
పరమవీరచక్ర.. భారతదేశ రక్షణార్ధం యుద్ధంలో అనిర్వచనీయమైన ధైర్యాన్ని సాహసాన్ని త్యాగాన్ని ప్రదర్శించిన సైనికులకు భారత ప్రభుత్వం సత్కరించే సర్వోన్నత పురస్కారం. మనలో చాల మంది ఈ పరమవీరచక్ర గౌరవ పురస్కారం గురించి విన్నప్పటికిని అసలు ఈ పరమవీరచక్ర యొక్క డిజైన్ ఎందుకు ఈ విధంగా చేయబడింది, అసలు ఈ పరమ వీర చక్ర యొక్క అర్ధం ఏమిటి? అన్న విషయం మాత్రం మనలో కొద్దీ మందికే తెలుసు. ముందుగా మనం పరమవీర చక్ర గురించిన ఆకృతిని గురించి తెలుసుకుందాం. భారతీయ నౌకాదళం యొక్క వెబ్ సైట్ లో దీని నిర్మాణాన్ని వర్ణించారు.
స్పష్టంగా మనకు ఇండియన్ నేవి వెబ్ సైట్ లో అర్ధం అయ్యేది ఏంటంటే పరమా వీరచక్ర గుర్తు మీద ఇంద్రుని వజ్రాయుధం చిహ్నాన్ని 4 సార్లు చెక్కబడి ఉంది. అయితే ఎందుకని ఇంద్రదేవుని వజ్రాయుధాన్ని మాత్రమే ఇక్కడ చెక్కబడింది. ఇది పరమ వీర చక్రకు సంబందించిన అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న. పరమవీరచక్ర మనకు అర్ధం కావాలంటే దధీచి మహర్షి జీవిత చరిత్ర గురించి మనకు అర్ధం కావాలి.
దధీచి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడైన కర్దమ ప్రజాపతి వంశంలో జన్మించిన ఒక గొప్ప యోగి. నాలుగు వేదాలలోను అన్నింటికంటే పురాతనమైన ఋగ్వేదంలో కూడా దధీచి మహర్షి యొక్క ప్రస్తావన ఉంది. దధీచి మహర్షి సరస్వతి నది తీరాన జీవించేవారని సరస్వతి నది పరివాహక ప్రాంతాల్లో ఆయన ఆశ్రమం ఉండేదని ఋగ్వేదం మరియు ఇతర పురాణాల ద్వారా మనకు అర్ధం అవుతుంది. అయితే ప్రస్తుత పరిశోధన పరిజ్ఞానానుసారం సరస్వతి నది కనీసంలో కనీసం 20 వేల సంవత్సరాల క్రితమే అంతరించి పోయిందని మనకు అర్ధం అవుతుంది. ఋగ్వేదంలో విశేషంగా సరస్వతి నది యొక్క ప్రస్తావన కొన్ని వందల వేళా ఏళ్ళ క్రితమే అంతరించి పోయిన సరస్వతి నది యొక్క చరిత్ర వీటన్నింటిని పరిశీలిస్తే దధీచి మహర్షి ఏనాటి వారు అనేది స్పష్టమౌతుంది.
మన పురాణాల్లో ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధాలను వివరించే దేవాసుర సంగ్రామ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒకానొక సందర్భంలో వృత్తాసురుడు అనే ఒక రాక్షస రాజు ఈ ప్రపంచంలో ఉన్న అందరిని అన్నింటిని హింసించ సాగాడు. అలా జరుగుతున్న దేవాసుర యుద్ధంలో ఇంద్రుడు వృత్తాసురుడితో తలపడి యుద్ధం చేసి అత్యంత శక్తివంతుడైన వృత్తాసురుడి ముందు నిలువలేక ఓడిపోయి వెనుదిరుగుతాడు. ఇంద్రునితో పాటు దేవగణాలందరిని కూడా ఎంతో సునాయాసంగా ఓడించి ఈ సృష్టిలో ఉన్న అందరిని అన్నింటిని అధర్మాత్మకంగా హింసిస్తూ ఉంటాడు. వృత్తాసురుణ్ణి జయించి తిరిగి ధర్మ సంస్థాపన చేయాలని ఇంద్రుడు, దేవగణాలు శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించి శరణు కోరాడు.
అయితే శ్రీ మహావిష్ణువు వృత్తాసురుడు తన భక్తుడు అవడం చేత తాను నేరుగా సంహరించలేనని, కానీ అధర్మాన ఉన్న వృత్తాసురుడు మరణించాక తప్పదు కాబట్టి దేవతలను దధీచి మహర్షి శరణు కోరామని శ్రీ మహావిష్ణువు ఉపాయాన్ని చెప్తారు. దధీచి మహర్షి వేరువేరు సందర్భాలలో శ్రీమహావిష్ణువు, మహాశివుని సందర్భంగా అపారమైన తపోశక్తి మరియు స్వచ్చంధ మరణం కలిగి ఉంటారు. ఆవిధంగా నైమిశారణ్యంలో తపస్సులో ఉన్నటువంటి దధీచి మహర్షి దగ్గరకు ఇంద్రుడు మరియు దేవగణాలు సహాయార్ధం శరణు కోరి వచ్చి వృత్తాసురుణ్ణి వదించడానికి తమ సహాయం కావాలని దధీచి మహర్షిని శరణుకోరుతారు.
దధీచి మహర్షి తాను వృత్తాసుర సంహారంలో ఇంద్రునికి దేవా గణాలకు ఏ విధంగా సహాయ పడగలను అని అడుగగా.. ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు చెప్పిన ఉపాయాన్ని దధీచి మహర్షికి వివరిస్తాడు. దధీచి మహర్షి యొక్క వెన్నెముక మరియు ఆస్తికలతో తయారుచేయబడిన ఒక దివ్య ఆయుధం చేత మాత్రమే వృత్తాసురుడిని చంపడం సాధ్యమని, అందుకని ఇంద్రుడు మరియు దేవగణాలు దధీచి మహర్షి యొక్క శరీర అస్థికలను ఎముకలను తమకు అనుగ్రహించాలని ప్రార్ధిస్తారు.
‘పరోపకారార్ధ మిదం శరీరం’ అన్న దధీచి మహర్షి సంతోషంగా స్వచ్చంధంగా తన శరీరాన్ని భిక్షగా దేవతలకు దేవగణాలకు దానం చేస్తాడు. ‘లోకా సమస్త సుఖినో భవంతు’ అని శరీర త్యాగం చేసిన దధీచి మహర్షి అస్థికలను విశ్వకర్మ అతి శక్తివంతమైన భయంకరమైన ఆయుధంగా మలుస్తాడు. అదే వజ్రాయుధం. శివకేశవ అనుగ్రహ శక్తి కలిగిన దధీచి మహర్షి యొక్క శరీరం నుంచి వెలువడిన ఈ వజ్రాయుధాన్ని ధరించి ఇంద్రుడు వృతాసుర వధకై యుద్దానికి బయల్దేరుతారు.
వృత్తాసురునికి ఇంద్రునికి జరిగిన యుద్ధంలో అత్యంత శక్తి వంతమైన వజ్రాయుధాన్ని నిలువలేక ఆ వజ్రాయుధ శక్తికి వృత్తాసురుడు మరణిస్తాడు. మన పురాణేతిహాసాలలో అస్త్ర శాస్త్రాలన్నింటిలోకెల్లా అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో వజ్రాయుధం ఒకటి. ఇందుకు కారణం దధీచి మహర్షి యొక్క శక్తి. పది మంది బాగుండాలని ప్రాణత్యాగం చేసిన వారిలో బహుశా మన పురాణేతిహాసాలలో మొట్ట మొదట ఉండే పేరు దధీచి మహర్షి. ఏ స్పూర్తితో అయితే దధీచి మహర్షి తన ప్రాణ త్యాగం చేశారో, అదే స్పూర్తితో భారతదేశం రక్షణార్థం యుద్ధంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ జీవితాలను భారతదేశ రక్షణార్థం అంకితం చేసినటువంటి సైనికులను దధీచి మహర్షి ఆస్తికలతో తయారు చేయబడిన ఇంద్రుని వజ్రాయుధం చిహ్నంగా చెక్కబడిన పరమ వీర చక్రను అలంకరించడం జరుగుతుంది. అంతే కాకుండా 1988లో దధీచి మహర్షి పేరున ఒక పోస్టల్ స్టాంప్ ను భారతీయ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.
అయితే ఇంద్రుని వజ్రాయుధం ఇలాగె ఉంటుందని పరమవీర చక్ర మీద ఎలా ముద్రిస్తున్నాం అనేది లోతుగా పరిశీలిద్దాం. ఇంద్రుని వజ్రాయుధం యొక్క వివరణ మనకు వేదాల్లో పురాణాల్లో ఉన్నప్పటికినీ చాలా సులువుగా మనకు అర్ధం అవ్వాలంటే ఒక విగ్రహం ద్వారా తెలుసుకోవచ్చు. సుమారు 1200 సంవత్సరాల క్రితం చెక్కబడినటువంటి ఈ ఇంద్రుని విగ్రహం ఏదైతే ఉందొ.. ఇది ప్రస్తుతం అమెరికాలోని మెట్రోపాలిటన్ మ్యూజియం అఫ్ ఆర్ట్స్, న్యూయార్క్ లో ఉంది. ఇక్కడ ఇంద్రుని విగ్రహంలో నాలుగు చేతుల్లో కుడి చేతికి వజ్రాయుధం ధరించి ఉంటుంది. ఈ వజ్రాయుధం శివును త్రిశూలం పోలి ఉంటుంది.
అలాగే ఇంద్రుని పక్కన ఐరావతం ఉంటుంది. ఈ విగ్రహంలో ఉన్న ఇంద్రుని వజ్రాయుధాన్ని పరమవీర చక్రతో పోల్చి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. మరొక పెద్ద దురదృష్టం ఏంటంటే.. భారతదేశసంపద అయిన ఇటువంటి పురాతన విగ్రహాలు పాశ్చాత్య దేశ మ్యూజియంలో ఈరోజు మనం చూడవలసి వస్తుంది. అయితే మనకు ఎలాగూ మన చరిత్ర మీద, మన పురాణాల మీదశ్రద్ధ ఎలాగూ లేదు కాబట్టి ఇవి మన దగ్గర ఉండటం కంటే.. పాశ్చాత్త దేశాల మ్యూజియంలో ఉండటమే బెటర్.
ఋగ్వేదం మరియు ఇతర పురాణాలలో చెప్పబడినటువంటి దధీచి మహర్షి జీవిత చరిత్రానుసారంగా రూపొందించబడిందే ఈ పరమవీర చక్ర. భారత దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన ప్రతి సైనికుడు దధీచి మహర్షి యొక్క స్వరూపమే అని భారత ప్రభుత్వం సమర్పించే గౌరవ పురస్కారమే ఈ పరమవీర చక్ర. కేవలం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులే కాకుండా సైన్యం దగ్గరనుండి మొదలుకొని పోలీసు సిబ్బంది వరకు పదిమంది బాగుండాలని తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కర్తవ్యాన్ని నిర్వహించే ప్రతి ఒక్కరూ దధీచి మహర్షి యొక్క స్వరూపమే. వేద పురాణ ఇతిహాసాలు అంటే అవేవో మతపరమైన గ్రంథాలు అనుకోవడం మూర్ఖత్వం. ఇది ఈ దేశ చరిత్ర. ఇది పరమవీర చక్ర యొక్క వైదిక విశ్లేషణ. సర్వేజనా సుఖినోభవంతు.. !!