17 అక్టోబర్ “అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం” సందర్భంగాపేదరికం ఓ బహువ్యాధి లక్షణంగా మారి ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్నది. పేదరికం ఒక ఆర్థిక సమస్య మాత్రమే కాదు, అది ఒక బహుముఖీన సమస్యలతో కూడిన విషవలయం. పేదరికంతో నిరక్షరాస్యత, మానవ హక్కుల ఉల్లంఘన, హింస, దోపిడీల, దొంగతనాలు, అసాంఘీక కార్యకలాపాలు, జీవన ప్రమాణాలు, అసురక్షిత గృహవసతులు, పోషకాహార లోపం, ఆరోగ్య అభద్రత, ఆకలిచావులు వంటివి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 1990 విశ్వజనాభాలో 36 శాతం దారిద్ర్యరేఖ దిగువన ఉండగా, 2018 గణాంకాల ప్రకారం 8 శాతం మాత్రమే ఉన్నారని తేలింది. దక్షిణ ఆసియా, సబ్-సహారా ఆఫ్రికావాసులు అధిక శాతం పేదరికం అనుభవిస్తున్నారని అంచనా. విశ్వవ్యాప్తంగా 55 శాతం జనాభాకు కనీసం ఒక సామాజిక రక్షణతో కూడిన ఆర్థిక చేయూతకు దూరంగా ఉన్నారని తేలింది.
అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం-2024 థీమ్:
1987లో జోసఫ్ వ్రెసిన్స్కీ చొరవతో ఫ్రాన్స్, పారిస్ నగరంలో పేదరికం, ఆకలి చావులు, హింస, ప్రాణభయం బారినపడిన ప్రపంచ పౌరుల సమస్యలను చర్చించేందుకు ఒక లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేయడం, 1992లో ఈ తీవ్ర సమస్యలకు స్పందించిన ఐక్యరాజ్యసమితి 17 అక్టోబర్ రోజున ప్రతి ఏటా “అంతర్జాతీయ పేదరిక నిర్మూలణ దినం” పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం-2024 థీమ్‌గా “శాంతియుత సమ్మిళిత అభివృద్ధికి సామీజిక, వ్యవస్థీకృత దిర్వినియోగాలకు అంతం పలుకుదాం” అనబడే అంశాన్ని తీసుకొని అవగాహన కల్పించుట జరుగుతున్నది. పేదల దుస్థితిని సహానుభూతితో ఆకలింపు చేసుకొని, పేదరిక నిర్మూలనకు సదాలోచనలు, క్షేత్రస్థాయి ఆచరణలు చేయడానికి ఈ రోజును పాటించాలని సూచిస్తున్నారు. ఆర్థిక అసమానతలను తగ్గించడం, పేదల బడుగు బలహీన వర్గాల సుస్థిరాభివృద్ధికి కృషి చేయడం ప్రభుత్వాల కనీస భాద్యత అవుతుంది.
ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యం :
2015లో ఐరాస రూపొందించిన ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030’ ప్రకారం 2030 నాటికి పేదరికం, ఆకలి లేని ప్రపంచం అవతరించే దిశలో కార్యక్రమాలు రూపొందించాలని మార్గనిర్దేశనం చేస్తున్నారు. పేదల కష్టాలను అర్థం చేసుకోవడం, వారి గోడును సానుభూతితో ఆలకించడం, పేదరిక నిర్మూలనకు సరైన కార్యాచరణ చేపట్టడం ప్రస్తుత కర్తవ్యంగా ప్రపంచ దేశాలు భావించాలి. పేద పిల్లలకు (బాలురు, బాలికలు) విద్య అందించడంతో భవిష్యత్తులో వారికి ఆర్థికాదాయం పెరగడం, పేదరికం/నిరుద్యోగం తగ్గడం జరుగుతాయి. బాలలకు ఆర్థిక, పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులను కల్పించడానికి కృషి చేయాలి. ఆహార పదార్థాల ప్రజాపంపిణి, వైద్య సదుపాయాల కల్పన, సురక్షిత నీరు, పరిసరాల పరిశుభ్రత, గర్భవతులకు పోషకాహారం అందించడం, ఉపాధి కల్పన లాంటి ప్రభుత్వ చర్యలు పేదరికాన్ని తగ్గించవచ్చు.
భారతంలో పేదరికం…..:
అధిక జనాభాగల భారత్‌లో 6.5 శాతం (73 మిలియన్లు) ప్రజలు దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారని, గత దశాబ్దకాలంలో 271 మిలియన్లను పేదరిక ఊబీలోంచి బయటకు తీసుకురావడం జరిగిందని నివేదికలు తెలుపుతున్నాయి. ఇండియాలోని ఒక శాతంగా ఉన్న ధనివంతులే 73 శాతం సంపదను అనుభవిస్తుండగా, 670 మిలియన్ల పేదల ఆదాయం ఒక శాతం మాత్రమే పెరిగిందని అంచనా వేశారు. మన దేశంలో అధిక జనాభా, వ్యవసాయ ఉత్పత్తుల తగ్గుదల, మౌళిక వసతుల లేమి, ఆర్థికవృద్ధి రేటు తగ్గడం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తక్కువగా ఉండడం, వైద్య ఆరోగ్య వసతుల కొరత, సామాజిక కారణాలు, శ్రమదోపిడి, వాతావరణ కారకాలు లాంటి సమస్యలతో పేదరికం ప్రబలటం జరుగుతున్నది.
భారత ప్రభుత్వం ఐఆర్‌డిపి, జవహర్ రోజ్‌గార్ యోజన, గ్రామీణ గృహవసతి, కరువు పనుల కల్పన, వృధాప్య పెన్షన్, అన్నపూర్ణ పథకం, గ్రామీణ ఉపాధి కల్పన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్, ప్రధానమంత్రి కౌషల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన లాంటి పథకాలతో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేస్తున్నది. రాష్ట్రప్రభుత్వాలు ప్రజాపంపిణి ద్వారా ఆహారధాన్యాలను అందిస్తూ, పలు పథకాలతో పేదరిక నిర్మూలన దిశగా చేయూతను ఇస్తున్నారు. భారతదేశంలో పేదరికం ఫలితంగా శిశుమరణాలు(సాలీనా 1.4 మిలియన్లు), పోషకాహారలోపం(61 మిలియన్లు), బాలకార్మిక దురాచారం(12.5 మిలియన్లు), బాలల అవిద్య (25 శాతం), బాల్యవివాహాలు(44.5 శాతం), హెచ్ఐవి- ఏయిడ్స్ (2.7 మిలియన్లు) లాంటి దుష్పరిణామాలు కలుగుతున్నాయి. ప్రజలకు పని కల్పన, పోషకాహార భద్రత, అందరికీ ఉచిత విద్య అమలు ద్వారా మాత్రమే సమాజం ఆరోగ్యంగా, పేదరికానికి దూరంగా జీవించగలుగుతారు.
పేదరిక అగ్నికి ఆజ్యం పోస్తున్న విపత్తులు:
గత దశాబ్ద కాలంలో విపత్తుల వల్ల పేదలు అదనంగా 143-163 మిలియన్లు పెరిగే ప్రమాదంతో పాటుగా మిలియన్ల ప్రజలకు తీవ్ర ఆకలి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని తెలుస్తున్నది. కరోనా విజృంభనతో ఆహారపదార్థాల సరఫరాలో ఆటంకం ఏర్పడటం, ఆహార కొరత ఎదురుకావడం, నిరుద్యోగం పెరగడం, కొనుగోలు సామర్థ్యం తగ్గడం విధిగా జరగడం చూసాం. వాతావరణ ప్రతికూల మార్పులు, విపత్తులు, కరువులు లాంటి ఏ ఉపద్రవం ఎగిసినా పేదలే ముందు తీవ్రంగా ప్రభావితం కావడం సర్వదా సహజంగా జరుగుతున్నది.
పేదరిక నిర్మూలనలో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజం తమ చేయూతను అందిస్తూ, మానవ హక్కులకు పట్టం కట్టి, ఆకలి చావులు లేని సంతోష తోరణాలు నిండిన భారతాన్ని నిర్మించుకుందాం.