
అమెరికాలోనే అతి పెద్ద తెలుగు సంఘంగా పేరొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలకు ఇప్పుడు అంటే మూడు నెలల ముందుగానే సన్నాహాలు మొదలయ్యాయి. రెండెళ్లకోసారి నిర్వహించే ఈ మహాసభలకు జులై 3 నుంచి 5వరకు డెట్రాయిట్ వేదిక కానుంది. 24వ ద్వైవార్షిక మహాసభలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సంఘం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా మహాసభల లక్ష్యానికి అనుగుణమైన నినాదం సిద్ధమైంది. యువతరం, నైపుణ్యం ప్రధాన అంశాలుగా 9 నినాదాలను మేధావులు సూచించారు. తెలుగుదనానికి, తెలుగు ఔన్నత్యానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చే తానా.. ఈసారి మహాసభలకు
‘తరతరాల తెలుగుదనం – తరలివచ్చే యువతరం’ అనే నినాదంతో ముందుకు రావడం విశేషం!
తానా సభలు ప్రపంచంలోని తెలుగు కమ్యూనిటీని ఎంతగానో ఆకర్షిస్తుంటాయి కాగా అమెరికా నలుమూలలా ఉన్న తెలుగువారితోపాటు అమెరికాలోని రాజకీయ ప్రముఖులు, భారత్ లోని రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు తరలివచ్చి ఈ సభల్లో కనువిందు చేస్తుంటారు.
డెట్రాయిట్, దాని చుట్టుపక్కల ఎంతోమంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని వారికీ ఈ ప్రాంతం అనువైనదిగా ఉండటం వల్ల సభ నిర్వాహకులు మహాసభలకు వేదికగా డెట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ ను ఎంపిక చేశారు. అలానే కాన్ఫరెన్స్ కు అవసరమైన ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
తానా మహాసభలకు మూడు నెలల ముందుగానే ప్రచార కార్యక్రమాలను చేపట్టేందుకు తానా నాయకులు సిద్ధమయ్యారు. మార్చి నుంచి ఈ ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా కమ్యూనిటీని కాన్ఫరెన్స్ లో భాగస్వాముల్ని చేసేందుకు వీలుగా వివిధ కార్యక్రమాలను వివిధ నగరాల్లో నిర్వహించనున్నారు.
ఇందులో ‘థీమ్ తానా పోటీ’లను వివిధ నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆటల పోటీలు, స్థానిక ప్రముఖులతో సమావేశాలూ ప్రధానంగా ఉండనున్నాయి. ప్రచార కార్యక్రమాలతోపాటు నిధుల సేకరణకు రూపకల్పన చేస్తున్నారు. కాన్ఫరెన్స్ కు అమెరికాలో ఉన్న వివిధ రంగాల ప్రముఖులు, కళాకారులు,సాహితీవేత్తలు, అమెరికా చట్టసభల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.