Telugu Featured NewsTelugu Special Stories

దేశ ప్రగతికి ఊతమివ్వనున్న సెమీ కండక్టర్స్ పరిశ్రమ 

నాటి ఆది మానవుని నుండి నేటి ఆధునిక మానవుని వరకు ఎడతెరిపి లేకుండా తన మేధస్సుకు పదును పెడుతూ, ఒకనాడు అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేస్తూ నూతన ఆవిష్కరణలను సృష్టిస్తూనే ఉన్నాడు. మానవుని ఈ నిర్విరామ కృషి ఫలితంగానే 1940వ దశకంలో “ఎలెక్ట్రానిక్స్” శకానికి అంకురార్పణ జరిగిందనుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని విస్తరించేందుకు విశేషమైన సంభావ్యత కలిగిన కొత్త పరికరాల శ్రేణిలో మొదటిది అనదగ్గ “ట్రాన్సిస్టర్‌” ను 1947లో జాన్ బార్డీన్, వాల్టర్ హెచ్. బ్రాటైన్, మరియు బెల్ పరిశోధనా సిబ్బందికి చెందిన విలియం బి. షాక్లీ లు కనుగొన్నారు. ట్రాన్సిస్టర్‌లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ల వంటి తదుపరి పరిణామాలతో పాటు, స్ఫటికాకార ఘన పదార్థాలతో రూపుదిద్దుకునే “సెమీకండక్టర్స్” అందుబాటులోకి వచ్చాయి.

నిరంతర పరిశోధనలతో ఈ రంగం కొత్త పుంతలు తొక్కుతూ, 1980 మధ్య నాటికి చవకైన మైక్రోప్రాసెసర్‌ లకు తెరలేపడంతో ప్రోగ్రామబుల్ మైక్రోవేవ్ ఓవెన్‌లు, థర్మోస్టాట్‌లు, వాషింగ్ మెషీన్లు, డ్రైయర్‌లు, సెల్ఫ్-ట్యూనింగ్ టెలివిజన్లు, సెల్ఫ్ ఫోకస్ కెమెరాలు, వీసీఆర్ లు, వీడియో గేమ్‌లు, టెలిఫోన్లు, ఆన్సరింగ్ మెషీన్లు, సంగీత వాయిద్యాలు, గడియారాలు మరియు భద్రతా వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాక వాణిజ్యం, పరిశ్రమలు, ప్రభుత్వ మరియు ఇతర రంగాలలో కూడా మైక్రోఎలక్ట్రానిక్స్ ల ప్రవేశంతో రిటైల్ స్టోర్‌లలో ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్‌లు, పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్ నుండి ఆటోమేటెడ్ ఫ్యాక్టరీ అసెంబ్లీ సిస్టమ్స్ మరియు ఆఫీస్ వర్క్‌స్టేషన్ల వరకు మైక్రోప్రాసెసర్-ఆధారిత పరికరాలు విస్తరించాయి.

గత 50 ఏళ్లలో సెమీకండక్టర్ టెక్నాలజీలో జరిగిన పరిణామాలు ఎలక్ట్రానిక్ పరికరాలను సూక్ష్మంగా, వేగంగా మరియు మరింత విశ్వసనీయంగా మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా నేడు మన పాలపుంతలో ఉన్న నక్షత్రాల సంఖ్యకు సమానంగా అంటే దాదాపు 100 బిలియన్ల ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు రోజువారీ ఉపయోగంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. కేవలం సెమీకండక్టర్ డిజైన్‌పై దృష్టి సారించే కంపెనీలను “కల్పిత” (Fabless) అని మరియు తయారీపై దృష్టి సారించే కంపెనీలను “ఫౌండ్రీస్” (Foundries) అని అలా కాక రెండు కార్యకలాపాలను నిర్వహించే సంస్థలను ఇంటిగ్రేటెడ్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్ లేదా (IDM) లు అని అంటారు.

డిమాండ్: 

సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ (SIA), ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ లు సంయుక్తంగా చేపట్టిన ఒక అధ్యయనం ప్రకారం, దేశీయంగా 67 వేల మంది కాకుండా విస్తృత అమెరికా ఆర్థిక వ్యవస్థను పరిగణన లోనికి తీసుకుని 2030 నాటికి 1.4 మిలియన్ల సెమీకండక్టర్స్ నిపుణులు, కంప్యూటర్ శాస్త్రజ్ఞులు మరియు ఇతర ఇంజనీర్ల కొరత ఏర్పడనున్నట్లు అంచనా వేసింది. ఇండీడ్ (Indeed) జాబ్ పోర్టల్ యొక్క సమాచారం ప్రకారం 2019 – 2023 మధ్య కాలంలో  దేశంలో ఈ రంగంలో 7 శాతం ఉద్యోగావకాశాలు పెరిగినట్లు తెలిసింది.

ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్ మరియు మెటీరియల్స్ ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు సెమీకండక్టర్స్ లో డిమాండ్ ఉంటుంది. స్టాటిస్టా (STATISTA) అంచనా ప్రకారం భారత్ నుండి ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులలో తమ పేర్లు నమోదుచేసుకుంటుండగా, ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ పట్టా అందుకుంటున్న వారిలో దాదాపు 25 శాతం భారతీయులు కావడం విశేషం. ఈ ప్రత్యేకతను అవకాశంగా మలచుకుని మన ఇంజనీర్లకు పరిశ్రమలో సుశిక్షితులైన నిపుణులతో శిక్షణ అందించగల్గితే ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఉద్భవించి తమ నైపుణ్యంతో ఈ కొరతను తీర్చవచ్చు.

అపారమైన ఉద్యోగావకాశాలు:

సెమీ కండక్టర్స్ లేదా చిప్స్ తయారీలో  డిజైనింగ్,  టెస్టింగ్ మరియు ప్యాకేజింగ్ వరకు ప్రతి దశలోనూ అత్యంత నైపుణ్యం గల వ్యక్తులు అవసరం. చిప్స్ డిజైనింగ్ పరిశ్రమ నిపుణుల అంచనా ప్రకారం, భారతదేశంలో ప్రస్తుతం చిప్ డిజైనింగ్ మరియు డెవలప్‌మెంట్ విభాగాలలో దాదాపు లక్షా ఇరవై ఐదు వేల బ్యాచిలర్స్, మాస్టర్స్ లేదా పీ హెచ్ డీ పూర్తిచేసిన ఇంజనీర్లు పనిచేస్తున్నారు. సాధారణంగా, VLSI (Very Large Scale Integration) డిజైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థల్లో పని చేయడానికి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్, VLSI డిజైన్‌లో ఎంటెక్ లేదా సెమీకండక్టర్ టెక్నాలజీ, మెటీరియల్ సైన్స్ లేదా కెమికల్ ఇంజనీరింగ్‌లో పీ హెచ్ డీ వాంఛనీయం.

ఈ విభాగంలో పనిచేస్తున్న బీటెక్ ఇంజినీర్ల వార్షిక వేతనం రూ.3-18 లక్షల మధ్య ఉంటుంది. కాగా, ఇంటెల్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఎన్‌ఎక్స్‌పి లాంటి భారీ బహుళజాతి చిప్ కంపెనీలలో మరింత అధిక జీతాలకు అవకాశం ఉంటుంది. దేశీయ సెమీకండక్టర్ పరిశ్రమలో చిప్స్ తయారీ కంటే కూడా ATMP (అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్ మరియు ప్యాకేజింగ్)కి అధిక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. జీతం విషయానికి వస్తే భారతదేశంలోని సంస్థలు ఈ విధులు నిర్వహించే నిపుణులకు రూ.7-14 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తుండగా అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం రూ.20-55 లక్షల వరకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ATMP కార్యకలాపాలు నిర్వహించే సంస్థలను స్వల్ప  పెట్టుబడితో స్థాపించే వెసులుబాటు ఉండడంతో వీటికి దేశీయ మార్కెట్ నుండే కాక బహుళ జాతి సంస్థల నుండి కూడా భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అభిప్రాయం.

నిత్య విద్యార్థి అయితేనే విజయం:

ఈ రంగంలో పనిచేసే వ్యక్తులు విభిన్న సాంకేతికతలకు సంబంధించిన అంశాలపై విధులు నిర్వర్తించవలసి ఉండడంతో కేవలం ఏదో ఒక కోర్సు పూర్తి చేసి నెట్టుకు రావాలంటే సాధ్యమయ్యే పని కాదు. బీటెక్ లేదా ఎంటెక్ స్థాయిలో ఏర్పడిన ప్రాథమిక అవగాహనతో ఉద్యోగ నిర్వహణతో పాటు అనుభవం గడిస్తూ కాలానుగుణంగా తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవాల్సి ఉంటుందని స్వతంత్ర సెమీ కండక్టర్ విశ్లేషకుడు అరుణ్ మాంపాఝీ అభిప్రాయం. వేగంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా నిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఈ రంగంలోని సంస్థలు మేధో వలసను అరికట్టడంతో పాటు తమ ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపర్చడానికి శిక్షణార్థం భారీ మొత్తాన్ని వెచ్చిస్తుంటాయి. అమెరికా లోని ఒక ప్రముఖ సెమీ కండక్టర్ సంస్థ, తమ సంస్థ లోని వందలాది మంది ఉద్యోగుల నైపుణ్యాలను మేరుగుపర్చుకోవడం కోసం ప్రతి యేటా 1.40 మిలియన్ డాలర్ల విద్యా సహాయాన్ని అందిస్తుండగా మరో సంస్థ ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి 30 వేల డాలర్ల ట్యూషన్ రీఇంబర్స్మెంట్ అందిస్తుంది.

‘చిప్ మేకర్’ గా భారత ఎదుగుదలకు అమెరికా తోడ్పాటు:

భారత అధ్యక్షతన ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా  9-10 సెప్టెంబర్ 2023 న నిర్వహించబడిన “జి-20 శిఖరాగ్ర సదస్సు” సందర్భంగా ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ముఖాముఖి చర్చల అనంతరం పటిష్ఠమైన ప్రపంచ సెమీకండక్టర్ సప్లై-ఛైన్ (ఉత్పత్తి నుండి అంతిమ వాడకందారు వరకు చేరే వివిధ దశలు) వ్యవస్థను నిర్మించడానికి నాయకులు తమ పరస్పర సహకారాన్ని పునరుద్ఘాటించడం శుభ పరిణామం. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బిజినెస్ టుడేతో మాట్లాడుతూ, “కృత్రిమ మేధస్సు (Artificial Intelligence), సెమీ కండక్టర్స్, సూపర్ కంప్యూటింగ్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ మరియు క్వాంటం [కంప్యూటింగ్] కోసం భారతదేశాన్ని, అమెరికా విశ్వసనీయమైన భాగస్వామిగా గుర్తించింది” అని తెలిపారు.

భారత్ లో పరిశోధన మరియు అభివృద్ధిని విస్తరించడానికి అమెరికాకు చెందిన మైక్రోచిప్ టెక్నాలజీ ఇన్కార్పోరేటెడ్ సుమారు 300 మిలియన్ డాలర్లు, అడ్వాన్స్డ్ మైక్రో డివైజ్ వచ్చే ఐదేళ్ళలో 400 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నాయి. అలాగే జూన్ 2023 లో అమెరికా కంపెనీలు మైక్రోన్, LAM రీసెర్చ్ మరియు అప్లైడ్ మెటీరియల్స్ చేసిన ప్రకటనలకు కొనసాగింపుగా జరుగుతున్న పనులపై ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం 10 మిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో  “ఇండియా-యు ఎస్ గ్లోబల్ ఛాలెంజెస్ ఇన్స్టిట్యూట్” ఏర్పాటు కోసం కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT కౌన్సిల్) మరియు అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్ (AAU)ల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని వారు స్వాగతించారు.

గ్లోబల్ ఛాలెంజెస్ ఇన్స్టిట్యూట్ ప్రధానంగా IIT కౌన్సిల్ మరియు AAU లతో పాటు ఇరు దేశాలలోని ఉన్నత విద్య మరియు పరిశోధనా సంస్థలను సమన్వయ పర్చి శాస్త్రసాంకేతిక, వ్యవసాయం, ఆరోగ్య భద్రత మరియు మహమ్మారులను ఎదుర్కోవడం, సెమీ కండక్టర్స్, టెలి కమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వివిధ రంగాల ఆధునీకరణకు కృషి చేస్తుంది. ఇరు దేశాల యూనివర్సిటీల భాగస్వామ్యంతో క్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు సంబంధించిన అంశాలపై విద్యా ప్రణాలికలను రూపొందిచడం పట్ల కూడా వారు హర్షం వెలిబుచ్చారు.   

తక్షణ కర్తవ్యం:

దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ పూర్తిచేసుకుంటున్న దాదాపు 25 లక్షల మందికి గాను కేవలం 3 లక్షల మందికి మాత్రమే అధిక జీతాలు గల ఉద్యోగాలు లభిస్తున్న తరుణంలో దేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమకు ఇతోధికంగా ప్రోత్సాహకాలు అందించి, ప్రత్యేకించి ప్రతి యేటా ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుంటున్న లక్షలాది మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మరియు యూనివర్సిటీలు కార్యాచరణ ప్రణాలికలు రూపొందిస్తున్నాయి.

వచ్చే రెండు నుండి ఐదు సంవత్సరాలలో డిజైన్, తయారీ, శిక్షణ మరియు నైపుణ్యం, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, కెమికల్స్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ లకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడనుండడంతో, మన దేశం ఈ రంగంలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా విద్యార్థులకు ప్రణాళికాబద్ధమైన శిక్షణ అందించగలిగితే ప్రపంచ సెమీ కండక్టర్ పరిశ్రమకు నిపుణులైన మానవ వనరులను అందించి తన ఆధిపత్యాన్ని చాటుకోవడంతో పాటు రోజురోజుకు పెచ్చుమీరుతున్న నిరుద్యోగ సమస్యను కూడా అధిగమించవచ్చు.

అయితే భారత్ లో ఈ సాంకేతికపరమైన అంశాలను బోధించే అధ్యాకులకు పరిశ్రమలో పనిచేసిన ప్రత్యక్ష అనుభవం లేకపోవవడం ప్రతికూలంశమని పరిశ్రమ ప్రముఖుల అభిప్రాయం. అందుచేత ఈ డొమైన్‌లో బోధించే అధ్యాపకులకు యుద్ధప్రాతిపదికన విస్తృతమైన అవగాహన కల్పించి  వారిని సుషిక్షితులుగా  తీర్చిదిద్దడం తక్షణ కర్తవ్యమే కాక పెను సవాలు కూడా. 

Show More

యేచన్ చంద్ర శేఖర్

మాజీ రాష్ట్ర కార్యదర్శి, ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ, హైదరాబాద్
Back to top button