ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తిగా చూస్తున్న అమెరికా అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ వాడీవేడిగా తాజాగా జరిగింది. ఈ డిబేట్ పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్ స్టిట్యూషన్ సెంటర్ వేదికగా రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఈ డిమేట్‌లో ఇరువురి మధ్య పలు అంశాలపై మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగింది. డిబేట్ ప్రారంభానికి ముందు ట్రంప్, హారిస్‌లు ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న సందర్భాలు లేవు. అయితే, ట్రంప్, హారిస్ ఇద్దరూ డిబేట్ ప్రారంభంకు ముందు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఆ తర్వాత జరిగిన డిబేట్‌లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగింది.
ట్రంప్‌కు మహిళల అభివృద్ధి నచ్చదంటూ హారిస్ తీవ్ర ఆరోపణలు చేశారు. అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారు. అత్యాచారాల వంటి కేసుల్లోనూ మహిళలకు ఎలాంటి మద్దతు ఇవ్వాలనుకోవడం లేదు. ఇది మహిళలను అవమానించడమే అని హారిస్ అన్నారు. అబార్షన్లపై నిషేధానికి నేను అనుకూలం కాదు. ఆ బిల్లుపై సంతకం చేయబోనని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపైనా ఈ ఇద్దరు మధ్య వాదోపవాదనలు జరిగాయి.
“ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి కమలా హారిస్ ఇజ్రాయెల్, నెతన్యాహులను ద్వేషిస్తున్నారు. నెతన్యాహు అమెరికా పార్లమెంట్‌కు చేరుకున్నప్పుడు హారిస్ అతన్ని కలవలేదు. ఆమె అరబ్ ప్రజలను ద్వేషిస్తుంది. ఆమె అమెరికా అధ్యక్షురాలు అయితే ఇజ్రాయెల్ రెండు సంవత్సరాల్లో తుడిచిపెట్టుకుపోతుందని” ట్రంప్ అన్నారు. దీనిపై హారిస్ స్పందిస్తూ.. ఇజ్రాయెల్‌కు తమని తాము రక్షించుకునే హక్కు ఉంది. కానీ, ఈ యుద్ధం ముగియాలని మేం కోరుకుంటున్నామని అన్నారు.
దీనికి ట్రంప్ మాట్లాడుతూ.. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు అమెరికాను చూసి ఎంతో భయపడేవి. కానీ, ఇప్పుడు అమెరికాను శాసించే స్థాయికి అవి చేరుతున్నాయని ఆరోపించారు. దీనికి కమలా హరిస్ కల్పించుకొని.. ట్రంప్, కిమ్ జోంగ్ మధ్య ప్రేమ లేఖ గురించి చర్చలు జరుగుతున్నాయని కౌంటర్ ఇచ్చారు. వైట్ హౌస్‌లోని పాత రికార్డులను తొలగించే సమయంలో కొన్ని ప్రేమ లేఖలు బయటపడ్డాయి.
వీటిని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ ట్రంప్‌కు, ట్రంప్ కిమ్‌కు పంపారంటూ హరిస్ సెటైర్లు వేశారు. దీంతోపాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కమలా హరిస్, ట్రంప్ మాటల యుద్ధం జరిగింది. అంతేకాదు తాను అధ్యక్షుడిని అయితే ఒబామాకేర్‌ను మారుస్తానని ట్రంప్ అన్నారు. ఒబామాకేర్ అనేది అమెరికాలో తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య బీమా చట్టం. అంటే స్థోమత రక్షణ చట్టం, దీనిని ఒబామాకేర్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ డిబేట్‌లో నిరుద్యోగం మరియు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఇరువురి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.