GREAT PERSONALITIESTelugu Special Stories

కర్ణాటక సంగీతంలో కలికితురాయి.. ముత్తుస్వామి దీక్షితులు..

ముత్తుస్వామి దీక్షితులు.. (24 మార్చి 1775 – 21 అక్టోబర్ 1835)

సంగీతం ఓ గలగలపారే నదీ ప్రవాహం. ఈ సంగీత సాగర ప్రవాహంలో హేమాహేమీలైన ఎందరో మహానుభావులు తమదైన ముద్రను వేశారు. వారు దివంగత లోకాలకు వెళ్లిపోయినా కూడా వారందించిన సంగీత స్వరాలు కొన్ని వందల సంవత్సరాల వరకు జనం నోళ్లల్లో నానుతూ చిరంజీవులవుతున్నారు. వారి ఖ్యాతి ఆచంద్ర తారార్కం వెలుగొందుతూనే ఉంటుంది.

అది కాశీ పట్టణం. పవిత్రమైన గంగా నది ఉరకలు వేస్తూ పారుతోంది. స్నాన సంధ్యాధులు ముగించుకుని ఏదో ప్రార్థిస్తున్నాడు అతడు. క్షణాలు మాత్రమే గడిచాయి. చుట్టూ ఉన్న వారి ఆశ్చర్యానికి అంతులేదు. అతని చేతుల్లో ఒక దివ్యమైన వీణ వెలిసింది. ఆనంద పరవశుడై దేవీదత్తమైన వీణను మీటుతూ చిందులు వేస్తున్నాడు అతడు. ప్రజలు పాదాభివందనం చేస్తున్నారు. అందరిదీ ఒకే ప్రశ్న. ఎవరా మహానుభావుడు? ఆయన ఎవరో కాదు, గురు గుహ దయాపాత్రుడైన ముత్తుస్వామి దీక్షితులు. “వాతాపి గణపతిం భజే” అని ప్రతినోట మనం వినే గణపతి ప్రార్థన ఆ నాదజ్యోతి రచననే. సంగీత త్రిమూర్తుల్లో ఈయనకే దీక్షితార్ అనే ప్రసిద్ధి. తంజావూరు జిల్లాలోని తిరువారూరు కన్న సంగీత త్రిమూర్తుల్లో మొదటివాడు త్యాగరాజు, మూడోవాడు శ్యామశాస్త్రి, మధ్యమణి ముత్తుస్వామి దీక్షితులు.

ఆయన జీవితమే ఒక సంగీత తపస్సు. కరువు కాటకాలతో అలమటిస్తున్న ఎట్టయాపుర ప్రాంతాన్ని చూసిన ముత్తుస్వామి దీక్షితులు గారి హృదయం ద్రవించింది. అమృత వర్షిని రాగంతో కృతిని ఆలపించాడు. కుంభవృష్టి కురిసింది. ఆర్తులైన అక్కడ ప్రజల ఆనందానికి హద్దులు లేవు.

సంగీత త్రిమూర్తులు..

సంగీత సరస్వతి సామ్రాజ్యం చేసిన శతాబ్దం (1750 – 1850 మధ్యకాలం). సంగీతానికి సంబంధించినంతవరకు ప్రపంచ దేశాల్లో ఎందరో మహానుభావులు ఆ మధ్య కాలంలోనే జన్మించారు. యూరప్ దేశంలో బితోవన్, మొజారల్ మొదలై సంగీత ప్రముఖులు ఈ కాలంలోనే పుట్టారు. దక్షిణ భారతదేశంలో సంగీత త్రిమూర్తులు అనబడే త్యాగయ్య, దీక్షితార్, శ్యామశాస్త్రి ఈ కాలంలోనే జీవించారు. కవిత్రయంలో నన్నయ, తిక్కన, ఎర్రన్నలకు తెలుగులో ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయో, అలాగే ఈ ముగ్గురికి (త్యాగయ్య, దీక్షితార్, శ్యామశాస్త్రి) విశేష ప్రచారం లభించింది.

వీళ్ళు ముగ్గురు తంజావూరు జిల్లాలోని తిరువారూరులో జన్మించడం విశేషం. వీరి  కృతులు మూడు భిన్న మార్గాలకు సంబంధించినవి. వీరికి జ్ఞానోపదేశం ముగ్గురు దేవలోక గురువులు చేయడం విచిత్రం. సంగీత ప్రపంచంలో త్యాగయ్య ఎంత మహానుభావుడో, దీక్షితులు వారు అంత గొప్పవారు.  త్యాగరాజు  గారూ (1767 – 1847 మధ్యకాలంలో), ముత్తుస్వామి దీక్షితుల వారు (1775 – 1835 సంవత్సరాలలో), శ్యామశాస్త్రి గారూ (1768 – 1827 సంవత్సరాల నడుమ)  జీవించారు.

జననం..

తంజావూరు నాయక రాజుల పాలనలో సంగీత సాహిత్యాలకు ఆశ్రయమిచ్చిన రఘునాథనాయకుని కొలువులో గోవింద దీక్షితులు గారూ మంత్రిగా ఉండేవారు. వారిది వేంకటమఖి సంప్రదాయం. వారి వంశంలో మన్మధ నామ సంవత్సరం 24 మార్చి 1775 తేదీన రామస్వామి, సుబ్బమ్మల నోముల పంటగా కుమారుడు జన్మించాడు. అది కృత్తికా నక్షత్ర సమయం. తంజావూరు జిల్లాలోని వైదీశ్వర ఆలయంలో ముత్తు కుమారు స్వామి అనుగ్రహం వల్ల తమకు కుమారుడు కలిగాడని తల్లిదండ్రులు ముత్తుస్వామి అని పేరు పెట్టారు. రామస్వామి సంగీతంలో పేరు ఉన్నవాడు. హంసధ్వని రాగ కర్త. ముత్తుస్వామి దీక్షితులు గారికి బాలస్వామి, చిన్నస్వామి అని ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒక సోదరి కూడా ఉంది. తన పేరు బాలాంబ. ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి రామస్వామి బ్రాహ్మణ కుటుంబంకు చెందిన వారు కావడంతో వారికి వేదాలు , కవిత్వం, సంగీతం మరియు ఖగోళ శాస్త్రంతో సహా అనేక విషయాలలో ప్రావీణ్యం అబ్బింది.

విద్యాభ్యాసం…

పూవు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు, బాల్యంలోనే ముత్తుస్వామి గారూ తన తెలివితేటలను ప్రదర్శించారు. తాను పుట్టుకతోనే ఏకసంతాగ్రహి అయ్యారు. గురువులకు అభిమాన శిష్యుడయ్యారు. తన 16వ యేటనే వేదాలు చదివారు. కావ్యాలు, నాటకాలు, అలంకార శాస్త్రాలు నేర్చుకున్నారు. సంగీతాభ్యాసం మొదలుపెట్టారు. జ్యోతిష్యం, వైద్యం, మాంత్రికం ఇలా శాస్త్ర రహస్యాలు తెలుసుకోవాలనే పట్టుదల వారిలో పెరిగింది.

బాల్యంలోనే కీర్తనలు..

సంస్కృత విద్య చక్కగా నేర్చుకొన్న ముత్తుస్వామి గారూ గేయ రచనలలో పటిష్టత సాధించారు. తమిళ, తెలుగు భాషల్లో పాటలు వ్రాసినా కూడా సంస్కృతం పాలు హెచ్చుగా ఉండేది. ముత్తుస్వామి వారిది నారికేళపాకం. చిన్నతనం నుంచే దేవ్యుపాసన ద్వారా శ్రీ విద్యను కరతలామలకం చేసుకున్నాడు. జయదేవుని అష్టపదులను మినహాయిస్తే సంస్కృతంలో ఇంత పటిష్టంగా కీర్తనలు రచించిన వారు లేనే లేరు. తెలుగుభాషకు అప్పటికే గేయానుకూలమైన శైలికి వచ్చింది. తమిళంలో గోపాల కృష్ణభారతి రచనలు సాగిస్తున్నారు. శబ్దానికి నాదానికి అనుకూలంగా దీక్షితులు గారూ సంస్కృతంలో కీర్తనలు వ్రాశారు.

తన బాని తనది

ముత్తుస్వామి దీక్షితులు గారూ సంగీతంలో ప్రవేశం లభించింది మొదలు తన బాణీలతో తానే పాడుకునేవారు. వీణ నాథంతో మైమరచిపోయేవారు. దీక్షితులు గారి ప్రతిభ గురువులకు ఆశ్చర్యం కలిగించి వారిని మెచ్చుకునేవారు. భవిష్యత్తులో ముత్తుస్వామి గారూ అత్యంత ప్రతిభా మూర్తి కాగలరని ఊహించారు. పూర్వజన్మ సుకృతం ఫలితంగా ముత్తుస్వామి గారూ సకల విద్యలోనూ పాండిత్యం సంపాదిస్తున్నారని భావించారు. తోటి శిష్యులు అనురాగంతో చూసేవారు. తల్లిదండ్రులు ముత్తుస్వామి గారిని అల్లారు ముద్దుగా పెంచారు రామస్వామి దీక్షితులు గారూ. తన వంశ ప్రతిష్టను నిలిపే వ్యక్తి తన కుమారులలో మొదటి వాడైన ముత్తుస్వామియే అని తండ్రి గారూ గర్వపడేవారు.

తండ్రి వెంట కచేరీలకు..

ముత్తుస్వామి గారికి కుమారునికి చిన్న వయస్సులోనే వివాహం చేశారు రామస్వామి గారూ. దీక్షితులు గారూ శాస్త్రాధ్యయనంలో తలమునకలైన ముత్తుస్వామి గారికి ఇంటి మీద ధ్యాస లేదు. నిష్ఠతో విద్యాభ్యాసం చేయడం, సంగీతోపాసన చేయడం వీరికి నిత్య కృత్యాలుగా మారిపోయాయి. తన తండ్రితో కలిసి సంగీత కచేరీలకు హాజరయ్యేవారు. మహారాజుల దగ్గర తన తండ్రి కానుకలను స్వీకరిస్తుంటే చూసి ఆనందించేవారు ముత్తుస్వామి గారూ. శ్రోతల్ని మైమరిపింపజేసేలా సంగీత సాధన చేసేవారు. ప్రత్యేకమైన బాణీలో కీర్తనలు గానం చేసేవారు.

నిరంతరం పరధ్యానం..

ముత్తుస్వామి గారూ ఎప్పుడూ సంగీత ధ్యానమే తప్ప, సంసారం గురించి పట్టించుకునే వారు కాదు. ఏమీ తెలియని వయస్సులో ముత్తుస్వామి గారికి వివాహం జరిగింది. తమ కోడలు మాత్రం ఇంట్లో అత్తమామలకు అనుగుణంగా నడుచుకుంటోంది కోడలు. ముత్తుస్వామి గారూ కాలకృత్యాలు తీర్చుకొని భగవంతుడి ధ్యానంలో కూర్చుంటే భోజనం వేళకు గాని లేచేవారు కాదు. భోజనానంతరం కొంత విశ్రాంతి తీసుకునేవారు. సంగీత సాధనలో వారికి సాయంకాలమయ్యేది. ముత్తుస్వామి గారూ ఈ విధంగా రాత్రింబవళ్లు కుటుంబ విషయాలను పూర్తిగా మర్చిపోయి, తిరగడం చూసిన వారి తల్లిదండ్రులకు ఏమి తోచలేదు. భార్యను గూర్చి ఒక్క క్షణం కూడా ఆలోచించని కుమారుడి పరధ్యానానికి విస్తుపోవడం వారి వంతయ్యింది.

రెండో పెళ్లి..

రామస్వామి గారి బంధువులంతా ముత్తుస్వామి గారి గురించి ఆలోచించసాగారు. ముత్తుస్వామి గారి పరధ్యానానికి కారణం, వారి భార్య రూపవతి కాకపోవడం అనుకున్నారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆ అమ్మాయి ఎంతో ముచ్చటగా ఇంటి పనులన్నీ సవరించేది. భర్త అనుగ్రహం కోసం ఎదురుచూస్తుండేది. కానీ ముత్తుస్వామి గారూ అవేమీ పట్టించుకోకునే స్థితిలో లేరు. అస్తమానం దైవచింతన. రెండవ వివాహం చేసి అందమైన కోడలును తీసుకువస్తే కుమారునికి సంసారం పై వ్యామోహం పెరుగుతుందని బంధువులు సలహా ఇచ్చారు. తధాస్తు అన్నారు పెద్దలు. శాస్త్రోక్తంగా రెండో పెళ్లి జరిపించారు. అయినా కూడా ముత్తుస్వామి గారి నడవడిలో ఏ విధమైన మార్పు రాలేదు. మూడు ముళ్ళు వేశారే తప్ప సంసార బాహుబంధాల్లో చిక్కుకోలేదు, అలాగని భగవద్భక్తి కూడా వారు మరువలేదు.

వాతాపి గణపతిం భజే..

తిరుత్తని దేవాలయ ప్రాకారంలో ఒకచోట త్రికోణకృతిలో వినాయక విగ్రహం ఇమిడి ఉంది. ప్రణవ స్వరూపంలో ఉన్న ఆ గణపతిని ఉద్దేశించి రచించిన కీర్తనయే  “వాతాపి గణపతిం భజే”. ఈ కీర్తన సంగీత విద్వాంసుల నోట కచేరీలలో ఆరంభ కీర్తనగా గానం చేయబడుతుంది. హంసధ్వని రాగంలో ఉండే ఆ కీర్తన మధుర మధురంగా సాగిపోతుంది. తిరుత్తనిలోని కమలాంబ దేవి ఆలయంలో, దేవి ఈశాన్యం ముఖంగా ప్రతిష్ఠితమైంది. రాత్రి వేళలో ముత్తుస్వామి గారూ ప్రాకారాలలో ద్వారానికి దగ్గరగా సుమారు అరఫర్లాంగు దూరంలో వీణ వాయిస్తూ దేవి యొక్క దీపారాధన తిలకించేవారు. ఆ దేవి దర్శన భాగ్యమే వారిని కృతకృత్యులను చేసింది.

పంచముఖ వాద్యం..

ఆ దేవాలయంలో మరో విచిత్రం ఉంది. అక్కడ పంచముఖ వాద్యం ఉంది. పెద్ద హండా లాంటి పాత్రలాగ ఉన్న వాయిద్యమది. పంచలోహాలతో చేయబడ్డ ఆ వాయిద్యానికి ఐదు తలలు. తోలుతో బిగించిన మూతులపై వాదనం చేస్తే ఒక్కొక్క ముఖం ఒక్కొక్క శృతిని ఇస్తుంది. ముత్తుస్వామి గారూ రెండు చేతులతో ఆ వాయిద్యాన్ని సామగానక్రమంలో  వాయించేవాడు. మద్దెలల జోడు లాగా శబ్దం చేసేది. ఇది ఆ ఆలయంలో వాయించడానికి ముత్తుస్వామి గారికి మాత్రమే హక్కు. ఆ విధంగా ఆలయ ధర్మకర్తలు చట్టం కూడా చేశారు.

అంతులేని శిష్యగణం..

ఆ కాలంలో ముత్తుస్వామి దీక్షితుల వారికి చుట్టూ శిష్య జనమే. తిరుక్కడయూరు భారతి, వీణ వెంకటరామయ్య, సుబ్రహ్మణ్యయ్య, తంబి యప్పడు, తంజావూరు పున్నయ్య, వడివేలు, రామస్వామి బిల్వవనం, అయ్యాస్వామి, కమలం, పళ్ళలారు గుడి, అమ్మణ్ణి ఇలా శిష్య బృందం అంతా తన చుట్టూ చేరి కీర్తనలు ఆలంపించేవారు. సంగీత శాస్త్ర రహస్యాలు గ్రహించేవారు. జంత్ర వాద్యాలలో ఆరితేరి రాజనమ్మా నాలు అందుకునేవారు. గురుభక్తితో ముత్తుస్వామి వారిని ఆరాధించేవారు.

అష్టదశ ముద్రలు

ముత్తుస్వామి దీక్షితుల వారికి కీర్తనలలో లయాత్మక గుణం తక్కువ. కానీ రాగసంచారం, గమక విశేషం, గానం చేసే సమయంలో శ్రోతలను మైమరిపింప చేస్తాయి. త్యాగయ్య గారూ అఖిల భారత ఖ్యాతినార్జించారు. శ్యామశాస్త్రి గారి కీర్తనలు ప్రసిద్ధిలోకి వచ్చాయి. అదే సమయంలో సంగీత ప్రపంచంలో ముత్తుస్వామి దీక్షితుల వారు తమదైన స్థానాన్ని నిలుపుకొన్నారు. తన రచనల్లో రాగముద్ర, వాగ్గేయకార ముద్ర, క్షేత్ర ప్రబంధ ముద్ర, రాజముద్ర మొదలుగా అష్టాదశ ముద్రలు కనిపిస్తాయి. ఏ ప్రాంతంలో గానం చేసింది స్పష్టమయ్యేందుకు అవకాశం కలిగింది. ఆయా క్షేత్రాలను సందర్శించినప్పుడు దీక్షితుల వారు సంతోష పారవశ్యంలో కీర్తనలు రచించి గానం చేయడం విశేషం.

పంచలింగ కృతులు..

ముద్దు ముద్దు పలుకులతో ముత్తుస్వామి దీక్షితులు పంచలింగస్థల కృతులు రచించారు. కంచి ఏకామ్రనాథేశ్వరుని పరంగా “చింతయమాం” కృతిని తిరువానైక్కావలీశ్వరుని పేర జంబూపతే కీర్తనను, అరుణాచలేశ్వరునిపై, అరుణాచలనాథ గేయాన్ని, శ్రీకాళహస్తిక ముద్రతో, కాళహస్తీశ్వరున్ని, చిదంబరేషుని ఆనందనటన మనే మధుర కృతిలోనూ భక్తి పరవశుడై గానం చేశారు. వీరు తాన వర్ణాలను, రాగమాలికలను అపూర్వ రాగాలలో గానం చేసి చరితార్థులయ్యారు.

సభలో సర్పం ఆడింది

బాలస్వామి దీక్షితులు గారిని చూడాలనే కోరిక ముత్తుస్వామి గారికి మార్గ శ్రమ లేకుండా చేస్తోంది. బాలస్వామి చిన్న తమ్ముడు. సంస్కృతాంధ్రలో మంచి పాండిత్యం సంపాదించాడు. సంగీత లక్షణం మర్మాలు తెలిసిన ప్రజ్ఞాశాలి. ఆంగ్లేయ సంగీతంలోనూ, హిందుస్థాని సంగీతములను పాండిత్యం సంపాదించి “మనలి” సంస్థానాధీశుల ప్రశంసలు అందుకున్నారు. పెద్ద తమ్ముడు చిన్న స్వామి “వైణిక శ్రేష్టుడు”. రాజ్యసభలలో గౌరవం పొందిన మహానుభావుడు. ఒకనాటి సభలో చిన్నస్వామి “నాగవరాశి” రాగం ఆలపించగా పెద్ద సర్పం పడగెత్తి ఆడుతూ నిలిచింది. సభలో ఉన్నవారు కలకలం చెందారు. ముత్తుస్వామి గారూ ఆ సంఘటన చూసి సోదరా నువ్వు భయపడవద్దు. వీణను నిలపక వాయించమని ఆజ్ఞ పురమాయించారు. ఆ గానామృతానికి లోబడి సర్పం పడగదించి నమస్కరించి వెళ్లిపోయింది. అలాంటి తమ్ముళ్ళపై ముత్తుస్వామి గారికి ఎనలేని అభిమానం.

అమృత వర్షిని రాగంతో మహావర్షం..

ముత్తుస్వామి దీక్షితులు గారూ ఎట్టాయపురం కి నడిచివస్తూనే మార్గాంతరంలో అనేక గ్రామాల సందర్శించారు. ఒకచోట వర్షం లేక ఎండిపోయిన పైరు తన కంటపడింది. సరస హృదయుడైన ముత్తుస్వామి గారికి హృదయం ద్రవించింది. చేతికింది వచ్చిన పైరు నాశనం అవుతుందనే బాధ వారి మనసును కలిసివేసింది. కనికరంతో చలించిపోయారు. ఒక్క క్షణం సమీపంలో ఉన్న చెట్టు నీడకు వెళ్లారు. వారి శిష్యులు కుటుంబం ఆశ్చర్యంగా చూస్తున్నారు. వలవల కన్నీరు కారుస్తున్న ముత్తుస్వామి గారి స్థితి వారిని కలవరపరిచింది. కారణం తెలిసి వారు ఆశ్చర్యపోయారు.

ఇంతలో ముత్తుస్వామి గారూ ధ్యాన నిమగ్నులయ్యారు. అమృతేశ్వరీ దేవి నుపాసించారు. అమృత వర్షిని రాగంలో కీర్తన అందుకున్నారు. “ఆనందమృత వర్షిని అమృతకర్షిణి” అని కరుణరసభరితంగా గానం చేశారు. ప్రకృతి పులకించిపోయింది. చుట్టూ ఉన్న జనం ఆశ్చర్య పరవశులై తిలకిస్తున్నారు. శిష్యులు గురువు వారి అమృత వాక్కులను గ్రంథస్థం చేస్తున్నారు. అద్భుతంగా సాగిపోతున్న ఆ కీర్తన ధోరణి వారికి ఆనందాన్ని కలిగించింది. నిర్మలాకాశంలో నీలి మేఘాలు తారసిల్లాయి. వర్ష సూచనలు కనిపించాయి. ఆ పల్లెలో జనమంతా అక్కడికి చేరారు. ఎంతో కాలంగా కరువు కాటకాలతో కృషించిపోతున్న వారి ముఖంలో ఆనందం చిందులేసింది.

సాక్షాత్తు వరుణ దేవుడే ఈ రూపంలో వచ్చాడని భావించారు. తమ కష్టాలు గట్టెక్కి తమ పంటలు పండే మంచి కాలం వచ్చింది అని సంతోషించారు. ఆ మహానుభావుడి వృత్తాంతం ఏమిటని శిష్యుల ద్వారా తెలుసుకున్నారు. వారి గాన మాధుర్యాన్ని గురించి తెలిసిన పండితులు పాదాభివందనం చేశారు. గ్రామ పెద్దలు మర్యాదపూర్వకంగా నమస్కరించి సంభాషించారు. ముత్తుస్వామి గారూ ఇవేవి గమనించే స్థితిలో లేరు. కీర్తన ఆలపిస్తూ పులకించి పోతున్నారు.

రాను రాను ఆకాశంలో మేఘాలు దట్టమయ్యాయి. క్షణకాలంలో విపరీతమైన వర్షధారలు కురిశాయి. ఎవరు చెట్ల చాటుకు వెళ్లలేదు. ఆనందంగా వర్షంలో తడిసి మురిసిపోతున్నారు. దీక్షితుల వారు మళ్ళీ కీర్తన గానం చేశారు.

ఆనందామృతకర్శిని అమృత వర్షిని

హరాది పూజితే శివే భవాని

శ్రీ నందనాది సంరక్షిని

శ్రీ గురుగుహజనని చిద్రూపిణి 

సానందహృదయ నిలయే సదయే

సధ్యః సుహృష్టి హేతవే ద్యాం 

సతతం చింతయే అమృతేశ్వరి

సలీలం వర్షయ వర్షయ వర్షయ

ఆనందామృతకర్శిని

అని గానం చేసేసరికి సకల చరాచర జగత్తు వర్షధారలతో  తడిసిపోయింది. గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు.

ఆ ప్రాంతమంతా రేగటినేల. ముత్తుస్వామి గారూ ప్రయాణం చేస్తున్నది రెండు చక్రాల బండి. ఆ వర్షం తాకిడికి రేగటి నేలలో బండి చక్రాలు కూరుకొనిపోయాయి. శిష్యులు క్రమక్రమంగా గ్రహించారు. గ్రామస్తులు ఆ రోజు తమ గ్రామంలో విడిది చేయాల్సిందిగా ముత్తుస్వామి దీక్షితుల గారిని బలవంతం చేశారు. కానీ వారి కోరిక అంగీకరించ లేదు దీక్షితులు గారూ. కారణం తన లక్ష్యం సోదరుని వివాహానికి అందుకోవాలి. బండిని బయటకు లాగారు గ్రామస్తులు. మేళ తాళాలతో వీడ్కోలు చెప్పారు.

జీవన అంతిమయాత్రలో..

ఎట్టాయపుర పొలిమేరలో దీక్షితులు వారిని మహారాజు గారూ స్వాగత సత్కారాలు నిర్వహించారు. తన తమ్ముడి కుటుంబంతో కలిసి యువరాజు గారి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు ముత్తుస్వామి దీక్షితులు గారూ. యువరాజుల వారి వివాహానికి వివిధ ప్రాంతాల నుండి బంధు జనం వచ్చారు. వివాహ ప్రాంగణంలో సంగీత, సాహిత్య విధ్వాంసులకు సన్మానాలు జరిగాయి. ముత్తుస్వామి దీక్షితుల వారు ప్రభువు కోరిక మీద నవావర్ణ కృతులను గానం చేశారు. 

తన జీవితంలో జీవన సంధ్యాసమయం ఆసన్నమైందని ముత్తుస్వామి దీక్షితులు గారూ గ్రహించారు. మన్మథ నామ సంవత్సరం  21 అక్టోబరు 1835 నాడు తులాకృష్ణ చతుర్థశి దినం నాడు శిష్య బృందంతో ముచ్చటిస్తున్నారు ముత్తుస్వామి దీక్షితులు వారు. శిష్యులను పూర్వ కళ్యాణి లోని “మీనాక్షి మేముదం” అనే కృతిని గానం చేయమన్నారు దీక్షితుల వారు. దీక్షితుల వారి శిష్యులు బృందంగా గానం చేశారు.

“మీనలోచని పాశమోచని” కీర్తన గానం చేయమన్నారు. శిష్యులు గురువు గారి ఆదేశం పాటించారు. రెండో మారు కూడా అదే కీర్తనలు గానం చేయమన్నారు. చివరలో ధ్యాన నిమగ్నులైన ముత్తుస్వామి దీక్షితుల వారు రెండు చేతులు పైకి ఎత్తి అంజలి ఘటించి “శివే పాహి” అని చివరి శ్వాస వదిలారు. నాద జ్యోతి ఆరిపోయింది.

వారి కీర్తనలు దేశం అంతటా వ్యాపింపజేసిన శిష్యులు గురువుగారి రుణం ఆవిధంగా తీర్చుకున్నారు.

Show More
Back to top button