
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. అతనికి తోడుగా యువ సంచలనం అభిషేక్ శర్మ (52 పరుగులు) మరియు ఇషాన్ కిషన్ (54 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
బౌలర్ల పంజా – కీవీస్ చిత్తు
256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన మ్యాజిక్ చూపించి 4 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. స్థానిక కుర్రాడు అక్షర్ పటేల్ కూడా 3 వికెట్లతో కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (52 పరుగులు) ఒంటరి పోరాటం చేసినా, ఇతర బ్యాటర్లు విఫలమవడంతో ఆ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 96 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.
చరిత్రలో భారత్: మూడుసార్లు విశ్వవిజేత
ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను భారత్ వరుసగా రెండోసారి (2024, 2026) నిలబెట్టుకోవడమే కాకుండా, మొత్తం మీద మూడోసారి (2007, 2024, 2026) ట్రోఫీని గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా కూడా భారత్ చరిత్రకెక్కింది. టోర్నీ అంతటా అద్భుతంగా రాణించిన సంజు శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ గా నిలవగా, ఫైనల్‌లో అద్భుత స్పెల్ వేసిన జస్ప్రీత్ బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమ్ ఇండియా సాధించిన ఈ విజయం భారత క్రికెట్ అభిమానులకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.










