Telugu NewsTelugu Special Stories

 ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో తేలిన 4 ముఖ్యాంశాలు

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు అగ్రరాజ్యాల మధ్య గత కొన్నేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్వయంగా అమెరికా పర్యటనకు వెళ్లడం అంతర్జాతీయంగా పెద్ద సంచలనంగా మారింది. స్వయంగా డోనాల్డ్ ట్రంప్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి మరి జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం పలికారు. “మనం శత్రువులుగా కాదు, ప్రపంచాన్ని నడిపించే భాగస్వాములుగా కలిసి పనిచేద్దాం” అని జిన్‌పింగ్ అమెరికాకు పిలుపునిచ్చారు. అసలు ఒకరినొకరు కంటిచూపుతోనే హెచ్చరించుకునే ఈ రెండు దేశాల అధినేతలు అమెరికా గడ్డపై ముఖాముఖి కూర్చుని ఏయే కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు? చైనా అధ్యక్షుడు ప్రధానంగా లేవనెత్తిన 4 పవర్ ఫుల్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఇది కూడా చదవండి: డ్రాగన్‌తో డీల్.. ట్రంప్‌కు మరో పరీక్ష

తైవాన్ మా సార్వభౌమాధికారం.. ‘రెడ్‌లైన్’ దాటకండి

చర్చల్లో జిన్‌పింగ్ అత్యంత గంభీరంగా, తేల్చి చెప్పిన మొదటి అంశం తైవాన్ సంక్షోభం. తైవాన్ అనేది చైనా దేశంలో అంతర్భాగమని, ఆ విషయంలో అమెరికా ప్రమేయాన్ని తాము సహించేది లేదని స్పష్టం చేశారు. “తైవాన్ విషయంలో అమెరికా చాలా జాగ్రత్తగా, హెచ్చరికతో వ్యవహరించాలి” అని డోనాల్డ్ ట్రంప్‌కు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్రయించడం, మిలిటరీ మద్దతు ఇవ్వడం ద్వారా చైనా రెడ్‌లైన్‌ను దాటవద్దని స్పష్టమైన సందేశం పంపారు.

సుంకాల సమరం.. ‘రేర్ ఎర్త్’ మూలకాల హెచ్చరిక

చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన 240 శాతం కఠినమైన సుంకాలను (Tariffs), వాణిజ్య ఆంక్షలను జిన్‌పింగ్ తీవ్రంగా నిరసించారు. అమెరికాకు ఉన్న 1.2 ట్రిలియన్ డాలర్ల ట్రేడ్ డెఫిసిట్‌లో చైనాతోనే 202 బిలియన్ డాలర్లు ఉన్న మాట నిజమే అయినా, చైనా ఉత్పత్తులు లేకుండా అమెరికా మార్కెట్ నడవదని గుర్తు చేశారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ఈవీ వాహనాలు, చివరకు అమెరికా మిస్సైళ్ల తయారీకి అత్యంత కీలకమైన ‘రేర్ ఎర్త్’ మూలకాలపై 90 శాతం పట్టు తమదేనని, ఈ వాణిజ్య యుద్ధం వల్ల అమెరికాకే నష్టమని ఎత్తి చూపారు. దీంతో దిగివచ్చిన ట్రంప్ సుంకాలను తగ్గించడమే కాక, ట్రేడ్ వార్‌కు తాత్కాలికంగా రెండు నెలల విరామం ప్రకటించారు.

ఇది కూడా చదవండి: భారత్-చైనా స్నేహం..ప్రపంచ రాజకీయాల్లో కొత్త అడుగులు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ఆంక్షలు వద్దు

సాంకేతిక రంగంలో చైనా సాధిస్తున్న ప్రగతిని అడ్డుకునేందుకు అమెరికా విధిస్తున్న ఆంక్షలపై జిన్‌పింగ్ అసహనం వ్యక్తం చేశారు. చైనా అభివృద్ధి చేస్తున్న చవకైన ‘ఓపెన్ సోర్స్ ఏఐ’ మోడల్స్‌ను అమెరికా భద్రతా నెపంతో తొక్కిపెట్టాలని చూడటం సరికాదన్నారు. ఏఐ వల్ల మానవాళికి, ప్రపంచ భద్రతకు పొంచి ఉన్న ప్రమాదాలను అరికట్టడానికి రెండు దేశాలూ కలిసి ‘ఏఐ సేఫ్టీ రూల్స్’ తయారు చేయాలని, పోటీ పేరుతో చైనా టెక్నాలజీ అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరారు.

ఇరాన్, రష్యాలతో ఇంధన బంధం ఖాయం

రష్యా, ఇరాన్ దేశాలపై అమెరికా విధిస్తున్న ఆంక్షలు తమ ఇంధన భద్రతను (Energy Security) దెబ్బతీస్తున్నాయని జిన్‌పింగ్ ఎత్తి చూపారు. చైనా దిగుమతి చేసుకునే చమురులో 90 శాతం ఇరాన్ నుంచే వస్తోందని, అలాగే రష్యా నుంచి కూడా సగానికి పైగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తమ దేశ సప్లై చైన్‌ను దెబ్బతీసేలా అమెరికా తెచ్చిన చట్టాలను తమపై రుద్దవద్దని, తమ ఇంధన అవసరాల కోసం రష్యా-ఇరాన్‌లతో బంధం కొనసాగుతుందని తెగేసి చెప్పారు.

Show More
Back to top button