GREAT PERSONALITIESHISTORY CULTURE AND LITERATURE

ఆయన వ్యక్తి కాదు, గొప్ప వ్యవస్థ.. కందుకూరి వీరేశలింగం పంతులు!

వీరేశలింగంగారు గొప్ప సంఘసంస్కర్తే కాదు, గొప్ప కవి, రచయిత, ఉపాధ్యాయుడు… తెలుగు సాహిత్యంలో ఆయన స్పృశించని సాహితీ ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన రచనలు, కవిత్వాల్లో… అభ్యుదయభావాలు ప్రస్ఫుటంగా నిండి ఉండేవి. వితంతు పునర్వివాహం, స్త్రీ విద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు.. ఎందరిలోనూ మార్పు తీసుకొచ్చారు. ఆయన రచనలు అప్పట్లో అంతలా సంచలనం సృష్టించాయి మరీ… తెలుగు సాహిత్యంలో పంతులుగారికి సమున్నతమైన స్థానం ఉంది. గద్య రచనలు, నవలలు, కథలు, వ్యాసాలు.. ఇలా అన్ని రకాల సాహితీ ప్రక్రియల్లో తనదైన ముద్ర వేశారని చెప్పవచ్చు. తెలుగుసాహిత్యం ఉన్నంతవరకూ ఆయన పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. యుగకర్తగా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. కావున ఆయన బాల్యం మొదలుకొని, విద్యాభ్యాసం, సాహితీ కృషి, సంఘ సేవా విశేషాలను మనం ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:

తాతగారి పేరూ.. వీరేశలింగం..!

1848 ఏప్రిల్, 16వ తేదీన అప్పటి రాజమహేంద్రవరం, నాటి రాజమండ్రిలో సుబ్బరాయుడు, పున్నమ్మ దంపతులకు జన్మించారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. వీరి పూర్వీకులది నేటి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు. వీరి తాతగారి పేరునే.. బాల  వీరేశలింగానికి పెట్టడం జరిగింది. ఈయన గొప్ప ధర్మాత్ముడు..  ఆ కాలంలో ఎన్నో భూదానాలు చేశారు. బాలవీరేశలింగం జననానికి ఒక సంవత్సరం ముందుగా ఈయన కాలం చేశారు. ఈయనకు ఇద్దరు కొడుకులు.. వెంకటరత్నం, సుబ్బరాయుడు. వీరిద్దరికి తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం ఉంది. సంస్కృతంలో పంచకావ్యాలు పూర్తి చేశారు. కొద్దిగా ఆంగ్ల పరిజ్ఞానం ఉంది. ఏదేని ఒక విషయాన్ని చక్కగా రాయగల నేర్పరులు.. చదువయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో కాకినాడలోని పిఠాపురం సంస్థానంలోని క్లర్కు ఉద్యోగానికి ఎంపికయ్యారు బాల వీరేశలింగం తండ్రి సుబ్బరాయుడు. పెద్దనాన్న వెంకటరత్నం పత్రిక సంస్థల్లో ఉద్యోగం చేసేవారు.  ఉద్యోగంలో చేరకముందే మేనత్త కూతురైన పున్నమ్మతో వివాహం జరిగింది.

ఎదురు మేనరికపు పెళ్లి వీరిది. తల్లి లేని పున్నమ్మలో తన చెల్లిని చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు వీరేశలింగం పంతులు తాతగారు. పున్నమ్మకు మొదటినుంచి పలు ఆరోగ్య సమస్యలు ఉండేవి. చాలా బలహీనురాలు.. ఇలా వీరికి పుట్టిన సంతానమే వీరేశలింగం పంతులు.. పుట్టిన ఆరు నెలలకే స్పోకటం సోకింది. అయితే ఒకనాడు ఈ స్పొకటం వల్ల కాళ్ళు చేతులు కదపలేక నిర్జీవంగా ఉండటంతో.. భయపడిపోయారు. అలా తాతగారి పేరు పెట్టిన తర్వాత.. తిరిగి కోలుకోవడంతో.. అప్పటినుంచి ఎంతో అల్లారుముద్దుగా చూసుకోవడం మొదలుపెట్టారు. అయినా బాల్యం నుంచే ఈయనకు విపరీతమైన దగ్గు, ఆయాసం ఉండేవి.. ఇవి ఆయన్ను జీవితాంతం వెంటాడాయి. అయితే తండ్రి అనారోగ్యం వల్ల బాల వీరేశలింగం చిన్నప్పుడే, నెలల వయసప్పుడే మరణించారు. తండ్రికన్నా పెద్ద నాన్నతోనే చనువు ఎక్కువ. తండ్రి మరణం తర్వాత ఆయన వద్దే పెరిగారు. పెద్దనాన్న ఉద్యోగం నిమిత్తం తిరిగి రాజమండ్రికి వచ్చేసింది వీరి కుటుంబం.  

వీధి బడే.. విద్యాభ్యాసం..!

ఐదేళ్ళప్పుడు ఇంటికి సమీపంలో వీధి బడిలో చేర్పించారు. అక్కడ అక్షరాలు, ఎక్కాలు, లెక్కలు గణితం నేర్చుకున్నాడు. కొన్నాళ్ళకు సోమరాజుగారి బడికి వెళ్ళాడు. ఈయన పాండిత్యం తెలిసిన వ్యక్తి. దీంతో బాలా రామాయణం, అమర నిఘంటువును చదివించాడు. అనంతరం వాచకం ఎలా చదవాలో, రాయాలో నేర్పించాడు కూడా. రుక్మిణి కళ్యాణం, సుమతి, కృష్ణ శతకాలను సైతం వల్లె వేయించాడు. ఆరోజుల్లో సామాన్యంగా ఇదే తెలుగుకు సంబంధించిన పాఠశాల విద్య… ఇక చదువు పూర్తయిందని బడి సైతం మాన్పించేశారు కుటుంబసభ్యులు. ఉద్యోగానికి కావాల్సిన విద్య(స్కిల్స్)ను నేర్పించేందుకు.. పోతరాజు రఘురామయ్య దగ్గరకు పంపించారు. ఈయన తాలూకా కచేరీలో గుమస్తాగా పని చేస్తుండేవారు. రెండేళ్లు అక్కడే గడిచింది. కానీ నేర్చుకున్నది ఏమి లేదు..

అయితే వీరి తాతగారు బతికున్న రోజుల్లో పురాణం చెప్పడానికి ఇంటికి దూరి సోమయాజులుగారు ఇంటికి వచ్చేవారట.. అలా ఆయన రోజు కొంతభాగం చొప్పున రఘువంశం గురుంచి చెప్పడం… సాయంత్రం కాగానే పెద్దనాన్న ఇంగ్లిష్ అక్షరాలూ, గణితం, మాట్లాడటం నేర్పించేవారట. ఇలా పొద్దున సాయంత్రం.. ఇంట్లోనే పాఠాలు, అభ్యసన నిర్విరామంగా జరిగేది. కొన్నిరోజులకు పురాణం చెప్పే దూరి సోమయాజుల వద్ద కాళిదాసు త్రయాన్ని చదివాడు. అప్పట్లో పాఠశాలలు, వార్షిక పరీక్షలు అంటూ ఉండేవి కావు. ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ కార్యస్థానాలకు పనుల నిమిత్తం వెళ్లి.. అక్కడ పని చేసేవారిని అనుసరిస్తూ ఉండేవారు. పనిని నేర్చుకుంటూ.. వారి మెచ్చుకోలు తెచ్చుకున్నవారినే ఉద్యోగాల్లో చేర్చుకునేవారు.

కొన్నాళ్ళకు.. ఆంగ్ల ప్రభుత్వం వారు ఇండియాలో పాఠశాలలు స్థాపించి, దేశ భాషల్లోనూ ఇంగ్లిష్ భాషల్లో కొన్ని సామాన్య, విశేష, పరీక్షలను ఏర్పాటు చేయాలని యోచన చేశారు. అలా కొంతకాలానికి 1860లో ఇంగ్లిష్ నేర్చుకోవటానికి పూర్తిస్థాయి దొర మండల పాఠశాలలో చేరారు పంతులు గారు. అప్పటికి అయన వయసు పన్నెండు.. మొదట్నుంచి శారీరకంగా అవస్థలు పడుతున్న వీరేశలింగానికి ఆటలు ఉండేవి కావు, బయట తిరిగింది లేదు. ఒక్కడే కొడుకు.. కావడంతో ఇంట్లోనే ఉంచుతూ.. ఏ పని చెప్పకుండా, ఏదో ఒకటి రాయమనో, చదవమనో చెబుతుండేవారట. అలా ఇంట్లోనే ఉంచుతూ అపురూపంగా చూసుకున్నారు.

అయితే ఇలా ఇంట్లోనే ఉండటం వల్ల సమయం ఎక్కువగా దొరికి, చదివిన దాన్నే మళ్ళీ మళ్ళీ చదవడం చేత.. ఏదైనా చదివితే.. వెంటనే ఙ్ఞప్తికి వచ్చేంత మేధను ఆయన స్వయంగా సంపాదించుకున్నారు. ఇంట్లో దొరికే తాటాకు పుస్తకాల్ని చదవడం.. క్రమంగా తెలుగు, తెలుగు కావ్యాల మీద ఎక్కడలేని అభిమానం ఏర్పడింది. ఆనాటి మహా కావ్యాలన్నిటిని చదవడాన్ని ఎంతో ఇష్టపడేవారట. స్కూల్ కి ఆరునెలల వరకు వెళ్లకపోయినా, పరీక్షల్లో మాత్రం ఎల్లప్పుడూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించేవాడు.1867లో ఈయన పెద్దనాన్న జబ్బుపడి, మరణించాడు. చదువయ్యాక.. పలు మండల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. నెలకు 25 నుంచి 30 రూపాయల జీతం ఇచ్చేవారు. అప్పట్లో అదే అత్యధిక వేతనం. స్త్రీ విద్య, వికాసం, బాలికల పాఠశాలల కోసం కృషి గావించాడు. దాదాపు పాతికేళ్లు పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 

రచనా రంగంలో… టీచర్ గా పని చేసిన సమయంలో ఎన్నో నాటకాలు రచించి తన శిష్యులతో వేయించారు. అలా వేసిన నాటకం ‘వ్యవహార ధర్మబోధిని’ ప్రజల చేత విస్తృతంగా అభిమానం చూరగొంది. పదిమందికి ఉపయోగపడే పనుల్లో ముందుండేవారు. అందుకు ఎన్ని అవస్థలు పడాల్సిన వచ్చిన వెనక్కి తలొగ్గేవారు కాదు. ఆయన చిత్తశుద్ధి అలాంటిది మరీ…

1874లో వివేకవర్థిని అనే పత్రికను నడిపారు. అస్తిత్వం, సత్యం, అహింస అనే అంశాలపై పలు వ్యాసాలను రాశారు. అవన్నీ ఆలోచింపజేసేలా, ఆచరణాత్మకంగా ఉండేవి.

1876లో హాస్య సంజీవని అనే మరో పత్రికను నడిపారు. ఈ పత్రికలో సులభ శైలిలో రచనలు చేసి, అందించారు. గ్రాంథిక భాషలో రచనలు చేసినప్పటికీ సామాన్య మానవులకు సైతం అర్థం అయ్యేలా ఉండేవి. అది ఆయన ప్రత్యేకత. నిజానికి గ్రాంథిక శైలిలో రాసి ఉండకపోతే, బహుశా ఇప్పుడవి పాఠ్యాంశాలుగా పరిగణింబడేవి కావేమో.. ఇంత గౌరవాన్ని పొందేవి కావేమో..

మూఢ విశ్వాసాలను పోగొట్టాలనే ఉద్దేశంతో రాజశేఖర చరిత్ర అనే వచన ప్రబంధం రాశారు. ఇది వివేక వర్థిని పత్రికలో నెలనెలా కొంతభాగం వచ్చేది. తర్వాత పుస్తక రూపం దాల్చింది. అప్పట్లో నవలను వచన ప్రబంధం అనేవారు. తెలుగు నుంచి ఫార్చ్యూన్స్ వీల్ అనే పేరుతో ఇంగ్లీష్ లోకి అనువదించబడింది ఈ నవల.. ఆపై కన్నడంలోకి కూడా అనువాదమైంది.

సొంత రచనలతో పాటు.. ప్రాచీన కవులు రాసిన రచనల్లో అముద్రితమైనవి, పేర్లు మాత్రమే వినపడి, ఆగిపోయిన గ్రంథాలను ఈయన సంకల్పించి పూర్తి చేశారు. అలా దాదాపు ఇరవై రెండు ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి, తిరిగి ముద్రింపజేశారు.

1883లో స్త్రీల కోసమే ప్రత్యేకంగా సతీహిత బోధిని అనే పేరుతో తెలుగు మాసపత్రికను ప్రారంభించారు.

రచనలు, వాటి ముద్రణ నిమిత్తం సొంత గ్రామం వదలి, 1897లో చెన్నపట్నానికి మకాం మార్చారు. ఆయన రాసిన పుస్తకాలు పది పెద్ద సంపుటాలుగా ముద్రణ అయ్యాయి. ఇందుకు రెండు సంవత్సరాల కాలం పట్టిందంటే.. నమ్మగలరా..

నవల, కథలు, ప్రసిద్ధ స్త్రీ, పురుష జీవిత చరిత్రలు, ప్రహసనములు, వ్యాసములు, గ్రంథ విమర్శనములు, చారిత్రక గ్రంథములు, పత్రికా రచనలు, శాస్త్ర గ్రంథములు, ఉపన్యాసములు వంటివి ఆయన రచించిన గద్య రచనలు.. ఇందుచేతనే ఆయనకు ‘గద్య తిక్కన’ అనే బిరుదు వచ్చింది. పద్య కావ్యాలకంటే గద్య కావ్యాల వల్లే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన భావించారు.

రచనలు..

సత్యవతీ చరిత్ర అనే మరో వచన ప్రబంధాన్ని రాశారు. విక్టోరియా మహారాణి చరిత్రను రాసి ప్రచురించారు. షేక్స్పియర్ నాటక కథలను కథారుపంగా రాశారు. శాస్త్రీయ గ్రంథాలు ఎలా రాయాలో అనేదానికి మార్గదర్శనం చేశారాయన.. ఆంధ్ర కవుల చరిత్ర ఆయన రాసిన వాటన్నిటిలో ప్రత్యేకమైంది. స్త్రీ పునర్వివాహల పట్ల ఆయనకున్న అభినివేశం.. ఆయన ఉపన్యాసాలు, రచనలలో అవ్యక్తమయ్యేవి. పద్యమైనా.. వచనమైనా ఆయన ఒక్కసారే రాసేవారట. చిత్తు కాపీలు అంటూ.. రాసే అలవాటు ఆయనకు లేదట. తెలుగు భాషను వృద్ది చేయాలనే సంకల్పమే ఈ రచనా ప్రవాహానికి కారణం. 

ఇతరాంశాలు..

*దాదాపు 130కి పైగా గ్రంథాలు రచించాడు.

*మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి.. కొనసాగింపుగా… 40 వితంతు వివాహాలు జరిపించాడు.

*మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు.

*తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే..

*ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలైంది.

*రాజశేఖర చరిత్రము(తొలి తెలుగు సాంఘిక నవల)

*ఆయన పదమూడో ఏట ఎనిమిదేళ్ళ బాపమ్మ(రాజ్యలక్ష్మమ్మ)తో బాల్య వివాహం జరిగింది. ఆయన లక్ష్యపెట్టిన సాంఘిక పోరాటంలో… బతికినంత కాలం.. భర్త అడుగు జాడలవెంటే ఉన్నారు రాజ్యలక్ష్మమ్మగారు. వీరిద్దరికీ పిల్లలు లేరు. ఈవిడ 1910లో కన్నుమూశారు. అది ఆయనకు తీరని నష్టం. ఆమె సమాధి తన సమాధి కన్నా ఎత్తుగా ఉండేలా కట్టించారట. తన స్వీయ చరిత్రను సైతం ఆమెకే అంకితమిచ్చారు.

1919 మే 27న, తన 71ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు.

ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త.. విధ్యాధికుడు.. నవయుగ వైతాళికుడు.. నిరంతరం గ్రంథ రచన, పత్రికా నిర్వహణ, వీటితో పాటు సాంఘిక దురాచారాల నిర్మూలన కార్యక్రమాలు.. వితంతు పునర్వివాహా ప్రయత్నాలు.. వీటిపై వాదోపవాదనలు చేయడమే కాక ఆయన అభిప్రాయాలను ఎంతమందిలోనైనా నికచ్చిగా  వెలిబుచ్చేవారట.. నాటికి, నేటికీ తెలుగు జాతికే గర్వకారణమయ్యారు.

Show More
Back to top button