అమెరికాలో వలసలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని గుర్తించి బహిష్కరిస్తున్న అధికారులు.. ఈ క్రమంలో చిన్నారుల విషయంలోనూ వెనక్కి తగ్గడం లేదు. తల్లిదండ్రుల నుంచి విడిపోయి, సరిహద్దుల్లో ఒంటరిగా మిగిలిపోతున్న పిల్లల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విడుదలైన అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (USCBP) నివేదిక ప్రకారం.. 2023 నుంచి ఇప్పటివరకు 1,389 మంది ఒంటరి భారతీయ చిన్నారులను ఇమిగ్రేషన్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. వీరిలో కొందరు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు లేకుండా సరిహద్దులకు చేరుకోగా.. మరికొందరు అక్కడే వదిలేయబడిన పిల్లలు.
అమెరికా కస్టడీలో 1,389 మంది భారతీయ చిన్నారులు
అమెరికాలో ఒంటరిగా ఇమిగ్రేషన్ అధికారుల కస్టడీలోకి వచ్చే చిన్నారులను ‘అన్అకంపెనీడ్ చిల్డ్రన్’గా పిలుస్తారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి పిల్లల సంఖ్య అమెరికాలో సుమారు 1.1 లక్షలుగా నమోదైంది. 2026 అక్టోబర్ వరకు 722 మంది చిన్నారులను కస్టడీలోకి తీసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. గతంతో పోలిస్తే ఒంటరి భారతీయ పిల్లల సంఖ్య తగ్గుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. కఠినమైన వీసా నిబంధనలు, అక్రమ వలసలపై చర్యలు ఈ మార్పుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
పిల్లలను సరిహద్దుల వద్ద వదిలేస్తున్నారా?
గతంలో కొందరు తల్లిదండ్రులు లేదా బంధువులు అమెరికాలో చట్టబద్ధమైన హోదా పొందేందుకు చిన్నారులను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా సరిహద్దు దాటే సమయంలో పట్టుబడితే పిల్లలను అక్కడే వదిలి వెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల సంరక్షణకు దూరమైన చిన్నారులను ఇమిగ్రేషన్ కేంద్రాల్లో ఉంచి, వారికి అవసరమైన వసతి, సంరక్షణ కల్పిస్తున్నారు. అయితే వలసలపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.






