TRAVEL ATTRACTIONS

మంచు కొండల మధ్య స్కీయింగ్‌ చేయాలనుందా? అయితే అవులికి వెళ్లాల్సిందే..

మంచుతో కప్పుకున్న కొండలు, చుట్టూ పచ్చని అడవులు, ఆకాశాన్ని తాకుతున్న హిమాలయ పర్వతాలు.. ఇలాంటి అందాల మధ్య కొన్ని రోజులు గడపాలనుకుంటే ఉత్తరాఖండ్‌లోని అవులి మంచి ఎంపిక. సముద్ర మట్టానికి సుమారు 2,500 నుంచి 3,050 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం స్కీయింగ్‌కు దేశంలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి నందాదేవి, కామెట్‌, దునగిరి వంటి పర్వతాలను చూడొచ్చు. మంచులో ఆడుకోవడం, స్కీయింగ్‌ నేర్చుకోవడం, ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఈ ప్రయాణంలో ప్రత్యేక అనుభవాలు.

అవులికి ఎలా వెళ్లాలి? ప్రయాణ మార్గాలు ఇవే!

అవులికి నేరుగా విమాన, రైలు సదుపాయాలు లేవు. ముందుగా డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్‌ విమానాశ్రయానికి లేదా రిషికేశ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీలో జోషిమఠ్‌ వెళ్లాలి. రిషికేశ్‌ నుంచి జోషిమఠ్‌కు సుమారు 250 కి.మీ. దూరం ఉంటుంది. అక్కడి నుంచి మరో 14-16 కి.మీ. ప్రయాణిస్తే అవులికి చేరుకోవచ్చు. ప్రస్తుతం జోషిమఠ్‌-అవులి రోప్‌వే సేవలు నిలిచిపోయాయి. కాబట్టి రోడ్డు మార్గంలో వెళ్లేలా ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవాలి.

అవులిలో చూడాల్సిన ప్రదేశాలివే.. స్కీయింగ్‌ ప్రత్యేక ఆకర్షణ

అవులిలో స్కీయింగ్‌ ప్రధాన ఆకర్షణ. మొదటిసారి ప్రయత్నించేవారికి శిక్షకుల సహాయంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. అవులి నుంచి సుమారు 3 కి.మీ. ట్రెక్కింగ్‌ చేస్తే గోర్సన్‌ బుగ్యాల్‌ చేరుకోవచ్చు. వేసవిలో పచ్చని గడ్డి మైదానంగా, చలికాలంలో మంచుతో కప్పుకున్న ప్రాంతంగా ఇది కనిపిస్తుంది. చత్రకుండ్‌ సరస్సు, అవులి కృత్రిమ సరస్సు కూడా చూడదగిన ప్రదేశాలు. సమయం ఉంటే సమీపంలోని జోషిమఠ్‌లోని నర్సింహ ఆలయాన్ని సందర్శించవచ్చు.

ఎప్పుడు వెళ్లాలి? ఎంత ఖర్చవుతుంది?

మంచు, స్కీయింగ్‌ కోసం నవంబర్ నుంచి మార్చి వరకు వెళ్లడం మంచిది. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరిలో మంచు కనిపించే అవకాశం ఎక్కువ. పచ్చని మైదానాలు చూడాలంటే వేసవి, శరదృతువు నెలలు అనుకూలం. ఢిల్లీ నుంచి నాలుగు రాత్రులు, ఐదు రోజుల ప్రయాణానికి ఒక్కొక్కరికి సుమారు రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు కావచ్చు. ప్రయాణ విధానం, హోటల్‌, ఆహారం, స్కీయింగ్‌ వంటి కార్యక్రమాలను బట్టి ఈ మొత్తం మారుతుంది. చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెచ్చని దుస్తులు, మంచి షూస్‌ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ప్రయాణానికి ముందు రోడ్డు పరిస్థితులు, వాతావరణం, స్కీయింగ్‌ సదుపాయాల వివరాలు తెలుసుకోవడం మంచిది.

Show More
Back to top button