండొచ్చు. తెలంగాణలో నవంబర్ 20, 21 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని అంచనా. సముద్రం అలజడిగా ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది.
ప్రభుత్వాల ముందస్తు చర్యలు కీలకం
ఇప్పటికే ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాలు సిద్ధం చేయడం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బందిని అందుబాటులో ఉంచడం వంటి చర్యలు అవసరం. ముఖ్యంగా రైతులు కోతకు వచ్చిన పంటలు, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తుఫాన్ తీరం దాటే సమయం దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణ శాఖ ఇచ్చే తాజా హెచ్చరికలను గమనించడం ముఖ్యం.










